Wednesday 17 November 2021

శ్రీ హనుమద్భాగవతము (78)



అప్పుడు వాయునందనునిలో తేజస్సు, బలము, పరాక్రమము అద్భుతముగా ఉన్నవి. దేవతలు జయజయధ్వానములను, ఋషులు శాంతిపాఠములను చేయసాగారు. ఆంజనేయుడు దక్షిణమువైపుగా తన రెండు బాహువులను చాచి మిగుల వేగముతో ఆకాశము మీదకు గరుడుని వలె ఎగిరాడు. అతని వేగముతో ఆకర్షింపబడిన ఎన్నో వృక్షములు పెకలింపబడి తమ తమ కొమ్మలతో కూడా ఎగిరిపోయాయి. పుష్పించిన వృక్షముల పుష్పములు అతని పైబడాఆయి. అవి వాయుపుత్రుని పూజించుచున్నట్లు ఉన్నాయి.


పవనపుత్రుడైన హనుమానుడు వాయు వేగముతో శ్రీ రామ కార్యార్ధమై వెళ్ళటం చూచి సాగరుడిట్లా ఆలోచించాడు. ఇక్ష్వాకు వంశీయుడైన సగర చక్రవర్తి యొక్క పుత్రులు నన్ను పెంచి ఉన్నారు; అభయుడు, వజ్రకాయుడైన హనుమానుడు ఇక్ష్వాకులోత్పన్నుడైన శ్రీరాముని కార్యార్థమై లంకకు వెళుతున్నాడు. అందువలన ఇతనికి మార్గమున విశ్రాంతిని ఒసంగుటకు ప్రయత్నించాలి.”


సముద్రుడు మైనాకపర్వతముతో ఇలా పలికాడు - "శైలప్రవరుడా! చూడు, కపిశ్రేష్ఠుడైన ఈ హనుమానుడు ఇత్వాకు వంశీయుడైన శ్రీ రామునకు సాహాయ్యము చేయుటకై తీవ్రవేగముతో లంకకు వెడలుచున్నాడు. ఈ పవిత్రవంశీయులు  నాకు పూజ్యులు, నీకు పరమ పూజనీయులు. అందువలన నీవు హనుమానునకు సహాయం చేయ్యి. నీవు వెంటనే నీటిలో నుండి పైకి లెమ్ము. దానిచే ఇతడు కొద్ది సేపు నీ శిఖరముపై విశ్రమించుగాక”!


మైనాకుడు సువర్ణమణిమయములైన తన అనేక శిఖరములతో కూడా సముద్రము నుండి చాలా పైకి లేచి, ఒక శృంగముపై మనుష్య వేషములో నిలుచుని హనుమంతుని ఇట్లా ప్రార్థించాడు. - “కపిశ్రేష్ఠా! నీవు వాయుపుత్రుడవు, ఆయనవలె అపరిమితశక్తిసంపన్నుడవు, ధర్మజ్ఞుడవు. నిన్ను పూజిస్తే సాక్షాత్తు వాయుదేవుని పూజించినట్లే అవుతుంది.


పూజితేత్వయి ధర్మక్షే పూజాం ప్రాప్నోతి మారుతః ||


(వా. రా. 5-1-122) 

అందువలన నీవు తప్పక నాకు పూజనీయుడవు. మొదట పర్వతములకు ఱెక్కలుండేవి. అవి ఆకాశమున ఇటు ఇటు వేగముగా ఎగురుచుండేవి. ఇలా అవి ఎగురుతుండటంతో దేవతలు, ఋషులు, సర్వప్రాణులు మిగుల భయపడిపోతుండేవారు. దీనికి కోపించి సహస్రాక్షడు లక్షల కొలది పర్వతముల ఱెక్కలను నరికాడు. వజ్రాయుధమును తీసుకుని క్రుద్ధుడైన సురేంద్రుడు నా వైపు కూడా వచ్చాడు. కాని నీ తండ్రి అయిన వాయు దేవుడు ఈ సముద్రమున పడవేసి నన్ను రక్షించినాడు.


No comments:

Post a Comment