Tuesday 7 December 2021

శ్రీ హనుమద్భాగవతము (95)

అప్పుడు త్రిజట ఇట్లు పలికింది. “అసుర స్త్రీలారా ! నేను స్వప్నములో రావణుడు బోడితలతో, నూనెలో స్నానమాచరించి, ఎఱ్ఱని వస్త్రములను ధరించి ఉన్నట్లు గాంచాను”.



కరవీర (గన్నేరు) పుష్పమాలను ధరించి మదిరోన్మత్తుడైన రావణుడు పుష్పక విమానము నుండి భూమిపై పడుచున్నట్లు గాంచాను. బోడితల గలిగిన రావణునకు నల్లని వస్త్రములను ధరించాడు. వానిని ఒక నల్లనిస్త్రీ ఎచటికో ఈడ్చు కొని పోవుచున్నాడు. శరీరముపై ఎఱ్ఱని చందనము అలదుకొని, ఎఱ్ఱని పుష్పమాలను ధరించి, నూనెను త్రాగుతూ, అట్టహాసం ఒనరిస్తూ, గార్దభముపై ఎక్కి దక్షిణదిశగా రావణుడు పోతున్నాడు. ఒక్క విభీషణుడు తప్ప రావణునితో పాటు వాని పుత్రులు, సేనాపతులు, పరివారమంతా ముండిత మస్తకులై నూనెలో స్నానమాడుచున్నట్లు కాంచాను. రావణుడు సూకరముపై, మేఘనాథుడు శింశుమారము (మొసలి) పై, కుంభకర్ణుడు ఒంటెపై ఆసీనులై దక్షిణాభిముఖముగా పోవుచున్నట్లు చూచాడు. ఇంతే కాదు ఎఱ్ఱనిముఖముగల మహాతేజ స్సంపన్నుడైన వానరుడు అసురులను ఎక్కువ మందిని సంహరించి లంకకు నిప్పుపెట్టినట్లు, ఆ మంటలకు లంక భస్మమైనట్లు చూసాను. ప్రాతః కాలమున గల్గిన ఈ స్వప్నము త్వరలోనే సత్యమవుతుంది”.


భక్తురాలు, బుద్ధిమంతురాలైన త్రిజట ఆ రాక్షస స్త్రీలకు ఉపదేశిస్తూ ఇట్లా పలికింది. “రాక్షసస్త్రీలారా! మహాచక్రవర్తి యొక్క గారాల కోడలు సీతాదేవి సమస్తరాజ్య భోగాలను, వైభవాలను కాల తన్ని తన భర్తతో అరణ్య వాసమునకు వచ్చింది. మహావీరుడైన శ్రీరామచంద్రునితో ఆమె కుశ కంటకములతోనూ, రాళ్ళతోనూ కూడి ఉన్న అరణ్యమార్గములందు చరిస్తూ కష్టములను అనుభవించు చున్నా అది తనకు పరమసుఖమే అని భావించింది. అట్టి మహాపతివ్రతే, పరమాదరణీయురాలు, శ్రీరామచంద్రునకు పరమప్రియురాలైన సీతాదేవిని ఇట్లా భయపెడుతూ, బెదరిస్తూ ఉంటే కౌసల్యానందనుడైన శ్రీరామచంద్రుడు ఇట్లా సహించగలడు ? 

No comments:

Post a Comment