Thursday 18 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 164 వ భాగం



మొదటి చంద్రగుప్తుడు కొడుకైన సముద్ర గుప్తుని కాలంలో ఆ రాయబారి వచ్చాడు. అతడు పేర్కొన్నది సాంద్రకోటస్, సముద్ర గుప్తుని మొదటి అక్షరం 'స' సరిపోతోంది కదా, సముద్ర శబ్దం జనుల నోళ్ళల్లో బడి సంద్రం కాగా దానిని విని సంద్రకోటస్ గా పేర్కొన్నాడని ఎందుకూహించకూడదు?  

ఇట్లా వేయి సంవత్సరాలు వెనుకకు వెళ్ళితే శంకరులు క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన బుద్దుని కాలం, ఇంకా వేయి సంవత్సరాలు వెనుకకు వెళ్ళగా, అప్పుడు బౌద్ద మత ప్రభావాన్ని శంకరులు ఎదుర్కొనడం కుదురుతుంది. అపుడు బుద్ధునికి శంకరులు సమకాలికులు కారు కదా!


పురాణాల ప్రకారం క్రీ.పూ. 1500 సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యం స్థాపింపబడింది. దీనికి ముందు బింబిసారుడు, తరువాత అతని కొడుకు అజాత శత్రువు, అతని తరువాత ముగ్గురు రాజులు పాలించారు. తరువాత మహా పద్మనందుడు వచ్చాడు. తరువాత మౌర్యచంద్ర గుప్తుని రాక, చంద్రగుప్త మౌర్యునికి మూడు వందల సంవత్సరాల ముందు బింబిసారుడున్నట్లు పురాణాలంటున్నాయి. అనగా క్రీ.పూ. 1800 నుండి 1700 వరకూ బుద్ధుడున్నాడు. కనుక శంకరుల అవతారం క్రీ.పూ. 509 సరిపోతుంది.


ఇక కాళిదాసు కాలం గురించి వ్రాస్తూ కొన్ని వందల పుస్తకాలను చూసి, విద్యా వాచస్పతియైన కొల్హాపూర్ నకు చెందిన అప్పాశాస్త్రిగారు కాళిదాసు కాలం క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందినదని, ఆ శతాబ్దం మధ్యలో కుమారిల భట్టు కాలమని, ఆ శతాబ్ది చివరలో శంకరుల కాలమని నిర్ధారించారు. జైన గ్రంథాలను కూడా వారు పరిశీలించారు.


అయితే క్రీ.శ. 2,6 శతాబ్దాలలో పుట్టిన బౌద్ధుల వాదులను శంకరులెట్లా ఖండించారని అడగవచ్చు. వారి పేర్లను పేర్కొనలేదు. బౌద్ధంలో చాలాకాలం నుండి వస్తున్న సిద్ధాంతాలనే ఖండించారని గుర్తించండి.


శంకరులు తన పూర్వమున్న అద్వైతాన్నే తిరిగి ప్రతిష్ఠించారు కాని లేని దానిని క్రొత్తగా కనుగొన్నట్లు వ్రాయలేదు.


అసలు గౌతమ బుద్ధుణ్ణి 24వ బుద్ధుడని బౌద్ధ గ్రంథాలంటున్నాయి. కనుక ఇతని ముందు 23 బుద్దులున్నట్లే కదా. అందుకనే రామాయణంలో బౌద్ధాన్ని ఖండించినా అది కేవలం గౌతమ బుద్ధుని సిద్ధాంతం కాదని అంతకుముందున్న దానినే అని భావించవచ్చు. జాబాలి యొక్క అవైదిక సిద్ధాంతాన్ని అట్లా ఖండించాడు. ఇట్టివారిని ప్రోత్సహించకూడదని వీరిని దొంగలను శిక్షించినరీతిలో శిక్షించాలని అన్నాడు. గౌతమ బుద్ధుడు చెప్పిన సదాచారం ధ్యానం, ఇంద్రియ నిగ్రహం వంటి సిద్ధాంతం చార్వాకం కాదు. ఇది పచ్చి భౌతిక వాదం. కాబట్టి దీనిని ఖండించాడు.


No comments:

Post a Comment