Thursday 7 September 2023

శ్రీదత్త పురాణము (251)

 


భద్రశీల గాధ


సనత్కుమారా ! ఈ విషయంలో పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉంది. చెబుతాను ఆలకించు. పూర్వకాలంలో గాలవుడు అనే ముని వున్నాడు. నర్మదాతీరంలో కందమూల ఫలాలూ సమిత్కుశ పుష్పాదులూ సమృద్ధిగా దొరికే ఒక సుందరారణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. శాంతి - దాంతులు కలవాడు. సత్యపరాయణుడు. జితేంద్రియుడై తపస్సు కొనసాగిస్తున్నాడు. ఆ అరణ్య సౌందర్యం పక్షిమృగాలకోలాహలం సిద్ధచారణ గంధర్వ యక్ష విద్యాధరాదుల్ని సహితం ఆకర్షిస్తూ వుండేది. వారు వచ్చి అక్కడ సంచేరించేవారు. ఈ తపోనిధి గాలవునికి భద్రశీలుడు అనే కుమారుడుండేవాడు. చాలా అందగాడు. పేరుకి తగ్గట్లే శీలసంపన్నుడు జాతి స్మరుడు. నారాయణభక్తి పరాయణుడు. అతడు బాలుడుగా వున్నప్పుడే ఆటలూపాటలు శ్రీ హరిపరంగా సాగించేవాడు మట్టితో నారాయణ ప్రతిమ చేసి దాన్ని అర్చించడం బాల్యక్రీడగా జరిపేవాడు. అర్చన ముగిసాక సకలజగత్తులకు సకల శుభాలు కల్పించమని ప్రార్థిస్తూ స్వామికి ననుస్కరించేవాడు. ఉన్నట్లుండి ఒక్కొక్కరోజున ఈ రోజు ఏకాదశి అని ఉపవాస దీక్ష స్వీకరించేవాడు. రాత్రి జాగారం చేసేవాడు. బాల్యం నుండీ ఇలా హరి భక్తి తత్పరుడైన బిడ్డడిని చూసి తల్లి తండ్రులు ఎంతగానో మురిసిపోయేవారు. ఒకనాడు తండ్రిగాలవుడు భద్రశీలుడ్ని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ -


నాయనా ! మహాయోగులకు సైతం దుర్లభమైన నీ భక్తి నీ ప్రవర్తనా నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. పేరుకి తగినట్లుగా వున్నావు. నిత్యమూ నువ్వు చేసే హరి పూజలూ సర్వభూతహితమూ, ఏకదశీ వ్రతాలూ, నిర్మమంగా శాంతచిత్తంతో చేసే హరి నామ స్మరణలూ, ఇవన్నీ నీ ఈడు పిల్లల్లో ఉన్నవి, విన్నవి, కన్నవికావు. నీకసలు ఈ విష్ణుభక్తి ఇంత - చిన్నవయస్సులోనే ఎలా ఏర్పడింది ? నా ఆలోచనకు అందడం లేదు. నీకేమైనా తెలిస్తే చెప్పు! విని సంతోషిస్తాను అన్నాడు. 


తండ్రీ ! జాత స్మరుణ్ని కనుక క్రిందటి జన్మలో యమధర్మరాజు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం వున్నాయి. నువ్వు అడిగావు కనుక అన్నీ వివరంగా చెబుతాను విను. నేను క్రిందటి జన్మలో సోమవంశంలో పుట్టిన మహారాజుని. అప్పుడు నాపేరు ధర్మకీర్తి. దత్తాత్రేయుడి శిక్షణలో ఆయావేదశాస్త్రాలు తెలుసుకొని ధర్మబద్ధంగా తొమ్మిదివేల సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాను. కీర్తి గడించాను. ధర్మకీర్తి అనే పేరుని చరితార్థం చేసుకున్నాను. ప్రజలంతా నన్ను దైవంతో సమానంగా చూసేవారు.


No comments:

Post a Comment