Friday 22 September 2023

శ్రీదత్త పురాణము (265)

 

శౌచసదాచారాలు


ధర్మకీర్తీ! సద్ర్బాహ్మణుడు నిద్రలేచింది మొదలు ఏయే శౌచసదాచారాలు పాటించాలో వివరిస్తాను తెలుసుకో. బ్రాహ్మీముహూర్తంలో వామనస్తుతిపరత్వంగా నిద్రలేవాలి. పురుషార్ధాలకు అవిరుద్ధంగా వుండే ప్రవృత్తుల గురించి యోచన చెయ్యాలి. జుట్టు (శిఖ) ముడివేసుకోవాలి. ఉత్తరీయాన్ని శిరస్సున కప్పుకోవాలి. యజ్ఞోపవీతాన్ని కుడిచెవికి తగిలించుకోవాలి. ఒక కర్రను జలపాత్రనూ పట్టుకోవాలి. బహిఃప్రదేశానికి వెళ్ళాలి. నేల కనబడకుండా గడ్డి పరవాలి. పగటివేళ కానీ ఉభయ సంధ్యల్లో కానీ ఉత్తరముఖంగా కూర్చోవాలి. రాత్రిళ్ళు అయితే దక్షిణముఖంగా కూర్చోవాలి. మౌనంగా మలమూత్ర విసర్జన చేయాలి. బాటలో, గోష్ఠంలో, నది ఒడ్డున, నూతికి దగ్గరలో, చెరువుల చెంత, నీళ్ళల్లో, చెట్లనీడన, అడవిలో, అగ్ని చేరువలో, దేవాలయాల దగ్గర, ఉద్యానవనాల్లో, దున్నిన పొలంలో, నాలుగుదారుల కూడలిలో, గురు, గో, బ్రాహ్మణ, స్త్రీ సన్నిధిలో ఊక-పొట్టు నిండిన స్థలాల్లో కపాలాల్లో ఇంకా ఇటువంటి చోట్ల మలమూత్ర విసర్జనలు చేయరాదు.


బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వకంగా శౌచం పాటించాలి. శౌచ మూలాః ద్విజాంః అన్నారు. ఇది లేకపోయాక ఎంతటి సత్కర్మలన్నా వ్యర్ధం.


ఈ శౌచం-బాహ్యము, ఆభ్యంతరము అని రెండు విధాలు, మట్టితో, నీటితో చేసుకొనేది బహిశ్శుద్ధి, భావశుద్ధినే ఆభ్యంతర శౌచము అంటారు.


మలమూత్ర విసర్జనలు అయ్యాక మర్మాంగం చేతబట్టుకొని లేచి మరొకచోట కూర్చుని మృత్రిక(మట్టి)తో నీటితో దుర్గంధం వదిలే వరకు ప్రక్షాళన చేసుకోవాలి. శౌచానికి ఉపయోగించే మట్టిని అనుచ్ఛిష్ట ప్రదేశాల నుంచే తీసుకోవాలి. ఎలుకలు త్రవ్విందో, నాగటితో లేచిందో, వాపీకూపతటాకాదులకు సంబంధించిందో కాకూడదు ఈ బాహ్యమృత్తిక. నీటిలో నుండి తీసుకొన్న తడిమట్టి శ్రేష్టం. మర్మంగానికి ఒకసారి అపానంలో అయిదుసార్లు కుడిచేతికి ఏడుమార్లు ఎడమచేతికి పదిమార్లు పాదాలకు మూడేసి సార్లు మట్టిపులుముకొని ప్రక్షాళన చేసుకోవాలి. ఈ శౌచం గృహస్థులకు రెట్టింపు, బ్రహ్మచారులకు మూడు రెట్లు వానప్రస్థులకు, సన్యాసులకు నాలుగు రెట్లు - అధికం. స్వగ్రామంలో అయితే పూర్ణశౌచం పాటించాలి. మార్గమధ్యంలో అర్థశాస్త్రం పాటిస్తే చాలు, రోగాతురుడైనప్పుడుగానీ ఆపత్కాలంలోగాని ఈ శౌచనియమం లేదు.


No comments:

Post a Comment