Friday 5 January 2024

శ్రీ గరుడ పురాణము (54)

 


మృత్యుంజయ మంత్ర జప మహిమ


సూతమహర్షి శౌనకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది.


“మునులారా! గరుత్మంతుడు కశ్యప మహర్షికుపదేశించిన మృత్యుంజయ మంత్రాదిక విషయాలను వినండి. ఇవి సాధకుని గొప్పగా ఉద్దరిస్తాయి. పుణ్యప్రదానం చేస్తాయి. ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ వున్నదని విజ్ఞులు చెప్తారు.


'ఓం జుం సః' అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇది మృత్యువునూ దారిద్ర్యాన్నీ మర్దించే మంత్రం. శివ, విష్ణు, సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులౌతారు. 'ఓం జుం సః' అనే ఈ మహామంత్రాన్ని అమృతేశ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ మంత్రాన్ని జపించేవారి పాపాలన్నీ నశిస్తాయి. మృత్యువు వలె బాధించు కష్టాలన్నీ దూరమవుతాయి.


ఈ మంత్రాన్ని నూరుమార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం, యజ్ఞఫలం, తీర్థ స్నాన దాన పుణ్యం లభిస్తాయి. మూడు సంధ్యలలోనూ నూట యెనిమిదేసి మార్లు ఈ మంత్రాన్ని జపించేవారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యువు దూరంగానే వుంటుంది. కఠినాతికఠినములైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది.


భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చుని వుంటాడు. ఆయన చతుర్భుజుడు ఒక చేతిని అభయముద్రలో మరొక చేతిని వరద ముద్రలో వుంచి మిగతా రెండు చేతులలో అమృత భాండాన్ని పెట్టుకొని నిత్యం మనను శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా, సర్వసన్నద్ధుడై వుంటాడు ఈ అమృతేశ్వర దేవుడు. ఆయన వామాంకస్థితయై అమృతభాషిణి అమృతాదేవి నిత్యమూ కొలువుంటుంది. ఆమెను ధ్యానించాలి. ఆమె ఒక చేతిలో కలశాన్నీ మరొక చేతిలో కమలాన్నీ ధరించి వుంటుంది. కలశం కుడిచేతిలో వుండాలి.


ఓం జుం సః అనే ఈ మంత్రం పరమశక్తిప్రదాయకం, అతులిత శాంతిదాయకం కూడ. అమృతాదేవీ సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహా మంత్రాన్ని మూడు సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి ఎనిమిదివేల మార్లు ఒక నెలదాకా చేయగలిగిన వారికి జర, మృత్యు, మహావ్యాధి బాధలుండవు. శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు. మహాశాంతినీ పొందగలుగుతారు.


అమృతేశ్వర భగవానుని పూజలో కూడా ఆవాహన, స్థాపన, రోదన (ప్రతిష్ఠ), సన్నిధానం, నివేశనం, పాద్యం, ఆచమన, స్నానం, అర్ఘ్యం, మాల, అనులేపనం, దీపము, వస్త్రం, ఆభూషణాలు, నైవేద్యం, పానం, వీవనలు, ముద్రాప్రదర్శన, మంత్రజపం, ధ్యానం, దక్షిణ, ఆహుతి, స్తుతి, వాద్య గీత నృత్యాలు, న్యాసయోగ ప్రదక్షిణలు, సాష్టాంగ ప్రణతి, మంత్ర శయ్య, వందనాది ఉపచారాలన్నీ వుంటాయి. పూజానంతరము దీక్షా విసర్జన చేయాలి.


No comments:

Post a Comment