Saturday 13 January 2024

శ్రీ గరుడ పురాణము (61)

 


ఈ కళలను కూడ ఓం, నమః ఆదులను చేర్చి పూజించాక శివుని నాలుగవ వక్త్ర రూపమైన తత్పురుషుని ఓం హైం తత్పురుషాయ నమః అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు అయిదు. అవి నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని ఓం హౌం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు ఆరు. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలనూ 'ఓం, షష్ఠి, నమః' లను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమౌతుంది.


ఋషులారా! ఇపుడు శివార్చన విధిని వినిపిస్తాను. పన్నెండంగుళాల మేర శివమూర్తిని, బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా వుండాలి. శివుని ముఖం వైపు అయిదు బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి ఆరవబిందువూ విసర్గ వుండాలి. అది అస్త్ర (హస్తన్యాస)ము. దానితో బాటు 'హౌం' అనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం. సంపూర్ణార్థ ప్రదాయకం. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ద్వ భాగం నుండి చరణ పర్యంతమూ చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి.


అపుడు అస్త్రమంత్రం ఓం ఫట్ నుచ్చరిస్తూ కుడి పిడికిలితో స్పర్శ, శోధనలను గావించాలి. తరువాత చిటికెన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి.


ఇక బాహ్యపూజ, మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా అందులోని మధ్యభాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య, స్నానములను అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలను గావించాలి. తరువాత అగ్నిలో ఆహుతులనివ్వాలి. అదెలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి వుంచడానికి ముందే 'ఓం ఫట్' అనే అస్త్ర మంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై 'ఓం హూం' అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి. అనగా నీళ్ళు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపియైన తేజాన్నీ అగ్నినీ విన్యాసం చేయాలి. (అంటే వుంచాలి) ఈ అగ్నిలో నిష్కకృతి-సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలనూ చేసుకోవాలి. అన్నిటి తరువాత సమస్త ఆంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులివ్వాలి.


No comments:

Post a Comment