Showing posts with label క్షమా. Show all posts
Showing posts with label క్షమా. Show all posts

Wednesday, 19 February 2014

హిందూ ధర్మం - 21

వికలాంగులైన ఈ 100 మంది, బాధపడుతూ, భారమైన మనసుతో, కంటతడి పెడుతూ, రాజమందిరంలోనికి ప్రవేశించగా, అది చూసిన కుశనాభుడు తన కూమార్తెలతో 'ఏం జరిగింది? మిమ్మలని ఈ స్థితికి తీసుకువచ్చిందెవరు, మీ ధర్మాన్ని నాశనం  చేసిందెవరు, మిమ్మలని పొట్టిగాం అందవీహినంగా చేసిందెవరు, మీరెందకు ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నారు' అంటూ ప్రశించాడు.

కుశనాభుడి మాటలు విన్న ఈ 100 ఆడపిల్లలు, ఆయన పాదాలకు తమ నుదురు తగిలేలా నమస్కరించి, 'వాయుదేవుడు సంకల్పం వలన మాకు ఈ స్థితి వచ్చింది' అని చెప్పి, జరిగినదంతా వివరిస్తారు. అప్పుడు కుశనాభుడు వారితో 'చాలామంచి పని చేశారమ్మా! నాకు చాలా గర్వంగా ఉంది. క్షమించడమనేది స్వీయ నియంత్రణ (తమ మీద తమకు నియంత్రణ) ఉన్నవారు మాత్రమే చేయగలరు. మీరు మానసికంగా బలవంతులు. మీరు చేసిన పనివల్ల మన వంశం కీర్తి మరింత పెరిగింది. క్షమా గుణం స్త్రీలకు అలంకారం. ఆమాటకు వస్తే, ప్రతి పురుషుడికి ఉండవలసిన లక్షణం. మీరు అప్సరస కూమర్తెలు, శపించగల శక్తి ఉండి కూడా, నిగ్రహించుకున్నారు, సాధారణ మనుష్యులలా ఆవేశానికి లోనుకాలేదు.

క్షమా దానాం క్షమా సత్యం క్షమా యజ్ఞస్య పుత్రికా
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్

క్షమా గుణమే దానము, సత్యము, క్షమయే గొప్ప యజ్ఞము, క్షమాగుణమే యశస్సు, క్షమించడమే ధర్మం, క్షమా గుణం చేతనే ఈ జగత్తంతా నడుస్తున్నది ఓ పుత్రికలారా! అని కుశనాభుడు వారి యొక్క క్షమాగుణాన్ని పొగిడారు.

తర్వాత బ్రహ్మదత్తుడనే ఒక ఋషుతుల్యుడైన మహారాజుకిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం బ్రహ్మదత్తుని చేయి తగలగానే, 100 మంది తమ పూర్వరూపాన్ని పొందారు.

To be continued...................

Tuesday, 18 February 2014

హిందూ ధర్మం - 20

క్షమా గుణం మీద రామాయణం బాలకాండ 32-33 సర్గల్లో చక్కటి కధ ఒకటి వాల్మీకి మహర్షి అందించారు.

కుశనాభుడనే ఒక రాజుకు, ఘృతాచి అనబడే ఒక గంధర్వకాంత వలన 100 మంది మహసౌందర్యవతులైన కుమార్తెలు జన్మించారు. యవ్వనంలో ఉన్న ఆడపిల్లలు ఒకసారి దగ్గరలో ఉన్న ఉద్యానవనానికి వెళ్ళి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఆకాశం నుంచి తారలు దిగివచ్చాయా అన్నట్టుగా ఉన్నది వారి అందం అని వర్ణించారు వాల్మీకి మహర్షి. వారు ప్రపంచంలోనే మహసౌందర్యవతులు. ఆ సమయంలో వారి ముందు వాయుదేవుడు ప్రత్యక్షమై మీ చాలా అందంగా ఉన్నారు, నేను మిమంలని వివాహం చేసుకుంటాను, నన్ను పెళ్ళి చేసుకుంటే మీకు ఈ మానవ శరీరాలు పోయి, దేవతలవుతారు, అధికకాలం, మానవులకు యవ్వనం కొంతకాలమే ఉంటుంది, కానీ నన్ను వివాహం చేసుకుంటే మీ యవ్వనానికి, అందానికి ఇక మరణం ఉండదు అంటాడు.

వాయుదేవుని మాటలు విన్న ఆ కాంతలందరూ ఒక్కసారి నవ్వి 'నీవు సకల ప్రాణకోటికి జీవనాధరమైనవడివి, మాకు నీ యొక్క గొప్పతనం తెలుసు, అయినా నీవు మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నావు. మేము కుశనాభుడి కుమార్తెలము, ఓ దేవోత్తమా! మేము తల్చుకుంటే నిన్ను, నీ వాయుపదివి నుంచి తప్పించగలము, అయినా మా తపశ్శక్తిని రక్షించుకోవడం కోసం మమ్మల్ని మేము నిగ్రహించుకుంటున్నాము. ఓ మదాంధుడా! తగిన సమయం వచ్చినప్పుడు మేము స్వతంత్రంగా, మా తండ్రి అనుమతితో నచ్చిన వరుడిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకుంటాము. మా నాన్నగారు మాకు దైవంతో సమానం, వారు మమ్మల్ని ఎవరి చేతిలో పెడితే, వారితోనే జీవితం గడుపుతాము' అన్నారు.

ఈ మాటలు విన్న వాయుదేవుడు, కోపంతో వారి శరీరాల్లోకి ప్రవేశించి, వారి సౌందర్యాన్ని నాశనం చేశాడు, వారిని అందవిహీనంగా, వికలాంగులుగా మార్చేశాడు.

To be continued................... 

Friday, 14 February 2014

హిందూ ధర్మం - 19

క్షమించమన్నారు కదా అనీ, అన్ని వేళలా ఇది వర్తించదు. దేశం విషయంలోనూ, ధర్మం విషయంలోనూ మితిమీరిన క్షమా గుణం పనికిరాదు. మాతృదేశంపై ఆక్రమణకు, యుద్ధానికి శత్రుదేశం పాల్పడినప్పుడు, స్వదేశరక్షణ కోసం ఎదుటివాడితో పోరాటం చేయాలి. అక్కడ క్షమించకూడదు, గట్టి సమాధానం చెప్పాలి, తగిన గుణపాఠం నేర్పాలి. అదే ధర్మం.అట్లాగే ధర్మానికి హానీ ఏర్పడినప్పుడు, ధర్మం మీద దాడి జరుగుతునప్పుడూ మౌనం వహించకూడదు, క్షమించకూడదు.

అదే మహాభారతంలో కనిపిస్తుంది. అంతా తన బంధువేలననీ, తనవారిపై పోరాటం చేయడం కంటే రాజ్యాన్ని విడిచిపెట్టడం మేలు అనుకున్న అర్జునుడికి శ్రీ కృష్ణపరమాత్మ గీత భోధించాడు. ధర్మానికి హానీ ఏర్పడప్పుడు, పిరికివాడిలా పారిపోవడం కాదు, నిజమైన క్షత్రియుడులా యుద్ధం చేసి, ధర్మాన్ని పునఃప్రతిష్టించమని చెప్పాడు, గీతను భోధించి అర్జునుడిని మానసికంగా బలవంతుడిని చేసి, యుద్ధం చేయించి, ధర్మరాజుకు రాజ్యం అప్పగించాడు. ధర్మానికి హాని ఏర్పడుతందంటే, బంధుత్వాలు, క్షమాగుణాలు అన్నీ విడిచిపెట్టాలని, ధర్మాన్ని, దేశాన్ని కాపాడడమే ప్రధమ కర్తవ్యం అని తెలియజేశాడు.

వందలమందిని దారుణంగా హతమార్చిన ముష్కరుడిని గట్టిగా దండించడమే రాజు యొక్క ధర్మం. అంతేకానీ, వాడిని క్రూరంగా దండిస్తే, మనకూ వాడికి తేడా ఏముంటుందండీ? వాడిని క్షమించి, విడిచిపెట్టాలి అంటారు కొందరు. అక్కడ క్షమాగుణం చూపవలసిన అవసరమే లేదంటుంది ధర్మం.

To be continued................... 

Thursday, 13 February 2014

హిందూ ధర్మం - 18

క్షమించడం గొప్ప లక్షణం. మాటమాట పెరగకుండా, మనమే ఒక అడుగు ముందుకేసి, వాదనను, యుద్ధాన్ని నివారించడం, ఆపడం అందరికి సాధ్యం కావు. ఎవరు ఎక్కువగా వాదిస్తారో, ఎక్కువగా పోరాడతారో, వారే గోప్పవారననేది సమాజం యొక్క భావన. కానీ శక్తి ఉండీ, వెనక్కు తగ్గడం అనేది చాలా కష్టతరమైన పని, అది ధీరులు మాత్రమే చేయగలరు. ఉదాహరణకు మీకు బాగా కోపం వచ్చిందనుకోండి, ఎదుటివాడిని చెంప పగిలేలా కొట్టే పరిస్థితి వస్తే, అక్కడ మీరు, మిమ్మల్ని నియంత్రించుకోవడానికి, శాంతపడడానికి, వెనక్కు తగ్గడానికి బోలెడు శక్తి కావాలి. కొట్టడం ఎంత సేపు చెప్పండి. అది గొప్ప కాదు. నిగ్రహించుకోవడం గొప్ప. ఇలా నిగ్రహించుకోవడం, అవతలవారిని క్షమించడం వల్లే సంకల్ప శక్తి పెరుగుతుంది. ఇటువంటి క్షమాగుణం జ్ఞానుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎదుటివాడు పాపం అమాయకుడు, అజ్ఞాని, పసిపిల్లవాడు లాంటివాడని జ్ఞాని మనస్పూర్తిగా క్షమించగలుగుతాడు.

ఇక రెండవ అంశం. క్షమించడం అన్నది కేవలం మాటలకే పరిమితం అవ్వరాదు. త్రికరణశుద్ధిగా క్షమించాలి. అంటే మనసులోనూ, మాటలలోనూ, చేతలలోనూ క్షమా గుణం కనిపించాలి. ఒకడి మీద మనసులో బోలెడు కోపం, కసి, పగ, ద్వేషం వున్నా, అందరూ చూస్తున్నారనీ, అందరి ముందు ఇవి ప్రదర్శిస్తే, చెడ్డపేరు వస్తుందని, బయటకు 'వాడిని నేను క్షమించేసానండీ!'  అని సులువుగా అనేస్తారు. కానీ మీకు తెలుసు, మీ మనసులో వాడి మీద కోపం ఉన్నదని, వాడి మీద కసి తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నారనీ. లేదా, తగిన సమయం కాదు కాబట్టి, తాత్కాలికంగా క్షమిస్తారు. అది నిజంగా క్షమించడం ఎలా అవుతుంది? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీ మనసులో మీ శత్రువు పట్ల విపరీతమైన ద్వేషాన్నీ వేళ్ళతో సహ తొలగించడమే నిజమైన క్షమా. ఇటువంటి నిజమైన క్షమాగుణమే ధార్మికులకు ఉండవలసిన లక్షణం. ఇది ఒక్క రోజులో రాకపోవచ్చు. కానీ సాధన చేత, ధర్మాన్ని తెలుసుకోవడం వల్ల మెల్లమెల్లగా అలవడుతుంది.

To be continued...................

Wednesday, 12 February 2014

హిందూ ధర్మం - 17

2 - క్షమా:

క్షమించడం, క్షమా గుణం కలిగి ఉండడం ధర్మం యొక్క రెండవ లక్షణం. క్షమించడం అన్నమాటని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఒకడు బలహీనుడై, ఎదుటివాడు బలవంతుడైనప్పుడు, వాడితో పోరాటం చేయలేక, వాడు ఎన్ని అకృత్యాలు చేస్తున్నా, వాడిని క్షమించేస్తాం. ఇది పరికితనంతో చేసే పని. ఇది క్షమా గుణం కాదు, చేతకానీతనం అంటుంది ధర్మం. ఏలా అంటే, మీకు ఎవరి మీదో బాగా కోపం వచ్చింది, గట్టిగా నాలుగు తగించాలనుకున్నారు, కానీ అవతలివాడు మీకంటే శక్తివంతుడని, మీరు ఒక్క దెబ్బ కొడితే, వాడు పది దెబ్బలేస్తాడని తెలిసు కనుక, మీరు వెనక్కు తగ్గుతారు. అది కాదు క్షమా అంటే అంటుంది ధర్మం.

మీరు ముందు బలవంతువులుగా మారండి. ఎవరైనా మీ జోలికి వస్తే వాడికి బుద్ధి చెప్పేటంతగా, శారీరికంగానూ, మానసికంగానూ మీరే బలవంతులవ్వాలి. ఎదుటివాడిని మట్టి కరిపించే శక్తి మీకు ఉండాలి. అన్నీ ఉండి, అవతలవాడు బలహీనుడని తెలిసి కూడా మీరు క్షమించగలగాలి. అదే నిజమైన క్షమా గుణం. ఇదే కర్మయోగం చెప్తుంది. ధర్మం కూడా అటువంటి క్షమాగుణాన్నే అలవరచుకోవాలని చెప్తున్నది. ఎందుకంటే ఏమి లేనీవాడు, శక్తిహీనుడు ఎట్లాగో వాదన చేయలేడు, కనుక సర్దుకుపోతాడు. క్షమించడం ధీరులైనవారి లక్షణం. చేతగానితనం బలహీనుల లక్షణం. అందుకే  బలహీనులు ఎప్పటికి క్షమించలేరు, క్షమించడం బలవంతుల సద్గుణం అన్నారు గాంధీ.

To be continued...................