Wednesday 19 February 2014

హిందూ ధర్మం - 21

వికలాంగులైన ఈ 100 మంది, బాధపడుతూ, భారమైన మనసుతో, కంటతడి పెడుతూ, రాజమందిరంలోనికి ప్రవేశించగా, అది చూసిన కుశనాభుడు తన కూమార్తెలతో 'ఏం జరిగింది? మిమ్మలని ఈ స్థితికి తీసుకువచ్చిందెవరు, మీ ధర్మాన్ని నాశనం  చేసిందెవరు, మిమ్మలని పొట్టిగాం అందవీహినంగా చేసిందెవరు, మీరెందకు ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నారు' అంటూ ప్రశించాడు.

కుశనాభుడి మాటలు విన్న ఈ 100 ఆడపిల్లలు, ఆయన పాదాలకు తమ నుదురు తగిలేలా నమస్కరించి, 'వాయుదేవుడు సంకల్పం వలన మాకు ఈ స్థితి వచ్చింది' అని చెప్పి, జరిగినదంతా వివరిస్తారు. అప్పుడు కుశనాభుడు వారితో 'చాలామంచి పని చేశారమ్మా! నాకు చాలా గర్వంగా ఉంది. క్షమించడమనేది స్వీయ నియంత్రణ (తమ మీద తమకు నియంత్రణ) ఉన్నవారు మాత్రమే చేయగలరు. మీరు మానసికంగా బలవంతులు. మీరు చేసిన పనివల్ల మన వంశం కీర్తి మరింత పెరిగింది. క్షమా గుణం స్త్రీలకు అలంకారం. ఆమాటకు వస్తే, ప్రతి పురుషుడికి ఉండవలసిన లక్షణం. మీరు అప్సరస కూమర్తెలు, శపించగల శక్తి ఉండి కూడా, నిగ్రహించుకున్నారు, సాధారణ మనుష్యులలా ఆవేశానికి లోనుకాలేదు.

క్షమా దానాం క్షమా సత్యం క్షమా యజ్ఞస్య పుత్రికా
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్

క్షమా గుణమే దానము, సత్యము, క్షమయే గొప్ప యజ్ఞము, క్షమాగుణమే యశస్సు, క్షమించడమే ధర్మం, క్షమా గుణం చేతనే ఈ జగత్తంతా నడుస్తున్నది ఓ పుత్రికలారా! అని కుశనాభుడు వారి యొక్క క్షమాగుణాన్ని పొగిడారు.

తర్వాత బ్రహ్మదత్తుడనే ఒక ఋషుతుల్యుడైన మహారాజుకిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం బ్రహ్మదత్తుని చేయి తగలగానే, 100 మంది తమ పూర్వరూపాన్ని పొందారు.

To be continued...................

1 comment: