Showing posts with label బోనం. Show all posts
Showing posts with label బోనం. Show all posts

Sunday, 2 August 2015

అచ్చమైన మన తెలంగాణ వేడుక

బోనాల పండుగ
దక్షిణాయణ ప్రారంభంలో వరుణుడు కరుణించి ప్రకృతి మాత పులకించగా, వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు, భక్తి ప్రపత్తులతో మహాశక్తిని విభిన్న రూపాలలో కొలుచుకోవటం అనాదిగా వస్తోంది. శక్తి ఆరాధనలలో ఇదీ ఒక భాగమే. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల.

ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. అచ్ఛమైన తెలంగాణ తెలుగువారి పండుగగా దీనిని అభివర్ణిస్తారు. ప్రత్యేకించి మన హైదరాబాద్ నగరంలో అయితే, ప్రతీ కూడలిలో కొలువుదీరిన అమ్మవారి దేవాలయాలు ఆకుపచ్చని తోరణాలతో, విద్యుద్దీప కాంతులతో తళుకులీనుతుంటై. కనీసం ఆ ఒక్క రోజైనా నిఖార్సయిన గ్రామీణ వాతావరణాన్ని కన్పింపజేయడం బోనాల పండుగలోని విశిష్టతగా చెప్పాలి. బోనం అంటే భోజనమే. భక్తులు అమ్మవారికి తమ మొక్కుల్ని తీర్చుకోవడమే కాదు, తమకు అన్నాన్నిస్తున్న ఆ తల్లికి కృతజ్ఞతా సూచకంగా, పవిత్రమైన బోనం కుండలో భోజనాన్ని వండి సమర్పించుకోవడం కూడా. ఇదే ఇందులోని పరమార్థం.



పిల్లల సంరక్షణలో అమ్మవారు
జాతరలో కొందరు మొక్కుబడి చెల్లించుకునేందుకు వెళ్తారు. మరి కొందరు ఉత్సాహం ముప్పిరి గొనగా దైనందిన జీవితం నుండి మార్పు కోరి తమ వాళ్ళతో కలిసి సరదాకు వెళ్తారు. ఇంకొందరు భక్తి ఆవేశం తన్మయించగా జాతరలో తామే ఒక భాగంగా మారుతారు. ప్రధానంగా బోనాలు జాతర అంతరార్థం మరోటి ఉంది. చిన్న పిల్లలకు మశూచి, అమ్మవారు వంటి భయానక వ్యాధులు రాకుండా ఉండాలని, అందుకు అమ్మవారు వారికి రక్షణ కవచంగా ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసమే ప్రజలను ఇలా ప్రతి ఏడూ బోనాలు సమర్పించుకొనేలా చేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణా సంస్కృతికి అద్దం పడుతూ, హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో అసంఖ్యాకంగా హిందువులు జరుపుకొనే పెద్ద పండుగలలో ఒకటి బోనాలు. దీనిని ఆషాడ జాతర అనీ అంటారు. తెలంగాణలోని అంతటా వివిధ తేదీలలో జరుపుకుంటారు. హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాతబస్తీలోని లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి దేవాలయాలలో అయితే అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారి గుడులను సందర్శించడం ఒక మహాజాతరను తలపిస్తుంది. ఈ బోనాల ఆచారం ప్రాచీనకాలంలోనూ ఉన్నదనేందుకు శ్రీనాథుని హరవిలాస కావ్యంలోనే చక్కని ఉదాహరణ ఉంది. నానావిధ పాకములుగ/ నానాలుగ జేసి నాలుగై దట్టికలన్/ బోనాము దొంతి బేర్చిరి అంటారందులో. ఈ ఆధునిక కాలంలోనూ ఏ మాత్రం తీసిపోని విధంగా జాతర జరుగుతుంది. ఈ పండుగ సమయాలలో ఇంటి ద్వారాలకు, వీధులకు, వేపమండలతో అలంకరణ చేసుకోవడం ఓ ప్రత్యేకతగా కనిపిస్తుంది.
ఈ సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల విశేషాల మాలిక ఇక్కడ-

ఘటోత్సవం:
అమ్మవారికి ఎదురువెళ్ళి పుట్టింటి నుండి తీసుకొని వచ్చే ఎదురుకోళ్ళతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది. ఘటం అంటే కలశం. కలశంతో అమ్మవారికి స్వాగతం పల్కడం. పూర్ణకుంభ స్వాగతమన్న మాట.
ప్రత్యేకమైన కలశంలో అమ్మవారు ఆవాహన చేయబడి పురవీధులలో ఊరేగుతారు. అసలైన బోనాల ఉత్సవం ముందు రోజు వరకు ఉదయం, సాయంత్రం అమ్మవారు ఘటంపై సూక్ష్మరూపంలో ఆసీనురాలై పురవీధుల గుండా సంచారం చేస్తూ, భక్తుల పూజలు అందుకుంటారు. ఘటోత్సవం ద్వారా అమ్మవారి పూజలు ప్రారంభమైనట్లు లెక్క. ఆలయానికి వెళ్ళ లేని వృద్ధులు, వికలాంగులు తమ ఇండ్ల వద్దకు తరలివచ్చిన అమ్మవారిని సేవించి, మొక్కులు తీర్చుకొని తరిస్తారు.

సాక సమర్పణ:
సాక అంటే శాఖ. అంటే చెట్టుకొమ్మ. వేపమండను పసుపు నీటి సాకలో ఉంచి, అమ్మవారికి సమర్పించడం. దీనినే సాకివ్వడం లేదా శాఖ సమర్పణం అంటారు. వేపాకు ఉంచిన పసుపు నీరు చల్లి సాక సమర్పిస్తే, ఆ తల్లి తమను చల్లగా చూస్తుందని ప్రజల నమ్మకం.

ఫలహారపు బండ్లు:
బోనాల పండుగ రోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ ఇండ్లలో తయారు చేసుకొని, వాటిని బండ్లలో పెట్టుకొని బయల్దేరుతారు. ఆలయం చుట్టు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి, మిగిలింది తమ ఇంటికి తెచ్చుకొంటారు. కుటుంబ సభ్యులంతా దానిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా వేల సంఖ్యలో భక్తులు బండ్లపై ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ. వీటినే ఫలహారపు బండ్లుగా పిలుస్తారు.

పోతురాజుల వీరంగం:
బోనాలలో వీరొక ప్రత్యేకత. పోతురాజులు వీరంగం చేస్తూ అమ్మ ఆలయానికి తరలి వెళతారు. శరీరమంతా పసుపు రాసుకొని, లంగోటి (వస్త్రము) కట్టుకొంటారు. కాళ్ళకు గజ్జెలు, కళ్ళకు కాటుకతో నుదుట కుంకుమ దిద్దుకొంటారు. నోట్లో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకొంటారు. నడుం చుట్టూ వేపమండలు చుట్టుకొంటారు. పసుపుతాడుతో చేసిన కొరడాను ఝుళిపిస్తూ, తప్పెట్లు వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ మహాభక్తి పారవశ్యంతో కదలి వెళతారు. అమ్మ వారికి సోదరుడైన పోతురాజు గ్రామాన్ని సంరక్షిస్తూ తమకు అండగా ఉంటాడని ప్రజల నమ్మకం. బోనాల పండుగ రోజున వేలాది మంది పోతురాజులు పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులను తమ అభినయాలతో, నృత్యాలతో రంజింపజేయడం ఒక అపూర్వ సన్నివేశం. పోతురాజులతో కలసి, నృత్యాలు చేస్తూ, చిందులు వేస్తూ తెలంగాణ యాసలో పాటలు పాడుతూ, తన్మయత్వంతో కదలి వెళ్ళే జనాలను ప్రపంచం తనివి తీరా చూడాల్సిందే తప్ప వర్ణించ మాటలు రావు.

రంగం వేడుకలు:
రంగం అంటే భవిష్యవాణి వినిపించడం. బోనాల పండుగ ప్రతి ఏడూ నిర్ణీత ఆదివారం నాడే జరుగుతుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం ముఖమండపంలో మాతంగేశ్వరి ఆలయం వద్ధ అమ్మవారికి ఎదురుగా ఒక అవివాహిత స్త్రీ వచ్చి కుండపై నిలబడుతుంది. దేవతా అమ్మవారి వంకే తదేకంగా చూస్తూ ఆమె కళనంతా ఆవహింపజేసుకొంటుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విశేషాలను ఆమె నోటి ద్వారా ఆ దేవతే వెల్లడిస్తుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ భవిష్యవాణిని వినడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. రంగం కార్యక్రమంలో పాల్గొనే స్త్రీ (మాతంగి) జీవితం అమ్మవారికే అంకితం. ఒక కత్తికి మాంగల్య ధారణ చేసి జీవితాంతం అవివాహితగానే ఉండిపోతుంది. బోనాల జాతర జరిగే ప్రతి ఆలయానికి ఒక మాతంగి ఉండవచ్చు. లేదా ఒకే మాతంగి కొన్ని ఆలయాల బోనాల ఉత్సవాలకు రంగం వేడుకలో పాల్గొనవచ్చు.

గావు పట్టడం:
వంశపారంపర్యంగా వస్తున్న పోతురాజులు ఉదయం 9 గంటల ప్రాంతంలో విలయతాండవం చేస్తూ, ఉద్వేగంతో ఊగి పోతూ ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలు ప్రదర్శిస్తారు. అమ్మవారికి ఎదురుగా, మేళతాళాల మధ్య, లయబద్ధంగా నాట్యం చేస్తున్నప్పుడు అమ్మవారు వారిపై ఆవహిస్తుందని అంటారు. ఈ సందర్భంలో సొరకాయ, గుమ్మడికాయలను బలి ఇస్తారు. ఈ కాయలను పోతురాజు నోటితో కొరకటమే గావు పట్టడం. అంతకు పూర్వం జంతుబలులు ఉండేవి. ఇప్పుడు వీటిని నిషేధించారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు చూసి తరిస్తారు.

సాగనంపు:
గావు పట్టడం పూర్తయ్యాక అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి, మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించుకుంటూ తీసుకొని వెళతారు. ఇలా ఆమెను సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు.
By వనిత విజయకుమర్ ద్యాప

నమస్తే తెలంగాణ - ఆదివారం సంచిక - బతుకమ్మ

Source: http://goo.gl/tvk3CY

Sunday, 20 July 2014

అమ్మకు బోనం

ఈ లోకంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఏలా అయినా వాడుకోవచ్చు. దాన్ని కొందరు స్వార్ధం కోసం, ప్రపంచంపై ఆధిపత్యం కోసం, లోక వినాశనం కోసం వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, కొందరు లోకహితానికి ఉపయోగపడాలని భావిస్తారు. మొదటిరకం వారు ఖచ్చితంగా నాశనమవుతారు, ఇంతకముందు అనేకులు అయ్యారు కూడా. కానీ వారు చేసే దుష్టకృత్యాల్లో అనేకమంది అమాయకుల ప్రాణాలు బలైపోతాయి. వీటికి తోడు రకరకాల రోగాలు, ప్రకృతి విపత్తులు అనేకమందిని బలి చేస్తాయి.

లలితా సహస్రనామాల్లో ' ఆబ్రహ్మకీట జననీ' అని అమ్మకి ఒక నామం, అంటే బ్రహ్మ మొదలుకొని చిన్న కీటకముల వరకు పక్షులు, చెట్లు, గ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, మనుష్యులు, దేవతలు మొదలైనవారందరికి ఆమెయే తల్లి అని అర్దం. ఇలా అమాయకుల ప్రాణాలు అనవసరంగా బలవడం అమ్మ(పరమేశ్వరి/జగజ్జనని)కి ఇష్టంలేదు. అందరం ఆమె పిల్లలమే. కాబట్టే అమ్మ మనందరికోసం భూమి మీదకు అనేకమార్లు అనేక రూపాలలో వచ్చింది.

కులమతాలకు అతీతంగా తన పిల్లలందరిని రక్షించడానికి గ్రామదేవతల రూపాన భువిపైకి దిగివచ్చింది. ఒక్కో గ్రామానికి ఒక్కొక్క పేరుతో గ్రామదేవత అయ్యింది. కొన్ని ప్రదేశాల్లో కొందరికిచ్చిన మాట కోసం వచ్చి కూర్చుంది, కొన్ని చోట్ల ఎవరో పిలవడం వలన వచ్చింది, కొన్ని చోట్ల స్వయంగా తానే వచ్చి కొలువుతీరింది. ఒక్కో చోట ఒకొక్క రకమైన కధ. మరిడమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, తలుపులమ్మ, సుంకుళ్ళమ్మ, గంగమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, పెద్దమ్మ, పెద్దమంటలాంబ, చిన్నమంటలాంబ................ఇలా రకరాకాల పేర్లతో ఒకటే శక్తి అనేక రూపాలను పొందింది. ప్రతి చోట ఊరి మధ్యలో కాకుండా ఊరి బయట పొలిమేరలో కూర్చుంది. ఊరిలోకి వచ్చే అరిష్టాలను, అంటువ్యాధులను, దుష్టశక్తులను పొలిమేరలోనే అడ్డుకుని, దూరంగా తరిమేసి తన పిల్లలను కాపాడుకోవాలన్నది ఆ తల్లి ఆకాంక్ష. మన అందరి రక్షణ కోసమే గ్రామదేవతగా అమ్మ పొలిమేరలో కాపలాకు కూర్చుంది. అందరిని కాపాడుతున్న ఆ దివ్యశక్తి స్వరూపిణిని మనం గ్రామదేవతగా కొలుస్తాం. దివ్యశక్తి స్వరూపిణి అయిన అమ్మకు యొక్క ప్రతిబింబాలే మన గ్రామ దేవతలు.

మన కోసం ఆ జగన్మాత ఊరి పొలిమేరలో గ్రామదేవతగా కూర్చుంది. సంవత్సరమంతా ఎండకు ఎండి, వానకు తడిసి, ఎముకలు కొరికే చలిలో కూడా ఆ శక్తి మనలని, మన గ్రామాల్ని రక్షిస్తూనే ఉంది. ఆమెకు ఏ విధంగానైన సాయం చేయగలమా? అది అసాధ్యం. ధనం ఇద్దామనుకుంటే ఆవిడకు డబ్బు అవసరమే లేదు. అందరికి లక్ష్మీదేవి రూపంలో తానే ధనం  తానేఇస్తుంది. మరి గ్రామదేవతకు కృతజ్ఞతలు చెప్పడం ఏలా?  అన్నిటిని మనకు ప్రసాదించగల ఆ దివ్యశక్తికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవడంలో భాగమే ప్రతి ఏటా నిర్వహించే జాతరలు, బోనాలు, ఉత్సవాలు మొదలైనవి. ఆ సమయాల్లో మొత్తం ఊరు ఊరంతా ఏకమై తరిలివెళతారు.

ఆషాఢం అనగానే గుర్తుకువచ్చేది బోనాలు. భాగ్యనగరం (హైద్రాబాదు)లో ఎంతో వైభవంగా జరుగుతాయి. బోనం భోజనం అనే పదానికి వికృతి. మా పిల్లల్ని, కుటుంబసభ్యులను, మొత్తం గ్రామాన్ని చల్లగా చూస్తున్న ఓ జగన్మాత! అందరికి అన్ని ఇవ్వగల నీకు భక్తితో ఈ బోనం సమర్పిస్తున్నానమ్మా! మా అందరి కోసం ఊరి పొలిమేరలో కూర్చున్నావు, నీకు ఏదైనా ఇద్దామంటే నీ దగ్గర లేనిదేది లేదు. కానీ అమ్మ! భక్తితో నీకు బోనం(భోజనం) తెచ్చాను. స్వీకరించి మమ్మల్ని సదా అనుగ్రహించు తల్లీ! అంటూ బోనం సమర్పించి అమ్మకు కృతజ్ఞతలు చెప్తున్నాం.    

బోనం జగన్మాతకు చెప్పే కృతజ్ఞత