Sunday 20 July 2014

అమ్మకు బోనం

ఈ లోకంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఏలా అయినా వాడుకోవచ్చు. దాన్ని కొందరు స్వార్ధం కోసం, ప్రపంచంపై ఆధిపత్యం కోసం, లోక వినాశనం కోసం వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, కొందరు లోకహితానికి ఉపయోగపడాలని భావిస్తారు. మొదటిరకం వారు ఖచ్చితంగా నాశనమవుతారు, ఇంతకముందు అనేకులు అయ్యారు కూడా. కానీ వారు చేసే దుష్టకృత్యాల్లో అనేకమంది అమాయకుల ప్రాణాలు బలైపోతాయి. వీటికి తోడు రకరకాల రోగాలు, ప్రకృతి విపత్తులు అనేకమందిని బలి చేస్తాయి.

లలితా సహస్రనామాల్లో ' ఆబ్రహ్మకీట జననీ' అని అమ్మకి ఒక నామం, అంటే బ్రహ్మ మొదలుకొని చిన్న కీటకముల వరకు పక్షులు, చెట్లు, గ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, మనుష్యులు, దేవతలు మొదలైనవారందరికి ఆమెయే తల్లి అని అర్దం. ఇలా అమాయకుల ప్రాణాలు అనవసరంగా బలవడం అమ్మ(పరమేశ్వరి/జగజ్జనని)కి ఇష్టంలేదు. అందరం ఆమె పిల్లలమే. కాబట్టే అమ్మ మనందరికోసం భూమి మీదకు అనేకమార్లు అనేక రూపాలలో వచ్చింది.

కులమతాలకు అతీతంగా తన పిల్లలందరిని రక్షించడానికి గ్రామదేవతల రూపాన భువిపైకి దిగివచ్చింది. ఒక్కో గ్రామానికి ఒక్కొక్క పేరుతో గ్రామదేవత అయ్యింది. కొన్ని ప్రదేశాల్లో కొందరికిచ్చిన మాట కోసం వచ్చి కూర్చుంది, కొన్ని చోట్ల ఎవరో పిలవడం వలన వచ్చింది, కొన్ని చోట్ల స్వయంగా తానే వచ్చి కొలువుతీరింది. ఒక్కో చోట ఒకొక్క రకమైన కధ. మరిడమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, తలుపులమ్మ, సుంకుళ్ళమ్మ, గంగమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, పెద్దమ్మ, పెద్దమంటలాంబ, చిన్నమంటలాంబ................ఇలా రకరాకాల పేర్లతో ఒకటే శక్తి అనేక రూపాలను పొందింది. ప్రతి చోట ఊరి మధ్యలో కాకుండా ఊరి బయట పొలిమేరలో కూర్చుంది. ఊరిలోకి వచ్చే అరిష్టాలను, అంటువ్యాధులను, దుష్టశక్తులను పొలిమేరలోనే అడ్డుకుని, దూరంగా తరిమేసి తన పిల్లలను కాపాడుకోవాలన్నది ఆ తల్లి ఆకాంక్ష. మన అందరి రక్షణ కోసమే గ్రామదేవతగా అమ్మ పొలిమేరలో కాపలాకు కూర్చుంది. అందరిని కాపాడుతున్న ఆ దివ్యశక్తి స్వరూపిణిని మనం గ్రామదేవతగా కొలుస్తాం. దివ్యశక్తి స్వరూపిణి అయిన అమ్మకు యొక్క ప్రతిబింబాలే మన గ్రామ దేవతలు.

మన కోసం ఆ జగన్మాత ఊరి పొలిమేరలో గ్రామదేవతగా కూర్చుంది. సంవత్సరమంతా ఎండకు ఎండి, వానకు తడిసి, ఎముకలు కొరికే చలిలో కూడా ఆ శక్తి మనలని, మన గ్రామాల్ని రక్షిస్తూనే ఉంది. ఆమెకు ఏ విధంగానైన సాయం చేయగలమా? అది అసాధ్యం. ధనం ఇద్దామనుకుంటే ఆవిడకు డబ్బు అవసరమే లేదు. అందరికి లక్ష్మీదేవి రూపంలో తానే ధనం  తానేఇస్తుంది. మరి గ్రామదేవతకు కృతజ్ఞతలు చెప్పడం ఏలా?  అన్నిటిని మనకు ప్రసాదించగల ఆ దివ్యశక్తికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవడంలో భాగమే ప్రతి ఏటా నిర్వహించే జాతరలు, బోనాలు, ఉత్సవాలు మొదలైనవి. ఆ సమయాల్లో మొత్తం ఊరు ఊరంతా ఏకమై తరిలివెళతారు.

ఆషాఢం అనగానే గుర్తుకువచ్చేది బోనాలు. భాగ్యనగరం (హైద్రాబాదు)లో ఎంతో వైభవంగా జరుగుతాయి. బోనం భోజనం అనే పదానికి వికృతి. మా పిల్లల్ని, కుటుంబసభ్యులను, మొత్తం గ్రామాన్ని చల్లగా చూస్తున్న ఓ జగన్మాత! అందరికి అన్ని ఇవ్వగల నీకు భక్తితో ఈ బోనం సమర్పిస్తున్నానమ్మా! మా అందరి కోసం ఊరి పొలిమేరలో కూర్చున్నావు, నీకు ఏదైనా ఇద్దామంటే నీ దగ్గర లేనిదేది లేదు. కానీ అమ్మ! భక్తితో నీకు బోనం(భోజనం) తెచ్చాను. స్వీకరించి మమ్మల్ని సదా అనుగ్రహించు తల్లీ! అంటూ బోనం సమర్పించి అమ్మకు కృతజ్ఞతలు చెప్తున్నాం.    

బోనం జగన్మాతకు చెప్పే కృతజ్ఞత

No comments:

Post a Comment