Showing posts with label వందనా శివ. Show all posts
Showing posts with label వందనా శివ. Show all posts

Tuesday, 6 June 2017

కన్నీరు మిగిల్చిన హరిత విప్లవం- ఖలిస్థాన్ ఉద్యమానికి కారణం కూడా;

జూన్ 6, పంజాబ్ లోని స్వర్ణదేవాలయం వద్ద ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన రోజు.
తమను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ పంజాబ్ లో రాజుకున్న ఖలిస్థాన్ ఉద్యమానికి కారణం ఏమిటి?
వ్యవసాయానికి, అందులో కలిగిన మార్పులకు, ఖలిస్థాన్ ఉద్యమానికి సంబంధం ఏమిటి?
వ్యవసాయం, పర్యావరణం నాశనమైతే దేశంలో విభజన వాదాలు, అతివాదాలు, తీవ్రవాదాలు పుట్టుకోస్తాయా? వనరుల కాలుష్యం దేశసమగ్రతకు ముప్పా?

వీటికి సమాధానం తెలుసుకోవాలంటే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి శ్రీమతి వందనా శివ గారు చెప్పిన విషయాలు చదవండి.

కన్నీరు మిగిల్చిన హరిత విప్లవం

- వందనా శివ   04/03/2014


ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించి 2014కు సరీగ్గా 30ఏళ్ళు నిండుతాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు 1984, జూన్ నెలలో పంజాబ్‌లో ఈ సైనిక చర్యను చేపట్టారు. అమృత్‌సర్‌లోని హర్‌మందిర్ సాహెబ్‌లో తిష్ఠవేసిన జర్నైల్ భింద్రన్‌వాలే..అతని నేతృత్వంలోని సాయుధ మిలిటెంట్లను ఏరిపారేసేందుకు ఈ చర్య తీసుకున్నారు. అయితే పంజాబ్‌లో ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహణకు, హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడానికి మధ్య అవినాభావ సంబంధముందన్న సం గతి బహుశా చాలామందికి తెలియని విషయం. ఒకవేళ తెలిసినా మరచిపోయి ఉండవచ్చు.



భారత్‌లో హరిత విప్లవం 1966లో ప్రారంభం కాగా, పంజాబ్‌లో 1968లో మొదలైంది. పంట సాగు, ఉత్పత్తుల విధానంలో హరిత విప్లవం సమూల మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా అంతకుముందు రైతులు వేర్వేరు రకాల పంటలు పండించేవారు. కానీ ఈ హరిత విప్లవం పుణ్యమాని కేవలం వరి, గోధుమ పంటలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. వీటి దిగుబడులు పెంచడానికి రసాయన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించారు. తొలి నాళ్ళలో రసాయన ఎరువులు, విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీని కల్పించింది. పదేళ్ళపాటు ఇదే విధానాన్ని కొనసాగించి, తర్వాత సబ్సిడీలు ఎత్తివేశారు. ఫలితంగా రైతుల ఆదాయం క్రమంగా పడిపోవడం ప్రారంభమైంది. ఇది రైతుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.


ఇదే సమయంలో భింద్రన్ వాలే ఒక మత ప్రచారకుడిగా, గ్రామ గ్రామానికి వెళ్ళాడు. సిక్కుమతం బోధించిన ప్రకారం జీవన విధానాలను కొనసాగించాలని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాడు. తీవ్ర అసంతృప్తితో ఉన్న సిక్కు యువతను అశ్లీలత, కల్తీ, మత్తుమందులు, పొగాకు వాడకం, మద్యం వంటి వ్యసనాలనుంచి బయటపడి ఖల్సా మార్గంలోకి తిరగి రావాలంటూ ప్రోత్సహించాడు. పై వ్యసనాలకు సిక్కు యువత అలవాటు పడటానికి కేవలం ‘హరిత విప్లవమే’ కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 1984 నాటికి పంజాబ్ పూర్తిగా హింసాకాండతో అట్టుడికిపోయే స్థితికి చేరుకుంది. ఖలిస్తాన్ బోధనలు చివరకు మిలిటెన్సీకి దారితీసాయి, దీని ఫలితంగా, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భద్రతా బలగాలను వినియోగించాల్సి వచ్చింది. ఈవిధంగా హరిత విప్లవానికి, పంజాబ్‌లో పెచ్చరిల్లిన హింసాకాండకు మధ్య ఉన్న తేడాను గుర్తించి...అసలు పంజాబ్‌లో ఏం జరుగుతున్నదనేదానిపై పరిశోధించి ‘‘ది వాయిలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్’’ అనే పుస్తకాన్ని రాయడానికి దారితీసింది. మరి ఈ హరిత విప్లవానికి పితామహుడిగా కీర్తి ప్రతిష్ఠలు అందుకున్న నార్మన్ బోర్‌లౌగ్‌కు నోబెల్ బహుమతి లభించింది మరి!


నిజం చెప్పాలంటే హరిత విప్లవం సుస్థిరమైనది కాదు. పర్యావరణం, ఆర్థిక, సామాజిక పరంగా పరిశీలించినప్పుడు దీని అస్థిరత బయటపడుతుంది. పర్యావరణ పరంగా చూస్తే, రసాయన ఎరువులను విపరీతంగా వాడటం వల్ల భూసారం చచ్చిపోయింది. పంజాబ్‌లో కేవలం ఒకటి లేదా రెండు శాతం ప్రాంతాల్లో మాత్రమే పదిశాతం సేంద్రీయ ఎరువుల వాడకం కనిపిస్తుంది. 1970-71 నుంచి 2010-11 మధ్యకాలం వరకు పరిశీలిస్తే, రసాయన ఎరువుల వాడకం 213,000 టన్నుల నుంచి ఏకంగా 1,911,000 టన్నులకు పెరిగిపోయింది. రసాయన ఎరువులను వాడటం వల్ల వ్యవసాయంలో నీటి వినియోగం బాగా పెరుగుతుంది. పంజాబ్‌లో సరీగ్గా ఇదే జరిగింది. ఆ రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూమికి, 27 శాతం ఉపరితల నీటి ద్వారా, 71శాతం భూగర్భ జలం ద్వారా సాగునీరు అందించారు. నీటివాడకం విపరీతం కావడం వల్ల నీటిలో ఉప్పు పరిమాణం పెరిగిపోయి, తాగునీరు అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా పంజాబ్‌ను నీటి కరువు ఆవహించడం మొదలైంది.


ఇక 1970 చివరి నాటికి, సబ్సిడీలు ఎత్తివేయడం, పెట్టుబడులు పెరగడంతో రాష్ట్రంలో ఋణ ఆర్థిక వ్యవస్థ చోటు చేసుకోవడం ప్రారంభమైంది. 1980 నాటికి పంజాబ్ రైతులను, భారత దేశానికే అన్నదాతలుగా కీర్తించడం పరాకాష్టకు చేరుకుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. 1986, ఏప్రిల్ 13న గురుగ్రంథ్ సాహెబ్ సమక్షంలో ‘సర్బత్ ఖల్సా’ (సిక్కులు సమావేశం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఏకరువు పెట్టారు. ‘‘నేడు సిక్కులు బానిస సంకెళ్ళతో నానా కష్టాలు పడుతున్నారు’’ అంటూ సమావేశంలో పాల్గొన్నవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.


1984లో పంజాబ్ రైతులు తాము అనుభవిస్తున్న బానిస బతుకులనుంచి విముక్తి కోసం ఆందోళనకు దిగారు. అదే ఏడాది జనవరి 31న ‘రాస్తారోకో’ నిర్వహించారు. మార్చి 12న వారు గవర్నర్ ఇంటి ముందు ఘెరావ్ చేశారు. తమను పీడిస్తున్న రుణ బాధలనుంచి విముక్తులను చేయాలంటూ, ‘ఖర్జా రోకో’ నిర్వహించారు. తిరిగి అదే ఏడాది మే నెలలో గవర్నర్ ఇంటి ఎదుట ఘెరావ్ చేశారు. చివరకు తాము పండించిన ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అమ్మకూడదని మే 23న పంజాబ్ రైతులు నిర్ణయించారు. పంజాబ్‌లో పెచ్చరిల్లిన హింసకు మూలం ‘హింసాత్మక వ్యవసాయం’లో ఉంది. ఈ హింసాత్మక వ్యవసాయానికి కారణం ‘హరిత విప్లవం’. ఈవిధంగా బీజ రూపంలో ప్రారంభమైన హింస, ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట సైనిక చర్యతో పరాకాష్టకు చేరింది. ఆ తర్వాతైనా శాంతి నెలకొన్నదా? అంటే అదీ లేదు. ఈ సైనిక చర్య చివరకు ఇందిరాగాంధీ హత్యకు, ఆ తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు దారితీసింది. పంజాబ్‌లోని సిక్కులకు మరియు రైతులకు ఇప్పటి వరకు జరిగిన అన్యాయం సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.


రసాయన ఎరువుల వాడకం వల్ల నేటికీ పంజాబ్ రైతులు వ్యాధులకు లోను కావడం, కొందరు మరణించడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే భూములు కోల్పోయిన సేంద్రీయ పదార్ధాలు తిరిగి కూడే పరిస్థితి లేదు. విభిన్న పంటలు పండించే పంజాబ్ రైతులను, హరిత విప్లవం పుణ్యమాని, ఖరీఫ్‌లో వరి, రబ్బీలో గోధుమ పండించడానికి మాత్రమే హరిత విప్లవం పరిమితం చేసింది. భూసారం పూర్తిగా క్షీణించి పోవడానికి ఇది కూడా ఒక కారణం. ఒక ఎకరానికి పంజాబ్‌లో ఉత్పత్తి అయ్యే ఆహారధాన్యంలో పోషకత, ఆరోగ్య లక్షణాలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఇదంతా హరిత విప్లవం పుణ్యమే! హరిత విప్లవానికి ముందు పంజాబ్ రైతులు మొత్తం 41 రకాల గోధుమ పంటను, 27 రకాల వరి పంటను పండిస్తున్నారు. అదేవిధంగా నాలుగు రకాల మొక్కజొన్న, మూడు రకాల సజ్జలు, 16 రకాల చెరుకు, 19 రకాల పప్పు ధాన్యాలు, తొమ్మిది రకాల నూనె గింజల/సుగంధ ద్రవ్యాల పంటలను పండించేవారు. అప్పట్లో గోధుమకు బదులు, షర్బతీ, దర్రా, లాల్ పిస్సీ,లాల్ కనక్, బన్సీ, కథియా, మాల్వా, పక్వాన్, దావత్ ఖాన్ వంటి నాణ్యమైన రకాలు పంట నాణ్యతను, మూలాన్ని వివరించేవిగా ఉండేవి. కానీ నేడు రైతులు పండిస్తున్న రకాలపై క్రిమి కీటకాలు, వ్యాధులు తేలిగ్గా ఆవహించేవిగా ఉన్నాయి. మరి వ్యాధులు, చీడపీడల నివారణకు మరింత ఎక్కువ డోసుతో క్రిమిసంహారకాలను రైతులు వాడాల్సి వస్తోంది.

2011-12సంత్సరంలో వరి ధాన్యం ఖరీదు రూ.1700, గోధుమకు రూ. 1500 ఉండగా, కనీస మద్దతు ధర మాత్రం రూ. 1285, రూ. 1110 గా నిర్ధారించారు. అదే 1995-2001 మరియు 2001-2005 మధ్యకాలంలో పంజాబ్ రైతుల నికరాదాయం, వరికి రూ.77 నుంచి రూ.7లకు, గోధుమకు రూ. 67 నుంచి రూ. 34కు పడిపోయింది. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సగటున ఎకరానికి రూ. 41,576లు చొప్పున రైతులకు అప్పులు మిగిలాయి. విత్తనాలు, రసాయనాల వంటి ఉత్పాదకాల ఖరీదు విపరీతంగా పెరిగిపోవడంతో, రైతుల ఆర్థిక పరిస్థితి ఋణాత్మకానికి దిగజారింది. మరి ఈ పరిస్థితుల్లో పంజాబ్ రైతుల్లో ఆందోళన, ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం సహజమే. దీన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సానుకూలంగా అర్థం చేసుకొని అందుకనుగుణంగా స్పందించాలి. ముఖ్యంగా పర్యావరణ, ఆర్థిక పరంగా రైతులకు మేలు చేసే విధానాలను రూపొందించి అమలు పరచాలి. రైతులకు హితుడిగా, మిత్రుడిగా ప్రభుత్వం వ్యవహరిస్తూ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి దోహద పడాలి. 1980 ప్రాంతంలో ఈ సంక్షోభం మిలిటెన్సీకి దారితీస్తే నేడు మరో రూపంలో..అంటే ఆత్మహత్యల రూపంలో ఇది కనిపిస్తోంది. 1984 నాటి పాఠాలను దృష్టిలో ఉంచుకొని, హింసాత్మక, ప్రమాదకారి హరిత విప్లవ పథం నుంచి వీడి, రైతు మిత్ర విధానాలను అనుసరించాల్సిన పంజాబ్ ప్రభుత్వం, మోన్‌శాంటో, అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ కార్పొరేషన్లతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం దారుణం.


క్రిమిసంహారక మందులు విషపూరితాలు. ఇక జన్యు పరివర్తక మొక్కలు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. బిటి పంటల్లోని బిటి జన్యువులు, హెర్బిసైడ్ రెసిస్టెంట్ పంటల్లోని, హెర్బిసైడ్ రెసిస్టెంట్ జన్యువులు అత్యంత విషపూరితాలు. ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదకారులు. మన ఆహారంలో, వ్యవసాయంలో విష పదార్ధాలకు, రసాయనాలకు తావులేదు. మనం మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చు. పర్యావరణానికి ఏవిధమైన హాని కలిగించని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. అయితే విష రహిత వ్యవసాయాన్ని మరియు ఆహార వ్యవస్థను రూపొందించుకోవడంకోసం మనం కంకణం కట్టుకోవాలి. నిబద్ధతతో కృషి చేయాలి. వ్యవసాయం వల్ల తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన లేదా తీవ్రమైన వ్యాధులకు గురైన వారికి మనం అర్పించే నిజమైన నివాళి ఇదే. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గడమే కాదు, రైతులు అధిక దిగుబడులను సాధించగలరు. ఇదే సమయంలో పర్యావరణ వ్యవస్థ కూడా దెబ్బతినబోదు. అందువల్లనే ఆధునిక వ్యవసాయం పేరుతో విచ్చల విడిగా వాడే రసాయన ఎరువులు, బయటనుంచి కొనుగోలు చేసే విత్తనాల వల్ల పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి రైతులు నష్టపోవడం తప్ప మరే ఇతర ఫలితం కనిపించదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.

Tuesday, 8 December 2015

వనరుల కొరతే సంఘర్షణలకు కారణం - వందనా శివ



మానవాళి ప్రస్తుతం అవరోహణ పథంలో పయనిస్తోంది. దాదాపు రెండు శతాబ్దాలుగా విచ్చలవిడి శిలాజ ఇంధన వినియోగం ప్రకృతిలోని విభిన్న జీవరాశులను, జీవవైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. నేలలో సారాన్ని దెబ్బతీసింది, నీటిని కాలుష్యమయం చేయడమే కాదు, నీటి పరిమాణం కూడా దారుణంగా పడిపోయేలా చేసింది. మొత్తంగా చెప్పాలంటే మొత్తం పర్యావరణ వ్యవస్థనే పూర్తిగా దెబ్బతీసింది. ఐదు వందల ఏళ్లపాటు నిర్విరామంగా సాగిన వలసవాదం వివిధ సంస్కృతులను, భాషలను, ప్రజలను పూర్తిగా కనుమరుగు చేయడమే కాదు ఉత్పత్తి, పరిపాలన సజావుగా సాగడానికి హింసను ఆశ్రయించే సంప్రదాయాన్ని మిగిల్చింది.
ఒక సంఘర్షణను ఏవిధంగా ఎదుర్కొనాలన్న అంశంపై మన చర్చలు, ఆలోచనా పథంలో, నవంబర్ 13 నాటి ప్యారిస్ దాడు లు హింస చెలరేగడం అనేది చొచ్చుకువచ్చింది. ఈ భూమిపై పర్యావరణ సంక్షోభానికి, ప్రపంచ సాంస్కృతిక సంక్షోభానికి ప్యారిస్ కేంద్రస్థానంగా నిలిచింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు ప్యారిస్‌లో పర్యావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కింద సదస్సు-సీఓపి21- జరుగుతోంది. ఈ సీఓపీ21 కేవలం వాతావరణ మార్పుపై మాత్రమే కాదు. ఈ ధరిత్రిపై జీవరాశి మనుగడకు ఆధారభూతమైన జీవావరణ వ్యవస్థను మన ఉత్పత్తులు, వినిమయాలు ఏవిధంగా ధ్వంసం చేస్తున్నాయనే అంశంపై కూడా చర్చించడానికి ఏర్పాటైన సదస్సు.
నవంబర్ 13 నాటి సంఘటనలకు, మానవ చరిత్రలో శిలాజ ఇంధన యుగం పర్యావరణానికి చేసిన భయంకరమైన హానికి మధ్య లోతైన అవినాభావ సంబం ధం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న విధానమే పర్యావరణ మార్పునకు, ప్రజల్లో పెరిగే హింసాప్రవృత్తికి కారణభూతమవుతోంది. ఈ రెండూ కూడా ఈ ధరిత్రికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాట ఫలితాలే. పారిశ్రామిక వ్యవసాయం అనేది పెద్ద ఎత్తున శిలాజ ఇంధన వాడకంతో కూడి ఉన్నటువంటిది. దాదాపు 40 శాతం గ్రీన్‌హౌజ్ వాయువులు (కార్బన్ డైయాక్సైడ్) విడుదల కావడానికి ఇది దోహదం చేస్తోంది. ఫలితం పర్యావరణ మార్పు. ప్రపంచీకరించిన ఆహార వ్యవస్థతోపాటు, భూతాపం పెరుగుదలలో కనీసం 50 శాతం వాటా కేవలం పారిశ్రామిక వ్యవసాయానిదే నంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

సింథటిక్ నైట్రోజన్ ఎరువులు కేవలం శిలాజ ఇంధనాలపై ఆధారపడి తయారుచేసినటువంటివి. అదేవిధంగా పేలుడు పదార్ధాలు, మందుగుండు సామగ్రి తయారీలో కూడా సింథటిక్ ఎరువుల తయారీలో అనుసరించిన రసాయనిక విధానాలనే అమలుపరుస్తారు. ఒక కిలో నత్రజని ఎరువును తయారు చేయడానికి రెండు లీటర్ల డీజిల్ మండిస్తే ఎంత శక్తి ఉత్పన్నమవుతుందో అంత శక్తి అవసరం. రసాయన ఎరువుల తయారీలో 2000 సంవత్సరంలో 191 బిలియన్ లీటర్ల డీజిల్ ఉపయోగించగా, 2030 నాటికి ఇది 277 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. సింథటిక్ ఎరువులు పారిశ్రామిక వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఇదే వాతావరణ మార్పుకు ప్రధాన దోహదకారి అవుతోంది. క్షేత్రంలో పనిచేయడానికి ముందు ఈ ఎరువులు మన భూగ్రహానికి విపరీతమైన హాని చేస్తాయి. అయినప్పటికీ సింథటిక్ ఎరువులు మాత్రమే మనకు ఆహారం అందడానికి కారణమని, అవి లేకతోతే కరువుతో ఇబ్బందులు పడక తప్పదన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తుంటారు. ఇక రసాయన ఎరువుల కంపెనీలైతే ‘మేం గాలి నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాం’ అంటూ ఘనంగా చెప్పుకుంటాయి.

నత్రజనిని భూమికి, మొక్కలకు అందించే అనేక అహింసాత్మక, ప్రభావయుత విధానాలను ప్రకృతి, మానవులు కనుగొని ఉన్నారు. ఉదాహణకు పుప్పు్ధన్యాలు, బీన్స్ మొక్కలు నత్రజనిని భూమిలో స్థాపితం చేస్తాయి. ఈ మొక్కల వేళ్లపై ఉండే బుడిపెలపై రైజోబియం బ్యాక్టీరియా ఆవాసం ఏర్పరచుకొని, వాతావరణంలోని నైట్రోజన్‌ను, అమోనియాగా ఆ తర్వాత సేంద్రీయ పదార్ధాలుగా మరుస్తాయి. ఈ పదార్ధాలను మొక్కలు తమ పెరుగుదలకోసం ఉపయోగించుకుంటాయి. కాయధాన్యాలు, తృణధాన్యాలను అంతర పంటలుగాను లేదా మార్పిడి పంటలుగాను వేయడం అనేది పురాతన కాలం నుంచి మనదేశంలో అనుసరిస్తున్న సంప్రదాయం. ఇదే సమయంలో మనం వాడే ఆకుపచ్చని ఎరువు కూడా భూమిలో నత్రజనిని స్థాపితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆవిధంగా సేంద్రీయ పదార్ధం స్థాపితం కావడం వల్ల, భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. అందువల్లనే సేంద్రీయ వ్యవసాయంలో మనం సాగుచేసే పంటను బట్టి భూమిలో నత్రజని 44 నుంచి 144 శాతం వరకు వృద్ధి చెందుతుంది. పారిశ్రామిక వ్యవసాయంలో మాదిరిగా కాకుండా సేంద్రీయ వ్యవసాయం గాలిలోని కార్బన్‌ను కిరణజన్య సంయోగక్రియ ద్వారా మార్పు చేసి భమిలో దాని పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా భూసారం భాగా పెరిగి అధిక ఆహారోత్పత్తికి దోహదం చేయగలదు. అంతేకాదు ఆవిధంగా ఉత్పత్తి అయిన ఆహారం అత్యధిక పోషక విలువలతో కూడి ఉంటుంది. ఫలితంగా ఏవిధమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే సానుకూల పర్యా వరణ మార్పు సాధ్యమవుతుంది.
హరితవిప్లవం పేరుతో శిలాజ ఇంధనాలపై ఆధారపడే పర్యావరణ పరంగా అస్థిర వ్యవసాయ నమూనాలను ‘మద్దతు’ మరియు ‘అభివృద్ధి’ పేరిట మనపై ప్రభుత్వాలు రుద్దుతున్నాయి. నేల, నీరు ధ్వంసమైపోయాక, పర్యావరణ వ్యవస్థ ఉత్పత్తి చేసే ఆహారం మరియు మద్దతుగా నిలిచే జీవనోపాయాలు ఎంతోకాలం సమాజాన్ని సుస్థిరంగా ఉంచజాలవు. ఫలితంగా ఆగ్ర హం, అసమ్మతి, నిరసనలు, సంఘర్షణలు చోటు చేసుకోవడం అత్యంత సహజం. అయినప్పటికీ భూమి, నీరు, వ్యవసాయ సంబంధ సంఘర్షణలు పదేపదే ఉద్దేశపూర్వకంగా మత వివాదాలుగా మార్పు చెంది, క్రమంగా సైనికీకృత వ్యవసాయ నమూనాను పరిరక్షించే విధంగా రూపొందుతాయి. ఇది క్రమంగా భూమి, ప్రజలకు వ్యతిరేకంగా చేపట్టే ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది.

ఈ పరిస్థితిని నా పుస్తకం కోసం పరిశోధన జరుపుతుండగా పంజాబ్‌లో ప్రత్యక్షంగా చూశాను. 1984లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ‘‘ది వాయిలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్’’ పేరుతో పుస్తకాన్ని రాశాను. భూసారం క్షీణించడం, నీటి సంక్షోభం కారణంగా చోటు చేసుకుంటున్న ఘర్షణలకు మత ఘర్షణల రంగు పులుముతుండటాన్ని నేడు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అస్థిర వ్యవసాయ పద్ధతులవల్లనే ఈ ఘర్షణలు తలెత్తుతున్నాయన్న సంగతి మరువకూడదు. 2009 నుంచి మనం బోకొహరాం ఉగ్రవాద సంస్థపేరు వింటున్నాం. ఇదే సమయంలో మనకు తెలియని అంశమేమంటే ‘్ఛద్ సరస్సు’ అదృశ్యమైపోవడం. ఛాద్ సరస్సు నైజీరియా, ఛాద్, కామెరూన్, నైజిర్ దేశాలకు చెందిన 30 మిలియన్ ప్రజల జీవనాధారంగా ఉండేది. అయితే 1983 నుంచి 1994 మధ్యకాలంలో ఈ దేశాల్లో పారిశ్రామిక వ్యవసాయం నాలుగురెట్లు పెరిగింది. ఆనకట్టల నిర్మాణం, తీవ్రస్థాయిలో పారిశ్రామిక వ్యవసాయం కోసం విపరీతంగా నీటివాడకం వల్ల యాభై శాతం ఛాద్ సరస్సు అదృశ్యమైపోయింది. ఎప్పుడైతే నీరు అదృశ్యమైపోయిందో ఇక తరిగిపోతున్న నీటి వనరులకోసం పశువుల కాపర్లుగా ఉన్న ముస్లింలు, సుస్థిర వ్యవసాయం చేస్తున్న క్రైస్తవ రైతుల మధ్య ఘర్షణ ఏర్పడి చివరికి అశాంతికి దారితీసింది.
ఎడారిని అరికట్టడానికి సంబంధించిన యుఎన్ కనె్వన్షన్ మాజీ ప్రధాన కార్యదర్శి ల్యూక్ నాకడ్జా నైజీరియాలో ప్రస్తుతం నెలకొన్న హింసాత్మకతకు కారణాన్ని ఈవిధంగా వివరిస్తున్నారు. ‘‘మతయుద్ధంగా ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న నైజీరియా సంఘర్షణలు వాస్తవానికి ముఖ్యమైన వనరులపై ఆధిపత్యానికి జరుగుతున్న పోరాటం మాత్రమే.’’
సిరియా కథ కూడా దీనికి భిన్నమేం కాదు. 2009లో దేశంలో తీవ్రస్థాయిలో కరువు సంభవించింది. దీంతో లక్షలమంది రైతులు జీవనాధారం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో జీవిక కోసం పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు విధించిన నిబంధనల చట్రంలోని నిర్మాణాత్మక సర్దుబాట్లు, వాణిజ్య నిబంధనలు సిరియా ప్రభుత్వం తమ దేశ రైతులను ఆదుకోవడానికి వీల్లేకుండా చేశాయి. దీంతో రైతుల ఆందోళనలు తీవ్రమయ్యాయి. 2011 నాటికి ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు సిరియాలోకి ప్రవేశించాయి. తమ ఆయుధాలను అమ్ముకోవడం ద్వారా సంఘర్షణకు అసలు కారణమైన భూమి, రైతులను మతం వైపునకు మరలించాయి. నేడు సిరియాలోని సగం ప్రాంతం పునరావాస శిబిరాలతోనే నిండిపోయింది. అంతర్యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడమే కాదు, మతం పేరుతో హింస చాలా చరుగ్గా కొనసాగుతోంది.

జైక్లోన్-బి అనే విషవాయువును కనుగొన్న హబర్ అనే శాస్తవ్రేత్తకు రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఇదే వాయువును ప్రయోగించి 1915లో నాజీలు లక్షలాది యూదులను పొట్టన పెట్టుకున్నారు. అమెరికాకు చెందిన జీవశాస్తవ్రేత్త నార్మన్ బోర్లోగ్‌కు కూడా నోబెల్ బహుమతి లభించింది. ఆయన ప్రవేశపెట్టిందే రసాయన ఆధారిత హరిత విప్లవం! మరి నేడు దాని పుణ్యమాని హింసా సంప్రదాయం కొనసాగుతోంది. నావరకు నాకు సీఓపి-21 అనేది కేవలం శాంతికోసం జరిపే ‘తీర్థయాత్ర’ వంటిది. భూమి, ప్రజలకు వ్యతిరేకంగా నిర్వహించే యుద్ధం బారిన పడిన అమాయక బాధితులను గుర్తు చేసుకునేందుకు, తెగలు, మతాల పేరిట మనం విడిపోవద్దని, మనమంతా ఒక్కటేనన్న దృఢమైన భావన కలిగేందుకు, మనల్ని మింగేస్తున్న పర్యావరణ విధ్వంసం, పెరుగుతున్న హింస మరియు యుద్ధాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంనేందుకు మాత్రమే ఈ సదస్సు ఉపయోగపడుతుంది. అయితే ఒక్కటి మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. భూమితో మనం శాంతిని కుదుర్చుకొనకపోతే, ప్రజల మధ్య శాంతి సాధ్యం కాదు. (చిత్రం) ఛాద్ సరస్సు నైజీరియా, ఛాద్, కామెరూన్, నైజిర్ దేశాలకు చెందిన 30 మిలియన్ ప్రజల జీవనాధారంగా ఉండేది. పారిశ్రామిక వ్యవసాయం పుణ్యమాని ఇది ఎండిపోతోంది. తరిగిపోతున్న ఈ నీటి వనరుపై ప్రారంభమైన సంఘర్షణలు క్రమంగా బొకొహరాం ఆవిర్భావానికి దారితీశాయ.

సేకరణ: ఆంధ్రభూమి 04 డిసెంబరు 2015
http://andhrabhoomi.net/content/human-kind