Tuesday 6 June 2017

కన్నీరు మిగిల్చిన హరిత విప్లవం- ఖలిస్థాన్ ఉద్యమానికి కారణం కూడా;

జూన్ 6, పంజాబ్ లోని స్వర్ణదేవాలయం వద్ద ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన రోజు.
తమను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ పంజాబ్ లో రాజుకున్న ఖలిస్థాన్ ఉద్యమానికి కారణం ఏమిటి?
వ్యవసాయానికి, అందులో కలిగిన మార్పులకు, ఖలిస్థాన్ ఉద్యమానికి సంబంధం ఏమిటి?
వ్యవసాయం, పర్యావరణం నాశనమైతే దేశంలో విభజన వాదాలు, అతివాదాలు, తీవ్రవాదాలు పుట్టుకోస్తాయా? వనరుల కాలుష్యం దేశసమగ్రతకు ముప్పా?

వీటికి సమాధానం తెలుసుకోవాలంటే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి శ్రీమతి వందనా శివ గారు చెప్పిన విషయాలు చదవండి.

కన్నీరు మిగిల్చిన హరిత విప్లవం

- వందనా శివ   04/03/2014


ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించి 2014కు సరీగ్గా 30ఏళ్ళు నిండుతాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు 1984, జూన్ నెలలో పంజాబ్‌లో ఈ సైనిక చర్యను చేపట్టారు. అమృత్‌సర్‌లోని హర్‌మందిర్ సాహెబ్‌లో తిష్ఠవేసిన జర్నైల్ భింద్రన్‌వాలే..అతని నేతృత్వంలోని సాయుధ మిలిటెంట్లను ఏరిపారేసేందుకు ఈ చర్య తీసుకున్నారు. అయితే పంజాబ్‌లో ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహణకు, హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడానికి మధ్య అవినాభావ సంబంధముందన్న సం గతి బహుశా చాలామందికి తెలియని విషయం. ఒకవేళ తెలిసినా మరచిపోయి ఉండవచ్చు.



భారత్‌లో హరిత విప్లవం 1966లో ప్రారంభం కాగా, పంజాబ్‌లో 1968లో మొదలైంది. పంట సాగు, ఉత్పత్తుల విధానంలో హరిత విప్లవం సమూల మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా అంతకుముందు రైతులు వేర్వేరు రకాల పంటలు పండించేవారు. కానీ ఈ హరిత విప్లవం పుణ్యమాని కేవలం వరి, గోధుమ పంటలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. వీటి దిగుబడులు పెంచడానికి రసాయన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించారు. తొలి నాళ్ళలో రసాయన ఎరువులు, విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీని కల్పించింది. పదేళ్ళపాటు ఇదే విధానాన్ని కొనసాగించి, తర్వాత సబ్సిడీలు ఎత్తివేశారు. ఫలితంగా రైతుల ఆదాయం క్రమంగా పడిపోవడం ప్రారంభమైంది. ఇది రైతుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.


ఇదే సమయంలో భింద్రన్ వాలే ఒక మత ప్రచారకుడిగా, గ్రామ గ్రామానికి వెళ్ళాడు. సిక్కుమతం బోధించిన ప్రకారం జీవన విధానాలను కొనసాగించాలని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాడు. తీవ్ర అసంతృప్తితో ఉన్న సిక్కు యువతను అశ్లీలత, కల్తీ, మత్తుమందులు, పొగాకు వాడకం, మద్యం వంటి వ్యసనాలనుంచి బయటపడి ఖల్సా మార్గంలోకి తిరగి రావాలంటూ ప్రోత్సహించాడు. పై వ్యసనాలకు సిక్కు యువత అలవాటు పడటానికి కేవలం ‘హరిత విప్లవమే’ కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 1984 నాటికి పంజాబ్ పూర్తిగా హింసాకాండతో అట్టుడికిపోయే స్థితికి చేరుకుంది. ఖలిస్తాన్ బోధనలు చివరకు మిలిటెన్సీకి దారితీసాయి, దీని ఫలితంగా, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భద్రతా బలగాలను వినియోగించాల్సి వచ్చింది. ఈవిధంగా హరిత విప్లవానికి, పంజాబ్‌లో పెచ్చరిల్లిన హింసాకాండకు మధ్య ఉన్న తేడాను గుర్తించి...అసలు పంజాబ్‌లో ఏం జరుగుతున్నదనేదానిపై పరిశోధించి ‘‘ది వాయిలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్’’ అనే పుస్తకాన్ని రాయడానికి దారితీసింది. మరి ఈ హరిత విప్లవానికి పితామహుడిగా కీర్తి ప్రతిష్ఠలు అందుకున్న నార్మన్ బోర్‌లౌగ్‌కు నోబెల్ బహుమతి లభించింది మరి!


నిజం చెప్పాలంటే హరిత విప్లవం సుస్థిరమైనది కాదు. పర్యావరణం, ఆర్థిక, సామాజిక పరంగా పరిశీలించినప్పుడు దీని అస్థిరత బయటపడుతుంది. పర్యావరణ పరంగా చూస్తే, రసాయన ఎరువులను విపరీతంగా వాడటం వల్ల భూసారం చచ్చిపోయింది. పంజాబ్‌లో కేవలం ఒకటి లేదా రెండు శాతం ప్రాంతాల్లో మాత్రమే పదిశాతం సేంద్రీయ ఎరువుల వాడకం కనిపిస్తుంది. 1970-71 నుంచి 2010-11 మధ్యకాలం వరకు పరిశీలిస్తే, రసాయన ఎరువుల వాడకం 213,000 టన్నుల నుంచి ఏకంగా 1,911,000 టన్నులకు పెరిగిపోయింది. రసాయన ఎరువులను వాడటం వల్ల వ్యవసాయంలో నీటి వినియోగం బాగా పెరుగుతుంది. పంజాబ్‌లో సరీగ్గా ఇదే జరిగింది. ఆ రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూమికి, 27 శాతం ఉపరితల నీటి ద్వారా, 71శాతం భూగర్భ జలం ద్వారా సాగునీరు అందించారు. నీటివాడకం విపరీతం కావడం వల్ల నీటిలో ఉప్పు పరిమాణం పెరిగిపోయి, తాగునీరు అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా పంజాబ్‌ను నీటి కరువు ఆవహించడం మొదలైంది.


ఇక 1970 చివరి నాటికి, సబ్సిడీలు ఎత్తివేయడం, పెట్టుబడులు పెరగడంతో రాష్ట్రంలో ఋణ ఆర్థిక వ్యవస్థ చోటు చేసుకోవడం ప్రారంభమైంది. 1980 నాటికి పంజాబ్ రైతులను, భారత దేశానికే అన్నదాతలుగా కీర్తించడం పరాకాష్టకు చేరుకుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. 1986, ఏప్రిల్ 13న గురుగ్రంథ్ సాహెబ్ సమక్షంలో ‘సర్బత్ ఖల్సా’ (సిక్కులు సమావేశం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఏకరువు పెట్టారు. ‘‘నేడు సిక్కులు బానిస సంకెళ్ళతో నానా కష్టాలు పడుతున్నారు’’ అంటూ సమావేశంలో పాల్గొన్నవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.


1984లో పంజాబ్ రైతులు తాము అనుభవిస్తున్న బానిస బతుకులనుంచి విముక్తి కోసం ఆందోళనకు దిగారు. అదే ఏడాది జనవరి 31న ‘రాస్తారోకో’ నిర్వహించారు. మార్చి 12న వారు గవర్నర్ ఇంటి ముందు ఘెరావ్ చేశారు. తమను పీడిస్తున్న రుణ బాధలనుంచి విముక్తులను చేయాలంటూ, ‘ఖర్జా రోకో’ నిర్వహించారు. తిరిగి అదే ఏడాది మే నెలలో గవర్నర్ ఇంటి ఎదుట ఘెరావ్ చేశారు. చివరకు తాము పండించిన ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అమ్మకూడదని మే 23న పంజాబ్ రైతులు నిర్ణయించారు. పంజాబ్‌లో పెచ్చరిల్లిన హింసకు మూలం ‘హింసాత్మక వ్యవసాయం’లో ఉంది. ఈ హింసాత్మక వ్యవసాయానికి కారణం ‘హరిత విప్లవం’. ఈవిధంగా బీజ రూపంలో ప్రారంభమైన హింస, ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట సైనిక చర్యతో పరాకాష్టకు చేరింది. ఆ తర్వాతైనా శాంతి నెలకొన్నదా? అంటే అదీ లేదు. ఈ సైనిక చర్య చివరకు ఇందిరాగాంధీ హత్యకు, ఆ తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు దారితీసింది. పంజాబ్‌లోని సిక్కులకు మరియు రైతులకు ఇప్పటి వరకు జరిగిన అన్యాయం సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.


రసాయన ఎరువుల వాడకం వల్ల నేటికీ పంజాబ్ రైతులు వ్యాధులకు లోను కావడం, కొందరు మరణించడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే భూములు కోల్పోయిన సేంద్రీయ పదార్ధాలు తిరిగి కూడే పరిస్థితి లేదు. విభిన్న పంటలు పండించే పంజాబ్ రైతులను, హరిత విప్లవం పుణ్యమాని, ఖరీఫ్‌లో వరి, రబ్బీలో గోధుమ పండించడానికి మాత్రమే హరిత విప్లవం పరిమితం చేసింది. భూసారం పూర్తిగా క్షీణించి పోవడానికి ఇది కూడా ఒక కారణం. ఒక ఎకరానికి పంజాబ్‌లో ఉత్పత్తి అయ్యే ఆహారధాన్యంలో పోషకత, ఆరోగ్య లక్షణాలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఇదంతా హరిత విప్లవం పుణ్యమే! హరిత విప్లవానికి ముందు పంజాబ్ రైతులు మొత్తం 41 రకాల గోధుమ పంటను, 27 రకాల వరి పంటను పండిస్తున్నారు. అదేవిధంగా నాలుగు రకాల మొక్కజొన్న, మూడు రకాల సజ్జలు, 16 రకాల చెరుకు, 19 రకాల పప్పు ధాన్యాలు, తొమ్మిది రకాల నూనె గింజల/సుగంధ ద్రవ్యాల పంటలను పండించేవారు. అప్పట్లో గోధుమకు బదులు, షర్బతీ, దర్రా, లాల్ పిస్సీ,లాల్ కనక్, బన్సీ, కథియా, మాల్వా, పక్వాన్, దావత్ ఖాన్ వంటి నాణ్యమైన రకాలు పంట నాణ్యతను, మూలాన్ని వివరించేవిగా ఉండేవి. కానీ నేడు రైతులు పండిస్తున్న రకాలపై క్రిమి కీటకాలు, వ్యాధులు తేలిగ్గా ఆవహించేవిగా ఉన్నాయి. మరి వ్యాధులు, చీడపీడల నివారణకు మరింత ఎక్కువ డోసుతో క్రిమిసంహారకాలను రైతులు వాడాల్సి వస్తోంది.

2011-12సంత్సరంలో వరి ధాన్యం ఖరీదు రూ.1700, గోధుమకు రూ. 1500 ఉండగా, కనీస మద్దతు ధర మాత్రం రూ. 1285, రూ. 1110 గా నిర్ధారించారు. అదే 1995-2001 మరియు 2001-2005 మధ్యకాలంలో పంజాబ్ రైతుల నికరాదాయం, వరికి రూ.77 నుంచి రూ.7లకు, గోధుమకు రూ. 67 నుంచి రూ. 34కు పడిపోయింది. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సగటున ఎకరానికి రూ. 41,576లు చొప్పున రైతులకు అప్పులు మిగిలాయి. విత్తనాలు, రసాయనాల వంటి ఉత్పాదకాల ఖరీదు విపరీతంగా పెరిగిపోవడంతో, రైతుల ఆర్థిక పరిస్థితి ఋణాత్మకానికి దిగజారింది. మరి ఈ పరిస్థితుల్లో పంజాబ్ రైతుల్లో ఆందోళన, ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం సహజమే. దీన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సానుకూలంగా అర్థం చేసుకొని అందుకనుగుణంగా స్పందించాలి. ముఖ్యంగా పర్యావరణ, ఆర్థిక పరంగా రైతులకు మేలు చేసే విధానాలను రూపొందించి అమలు పరచాలి. రైతులకు హితుడిగా, మిత్రుడిగా ప్రభుత్వం వ్యవహరిస్తూ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి దోహద పడాలి. 1980 ప్రాంతంలో ఈ సంక్షోభం మిలిటెన్సీకి దారితీస్తే నేడు మరో రూపంలో..అంటే ఆత్మహత్యల రూపంలో ఇది కనిపిస్తోంది. 1984 నాటి పాఠాలను దృష్టిలో ఉంచుకొని, హింసాత్మక, ప్రమాదకారి హరిత విప్లవ పథం నుంచి వీడి, రైతు మిత్ర విధానాలను అనుసరించాల్సిన పంజాబ్ ప్రభుత్వం, మోన్‌శాంటో, అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ కార్పొరేషన్లతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం దారుణం.


క్రిమిసంహారక మందులు విషపూరితాలు. ఇక జన్యు పరివర్తక మొక్కలు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. బిటి పంటల్లోని బిటి జన్యువులు, హెర్బిసైడ్ రెసిస్టెంట్ పంటల్లోని, హెర్బిసైడ్ రెసిస్టెంట్ జన్యువులు అత్యంత విషపూరితాలు. ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదకారులు. మన ఆహారంలో, వ్యవసాయంలో విష పదార్ధాలకు, రసాయనాలకు తావులేదు. మనం మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చు. పర్యావరణానికి ఏవిధమైన హాని కలిగించని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. అయితే విష రహిత వ్యవసాయాన్ని మరియు ఆహార వ్యవస్థను రూపొందించుకోవడంకోసం మనం కంకణం కట్టుకోవాలి. నిబద్ధతతో కృషి చేయాలి. వ్యవసాయం వల్ల తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన లేదా తీవ్రమైన వ్యాధులకు గురైన వారికి మనం అర్పించే నిజమైన నివాళి ఇదే. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గడమే కాదు, రైతులు అధిక దిగుబడులను సాధించగలరు. ఇదే సమయంలో పర్యావరణ వ్యవస్థ కూడా దెబ్బతినబోదు. అందువల్లనే ఆధునిక వ్యవసాయం పేరుతో విచ్చల విడిగా వాడే రసాయన ఎరువులు, బయటనుంచి కొనుగోలు చేసే విత్తనాల వల్ల పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి రైతులు నష్టపోవడం తప్ప మరే ఇతర ఫలితం కనిపించదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.

1 comment:

  1. ఈ పుస్తకం భారత వ్యవసాయ సంక్షోభ కారణాలను చక్కగా వర్ణించింది. ప్రతి ఒక్కరూ చదవాలి.

    ReplyDelete