Showing posts with label విద్య. Show all posts
Showing posts with label విద్య. Show all posts

Saturday, 19 April 2014

హిందూ ధర్మం - 49 (విద్య)

శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఆధునిక కాలంలో మళ్ళీ మనిషి ఇతర గ్రహాలపై అడుగుపెట్టాడు. విశ్వం యొక్క రహస్యాన్ని చేధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఇంకా అంతులేని ప్రశ్నలు వేల కొద్ది పుట్టుకొస్తున్నాయి. కొన్నిటికి సమాధానం ఉండదు. కొన్ని చేధించడం కష్టం. వీటిని తెలుసుకోవద్దని కానీ, ఇవి అవసరం లేదని కానీ వేదం, శాస్త్రం ఎప్పుడు చెప్పలేదు. వేదంలో కంప్యూటర్ మొదలైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది. కానీ ఇదంతా బాహ్య విషయజ్ఞానం. విద్య అంటే ఏమిటి? దెన్ని తెలుసుకుంటే ఇక ఏది తెలుసుకోవలసిన అవసరం ఉండదో, ఏది అర్దమైతే ఈ లోకంలో రహస్యాలన్నీ అర్దమవుతాయో, దేన్ని తెలుసుకున్న క్షణంలోనే మానవ మస్తిష్కానికి వచ్చే సమస్త ప్రశ్నలకు సమాధానం తొలగుతుందో, ఏ జ్ఞానం చేత ఇక మనిషికి ప్రశ్నలు అనేవి తలెత్తవో, అదే విద్య. దాని గురించే ధర్మం మాట్లాడుతోంది.

ఈ విద్య మన గురించి చెప్తుంది. 'యత్ పిండాండే తత్ బ్రహ్మాండే' అని సంస్కృత వాక్కు ఒకటి ఉంది. ఏదైతే ఈ పిండాండంలో (శరీరంలో) ఉందో, అదే బ్రహ్మాండంలో కూడా ఉంది. ఎక్కడో ఉన్న విషయాన్ని అర్దం చేసుకోవడం కంటే మనలో ఉన్న విషయాన్ని అర్దం చేసుకోవడం సులభం. ఈ రహస్యం మనకు దగ్గరగా ఉంది. మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు? జీవితంలో వచ్చే సుఖదుఖాలకు, కష్టనష్టాలకు కారణం ఏమిటి? అసలు అందరిలో ఉన్న 'నేను' ఎవరు? ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి అనేక రహస్యాలను విస్పష్టం చేస్తుంది విద్య.

ఇంకోమాటలో చెప్పాలంటే ఎవరో చనిపోతారు. అందరూ ఏడుస్తుంటారు, అక్కడున్న వారు అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు. ఇంకా శవాన్ని దహనం చేయలేదు కదా. ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. కాకపోతే ఉలుకుపలుకు లేదు, ఒక బొమ్మలాగా ఉన్నాడు, అంతేకదా. మరి ఎక్కడికో పొవడమేమిటి? అక్కడ పోయింది ఎవరు? కదలకుండా ఉన్న ఆ దేహం ఎవరు? అతనే దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు కదా. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? వెళ్ళిపోయిందెవరు, అక్కడ పడి ఉన్నది ఎవరు? అతను ప్రాణం అయితే, ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పోయింది? అసలు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానం చెప్తుందీ విద్య.

To be continued...........

Friday, 18 April 2014

హిందూ ధర్మం - 48 (విద్య)

ఎన్నో గొప్ప గొప చదువులు చదువుతున్నారు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందుతున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ ఎంత సంపాదించినా, ఆనందంగా ఉండలేకపోతున్నారు, జీవితంలో ఒక అసంతృప్తి, ఏది తెలియని వెలితి. ఎందుకు? ఎంత గొప్ప చదువులు చదివినా తల్లిదండ్రులను వీధిన పడేస్తున్నారు, తన్ని తరిమేస్తున్నారు, జీతం తక్కువగా వస్తోంది, కలిసి ఉంటే మన జీతం కూడా మన అన్నకో, తమ్ముడికో ఇవ్వాల్సి వస్తుందని వేరు కాపురం పెడుతున్నారు ఎందుకు? సొంత చెల్లలి పెళ్ళి భారంగా భావిస్తున్నారు ఎందుకు?

ఎందుకంటే ఈ రోజు  మనం చదువుతున్న చదువులు సంస్కారాన్ని ఇవ్వడంలేదు. ప్రేమలు, అనుబంధాల గురించి చెప్పడంలేదు, నైతిక విలువల గురించి మనము, మన పిల్లలు చదువుకున్న చదువులో ఏమి ఉండదు. పిల్లలను కేవలం ఒక యంత్రాలుగా చూస్తూ, నిత్యం ఏదో ఒకటి నూరి పోయడమే విద్యా విధానం అయిపొయింది. అసలు ఇది విద్యనే కాదు, ఇది ఒక మిధ్య. ఆస్తికులుగా వెళ్ళిన పిల్లలను నాస్తికులుగా, భౌతికవాదులుగా మారిపోతున్నారు. ఆత్మనూన్యతకు లోనవుతున్నారు, ఒత్తిడికి గురువతున్నారు, కనీసం 8 గంటల సుఖనిద్ర కూడా లేని స్థితికి చేరుకున్నారు. ఇది భారతీయ విద్యావిధానం కాదు.

విద్య వినయాన్నిస్తుంది, అందరిని, అన్నిటిని అంగీకరించడం నేర్పిస్తుంది. ఆస్తికతను పెంచుతుంది, నైతికవిలువలను వృద్ధి చేస్తుంది. సమాజం పట్ల బాధ్యతలను, తోటి మనుష్యుల పట్ల ప్రేమానురాగాలను కలిగిస్తుంది. స్వార్ధాన్ని తొలగిస్తుంది, పదిమందికి సాయపడే మనస్తత్వాన్ని కలిగిస్తుంది. సహనాన్ని ఇస్తుంది, ఓర్పును పెంచుతుంది. అన్నిటికి మించి సంతృప్తినిస్తుంది. ఇది ఒక్క ఋషుల చేత ఏర్పరిచిన భారతీయ విద్యావిధానంలోనే కనిపిస్తుంది. ఈ రోజు సొంత చెల్లలికి పెళ్ళి చేయడం అన్నకు భారంగా మారింది. కానీ ఒకప్పడు భారతదేశంలో గృహస్థులు తమ కుటుంబీకులతో పాటు, బంధువుల బాగోగులను కూడా దగ్గరుండి చూసుకున్నారు. వారి నుంచి ఏమి ఆశించకుండా సాయం చేశారు. భారతీయ విద్యావిధానంలో చదువుకున్న ఏ విద్యార్ధి అడుక్కుతిన్న దాఖలాల్లేవు. అవరు ఆత్మహత్య చేసుకోలేదు, దోచుకులేదు, మోసం చేయలేదు, తల్లిదండ్రులను ఇంట్లో నుండి వెళ్ళగొట్టలేదు, ముసలివారిని భారంగా భావించలేదు. ఇవన్నీ ఒక భారతీయ విద్య మాత్రమే అందించింది. విద్య అంటే భారతీయ విద్యనే. అటువంటి విలువలను పెంచే విద్యను అభ్యసించడం ధర్మం.

To be continued............

Saturday, 12 April 2014

హిందూ ధర్మం - 47 (విద్య)

విద్య: జ్ఞానము కలిగి ఉండడం. అది నిజజీవితంలో ఉపయోగపడేదిగా ఉండాలి. విద్యా నమ్రతను, అణుకువను, వినయమును ఇవ్వాలి. అదే నిజమైన విద్య.

భూమి నుంచి దైవం వరకు, జడపదార్ధం నుంచి విశ్వచైతన్యం వరకు, స్థూలమైన విషయాల నుంచి సూక్ష్మ విషయాల వరకు, భౌతిక జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం వరకు,  సరైనా జ్ఞానాన్ని ఆర్జించడం, సమస్త విషయాయలపైన సరైన అవగాహన ఉండాలి, లేదా తెలుసుకోవాలి. తెలుసుకున్న జ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు, నిజ జీవితంలో ఉపయోగపడాలి. అటువంటి జ్ఞానమే విద్యా. మరొక విధంగా చెప్పాలాంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, మనసులో ఉన్న భావాన్ని అచ్చం అలాగే వ్యక్తపరచడం/పలకడం, ఏది మాట్లాడుతున్నామో, అచ్చంగా అదే చేయడం విద్యా అని, దానికి విరుద్ధంగా ఉండడం అవిద్యా అని అన్నారు ఆర్యసమాజ స్థాపూకులు దయానంద సరస్వతీ. అంటే ఏ కర్మనైనా త్రికరణశుద్ధిగా చేయించగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది.

The Knowledge of self is vidya - Swami Chinmayananda. (ఆత్మ) తన గురించి తాను తెలుసుకోవడమే విద్య అన్నారు స్వామి చిన్మయానంద. విద్య అనేది జనంలో ఆస్తికతను పెంచాలి తప్ప నాస్తికతను పెంచకూడదు.

మనం ఏం చదువుకున్నామో అది మన జీవితంలో ఉపయోగపడాలి. ఈ రోజు గమనిస్తే, మనం చదివిన చదువుకి, చేసే పనికి ఎంతమాత్రం పోలిక ఉండదు. వేదం అంటుంది కేవలం చదవడమే కాదు, మీరు చదివిన చదువు మీకు మీ జీవితంలో ఉపయోగపడాలి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడాలి, మీరు నేర్చుకున్న విద్యతో కొత్త విషయాలను వెలుగులోకి తేవాలి అంటే ముందుగా మీరు నేర్చుకున్న విద్య మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అది మీ మనసులోకి దట్టించకూడదు, మీకు మీరుగా స్వేచ్చగా తెలుసుకునేంత ఆసక్తిగా ఉండాలి. విద్య మీ సంస్కారాన్ని వృద్ధి చేయాలి, మీ జీవితాన్ని, మీ ద్వారా సమస్త సమాజాన్ని ఉద్ధరించాలి. మీలో స్వార్ధాన్ని తొలగించాలి. మీ ధృక్పదాన్ని మార్చాలి. నేను, నా కుటుంబం అనే భావన నుంచి సమస్త ప్రపంచం నా కుటుంబమే (వసుదైవ కుటుంబకం) అన్న భావన తీసుకురావాలి. విద్య దైవాన్ని దర్శింపజేయాలి. మీలో మీకు తెలియని రహస్యాలను తెలియజేయాలి. మీలో ఉన్న సమస్త శక్తిని బహిర్గతం చేయాలి. ఆత్మ తత్వాన్ని భోధించాలి. అదే నిజమైన విద్య.  

To be continued..............