Sunday, 27 January 2013

గంగావతరణం(12)

ఓం
గంగావతరణం(12)

నీటి ప్రవాహానికి అడ్డువచ్చిన మహామహా వృక్షాలే నేలకొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్నుమహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది. గంగాప్రవాహంలో జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్నుమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశారు.  ఎంతో తపస్సు చేయడం వలన మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తిమంతులవుతారు.


గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జహ్నుమహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి, నా పితృదేవతల కోసం గంగను భూమికి తీసుకువస్తే మీరు త్రాగేశారు, వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగనది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు అన్నాడు. దేవతలు కూడా  ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమి తెచ్చారు,  ముంచెత్తడం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు.


ఎవరైనా తమకు అపకారం చేస్తే, ఉత్తములకు అపకారం చేసినవారి యెడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు రెండు ఘడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టివాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది అని శాస్త్రం అంటొంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరథ నీ కోసం గంగను విడిచిపెట్టెస్తున్నాను అన్నాడు. గంగను తన కుడి చెవిలోనుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు.

మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు, గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళి గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. గంగ  ఆ 60,000 మంది బూడిదకుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికి ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి.

వెంటనే బ్రహ్మ దేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి, వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు.

to be continued............................      

మన దేవాలయాలు-8

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం 
మన దేవాలయాలు-8
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)


దేవాలయాలు పవిత్రమైన స్థలాలు. మన దేవాలయానికి వెళ్ళగానే, ఆలయ ప్రవేశానికి ముందు ప్రదక్షిణం చేస్తాం. అసలు ప్రదక్షిణం అంటే ఏమిటి?

ప్రదక్షిణం పదంలో ప్రతి అక్షరానికున్న గొప్పతనం తెలుసుకుందాం.'ప్ర ' అనే అక్షరం సకలపాపవినాశనానికి సూచకం. ' ద ' అనే అక్షరానికి అర్ధం కోరికలన్నీ తీరడం. 'క్షి ' అంటే రాబోవు జన్మలఫలం. 'ణ ' అంటే అజ్ఞానం నుండి విముక్తిని ప్రసాదిస్తుంది.

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ............ అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.


యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
................................
..............................
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన

అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, భవిష్యత్తులో కూడా పాపం చేసే అవకాశం ఉంది. నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. ఓ జనార్దన! నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.

ప్రదక్షిణం చేయడం అంటే " ఓ భగవంతుడా! నేను అని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను. నా జీవితం అంతా నీవు చెప్పిన మార్గంలోనే నడిపిస్తాను, నీవు చెప్పినట్టే జీవిస్తాను " అని పరమాత్మకు చెప్పడం.

ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చుట్టూ మనం తిరిగే అవకాశమే లేదు. అటువంటి పరమాత్మ మనలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు,  మనలో ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే, బాహ్యవిషయాలను పక్కనబెట్టి, మన గురించి మనం విచారించాలని గుర్తుచేసేది, మనల్ని మన ఆత్మతత్వం చుట్టు తిప్పెది ఈ ప్రదక్షిణం.

ఇంకా మిగిలివుంది.

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............
  

Saturday, 26 January 2013

గంగావతరణం(11)

ఓం
గంగావతరణం(11)

శివుడు విప్పిన జటాజూటాంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరంపాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా, ఒక్క చెమటచుక్క పరిణామంలో కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ క్రిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. భగీరథుడు వేచిచూసి బ్రహ్మ దేవుడిని అడుగగా, శివుడు గంగ అహకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడని చెప్పాడు.

మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివా! గంగ రోషం బాగానే ఉంది. నీ ప్రతాపమూ బాగుంది. ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టాగానే గంగా పెద్దశబ్దం చేసుకుంటూ, మొసళ్ళతో, ఎండ్రకాయలతో, చేపలు, పాములతో సుడులు తిరుగుతూ, మంచి నురుగుతో, ఆ శబ్దం విన్నా, చూసినా భయం వేసేంత ప్రవహంతో గంగ భూమి మీద పడింది.

నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేఇంఛాడు. భగీరథుడు రధాన్ని అనుసరించమని గంగను వెళ్ళమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. గంగ భగీరథుని రధం వెనుకాలే వెళ్ళింది.

మాంచి ఎండాకాలంలో మనకు త్రాగునీరు రానప్పుడు మన ప్రక్కవీధిలోకి ఒక ప్రభుత్వ ట్యాంకరు వస్తోంది అని తెలియగానే, అన్ని పనులు వదిలేసి జనం నీటి బిందేలు పట్టుకుని ఎలా పరిగెడతారో, అదే విధంగా గంగ భూమి మీదకు పడిందనగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు, ఋషులు, మునులు, మనష్యులు, పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్నవారు, అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగ నీటిని త్రాగడానికి పరుగులుతీస్తున్నారు.

మహామహా పాతకాలు చేసినవారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపొయి మంచి శరీరాలను పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు.ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేనివారు, ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తలమీద చల్లుకుంటున్నారు. వారు వెంటనే ఊర్ధ్వలోకాలు వెళ్ళీపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం, మంచి శక్తులను పొంది, పవిత్రులై ఆకశంలోకి ఎగిరిపోతున్నారు.

గంగ ఇంత పవిత్రమైంది ఎందుకు? శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటం నుంచి పడింది. పరమశివుడిని తాకడం వలన గంగ పరమపవిత్రమై, గంగను ఇతర జలాలో స్మరించినంత మాత్రం చేతనే, ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది.

ముందు భగీరథుడు రథం మీద వెళ్తున్నాడు, ఆయన రథాన్ని గంగ అనుసరిస్తోంది.దేవతలందరూ ఆకాశంలో గంగ ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో, పక్కన ఉన్న నేలను తుంపర్లతో తడుపుకుంటూ ఆయన ఎటు వెళ్తే గంగ అటు వెళ్తోంది.

ఇలా సాగిపొతున్న గంగ ప్రవాహం శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిగి చుశాడు కాని గంగ కనిపించలేదు.

to be continued.....................        

Friday, 25 January 2013

గంగావతరణం(10)

ఓం
గంగావతరణం(10)

శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయపర్వతాలకు వెళ్తారు. శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకుని జటజూటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి క్రిందకు పడమని బ్రహ్మదేవుడి ఆజ్ఞ.

 అందుకని గంగ మంచిప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తోంది. క్రింద నిల్చున్న పరశివుడిని చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక, శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు, తాను ఒక్కసారి క్రిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఈ శివుడిని తన ప్రవాహవేగంతో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది. తన ప్రతాపం చూపిద్దాం అని మొసళ్ళతో, తాబేళ్ళతో, ఎండ్రకాయలతో, కప్పలతో పడిపోదామని అని నిశ్చయించుకుంది.

ఈ విషయం పరమశివుడికి తెలిసింది. అందరిలోనూ ఆత్మగా ఉన్నది శివుడే. మనం చేసే ప్రతి కర్మకు సాక్షి ఆ పరమశివుడు. మనం ఏదో పని చేసి, అది దేవుడికి తెలియదనుకుంటే అది మన అజ్ఞానమే అవుతుంది. మనం చేసే ప్రతిపని, ఆలోచన, మాట్లాడే ప్రతి మాట కూడా ఆ పరమాత్మకు తెలుస్తాయి. అలాగే పరమశివునకు గంగ మనసులో ఉన్న భావం అర్ధమైంది. గంగ అహకారాన్ని అణచాలనుకున్నాడు. అందుకే హిమాలయాలంతా పరమపవిత్రమైన తన జటాజూటాన్ని(జడలను) పెద్దగా విస్తరించాడు శివుడు.

అంతే గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటం లోనికి దూకింది. దూకూతూ నేను శివుడను పాతాళానికి ఈడ్చుకుపోతాననుకుంది.

ఒక సంవత్సరం గడిచింది. దేవతలూ, బ్రహ్మ, భగీరథుడు అందరూ గంగ క్రిదకు పడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఎంత కాలం చూసినా ఒక్క చుక్క కూడా క్రిందపడలేదు.

to be continued....................  

Thursday, 24 January 2013

గంగావతరణం(9)


ఓం
గంగావతరణం(9) 卐

భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలకు కూడి ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు సంతోషించాను, ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు భగీరథుడు " నా పితృ దేవతలు కపిలమహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమలోకాలు పొందలేరు. అందువల్ల గంగా వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం కలగాలన్నాడు ". వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు.

నీ రెండవకోరిక ఉందే అది సులువైనది. కాని మొదటి కోరిక, గంగను భూమికి తీసుకురావడం, అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్ధుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు.

ఎవరి కోసం భగీరథుడు ఇన్నిన్ని సంవత్సరములు, ఇన్ని సార్లు తపస్సు చేస్తున్నాడు. తన కోసం కాదు. తన పితృదేవతలకోసం. మనిషై పుట్టినవాడి కర్తవ్యం ఏమిటి? పితృదేవతలను ఉద్దరించడం, వారికి ఉత్తమ గతులు కల్పించడం. అందుకే భగీరథుడు గంగను భుమికి రావాలని వరం అడిగాడు. తాను వివాహం చేసుకుని సంతానం పొంది పితృ ఋణం తీర్చుకోవడం కూడా పుట్టిన ప్రతి మనిషి కర్తవ్యం. అందుకే తనకు సంతానం కలగాలని కోరుకున్నాడు.

మనకు రామాయణం నేర్పుతున్నదేమిటి? కోడుకై పుట్టినవాడు తండ్రి దగ్గర ఆస్తులు తీసుకోవాలని ప్రయత్నించడం కాదు. తన తల్లిదండ్రులు బ్రతికున్నతకాలం వారిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాలి. వారు మరణిచాక వారికి ఉత్తమలోకాలను కల్పించేందుకు పిండప్రధానం చేయాలి, తర్పణలివ్వాలి, వారి మరణతిధి రోజున వారికి పితృకర్మ చేయాలి.

కాని ఈ కాలం వారు చేస్తున్నది, బ్రతికున్నప్పుడే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు, పసివయసు నుండి ఎంతో ప్రేమగా పెంచినా, ముసలివయసు రాగానే తల్లిదండ్రులను చూసూకోవడం మా వల్ల కాదు, వీరితో మేము సర్దుకుని బ్రతకలేమంటూ వారిని తిట్టిపోస్తూ ఇంటిలోనుండి తోసేయడం. బ్రతికిఉండగానే వారిని చంపేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. ఇక వారు చనిపోయాక తర్పణలివ్వడం వృధా ఖర్చుగా భావిస్తున్నారు. రామాయణం చెప్పినవేవి ఆచరించకుండా శ్రీ రాముడి ఆలయలు చుట్టూ తిరుగుతూ, శ్రీ రాముడి దీవెనలు పొందాలని చూడడం మూర్ఖత్వమే అవుతుంది.            

మళ్ళీ భగీరథుడు పరమశివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. కాలి బొటనువేలి చివరి భాగం మీద నిలబడి ఒక్క సంవత్సరం తపస్సు చేశాడు. శివుడు త్వరగా వరాలిస్తాడు. అందుకే ఆయన బోళాశంకరుడు, భక్త వశంకరుడని పేర్లు. ఓం నమః శివాయ. ఆయన ఒక్క సంవత్సరానికే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవ్వగానే నీకే వరం కావాలి అని కూడా అడగలేదు. గంగను నా తలమీద జటాజూటంలో ధరిస్తాను అన్నాడు శివుడు. అడగకుండానే వరలిచ్చాడు శివుడు.

to be continued....................

Wednesday, 23 January 2013

గంగావతరణం(8)

ఓం
గంగావతరణం(8)

క్రోధాగ్నికి భస్మైపోయారు కనుక వీరికి ఉత్తమ గతులుండవు. వీరు ఊర్ధ్వలోకాలకు, భూలోకానికి మధ్య అంతరిక్షంలో ఎక్కడో వెళాడుతుంటారు. నా తండ్రి సమానులైన వీరికి ఉత్తమ గతులు కల్పించడం కోసం నేను తర్పణం విడుస్తానని అంశుమంతుడు దగ్గరలో నీరు లేకపోతే చాలా దూరం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.

అంతలో అంశుమతుడికి మేనమామైన గరుత్మంతుడు కనిపించి, వారిది మామూలు మరణం కాదు, మహాపురుషుడైన కపిల మహర్షి కోపానికి బలైపోయారు. వీరికి మామూలు జలంతో తర్పణాలిస్తే ప్రయోజనం ఉండదు. హిమవంతుడి కూమార్తైన గంగమ్మ యొక్క జలంతో తర్పణలిస్తే తప్ప విముక్తి లభించదు. ఈ 60,000 సగరుల భస్మరాశుల మీది నుండి గంగ ప్రవహించాలి. అప్పుడే వీరికి ఉత్తమ లోకాలు లభిస్తాయి అన్నాడు.

ఆ మాటలు విని, గుర్రాన్ని తీసుకుని యజ్ఞప్రదేశానికి వచ్చి, సగర చక్రవర్తికి ఈ వార్త చెప్పి, యజ్ఞాన్ని పూర్తిచేశాడు. తన కూమారులకు ముక్తిని కల్పించడానికి సగరచక్రవర్తి చాలా ప్రయత్నం చేశారు కానీ ముసలివారవడం వలన మరణించాడు.

ఆయన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. తన పితరులకు విముక్తి కల్పించడానికి గంగను తీసుకురావాలనుకున్నాడు, కానీ తపస్సు చేయలేకపోయాడు, సగరులకు ముక్తిని కల్పించలేకపోయాడు, కాలక్రమంలో మరణించాడు.

తరువాత దిలీపుడు రాజయ్యాడు. చాలా గొప్పవాడు ఈయన. ఈయన ప్రయత్నం చేశాడు కానీ తపస్సు చేయలేదు, గంగను భూమికి తీసుకురాలేదు.

దిలీప మహారజు తరువాత భగీరధుడు రాజయ్యాడు. ఆయన రాజువుతూనే తన పితృదేవతలను ఎలా ఘొర నరకాలనుండి ఎలా రక్షించాలి, వారికి ఎలా ముక్తిని కల్పించాలని ఆలోచించి, మహారాజు అవ్వగానే రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి బ్రహ్మదేవుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు.

ఎలా తపస్సు చేశాడు? రెండు చేతులు పైకెత్తి, తనకు నాలుగు వైపులా అగ్నిహోత్రాలను పెట్టుకుని, కన్నులు మూయకుండా సూర్యుడినే చూస్తూ, నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ, ఇంత బాధ అనుభవిస్తున్నా, తన మనసును, శరీరాన్ని జయించి, వాటి గురించి ఆలోచించకుండా, బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు.  
 
to be continued..............      

Tuesday, 22 January 2013

గంగావతరణం(7)

ఓం
గంగావతరణం(7)

ఈ 60,000 మంది ఈయన మీదకు పరుగేడుతున్నప్పుడు వచ్చిన శబ్దాన్ని ఆయన విన్నారు.వారు భూమికి చేసిన అపరాధానికి క్రోధంతో అప్పటికే ఉన్నారు కపిల మర్షి రూపంలో ఉన్న వాసుదేవుడు. ఆయన ముఖం కోపంతో ఎర్రబడి, హుంకారం చేస్తూ కళ్ళు తెరిచారు. ఈ 60,000 బూడిద కుప్పలుగా మిగిలిపోయారు. మనకు శ్రీ రామాయణం ఇస్తున్న సందేశం ఏమిటి? భూమాతను ఎవరు అగౌరవపరుస్తారో, భూమికి అపకారం చేస్తారో, కలుషితం చేస్తారో వారు ఈ రోజు కాకపోయిన ఏదో ఒకరోజు శ్రీ మహావిష్ణువు క్రోధానికి గురవుతారు.

సగరచక్రవర్తి తన 60,000 మంది సగరుల కోసం ఎంతోకాలం ఎదురు చూశాడు. ఎంతకాలానికి రాకపోయే సరికి తన మనుమడు అంశుమంతుడిని పిలిచి, అశ్వం తిరిగి రాకపోతే యజ్ఞం పూర్తవ్వదు. నేను దీక్షలో ఉన్న అందువల్లు ఇక్కడినుండి కదులరాదు. కనుక ఇప్పుడు నువ్వు పాతాళానికి వెళ్ళు. వెళ్ళెటప్పుడు నీకు విరోధులైన వారు ఎదురుపడచ్చు కనుక ఖడ్గాన్ని, దనస్సు, బాణాలను వెంటతీసుకువెళ్ళు. కాని మార్గమధ్యంలో మహాపురుషులు, గురువులు, పుజనీయులు కనిపిస్తే వారికి నమస్కరించి, పూజించు. ఎవరిని పదితే వారిని వేధించకు, అకారణంగా దూషించకు అని చెప్పి పంపించాడు.

తాను కూడా రసాతాలానికి బయలుదేరాడు. మొదట తూర్పు దిక్కును మోస్తున్న విరూపాక్షానికి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. అది అంశుమంతుడిని ఆశీర్వదించింది. అలాగే దక్షిణం, పడమర, ఉత్తర దిక్కుల భూభాగాన్ని మోస్తున్న మహాపద్మం, సౌమనసం,భధ్రం అనే ఏనుగులకు ప్రదక్షిణం చేసి, నమస్కరించి వాటి ఆశీర్వాదం పొందాడు. ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమం కనిపించింది. దానికి ఒక నమస్కారం చేశాడు. ప్రక్కనే గుర్రం గడ్డి మెస్తూ కనిపించింది. దాని తీసుకువెళ్ళడానికి దగ్గరకు వెళ్ళాగానే అక్కడ తన తండ్రి సమానులైన 60,000మంది సగరుల భస్మరాశులు కనిపించాయి. అయ్యో, నా తండ్రి సొదరులైన 60,000 మంది మహర్షి కోపానికి భస్మైపోయారని వాటిని చూసి భోరున విలపించాడు.

to be continued...........