Sunday 27 January 2013

గంగావతరణం(12)

ఓం
గంగావతరణం(12)

నీటి ప్రవాహానికి అడ్డువచ్చిన మహామహా వృక్షాలే నేలకొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్నుమహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది. గంగాప్రవాహంలో జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్నుమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశారు.  ఎంతో తపస్సు చేయడం వలన మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తిమంతులవుతారు.


గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జహ్నుమహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి, నా పితృదేవతల కోసం గంగను భూమికి తీసుకువస్తే మీరు త్రాగేశారు, వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగనది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు అన్నాడు. దేవతలు కూడా  ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమి తెచ్చారు,  ముంచెత్తడం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు.


ఎవరైనా తమకు అపకారం చేస్తే, ఉత్తములకు అపకారం చేసినవారి యెడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు రెండు ఘడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టివాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది అని శాస్త్రం అంటొంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరథ నీ కోసం గంగను విడిచిపెట్టెస్తున్నాను అన్నాడు. గంగను తన కుడి చెవిలోనుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు.

మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు, గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళి గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. గంగ  ఆ 60,000 మంది బూడిదకుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికి ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి.

వెంటనే బ్రహ్మ దేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి, వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు.

to be continued............................      

No comments:

Post a Comment