Friday, 14 August 2015

స్వాతంత్ర దినోత్సవం - సద్గురు మలయాళ స్వామి వారి సందేశం

సద్గురు మలయాళ స్వామి వారి స్వాతంత్ర సందేశం

1947 ఆగష్టు 15 న దేశానికి స్వతంత్రం లభించింది. సెప్టెంబరులో ఒక సందేశం ఇస్తూ స్వామి వారు ఇలా అన్నారు ..............

"గతమాసము 15 వ తేదీన స్వరాజ్యము వచ్చినందుకు దేశమంతటా ఆబాలవృద్ధము మహానందముగా ఉత్సవాలు, ఉపన్యాసాలు, దానధర్మాలు జరిపారు. ఇవన్నీ శుభసూచనలే. రోగ పీడితుడు రోగ విముక్తి కలిగినప్పుడు ఎలా ఆనందం పొందుతాడో, అలా మాత్రమే జరిగినది. కానీ దేనివలన రోగము కలిగినదో, ఆ కీలకము (కారణము) తెలుసుకుని మెలిగినపుడే మరల ఆరోగ్యహాని కలగదు. దీనిలో రహస్యమిదే......... ప్రజలలోనూ, పాలకులలోనూ ఐకమత్యము లేనందువల్లనే పతనము సభవించినదని కొందరు తెలియజేసినా అది చాలదు. ఇంకోక ముఖ్యకారణం కూడా ఉంది. అదే వర్ణాశ్రమ ధర్మాలను ఆధారంగా చేసుకుని కొన్ని జాతులకు మాత్రమే శాస్త్రపఠనమునకు, అస్త్ర శస్త్రములు ధరించి యుద్ధం చేయుటకు అధికారము కలిపించుట. శారీరిక, మానసిక ప్రజ్ఞలను అనుసరించి సర్వజనులకు, వారికి అనుగుణమైన కార్యములలో ప్రవేశం ఏర్పడాలి. అప్పుడే భారతమాతను బంధించిన పిశాచము వదిలిపోతుంది".  - సద్గురు మలయాళ స్వామి

--------------------------------------------
నిజానికి అప్పటితో మన నాయకులు కులవ్యవస్థను అంతం చేయాల్సింది. కానీ దాన్ని చట్టబద్ధం చేశారు, ఇప్పుడు మతం మారే అవకాశం ఉంది కానీ, కులం మార్చుకునే అవకాశం లేదు. ఒకప్పుడు ఏ కారణం చేతనో వచ్చిన ఈ జన్మ ఆధారిత వర్ణవ్యవస్థ సమాజంలో స్వాతంత్రం తర్వాత బలంగా పాతుకుపోయి, హిందువుల్లో అనైక్యతకు కారణమవుతోంది. అలా కాక వేదం చెప్పిన గుణకర్మల ఆధారిత వర్ణవ్యవస్థ మాత్రమే దేశాన్ని తిరిగి పరిపుష్టం చేయగలదు.

శ్రావణ శనివార వేంకటేశ్వర దీపారాధన

శ్రావణమాసంలో వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది. సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. భక్తులపాలిట కల్పవృక్షం, కలియుగం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. అటువంటి స్వామిని శ్రావణమాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే ఓ విశేషపూజ ఉంది.

పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం (తిరు నామం) దిద్దాలి. ఆ అవకాశం లేనప్పుడు ఏదైనా వేంకటేశ్వరుని ఫొటో తీసుకోవాలి. నీరు ఉపయోగించకుండా, ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలివిడి కలిపి, దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. అందులో ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించాలి. వెలుగుతున్న ఆ జ్యోతినే వేంకటేశ్వరునిగా భావన చేసి, ఆ జ్యోతి స్వరుపుడైన వేంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించి, అష్టొత్తరశతనామవాళి (108 నామాలు)తో పూజించి, పానకం, వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) నైవేధ్యం పెట్టాలి (అవి కాక ఇతర పదార్ధాలు పెట్టడమనేది మన ఇష్టం, శ్రద్ద), మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేధ్యంగా స్వీకరించాలి. ఇది శ్రావణ శనివార వేంకటేశ్వర దీపారాధన. ఈ పూజ చేయడం వల్ల ఎంతోమందికి కోరిన కోరికలన్నీ స్వామి అనుగ్రహంతో నేరవేరాయి.

ఓం నమో వేంకటేశాయ
-------------------------------------------------------------------------------------
సాధారణంగా మామూలు రోజుల్లో దీపారాధన ఎలా చేయాలో, దాని నియమాలేంటో ఈ లింక్ లో చెప్పడం జరిగింది.
http://ecoganesha.blogspot.in/2014/01/blog-post.html

Wednesday, 12 August 2015

భారత్ గురించి సదాశివ గోల్వాల్కర్


స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యర్ధన

దేశహితం కోసం జపనీయులు పెద్దగా ఉండే మన బాస్మతి బియ్యాని విడిచిపెట్టి, చిన్నగా వివిధ రకాల్లో ఉండే తమ బియ్యాన్ని తింటున్నప్పుడు, మన దేశం కోసం మనం ఫిలా, రిబాక్, ఎడిడాస్, నైక్, ప్యూమ, లీ, లెవిస్ మొదలైన విదేశి కంపెనీల సామాన్లు, ఫోర్డ్, హుండాయ్, షెవర్లె, యమహా, హోండా, సుజుకి, వోక్స్ వేగన్, ఫియట్ వాహనాలు, ఎల్జీ, సోని, సాంసంగ్, ఫిలిప్స్, నోకియా ఉపకరణాలు, కాల్గేట్, క్లోజ్అప్, పెప్సోడెంట్ టూత్‌పేస్ట్ లు వదలిపెట్టలేమా? ఇదేనా మన దేశభక్తి, దేశం పట్ల ప్రేమ? ఇప్పుడు లక్షల మంది దేశం కోసం ఇలా చేస్తున్నారు, కానీ మీ దేశభక్తి 15 ఆగష్టు, 26 జనవరి కే పరిమితమైందా? కాస్త ఆలోచించండి. మీ కోసం, మీ దేశహితం కోసం మారండి. స్వదేశి వస్తువులే వాడండి, దేశాన్ని కాపాడండి.   జై హింద్, వందేమాతరం   స్వదేశీ జాగరణ్ మంచ్

Tuesday, 11 August 2015

భారత్ గురించి రోమైన్ రోలాండ్


దేశరక్షణ కోసం సుబ్రమణ్యారాధాన

గత కొన్నెళ్ళుగా పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్‌ను కవ్విస్తోంది. ఈ మధ్య అయితే మరీ తెగించింది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దు గ్రామాల్లో ఉండే పౌరుల మీద, సైనికుల మీద కాలుపు జరుపుతూ దాడులు చేస్తున్నారు. గత పదేళ్ళలో ఎప్పుడు పాక్ కాల్పులు విరమణ ఉల్లగించినా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ విధానాల వలన భారత సైన్యం తిరిగి స్పందించేది కాదు. స్పందించవద్దని, మౌనంగా ఉండమని అప్పటి ప్రభుత్వ ఆదేశం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి స్చేచ్చనిచ్చింది. ఫలితంగా భారత సైన్యం పాక్ కాల్పులను ధీటుగా తిప్పికొడుతోంది. అయితే తిప్పికొడితే సరిపోదు. తగిన సమాధానమివ్వాలి. అది వేరే సంగతి. కానీ ఇప్పుడు పాక్ చేస్తున్నదేమిటంటే ఒక పక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ, అటువైపు సైన్యం దృష్టి మరల్చి, ఇంకో పక్క అక్రమంగా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపుతోంది. భారతదేశానికి పాకిస్థాన్‌తోనే కాక, అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. అనేకశక్తులు భారతదేశాన్ని విఛ్ఛినం చేయాలని చూస్తున్నాయి. అందుకు పధకాలు వేసి అమలు చేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఆ పధకరచన చేసిన శక్తులు విదేశివైతే, వాటిని అమలు పరుస్తున్నది మాత్రం భావదాస్యంలో కూరుకుపోయిన భారతీయులే. కొందరు సంఘసంస్కర్తలు గా, కొందరు దేశభక్తులుగా, కొందరు సేవాభావం ఉన్నవారిగా, రాజకీయనాయకులుగా, మతపెద్దలుగా ముసుగు వేసుకుని చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇంటలిజెన్స్ విభాగం సైతం పసిగట్టలేని విధంగా చాపకింద నీరులా దేశ విద్రోహ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే మనవాళ్ళే మనకు శత్రువులుగా పని చేస్తున్నారు. కొందరు తెలిసి చేస్తున్నారు, కొందరు తెలియక చేస్తున్నారు.

మరి ఇటువంటి సమయంలో దేశభక్తి కలిగిన పౌరులుగా దేశానికి మనమేం చేయగలం అనే ప్రశ్న ఉదయిస్తుంది. ముందు పౌరుల మనసు సంఘవిద్రోహ శక్తులకు లోబడకుండా ఉండాలి. అలా జరగాలంటే దైవబలాన్ని పెంచాలి.
అప్పుడు దైవీశక్తులు జనం యొక్క మనసును మంచిమార్గంలో, ధర్మమార్గంలో నడిపిస్తాయి. దుష్టభావాలను తగ్గిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి దేవసేనలకు అధిపతి. ఆయనే దేవతాసైన్యానికి నాయకుడు. ప్రతి రోజు ప్రతి పౌరుడు కనీసం 108 సార్లు శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రాన్ని జపించి ఆ శక్తిని దేశానికి ధారపోస్తే, భారతసైన్యానికి అంతులేని దైవబలం పెరుగుతుంది. సైన్యానికేకాదు ఇంటలిజెన్స్ విభాగం వారికి ఆ శక్తి సహాయపడి కుట్రలను భగ్నం చేసే శక్తిని, మేధస్సును ఇస్తుంది. దాంతోపాటు శత్రువుల మనసులో దైవీశక్తులు భయాన్ని కలిగిస్తాయి, ఫలితంగా శతృసేనల బలహీనపడతాయి. దైవీశక్తుల బలం పెరిగిందంటే దుష్టశక్తుల బలం క్షీణిస్తుంది.కనుక దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు కనీసం 108 మార్లైన జపం చేయండి. అంతకంటే ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. యుద్ధం వస్తే, చేయాల్సిందే. కానీ యుద్ధం చేసేది సైన్యం కదా, మరి మనమేం చేయాలంటే, దానికి సమాధానమే ఈ మంత్రజపం. ఇది చేయడం వలన దేశనికి రక్షణ కలగడమే కాక, మనం సంఘవిద్రోహశక్తులకు పావులుగా మారకుండా ఉంటాము. మనకూ రక్షణ కలుగుతుంది. ఇన్ని కోట్లమంది కోసం చేస్తున్నారు కనుక త్వరగా కర్మ తీరిపోతుంది.

ఇదే సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం

ఓం తత్పురుషాయ విద్మహే
మహాసేనాయ ధీమహి
తన్నః షణ్ముఖః ప్రచోదయాత్