Thursday, 7 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (137)



ఏనుగు చెవులను అట్లా త్రిప్పడం ఊరకే కాదు. దానికి ఒక లక్ష్యం ఉంది. దీనినుంచి ఒక్కొక్కప్పుడు మదం కారుతూ ఉంటుంది. ఆ సమయంలో చీమలు, పురుగులు మూగుతాయి. వాటిని తరమడం కోసం భగవంతుడే వీటికి చేటలంత చెవులనిచ్చాడు.


గణేశ పంచరత్నంలో శంకరులు, మదం కారుతున్న వినాయకుని కపోలాలను 'కపోల దాన వారణం' అని వర్ణించారు. 


అతని చెక్కిలినుండి కారే మద జలం సంతోషం వల్ల, దయవల్ల కూడా. అది మధురంగా ఉంటుంది. దీని రుచి కోసం తుమ్మెదలు మూగుతాయి. ఈ మాటను శంకరులు ఇలా అన్నారు. గలత్ దానగండం మిలత్ భృంగషండం 


ఆ తుమ్మెదను కోపంతో తరుముతున్నాడా? ఆ పిల్ల దేవతకు ఇది కూడా ఆటయే. తుమ్మెదలు వచ్చి ఆటలాడుకుంటున్నాయి. అసలితణ్ణి చూడడంతోనే అవి నృత్యం చేస్తాయి. అవి అట్టి మకరందాన్ని పానం చేయాలా? పిల్లల చెవులలో కూతలు కూసి మనం ఆడుకోమా? అవి ఝుంకారం చేస్తూ ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయో స్వామికి తెలుసు. వాళ్ళను తరుముతున్నట్లుగా సరదాగా చెవులనాడిస్తాడు. ఆ గాలికి వెళ్ళి పోతూ ఉంటాయి. తిరిగి వస్తూ ఉంటాయి. దీని మదంపై ఆ గాలి చల్లదనాన్ని ఇతనికి కలిగిస్తుంది.

Wednesday, 6 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (136)



గజ కర్ణకుడు


తరువాతి నామం ఏనుగు చెవులున్న గజకర్ణకుడు. అతణ్ణి గజముఖు డనినపుడు ఏనుగుల చెవులతో ఉంటాడు కదా! మరల చెప్పాలా?


మిగతా విగ్రహాలలో చెవులకు చుట్టూ ఉన్న నాల్గవ భాగం భుజాలవరకూ ప్రేళ్ళాదుతూ ఉంటుది. సాధారణంగా చెవులు కనబడవు. వాటికి వ్రేళ్ళాడే కుండలాలే కన్పిస్తాయి. వినాయకుడు భిన్నంగా ఉంటాడు. చెవులు విప్పుకొన్నట్లుగా, వింజామరల మాదిరిగా అతని పెద్ద తలకు అతకబడి నట్లుంటాయి.


అట్లా ఎందుకున్నట్లు? మన ప్రార్థనలను బాగా ఆలకిస్తాడని, ఆ చెవులు కనబడకపోతే ఏం ప్రయోజనం! విస్తరింపబడిన చెవుల వల్లనే నేను మీ ప్రార్థనలను వింటున్నానని చెప్పకనే చెబుతున్నాడన్నమాట.


జంతువులకు చెవులు ఒక గిన్నె మాదిరిగా ఉంటాయి. ఏనుగునకే విసన కర్రల మాదిరిగా ఉంటాయి. మిగతా జంతువులకు శబ్దం చెల్లాచెదురు గాకుండా లోపలికి పంపునట్లుగా గిన్నె మాదిరిగా ఉంటాయి. అయితే ఏనుగులకు ఆ ఇబ్బంది లేదు. అవి సూక్ష్మమైన శక్తి కలవి.


అది చెవులని అటూ ఇటూ ఆడిస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. జంతు ప్రపంచంలో ఇట్లా ఆడించగల శక్తి ఒక్క ఏనుగునకే ఉంది. పశువులు కూడా అప్పుడప్పుడు చెవులును కదిలిస్తూ ఉంటాయి. పురుగులను తోలుతూ ఉంటాయి. కాని ఏనుగు మాదిరిగా చేయలేవు. అట్లా పురుగులను తోలడానికి అవి కష్టపడవు కూడా. కాని ఏనుగు సహజంగానే త్రిప్పగలుగుతుంది. అందుకే గజాస్ఫాలన మన్నారు. గజ తాళమనీ ఉంది. తాళం అంటే తాటాకు. విసనకర్రగా ఉంటుంది. సంగీతంలో తాళం ఉంటుంది కదా! ఎవరైనా మనుషులు అట్లా చెవుల నాడించగలిగితే అది ఒక అద్భుతకృత్యమే. ఏదైనా ఎవ్వరూ చేయలేని దానిని గజకర్ణం ఉన్నా చేయలేదని అంటారు. అంటే చెవులు త్రిప్పలేడని. మనం చేయలేనిదానిని అతడు చేస్తాడు. కనుక అతనికి గజకర్ణకుడని పేరు.  

Tuesday, 5 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (135)



అగస్త్యుడు, కావేరీ నదిని కమండులువులో బంధించాడు. విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వెళ్ళి దానిని తన్ని కావేరిని ప్రవహించునట్లు చేసాడు. అగస్త్యునకు కోపం వచ్చింది. కాని తన్నినవాడు వినాయకుడని తెలిసి అతనికి భక్తుడయ్యాడు. ఇప్పుడు వాతాపి కథ చెప్పుకొందాం. వాతాపి, ఇల్వలులనే ఇద్దరు రాక్షసులుండేవారు. వారు నరమాంసానికి అలవాటు పడ్డారు. ఇక మంత్ర పూతమైన శరీరాలు గల మహర్షుల మాంసం అంటే వారికి మరీ ఇష్టం. మోసం చేసి వారిని చంపుతూ ఉండేవారు. అందులో పెద్దవాడు, బ్రాహ్మణ వేషం వేసుకొని మా ఇంటికి ఆతిథ్యానికి రమ్మనేవాడు. ఋషి నమ్మేవాడు. తప్పని సరియైతేనేగాని ఋషులు అతీంద్రియ శక్తిని వాడరు. వాతాపి తినే ఆహారమయ్యేవాడు. ఇక తమ్ముడు "వాతాపి బయటకు రా" అని అంటే మేకరూపం ధరించి అవతలి వాని పొట్టను చీల్చుకొని వచ్చేవాడు. ఇద్దరూ కలిసి ఆ ఋషిని తినేవారు. అగస్త్యుని దగ్గర కూడా ఆ మోసం చేద్దామనుకున్నారు. అతడు నిరంతరం వినాయకుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. అందువల్ల వారి పన్నాగాన్ని పసిగట్టేడు. వెంటనే 'వాతాపి! జీరోభవ' అన్నాడు అందువల్ల వాతాపి తిరిగి రాలేదు.


ఇతడు వినాయకుని పూజించడం వల్ల లోకానికి ఉపకారం చేసినవాడయ్యాడు. ఆ సందర్భంలో అవిర్భవించినవాడే వాతాపి గణపతి అగస్త్యుడు తిరువారూర్ వెళ్ళి అక్కడ ఈ గణపతిని ప్రతిష్టించాడు. ముత్తుస్వామి దీక్షితులు, ఈ గణపతి మీదనే వాతాపి గణపతిం భజే అనే కీర్తనను వ్రాసేరు. అంతేనే కాని తిరుచెంగట్టాన్ కుడిలో నున్న గణపతి మీద కాదని గుర్తించండి. పాటలో మూలాధార క్షేత్రం అని వస్తుంది. తిరువారూర్, పృథ్వీక్షేత్రం కనుక మూలాధారక్షేత్రమే.


Monday, 4 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (134)




గజానతత్వం - అగస్త్యుడు


అగస్త్యునకు గణపతికి గట్టి సంబంధం ఉంది. ఇద్దరికీ పెద్ద బొజ్జలే, బొటన వేలంత పొట్టివాడు అగస్త్యుడు. ఇక మన స్వామి వామన రూపుడే కదా.


వామనరూప మహేశ్వర పుత్ర


విఘ్నవినాయక పాద నమస్తే


వామనరూపం అంటే గుజ్జు రూపమే కదా. ఇక అతడు వక్రతుండ మహాకాయుడు కూడా. అంటే ఒకమూల గొప్ప శరీరం కలవాడు, మరొక విధంగా అతడు వామనరూపుడు కూడా. అంటే చిన్నవాడూ ఆయనే, పెద్దవాడూ ఆయనే. అణువు ఆయనే.. మహత్తూ ఆయనే.


హంపిలో రెండు పెద్ద విఘ్నేశ్వరమూర్తులున్నాయి. ఒకటి పది అడుగులు, మరొకటి ఇరవై అడుగుల ఎత్తుతో ఉంటాయి. అయితే ఆ మూర్తుల పేర్లు ఆవగింజంత వినాయకుడు, కంది బద్దంత వినాయకుడు అని ఉంటాయి. అతడు విశ్వరూపుదని, అట్టి మూర్తిని చూపించలేమని కనుక ఈ చిన్నిమూర్తినే చూపించామని అంటారు. ఆ మాటలను (ఆవగింజ, కందిబద్ధ అని) వినయంతో అంటారు.

Sunday, 3 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (133)



క్షత్రియుల పేర్ల చివర వర్మ అని ఉంటుంది. అనగా అసలర్థం కవచమని. కవచం ధరిస్తారు కనుక వర్మలయ్యారు. అంతేకాదు, దేశాన్ని; జీవితాన్ని పోగొట్టుకొనైనా రక్షిస్తారు కనుక వర్మలయ్యారు. పై వర్మలో అట్టి లక్షణం కంటె శత్రుత్వమే ప్రధానమై కన్పించింది. చాళుక్యులూ ఈ విషయంలో పల్లవులకు తక్కువ వారేమీ కాదు. పగబట్టి కాంచీపురాన్ని ధ్వంసం చేసారు. వంద సంవత్సరాల తరువాత రెండవ విక్రమాదిత్యుడు కంచిపై దండెత్తాడు. కంచిలో కైలాస నాథాలయ నిర్మాణం జరిగిన కాలమది. విక్రమాదిత్యుడు తలుచుకుంటే కంచిని, అందలి ఆలయాన్ని ధ్వంసం చేసి యుండేవాడు. కాని ఆ పని చేయలేదు. శివమంత్ర దీక్షాపరుడు. శివభక్తి వల్లనో, పోషకుడవడం వల్లనో గాని అట్టి పాడు పని చేయలేదు. అంతేకాదు, దండెత్తి తిరిగి వచ్చిన తరువాత కైలాసనాథ ఆలయ ప్రతిబింబమా అన్నట్లుగా విరూపాక్షాలయాన్ని నిర్మించాడు. తమిళ దేశం నుండి శిల్పులను ఆహ్వానించి వారిని గౌరవాదరాలతో చూసాడు.


వాతాపిని జయించిన నరసింహవర్మ దగ్గరకు వెడదాం. అతని సైన్యాధిపతి పరంజ్యోతి, మహామాత్ర అనే బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. వీళ్ళు వైదిక మార్గాన్ని విడిచిపెట్టి మిగిలిన లౌకిక వ్యవహారాలలో ఆరితేరియుండేవారు. పరంజ్యోతి, శివాలయం ఉన్న తిరుచెంగట్టాన్ కుడికి చెందినవాడు. అతనికి వినాయకుని పట్ల భక్తియుండేది. వాతాపిని జయించి తిరిగి వచ్చేటపుడు అనేక వస్తు వాహనాలతో అక్కడి గణపతిని కూడా వెంట తీసుకొని వచ్చాడు. కళింగ యుద్ధం తరువాత అశోకునిలో ఎట్టి మార్పు వచ్చిందో ఇతనిలోనూ అట్టి మార్పు కనబడింది. ఇక సైన్యాధిపత్యానికి స్వస్తి చెప్పి స్వగ్రామంలో శివభక్తితో కాలం గడిపేవాడు. వాతాపినుండి తెచ్చిన గణపతి విగ్రహాన్ని తిరుచెంగట్టాన్ కుడిలో ప్రతిష్ఠించి సిరు తొండనాయనార్ గా ప్రసిద్ధుడయ్యాడు. ఇట్లా తీసుకొని రాలేదనే అభిప్రాయమూ ఉంది. విగ్రహం యొక్క లక్షణాలను బట్టి వాతాపినుండి వచ్చిందని నిర్ధారణ చేసారు. వాతాపిలోనున్న విఘ్నేశ్వరుని పట్ల అచంచల భక్తి యుండడం వల్లనే వాతాపిని జయించగలిగాడని తిరిగి ప్రతిష్టించాడని కొందరన్నారు. అతడు కారణ మగుటచే ఇది వాతాపి గణపతి అయిందని అన్నారు. మరొక అభిప్రాయం ప్రకారం వాతాపి నుండి మూర్తిని తీసుకొని వచ్చినా మూలాధార క్షేత్రమైన తిరువారూర్ లో ప్రతిష్ఠించాడని కొందరన్నారు.


Saturday, 2 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (132)



చెప్పబోవు కథలో మహేంద్రవర్మ పల్లవుడనే గొప్ప రాజుకు బద్ధ విరోధి రెండవ పులకేశి. ఈ పల్లవ రాజుకంటె ఉత్తర దేశంలోని హర్షవర్ధనుడు ఇంకా గొప్పవాడు. హర్ష శబ్దం, పులకేశి పదాన్ని తలపింపచేస్తోంది. పులకేశి హర్షుణ్ణి తరమివేసాడు. పులకేశికి కన్నడంలో అసలు నామం, ఎరాయమ్మ. రాజైనపుడు తాత పేరును గ్రహించి హర్షవర్ధనునకు బద్ద శత్రువైనాడు.


వెంట్రుకకు అలకమని సంస్కృతంలో అంటారు. యక్షరాజైన కుబేరుడు అలకేశ్వరుడు. అతని రాజధాని అలకాపురి. హృషీకేశ, పులకేశి, అలకేశన్ అనే పదాలు రోమాంచిత లక్షణాన్ని, గొప్పదనాన్ని సూచిస్తాయి.


రెండవ పులకేశి, దగ్గర బంధువుచే మోసగింపబడి రాజ్యాన్ని కోల్పోయాడు. తరువాత అమిత శక్తితో అతణ్ణి జయించి గద్దెనెక్కాడు. చాళుక్య రాజులందరిలో ప్రసిద్ధిని పొందాడు. సత్యాశ్రయుడనగా సత్యానికి ఆశ్రయుడనే బిరుదు వహించి పరిపాలించాడు. దండెత్తిన హర్షవర్ధనుని తరమివేసాడు. నర్మదకు ఉత్తరపు వైపున అతడు పరిపాలించ వలసి వచ్చింది.


ఆనాటి కాలంలో దక్షిణ దేశంలో ఒక పల్లవ రాజుండేవాడు. అతడు మహేంద్ర వర్మన్. అతడు వ్రాసిన మత్తవిలాస ప్రహసనంలో తాను మహేంద్ర విక్రమ వర్మనని వ్రాసుకున్నాడు. గొప్ప రసజ్ఞుడు. సంగీత శిల్ప పోషకుడు. అట్టివానిపై పులకేశి దండెత్తి, కోటకే అతడ్డి పరిమితమగునట్లుగా చేసాడు. అట్లా విజయం సాధించాడు.

పులకేశి చేతిలో ఓడింపబడడం అతనికి అవమానకరమైంది. పగ తీర్చుకోకుండానే కన్ను మూసాడు. అతని కొడుకు నరసింహవర్మ. అతనికే మామల్లన్ అనే బిరుదుండేది. అతడు వాతాపిపై దండెత్తి చాళుక్యుల నోడించాడు. ఆ నగరాన్నే ధ్వంసం చేసాడు.

క్షత్రియులలో మంచి లక్షణాలున్నా వారిలోని క్షాత్రగుణం, శత్రుత్వంగా మారి వారి మనస్సులను చెడగొడుతుంది.

Friday, 1 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (131)



వాతాపి గణపతి - చారిత్రక వివరాలు


వాతాపి గణపతిని అగస్త్యుడు అర్చించాడు. వాతాపీయనే రాక్షసుడు మోసపూరితంగా అగస్త్యుని ఉదరంలో ప్రవేశించుట, అతడు జీర్ణం చేసుకొనుట మనకు తెలిసిందే. వాతాపి నివసించిన చోటు, చంపబడినచోటు, వాతాపి అని పిలువబడుతుంది. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో బాదామి అనే ప్రాంతమే ఇది. ఇది చాళుక్యుల రాజధాని. 


చాళుక్య సామ్రాజ్యంలో పులకేశి అనే పేరు కలవారిద్దరున్నారు. చాళుక్యుల తామర శాసనాలు సంస్కృతంలో; ఱాతి శాసనాలు కన్నడంలో ఉంటాయి. కన్నడంలో పులకేశిని పోలేకేసి అన్నారు. ఇట్లా చాలా పదాలు ప్రాంతీయ భాషలలో ఉన్నా వారు రాజులైన తరువాత వారి పేర్లు సంస్కృతీ కరింపబడతాయి. కనుక సంస్కృతంలో ఇతడు పులకేశి, చరిత్ర కారులు పుళకేశిన్ అన్నారు. పులకేశి అని సంస్కృతంలో ఉందని అట్లా ఆంగ్లంలోనూ వ్రాసేరు.


పులకేశి యనగా సంతోషంతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలు కలవాడని అర్థం. పులకాంకితుడని విన్నాం కదా. అట్లా సాహస కృత్యాలు చేసి రాజులు పులకాంకితులయ్యేవారు. ఇతరులకు గగుర్పాటును కలిగించి అనగా పులకాంకితులగునట్లుగా చేసేవారు.