Sunday, 7 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (166)



వక్రతుండుడు


ముఖాన్ని సూచించే పదాలలో తుండం ఒకటి. సాధారణంగా తుండం అంటే ముఖమని ఉన్నా పంది, ఏనుగులకు ముక్కును బట్టే వాటికి ప్రాధాన్యం. తుండమనగా ఆ రెండింటికే 'ముక్కు' అని చెప్పాలి. పంది యొక్క ముక్కుకు ప్రాధాన్యం ఏమిటి? గుఱ్ఱం మొదలగు జంతువుల ముక్కు క్రమంగా తగ్గుబాటుతో ముఖంవైపు సారించినపుడున్నట్లు ఉండగా, పంది ముక్కు వృద్ధి పొందుతూ ఉంటుంది. ఏనుగుకు ముక్కు ప్రేలాడుతూ ఉంటుంది. చెట్టుబోదెలా ఉండేదే తుండం. పక్షులకు ముక్కు పొడవుగా ఉండి పోను పోను కోసుగా ఉంటుంది. దీనినీ సంస్కృతంలో తుండం అంటారు.


శరీరంలో తలకెంత ప్రాధాన్యమో తలలో ముక్కునకు అంత ప్రాధాన్యం ఉంది. అది చేసే పనివల్లనే కాదు, దాని ఆకారానికి ప్రాధాన్యం ఉంది, ఒకని ముక్కును బట్టి అతని ఆకారం చెబుతాం. (గ్రద్ద ముక్కున్నవాడు మొదలైన వ్యవహారంలో ఉన్నాయి).


వక్రమనగా వంకర. ఎవడైనా తప్పుపని చేస్తే వాటిని వక్రుడని అంటాం. అంటే వాడిది వక్రగుణం, ఋజుప్రవర్తన ఉన్నవాడికి తిన్నని గీతలా మనః ప్రవృత్తి ఉంటుంది. ఇట్టి దానిని సంస్కృతంలో ఆర్జవమంటారు. తిన్నగా అని అర్థం. ఋజు = ఆర్జవం.


ఇక వక్రతుండం అనినపుడు చెడ్డ అనే అర్థంలో వాడం. కేవలం వంకరనే. ఇతని తుండం, వంకరగా తిరిగియుండుటవల్ల ఇతడు వక్రతుండుడు.


మరొక చిత్రం. ఏనుగు, మొత్తం తుండాన్ని కదపకుండా దాని అగ్రభాగాన్ని వంచగలదు, అటూ ఇటూ సాధారణంగా ఎడమవైపునకు త్రిప్పుతుంది. ఎప్పుడైనా కుడివైపునకు కూడా.


ముత్తుస్వామి దీక్షితులు వక్రతుండ మహాకాయ అని స్వామిని కీర్తించారు. దాని అగ్రభాగాన్ని కుడివైపునకు త్రిప్పినపుడు (వలంపురి) అతడు ప్రణవ స్వరూపునిగా కనబడతాడని లోగడ చెప్పాను.


వెన్నను దొంగిలించే కృష్ణుణ్ణి భావిస్తే మనలో చారగుణం పోతుంది. అతని రాసలీలలను స్మరిస్తే మనలో కామం పోతుంది. అట్లాగే వక్రతుండుని స్మరిస్తే మనలో వక్రలక్షణాలు పోతాయి. గణపతి గాయత్రిలో వక్రతుండ పదమే ఉంది. ఈ మంత్రం యొక్క లక్ష్యం మనలను సన్మార్గంలో పెట్టుమనే.

Saturday, 6 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (165)



ముఖం - నోరు


గజాననంలో ఆననం ఉంది. అనగా ముఖం. ముఖానికి అమర కోశంలో చాలా పర్యాయ పదాలున్నాయి. వక్త్రాస్యం, వదనం, తుండం, ఆననం లపనం, ముఖం ఇవన్నీ ముఖాన్నే సూచిస్తాయి. 


ఇక సంస్కృతంలో నోటికి ప్రత్యేక పదం లేదని, ముఖానికి ఉన్న పదమే నోటికీ ఉందని లోగడ చెప్పాను. వాక్, వచనం మొదలైనవి మాటకు సంబంధించినవి. మాట్లాడతాడు కనుక, వక్త. మాట్లాడదగినది వక్తవ్యం. కనుక వక్త్రం అనే మాట నోటికే చెందుతుంది. వదనం అనేమాట కూడా మాటకాధారమైన అంగం, ముఖ్యంగా నోటినే చెబుతుంది. వద అనగా మాట్లాడు. ధాతువును చూస్తే లపనం కూడా మాటకే చెందింది. లప్ అనగా మాట్లాడుట. దాని నుండే ఆలాపం, సల్లాపం, ఆలాపన అనే మాటలు వచ్చాయి. కనుక ముఖాన్ని సూచించే పదాలు నోటినీ సూచిస్తాయనడం సబబు కాదు. ఆపైన వక్ర్తం, వదనం అని నోటిని సూచించే పదాలు ముఖాన్ని సూచిస్తాయి. మాట్లాడేశక్తి మానవునకే ఉంది కనుక నోటికి ప్రాధాన్యం ఉంది. నోరు, అన్ని అవయవాలలో ముఖ్యమైన ముఖంలో ఉంది. చూసే కళ్ళు గాని, వినే చెవులు గాని, వాసన చూసే ముక్కు గాని, స్పృశించడానికి అందంగా ఉండే చెక్కిళ్ళు గాని అన్నీ ముఖంలోనే ఉన్నాయి. మానవులలో ప్రత్యేకత, మాట్లాడే లక్షణం కనుక, నోరే మాట్లాడుతుంది. కనుక నోటిని, ముఖాన్ని సూచించే పదం ఉంచారు. నోటికే రెండు లక్షణాలున్నాయి. కన్ను చెవులనే జ్ఞానేంద్రియలతో బాటు ఇదీ జ్ఞానేంద్రియమే. మాట్లాడగలదు, రుచి కూడా చూడగలదు. ఇట్లా రెంటి పనులూ చేసి ప్రముఖ స్థానాన్ని పొందింది.  


అందువల్ల ముఖాన్ని, నోటిని సూచించు పై పదాలున్నాయి. గజానుడన్నా, విఘ్నేశ్వరుడన్నా ఏనుగు ముఖమే గుర్తుకు వస్తుంది.


శరీరంలో తలకు ప్రాధాన్యం. ఒకడు అందంగా ఉన్నాడా లేదా అని చెప్పేది ముఖాన్ని బట్టే కదా! అట్టి ముఖం ఉన్నవాడు గణపతి. ఇందన్ని అవయవాలూ చూడముచ్చటగా ఉంటాయి.


(ఇక అమరకోశంలో - వఅక్త్రం దీనిచే పలుకబడును; ఆస్యం = దీని యందు భక్ష్య వస్తువులు వేయబడును; వదనం=దీనిచే పలుకుదురు; తుండం=భక్ష్య వస్తువు దీనిచే పీడింపబడును, ఆననం=దీనిచేత బ్రతుకుదురు; లపనం దీనిచే పలుకుదురు; ముఖం=దీనిచే భక్ష్యము పీడింపబడును. ఇందు చాలా పదాలు నోటికే ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయని సారాంశం -అనువక్త)


Friday, 5 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (164)



దేవతలకు ఎన్నో ఆహార పదార్థాలను నివేదిస్తాం. వాటిని ప్రత్యక్షంగా తింటారా? వాసన చూస్తారట. మానవులే వండిన ఆహారాన్ని తింటారు. విఘ్నేశ్వరునకు రెండుసార్లు ఉడికిన మోదకాలంటే మక్కువ. ముందు బియ్యపు పిండిని ఉడక పెడతాం. అందు పూర్ణం పెట్టి మరల ఉడకపెడతాం. ఇంకా పవిత్రత కోసం వాటిని నేతిలో కూడా వేయిస్తారు. గణపతి హోమంలో వాటినే హోమం చేస్తారు. అతడు మోదకహస్తుడు. అంటే తీపిగానున్న మోదకాలను చేతిలో ఉంచుకొనే స్వామి ఇతడొక్కడే. కృష్ణుని చేతిలో వెన్నముద్ద యుంటుంది. వెన్నకుండను ఆలింగనం చేసుకున్నట్లుగా బొమ్మలుంటాయి. అయితే వెన్నను ఉడకబెట్టరు కదా! తేనెగాని, పిండిని గాని సుబ్రహ్మణ్యునకు అర్పిస్తాం. అవీ ఉడక బెట్టినవి కావు. అన్నపూర్ణేశ్వరికి చేతిలో పాయసముంటుంది. అది ఆమె కోసం కాకుండా మనకీయడానికే అన్నట్లుంటుంది. ఒక్క గణపతి మాత్రమే వండినవి తింటాడు, వండినవి ఇస్తాడు.


అందువల్ల తనలో దేవాంశ, భూతాంశ, మానవ లక్షణాలను వినాయకుడు ప్రకటిస్తున్నాడు. కేవలం దేవతగా కేవలం మానవునిగా కేవలం భూతంగా ఉన్నాడా? అన్నీ కలబోసిన మూర్తిగా ఉన్నాడు.


అయితే ఏనుగు ఆకారంలోనే ఎందుకుండాలని ప్రశ్న. దానికి మిగిలిన జంతువులకంటె గొప్ప గుణాలున్నాయి కనుక. మరొక్క విషయం. ఏనుగు తలనే ఎందుకు ధరించాడు? పరమాత్మ తానన్నిటికీ మూలమని సూచించడానికి, అట్టి రూపాన్ని అందరూ భజించాలని తెలుపడానికి అట్టిరూపాన్ని ఎంచుకున్నాడు. అసలు సృష్టికి మూలం ఏమిటి? అన్నిటికీ మూలం ప్రణవం. అన్ని జంతువులలోనూ దేనికీ లేని ప్రత్యేకత ఏనుగు ముఖానికి ఉంది. దాని ముఖం, కుడివైపున తిరిగిన తుండం, ప్రణవాకారంగానే ఉంటాయి. అందువల్ల గజానన రూపంలో సాక్షాత్కరించాడు.


Thursday, 4 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (163)



గోపూజలో దానిని పూజించడంతోనే సరి. గజ పూజలో దానిని పూజించడమే కాకుండా అదీ పూజ చేస్తుంది.


అన్ని పెద్ద ఆలయాలలోనూ ఏనుగులుంటాయి. కేరళలో త్రిచూర్లో భగవంతుని కంటే ఏనుగులకే ప్రాముఖ్యం ఉన్నట్లు కన్పిస్తుంది. అట్లా ఏనుగులకు దైవానికి సంబంధం ఉంది. ఏనుగు మొఱ పెడితే వైకుంఠం నుండి విష్ణువు రాలేదా? గజేంద్ర మోక్షకథ తెలుసుకదా. అన్ని జంతువులలో పెద్ద శరీరం కలది, దొడ్డ గుణాలున్నది ఏనుగు ఒక్కటే. పరమాత్మ అందరి శరీరాలలోనూ ఉన్నా అతని విభూతి ఇందు వ్యక్తీకరింపబడుతుంది.


అన్ని ప్రాణులూ వినాయకునిలో ఉన్నాయి. అతణ్ణి ముందుగా అర్చిస్తారు కనుక దేవగణాలకు చెందినవాడు. దేవుడని చెప్పడానికి గుర్తేమిటంటే సేవించిన వారికి ఆశీస్సులనందించే శక్తి కలిగి యుండడడమే. గణపతికి ఆ శక్తి యుంది.


అతడు భూతగణాలకు చెందినవాడు. ఆ పెద్ద బొజ్జ, పొట్టికాళ్ళు మొదలైన లక్షణాలు సూచిస్తున్నాయి కదా.

Wednesday, 3 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (162)



దాని ముఖమే విలువైనదని, మిగతా దానికి విలువ లేదని భావించకండి. దాని తోకకూ విలువుంది. అందలి వెంట్రుకలు, దుష్ట శక్తులను తరుముతాయి. ఐశ్వర్య ప్రదం అని ఉంగరంలో బంధిస్తారు. ఇది ఆభరణము, రక్షించే శక్తి కలదు కూడా. సాధారణంగా వెంట్రుకలను, గోళ్ళను దోషంతో కూడియుంటాయని దూరంగా పారవేస్తారు. తాంత్రిక శక్తులను కలిగినవారే వీటిని వాడతారు. వెంట్రుకలు, గోళ్ళు శరీరం మీద ఉన్నంతవరకూ వాటికి దోషం లేదు. కత్తిరిస్తే మాత్రం దూరంగా పారవేస్తాం. కాని ఏనుగు వెంట్రుకలకు, దుష్టశక్తులను తరిమే లక్షణముంది. పెద్దపులి గోరునకూ ఇది ఉంది. కృష్ణుని బొమ్మలో పులిగోరు పతకంతో ఉన్నట్లుంటాడు కదా!


జంతువులు - దేవతా సంబంధం


మన మఠంలో రోజూ జంతువులకు పూజ యుంటుంది. ఒకటి గోపూజ, రెండవది గజపూజ. ఆవును జంతువుగా చూడం. తల్లిలా చూస్తాం. గజ పూజ చేస్తాం. మిగిలిన జంతువులకు పూజ యుండదు. ప్రాతః కాలంలో గోపూజ, సాయం సమయంలో గజ పూజ యుంటుంది, గజపూజలో పండ్లను పెడతాం. గౌరవంతో శంకరుల పాద పద్మాలకు చామరం దానిచే వీచునట్లు చేస్తాం. రోజువారీ ఖర్చును పాదపద్మాలకు నివేదిస్తాం. మేము నమస్కరించిన తరువాత ఏనుగు తుండం ఎత్తి అదీ జయఘోష చేస్తుంది.

Tuesday, 2 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (161)



అంతకంటే ఈ ఏనుగు నడుస్తూ ఉంటే అందమూ ఉంది, ఆజ్ఞాపించే లక్షణమూ ఉంది. దాని నడకను గజగతి యంటారు. ఇది స్త్రీ పురుషుల  ఇద్దరి నడకనూ సూచిస్తుంది. ఆజ్ఞాపూర్వకమైన చూపు, నడక ఉంటే పురుషుణ్ణి గజగమనంతో పోలుస్తారు. ఉత్తమ జాతి స్త్రీలను గజగామినులని అంటారు.


అంతేకాదు, దీనిపై కూర్చున్నవానికే ఈ లక్షణాలు సంక్రమిస్తాయి. అట్లా రాముణ్ణి ఊరేగింపులో ఏనుగుపై నెక్కినవానిగా చూడాలని ప్రజలు దశరథునితో అన్నారు. గజేన మహతాయాంతం - (అయోధ్య కాండ సర్గ 2 శ్లో 22) రాముని నెత్తిపై రాజచ్ఛత్రం ఉండాలన్నారు. ఛత్రవృతాననం. వినాయకుని ప్రతిమపై గొడుగు పెడతాం.


విభూతిగాని, వైష్ణవ నామాలు గాని ఏనుగు యొక్క నల్లని ముఖంపై పెట్టినపుడు, ఎంత అదంగా ఉంటుందో వేరే చెప్పాలా? ఏ జంతువుకైనా నగలు పెట్టవచ్చు. కాని ఈ నామాలుంటాయా?


ముత్యపు చిప్పనుంచి ముత్యాలు వస్తాయని అందరికీ తెలుసు. కాని అవి మిగతా చోట్ల నుండి కూడా లభిస్తాయి. అరుదుగా వెదురునుండి, ఏనుగు ఫాలభాగం నుండి వస్తాయట. ఏనుగు నుండి వచ్చినవి చాలా విలువైనవట.


మరొక గొప్పదనం, దివ్యత్వం. దీని ముఖమే లక్ష్మీనిలయంగా ఉంటుంది. పద్మంలో, పాలకాంతిలో, మారేడు వెనుక తట్టున, స్త్రీల సీమంతంలో ఆవు వెనుక తట్టున ఏనుగు కుంభస్థలంలో - ఇట్లా ఐదు స్థలాలు లక్ష్మీనిలయాలని ప్రమాణముంది.


Monday, 1 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (160)



దీనికి ద్విపం అని పేరు. అనగా రెండు సార్లు త్రాగుట, రెండుసార్లు తినుట అని మామూలుగా అర్థం. ద్విపం ఎట్లా అయింది? ముందుగా తుండంతో నీటిని గాని ఆహారాన్ని గాని తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. మిగతా జంతువులు నోటితోనే ఆహారాన్ని స్వీకరిస్తాయి. మనిషి మాదిరిగా ఏనుగు ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఘనమైన దానిని విడువాలంటే నోటి ద్వారానే విడుస్తుంది. అందువల్ల ఇది ద్విపం. నీరైతే తుండం ద్వారా విడిచిపెడుతుంది. జలయంత్రం నుండి నీరు చిమ్మినట్లుగా ఉంటుంది. ఇందులో ఒక తాత్త్వికత దాగియుంది. మనమేదైనా తినాలని అనినపుడు రెండు మూడుసార్లు ఆలోచించి తరువాత స్వీకరిస్తాం. తిరస్కరించవలసి వస్తే ఒక్క మారే గెంటి వేస్తాం. ఇట్టి లక్షణాన్ని ద్విపం సూచిస్తుంది.


ఎవరో ఒకాయన ఒక చిత్రమైన విషయాన్ని వ్రాసాడు. తుండంలాంటి సాధనం ఎక్కడా లేదన్నాడు. చిన్న గుండుసూదిని తీయడం, దాని తోనే పెద్ద దుంగల్ని గ్రహించే సాధనం లేదన్నాడు. భగవత్ సృష్టిలో ఏనుగు తుండానికే అట్టి శక్తి ఉంది. అట్టివాడు గజముఖుడైన గణపతియని అతడు చిన్నవాటినీ, పెద్దవాటినీ నిర్వహించగలడని వ్రాసేడు.


ఈ భువనం అంతా ఎనిమిది గజాలచే మోయబడుతుందని, ఎనిమిది దిక్కులలో అవి యున్నాయని వాటిని అష్టదిగ్గజములని అంటారు. (విద్యుత్ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తి మొదలైనవాటిని దిగ్గజములుగా భావించండి) శారీరక బలంతోబాటు, బుద్ధి శక్తి కూడా కావాలి. పరిపాలనలో ఎనమండుగురు ముఖ్యులు. ఇక కొందరు రాజులు, అష్ట దిగ్గజములనే కవులను పోషించారు. కృష్ణ దేవరాయల కాలంలో అట్లా కవులు పిలువబడేవారు.