Saturday 6 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (165)



ముఖం - నోరు


గజాననంలో ఆననం ఉంది. అనగా ముఖం. ముఖానికి అమర కోశంలో చాలా పర్యాయ పదాలున్నాయి. వక్త్రాస్యం, వదనం, తుండం, ఆననం లపనం, ముఖం ఇవన్నీ ముఖాన్నే సూచిస్తాయి. 


ఇక సంస్కృతంలో నోటికి ప్రత్యేక పదం లేదని, ముఖానికి ఉన్న పదమే నోటికీ ఉందని లోగడ చెప్పాను. వాక్, వచనం మొదలైనవి మాటకు సంబంధించినవి. మాట్లాడతాడు కనుక, వక్త. మాట్లాడదగినది వక్తవ్యం. కనుక వక్త్రం అనే మాట నోటికే చెందుతుంది. వదనం అనేమాట కూడా మాటకాధారమైన అంగం, ముఖ్యంగా నోటినే చెబుతుంది. వద అనగా మాట్లాడు. ధాతువును చూస్తే లపనం కూడా మాటకే చెందింది. లప్ అనగా మాట్లాడుట. దాని నుండే ఆలాపం, సల్లాపం, ఆలాపన అనే మాటలు వచ్చాయి. కనుక ముఖాన్ని సూచించే పదాలు నోటినీ సూచిస్తాయనడం సబబు కాదు. ఆపైన వక్ర్తం, వదనం అని నోటిని సూచించే పదాలు ముఖాన్ని సూచిస్తాయి. మాట్లాడేశక్తి మానవునకే ఉంది కనుక నోటికి ప్రాధాన్యం ఉంది. నోరు, అన్ని అవయవాలలో ముఖ్యమైన ముఖంలో ఉంది. చూసే కళ్ళు గాని, వినే చెవులు గాని, వాసన చూసే ముక్కు గాని, స్పృశించడానికి అందంగా ఉండే చెక్కిళ్ళు గాని అన్నీ ముఖంలోనే ఉన్నాయి. మానవులలో ప్రత్యేకత, మాట్లాడే లక్షణం కనుక, నోరే మాట్లాడుతుంది. కనుక నోటిని, ముఖాన్ని సూచించే పదం ఉంచారు. నోటికే రెండు లక్షణాలున్నాయి. కన్ను చెవులనే జ్ఞానేంద్రియలతో బాటు ఇదీ జ్ఞానేంద్రియమే. మాట్లాడగలదు, రుచి కూడా చూడగలదు. ఇట్లా రెంటి పనులూ చేసి ప్రముఖ స్థానాన్ని పొందింది.  


అందువల్ల ముఖాన్ని, నోటిని సూచించు పై పదాలున్నాయి. గజానుడన్నా, విఘ్నేశ్వరుడన్నా ఏనుగు ముఖమే గుర్తుకు వస్తుంది.


శరీరంలో తలకు ప్రాధాన్యం. ఒకడు అందంగా ఉన్నాడా లేదా అని చెప్పేది ముఖాన్ని బట్టే కదా! అట్టి ముఖం ఉన్నవాడు గణపతి. ఇందన్ని అవయవాలూ చూడముచ్చటగా ఉంటాయి.


(ఇక అమరకోశంలో - వఅక్త్రం దీనిచే పలుకబడును; ఆస్యం = దీని యందు భక్ష్య వస్తువులు వేయబడును; వదనం=దీనిచే పలుకుదురు; తుండం=భక్ష్య వస్తువు దీనిచే పీడింపబడును, ఆననం=దీనిచేత బ్రతుకుదురు; లపనం దీనిచే పలుకుదురు; ముఖం=దీనిచే భక్ష్యము పీడింపబడును. ఇందు చాలా పదాలు నోటికే ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయని సారాంశం -అనువక్త)


No comments:

Post a Comment