Sunday, 14 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (173)



కుమారస్వామి జననం - అన్నగారి పాత్ర


విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు కుమార స్వామి కథను చెప్పాడు. వాల్మీకి రామాయణంలో ఈ కథను చెప్పేటప్పుడు కుమార సంభవమని అన్నాడు. కాళిదాసు ఈ మాటలను గ్రహించి ఆ పేరుతో కావ్యమే వ్రాసేడు.


పుట్టుకలో ప్రత్యేకత ఏమిటి? ఎవరైనా పుట్టిన తరువాత, పెరిగినప్పుడు, విద్యాభ్యాసం తరువాత కీర్తిని గడిస్తారు. ఇక కుమార సంభవానికి ముందే దేవసేనాధిపత్యం అనే బాధ్యత తారసపడింది. దానిని నిర్వహించడానికి కుమారస్వామి పుట్టి తీరాలి. పుట్టుకతోనే దేవగణాలకు సైన్యాధిపతి కావలసి వచ్చింది. అసురుల చేతిలో దేవతలు నానా ఇబ్బందులూ పడుతూ ఉండగా పోగొట్టేవాడెపుడు అవతరిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు.


శూరపద్ముడు, తారకా సురుడు మొదలైనవారు శివునినుండి, తమను సంహరించడానికి శివునితో సమానుడైన వాడే అర్హుడని నియమం పెట్టారు. ఇక శివునకు సాటి ఎవరు? శివునకు సాటి శివుడే కదా! అయితే వరాన్ని ఇచ్చినవాడే చంపుతాడా? అందువల్ల తెలివిగా శివుడెట్లాగూ చంపలేడని, ఇక శత్రుబాధ ఉండదని దేవతలను హింసించడం మొదలు పెట్టారు.


దేవతలొక మార్గాన్ని అన్వేషించారు. వేదం, ఆత్మావైపుత్ర నామాసి అని చెప్పింది. తండ్రియే పుత్రునిగా పుడుతున్నాడని అర్థం. అందువల్ల పరమేశ్వరుణ్ణి సంతానం కనవలసిందని, అతడు మా నాయకుడవుతాడని తపస్సు చేసారు. అదే సమయంలో శివుడు, దక్షిణామూర్తి రూపంలో ఉండి తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు, స్వామికి పరిచర్య రూపంలో తపస్సు చేస్తూ ఉంది. ఇట్టి పవిత్ర వాతావరణంలో కుమారుడు పుట్టాడు.


పిల్లవానిగా ఉన్నపుడు ఆరు రోజులు కొన్ని లీలలను ప్రదర్శించాడు. ఇతనికి, ఆరు సంఖ్యకూ దగ్గర సంబంధం ఉంది. ఇతనికి ఆరు ముఖాలు. ఇతని మంత్రంలోనూ ఆరు అక్షరాలే. పుట్టిన రోజు కూడా షష్టియే. ఇతనికి పాలనిచ్చినవారు ఆర్గురే. వారే కృత్తికలు. అతని పేరు కుమారుడవడం వల్ల ఆరు రోజులతని లీలలు. తరువాత సైన్యాధిపత్యం వహించాడు. అసురులను చంపాడు. దేవతలను రక్షించాడు.



Saturday, 13 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (172)



స్కంద పూర్వజుడు


చివరి నామం దగ్గరకు వచ్చాం. స్కందునకు అన్న గారని అర్థం. ఇతణ్ణి అగ్రజుడని పేర్కొన్నాం.


సహోదర పదం వాడబడినప్పుడు అన్నగారూ కావచ్చు, తమ్మడూ రావచ్చు. పూర్వజుడని చెప్పడం వల్ల ముందు పుట్టినవాడని స్పష్టంగా తెలుస్తోంది. తమ్ముణ్ణి అనుజుడని అంటాం. రామానుజుడు అనగా రాముని తరువాత పుట్టినవాడు. అమర కోశంలో సుబ్రహ్మణ్యస్వామికి గజముఖానుజుడని నామం.


కుమారస్వామికి అన్న గారవడం వల్ల గొప్పదనాన్ని సూచిస్తుంది


షోడశనామాల నుచ్చరిస్తూ ఉన్నపుడు శివుని కొడుకని గాని అమ్మవారి కొడుకని గాని లేదు. ఎవరి పతి యని కూడా లేదు. బ్రహ్మచారిగా అనేక రూపాలలో ఉన్నవానికి భార్యతో కలిసి యుండగా అనేక నామాలతో కీర్తింపబడ్డాడు. వల్లభితో ఉన్నపుడు వల్లభ గణపతి. సిద్ధి, బుద్ధి కూడా ఇతని భార్యలు. ఫలానా వారికి ఇతడు తండ్రియని సూచించే పదాలు లేవు. షోడశనామాలలో మాత్రం చివరి నామం, స్కందునికి అన్నగారనే ఉంది. ఎందుకిట్లా?


ఇక్కడ చిన్నవాని పేరు చెప్పి అతని అన్నగారైన వినాయకుడని చెప్పడం జరిగింది. ఎందుకిట్లా చెప్పారు?


వినాయకుడు, కుమారస్వామితో సంబంధం పెట్టుకొని యున్నాడు కనుక. సోదరుని జీవితంలో మూడు దశలలో అనగా పుట్టుక, వివాహం, సన్న్యాసంలో అన్నగారి పాత్ర ఉంది.


Friday, 12 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (171)



ఎక్కడా జరగనివి, గణపతి విషయంలోనే జరిగే సంఘటనలను, శంకరులు తమ ప్రతిభతో పేర్కొన్నారు. మొదటగా కొండంత విఘ్నాలను గణపతి పిండి చేస్తాడని అంటూ అతడేనుగు ముఖం కలవాడైనా సింహం చేత పూజలందుకొంటున్నాడని వ్రాసేరు. మొట్టమొదటిగా పంచాస్య మంటే సింహమని భావిస్తాం. కానీ ఇక్కడ సింహం కాదు. పరమశివుడే. త్రిపురా సుర సంహార విషయంలో విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజించలేదా! అతని రథపుటిరుసు విరిగినపుడు పూజించాడని విన్నాం కదా. 


ఐదు ముఖాలున్నవానికి సింహం వాహనంగా


అతడు పంచాస్య మాన్యుడే కాదు అతడే ఐదు ముఖాలున్న హేరంబ రూపంలో ఉంటాడు. అప్పుడు అతనికి ఐదు ఏనుగు ముఖాలు, పదిచేతులు, సింహం వాహనంగా ఉంటుంది. ఇక్కడ ఏనుగు సింహాన్ని చూసి భయపడడం లేదు. సింహం పైనే ఎక్కి స్వారీ చేస్తుంది. ఐదు ముఖాలు కలిగి తండ్రిని తలపింప చేస్తున్నాడు, సింహం వాహనంగా కలిగి తల్లిని గుర్తు చేస్తున్నాడు. అమ్మవారికి, సింహ వాహిని అని పేరుంది కదా. ఇక మహాగణపతి మూర్తికి పది చేతులున్నా ఐదు ముఖాలూ ఉండవు. సింహం, వాహనం గానూ ఉండదు. ఒక్క హేరంబ రూపంలోనే అట్టి రూపాన్ని చూడగలం. నాగ పట్టణంలో ఉన్న నీలాయతాక్షి ఆలయంలో ఇతడు రాగిరూప విగ్రహంగా ఉంటాడు. నాల్గు ముఖాలు నాల్గు దిక్కులను చూస్తూ ఉంటాయి. ఐదవ ముఖం కిరీటంగా ఉంటుంది. ఇట్లా ఐదు ఏనుగు ముఖాలతో కనువిందు చేస్తుంది ఆ మూర్తి.


Thursday, 11 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (170)



ఏనుగును పూజించిన సింహం


హేరంబ గణపతి రూపం ప్రత్యేకంగా ఉంటుంది. ఇతనికి ఐదు ముఖాలు అన్నీ గజ ముఖాలే. 'పంచమాతంగ ముఖ' అనే పాట కూడా ఉంది. తిరువారూర్ లో ఇట్టి గణపతిని చూసి ముత్తుస్వామి దీక్షితులు పాడియుంటారు.


పరమశివునకు ఐదు ముఖాలు. శివపంచాక్షరి ధ్యానంలో అలా ఉంటుంది. శంకరులిక్కడే శ్లేషను ప్రయోగించారు.


బదు ముఖాలుంటాయి. కనుక ఈశ్వరునకు పంచాస్యుడని పేరు. సింహానికీ పంచాస్యమని పేరు. ఇక్కడ పంచయనగా విస్తరించినదని (పెద్ద ముఖం కలది) అర్థం. ప్రపంచం అనినపుడు విస్తరించినది యనే అర్థంలో వాడుతున్నారు. ఈ సందర్భంలో పంచ్ అనగా ఐదని, ఐదు భూతాలతో ప్రపంచముంటుందని అర్థం చేసుకోవచ్చు కదా. సింహం అంటే భయపడుతుంది ఏనుగు. సింహాన్ని స్వప్నంలో చూసినా భయపడి చనిపోతుందని అంటారు. సింహ స్వప్నం అనే మాట ఉంది. ఏనుగును చూస్తే ఉన్న బలాన్ని అంతా పుంజుకుని మీద పడడానికి సిద్ధమౌతుంది సింహం. దాని కుంభస్థలం బ్రద్దలు కొడుతుంది. అట్టి సింహం ఏనుగునకు పూజ చేస్తే ఆశ్చర్యం. అందుకే శంకరులు మహాదంతి వక్రాపి పంచాస్యమాన్యా అని తిరుచెందూర్ లోని సుబ్రహ్మణ్యుని భుజంగ స్తోత్రంలో నుతించినపుడు, వినాయక స్తుతిగా ఈ మొదటి శ్లోకాన్ని వ్రాసేరు.


సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రీ


మహాదంతి వక్రాపి పంచాస్య మాన్యా


విఘ్నేశ్వరుడెపుడూ బాలరూపంలో ఉంటాడు. సదా బాలరూపాపి. అపి అంటే అయినా, కొండల వంటి విఘ్నాలను పిండి చేస్తున్నాడు.


దాని తరువాత అతడేనుగైనా సింహం చేత పూజింపబడ్డాడు. 'మహాదంతి వక్రాపి పంచాస్య మాన్యా'.


Wednesday, 10 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (169)



వనవాసానికి ముందు పాండవులు ఇంద్రప్రస్థంలో రాజసూయ యోగం చేయాలనుకున్నారు. ధర్మరాజు, సోదరులను నలువైపులా పంపించాడు. అప్పుడు సహదేవుడు దక్షిణ వైపునకు వచ్చాడు. ఆ ప్రాంతాలను జయించాడు. భారతంలో హేరంబం అనే రాజ్యాన్ని జయించినట్లుంది. ఇదే కాలక్రమంలో మైసూరుగా రూపొందిందేమో! మహిషుని ఊరు, మైసూరు. మహిషం అంటే దున్నపోతే కదా! మహిషానికి, హేరంబ పదానికి దగ్గర సంబంధం ఉంది. సహదేవుని చేతిలో ఓడిపోయినా తాము గొప్ప వారమనే అహంకారంతోనే అక్కడవారు యుండి యుంటారు. ఎవడు తన గొప్పను తాను చెప్పుకుంటూ ఉంటే వాటిని హేరంబుడని పిలిచి యుంటారు. ఇట్టి ప్రాంతంలో వినాయకుడు కొలవ బడడం చేత ఇతడు హేరంబ గణపతి అయ్యాడు.


ఇది ఊహ మాత్రమే. నాకేమని తట్టుతోందంటే అర్థం కోసం ప్రాకులాడకుండయ్యా. హేరంబపదం వీనులవిందుగా లేదా? నామాదిరిగా ఆజ్ఞా సూచకంగా లేదా? నేనీ పేరుతో పిలువబడడం సబబే కదా, నా పేరుతో పిలవండి. నిఘంటువుల నెందుకు చూస్తారు? అని చెబుతున్నాడేమో! 


అతడు హేరంబ రాజ్యానికి చెందినవాడైనా కాకపోయినా పదం ప్రసిద్ధి పొందింది. షోడశనామాలలో ఇదీ ఉంది.


(హేరంబ పదం అమరంలో, హేరుద్ర సమీపే రంబతే తిష్ట తీతి హేరంబ రుద్రుని యొద్దనుండువాడు, ఋగతా హేరతే వర్ధయతి భక్తానితివా భక్తులవృద్ధి బొందించువాడు. హే వృద్ధా - అమరం - గురుబాల ప్రబోధిక-అనువక్త)


Tuesday, 9 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (168)



హేరంబుడు


నాకు తెలిసినంతవరకూ ఎవ్వరూ ఈ ధాతువునకు అర్థం ఈయలేదు లేదా నేను సరిగా అర్థం చేసుకొని యుండకపోవచ్చు, భాస్కర రాయలనే మంత్ర శాస్త్రవేత్త ఉండేవాడు. లలితా సహస్ర నామాలపై వారి వ్యాఖ్య చాలా ప్రసిద్ధిని పొందింది. ఆయన గణేశ సహస్రనామాలపై వ్యాఖ్య వ్రాసేడు. ఈ పదానికి అతడెట్టి వ్యాఖ్యానం చేసాడా అని చదివినాను. వ్యాఖ్యననుసరించి శైవాగమాన్ని స్థాపించినవాడని; బాగా శార్యం కలవాడని వ్రాసేడు. ఆ వ్యాఖ్యాత, గొప్పవాడే, ఆ పదానికి ఆ అర్థం ఎట్లా వస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఇది నా లోపం కావచ్చు. తమిళ పదమైన ఎరుమై (Erumai) అనగా దున్నపోతు, హేరంబునిగా మారిందని కొంతమంది పరిశోధకులంటున్నారు.


సంస్కృత పదాలకు అర్థం చెప్పేటప్పుడు వాటి ధాతువులను బట్టి నిర్ణయిస్తారు. ఈ నియమానికి కొన్ని మినహాయింపులు లేకపోలేదు. ఆయా ధాతువును బట్టి ఆయా అర్థం వస్తుందని చెప్పడం వల్ల యౌగికార్థం వస్తుంది. యౌగికమనగా వ్యుత్పత్తి కలది. వ్యుత్పత్త్యర్ధము కలది.


(దీనికి విరుద్ధంగా అవయవ శక్తిని ఆపేక్షించకుండా కొత్త అర్థంలో ప్రసిద్ధమైన దానిని రూఢియని అంటారు. ఉదా: లావణ్యం. లవణము యొక్క భావం లావణ్యం. కాని తళతళలాడే వస్తువు, లావణ్యంతో ఉందని అంటాం. ఉదా: లావణ్యవతి. లవణమనగా ఉప్పు. అది తళతళలాడుతుంది. కాని మిగిలిన సందర్భాలలోనే ఈ లావణ్య పదాన్ని వాడతారు. అంటే వాడుకలోనున్న అర్థము. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రకృతి ప్రత్యయముల అపేక్ష లేకుండా బోధపడే అర్ధం, యౌగికము కాని అర్ధం - అనువక్త) ఇట్లా హేరంబపదం రూఢికెక్కింది.


Monday, 8 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (167)



శూర్పకర్ణుడు


అనగా చేటల వంటి చెవులు కలవాడు. ఇంతకుముందే గజకర్ణకుడని చెప్పడం వల్ల అట్టిదే శూర్ప కర్ణుడు చెప్పడంలో ఔచిత్యం ఉందా? ఉంది. 


గజకర్ణకుడని చెప్పినపుడు, పెద్ద చెవులుంటాయని, వాటి ద్వారా మన ప్రార్థనలను వింటాడని తెలుసుకున్నాం. మన ప్రార్థనలొక్కటే వింటాడా? మనం మాట్లాడేవన్నీ, అందునా వ్యర్థ ప్రసంగాలనూ వింటాడు. ఇక మన ప్రార్ధనలు కూడా వెఱ్ఱి మొఱ్ఱిగా ఉంటాయి. వ్యర్థమైన మన మాటలను చెవినొడ్డి ఎట్లా వినగలడు? అందువల్ల అతడన్నిటినీ వింటున్నా దేనిని మనస్సులో ఉంచుకోవాలో దానిని అట్టే పెట్టుకుని మిగిలిన వాటిని గెంటి వేస్తూ ఉంటాడు. అందువల్ల అతడు శూర్పకర్ణుడయ్యాడు, శూర్పమనగా చేట. చేట గింజల నుంచుకొని పొట్టును చెరిగి వేస్తుంది. అంటే చెత్తా చెదారాన్ని గెంటి వేస్తుందన్నమాట. 


ఇట్టి రూపం ఏమని సందేశమిస్తోంది! మిగతా జంతువులకు లేని పెద్ద పెద్ద చెవులు దీనికి ఉన్నాయి కనుక అన్నీ వినే శక్తి కలవాడు. అందువల్ల మనము సరియైన ప్రార్థనలే అతని ముందు చేయాలని హితోపదేశం చేస్తోంది. ఏది సరియైనదో కాదో ఆయన తూకం వేసి చూస్తాడు. సరియైన ప్రార్ధనకే ఐదులిస్తాడని భావించాలి. అందుకే ఈ నామం.