Thursday, 6 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 213 వ భాగం



శంకరులు చూసినది, మనస్సును పోగొట్టుకొన్న రాగద్వేషాలు లేని అసాధారణ పంచముణ్ణి. కాబట్టి అట్టివానిని గురువని కీర్తించారు. జాతి భేదాన్ని వద్దని శంకరులు, ఈ మనీషా పంచకంలో ప్రవచించారని అనడం సాహసం.


విశ్వనాథుని లీల


ఇక పంచముడంతర్ధానమై విశ్వనాథుడు సాక్షాత్కరించాడు. ఆచార్యులను పరీక్షించడం కోసం శంకరుడట్లా వేషం వేసుకొని వచ్చాడు. శంకరులు జ్ఞానియైనా, ఇతరులకు ఆదర్శంగా ఉండడం కోసం కొన్ని ఆచారాలను పాటించాలని, ప్రపంచ వాసనల కతీతంగా ఉన్నవారి పట్ల వినయంతో ఉండాలని, తామాచార్యులమని భావించకూడదని, అటువంటి వారికి శిష్యులుగా భావించాలని తెలివిడి చేయడం కోసం అట్లా వచ్చాడు. ఆచార్యులు శంకరుణ్ణి స్తోత్రాలతో పూజించారు. ఆచార్యులను దీవించి శంకరుడు అదృశ్యుడయ్యాడు.


కుమారిల భట్టు వృత్తాంతము 


దిగ్విజయం చేయవలసినదిగా వ్యాసుడే శంకరులతో అన్నాడు. నివృత్తి మార్గంలో నున్న శంకరులు ప్రవృత్తి మార్గంలో ఉన్న కుమారిలుని ప్రదేశానికి వెళ్ళారు. ఆనందగిరీయంలో కుమారిలుడు అపుడు ప్రయాగలో ఉన్నాడు. అది రుద్రపురం అని యుంది.


కుమారిలుడు, అద్వైత వేదాంతాన్ని అంగీకరిస్తే తన అవతార ప్రయోజనం సిద్ధించినట్లే. కానీ అతడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడని విని వెళ్ళారు.


కుమారిలుడు బౌద్ధాన్ని ఖండించడం కోసం, వైదికునిగా వెడితే వారంగీకరించరని తాను బౌద్ధుడనని, తత్త్వం తెలిసికోవాలని బౌద్ధ విహార కేంద్రంలో ప్రవేశించాడు. అయితే అతడు వైదిక కర్మానుష్టానాలను రహస్యంగా చేస్తూ ఉండేవాడు. దీనిని బౌద్దులు పసిగట్టారు. ఇతణ్ణి భవనంలోని ఏడవ అంతస్తు నుండి త్రోసివేసారు. వేదాలే ప్రమాణమైతే తాను సురక్షితంగా బయట పదాలని అన్నారు.


Wednesday, 5 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 212 వ భాగం



ఇతర దేశాలలో మన వంటి వర్ణ విభజన లేకపోవచ్చు. అయితే వారిలో ఐకమత్యం ఉందని చెప్పగలరా? సమానత్వం పేరు పెట్టినదగ్గరనుండి పరస్పర కలహాలు వస్తున్నాయి. సమానత్వం పేరుతో ఉద్యమాలున్నా పోటీ మనస్తత్వం ప్రబలిపోయి సంఘర్షణలకు దారితీస్తోంది.


వర్ణ విభజన యొక్క మౌలిక తత్త్వం పోయి గందరగోళ పరిస్థితులేర్పడినపుడు మరల దానిని శంకరులు పునరుద్ధరించారు. వాటి గోడలను బ్రద్దలు కొట్టాలని అనలేదు. ఈ మాటలు చెబితే ఇవి మీకు రుచింపకపోవచ్చు. బుద్ధుడు, గాంధీ మాదిరిగా చెబితే వారికీ బహుళ ప్రచారం లభించి యుండేది. అబ్బి పొగడ్తలను, ప్రచారాన్ని వారాశించలేదు.


శంకరులు చెప్పినదేమిటి? జ్ఞానావస్థలో ఉన్నవారికి అంతా సమానంగా కన్పిస్తుందని అన్నారు. జ్ఞానికి జాతి లేదు, ఎక్కువ తక్కువలు లేవు. తల్లి, తల్లి కాదు, తండ్రి తండ్రి కాదని చివరి దశలో నున్నవానికి వేదం చెప్పింది. ఫలానా కోరిక లేనివానికి దేనిని పడితే దానిని తినవచ్చని చెప్పింది. ఆ జ్ఞాని స్థితి ఎక్కడ? మనమెక్కడ? నూటికి 99 పాళ్ళు, అందరూ రాగద్వేషాలతో కూడి యున్నవారే. 


అందరి కార్యక్రమాలూ ఒకటని గీత చెప్పలేదు. నీవు క్షత్రియుడివి, నీ ధర్మం నీవు నిర్వర్తించమని ఎందుకన్నాడు? జాతి భేదం లేకపోతే ఇట్లా అంటాడా? మనం, ద్వంద్వ ప్రపంచంలో ఉన్నాం. ఇది నడవాలంటే ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించవలసిందే. అద్వైతానుభవాన్ని నిత్య వ్యవహారంలో చూపిస్తే ఎలా?


తామనుకొన్నవి శాస్త్రాలలో ఉన్నాయని, ఆధునికులు నిర్ణయానికి వస్తారు. ఏ సందర్భంలో అవి చెప్పబడ్డాయో అని విచారణ చేయరు.


ఆ పంచముడు, మామూలు వాడైతే శంకరులు ఇట్లా సమాధానం చెప్పి యుండేవారు. "నీవన్నట్లు రెండు శరీరాలు రక్త మాంసమయములే. లోనున్న చైతన్యమూ ఒక్కటే. అయితే లోనున్న దానిని చూడగలుగుతున్నావా? చూడలేవు. ఎందుకు చూడలేవు? గత జన్మ సంస్కారాలు చూడలేకుండా చేస్తున్నాయి. సంస్కారాలకనుగుణంగా జన్మనెత్తుతున్నావు. వచ్చిన జన్మకు అనుగుణంగా ప్రవర్తించి పాపాలను పోగొట్టుకో. నీవు చూడలేనట్లే అందరూ చూడలేకపోతున్నారు. వారి వారి కర్మలను చేస్తూ చిత్త శుద్ధిని పొందగలిగితే చూస్తారు. మానసికంగా అందరూ ఒక్కటే అని భావించాలి గాని, భౌతిక వ్యవహారాలలో భేదాలు తప్పవు. సంఘం సరిగా సాగాలంటే భిన్న భిన్న కార్యకలాపాలలో ఎవరి పాత్రను వారు నిర్వహించవలసిందే. అందరి శరీరాలలోనూ చైతన్యం ఒకటైనా సంఘం యొక్క మంచి కోసం మంత్రానుష్టానం చేయాలంటే మిగిలిన వారికంటే బ్రాహ్మణులు తప్పక ఆచారాలు పాటించ వలసినదే. అట్టివారు దూరంగా ఉన్నా తప్పు లేదు, మనస్సు నణిగినవాని దృష్టిలో మాత్రం అంతా ఒకటంటే చెల్లుతుంది.


Tuesday, 4 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 211 వ భాగం



ఇంద్రునికు అట్టి అనుభూతి లేదు. రెండవ వాక్యంలో జ్ఞానిని మునిగా పేర్కొన్నారు. ఇంద్రుని ఆనందాన్ని ముందుగా, జ్ఞాని ఆనందాన్ని తరువాత పేర్కొన్నారు. ఇంద్రాది దేవతలు బుద్ధితో ఆనందాన్ని అనుభవిస్తే జ్ఞాని యొక్క బుద్ధి, శాశ్వతానందంలో మునిగిపోయి ఉంటుంది. బుద్ధి లీనమై పోతుంది.


ఎంతవరకూ, ఇంకొకదానిని తెలిసికొంటుందో, తెలిసికొనేది వేరు, తెలియబడేది వేరనే విభజన ఉందనే యుంటుంది. ఇది ద్వైతం. బుద్ధి లేకపోతే దేనితో తెలిసికోవడం? బుద్ధి కనుమరుగైతే ఉండేది ఆత్మయే కదా! దానికి రెండంటూ లేదు. కనుక బ్రహ్మవిత్ అవుతాడు. బ్రహ్మవిత్ కూడా కాదు బ్రహ్మమే అవుతాడు.


"బ్రహ్మైవ న బ్రహ్మవిత్"


అట్టి బ్రహ్మ స్వరూపమే నా గురువని శంకరులన్నారు. అట్టివానికి బ్రహ్మ కూడా శిష్యుడై యుంటాడని అన్నారు. అట్టివారిని జాతి, వర్గ, స్థాయి, వయస్సులనే కొలబద్దలతో లెక్కపెట్టరాదని సిద్ధాంతం.


సమదృష్టి వేరు, సాంఘిక సమానత్వం వేరు


ఈ సంఘటనకు ఆధునిక సంస్కర్తలు మరొక విధంగా అర్ధం చెబుతారు. శంకరులు వర్ణాశ్రమ విభజన వద్దు అన్నారని అర్ధం తీస్తారు. వారి రచనలను చదవితే వీరు చెప్పినది తప్పనిపిస్తుంది. ఈ సంస్కర్తలకు వర్ణాశ్రమ విభజన తప్పనిపిస్తే వారు చెప్పవచ్చు గాని ఈ కథతో ముడిపెట్టడం అన్యాయం. పూర్వులు దేనిని సమత్వమన్నారు? అందరిపట్ల ఎక్కువ తక్కువలు చూడకుండా ప్రేమను పంచి పెట్టాలన్నారు. వర్ణాశ్రమాలు వద్దని, వివిధ ప్రజలు వివిధ వృత్తులను చేసుకోనవసరం లేదని చెప్పలేదు. మామూలు నడవడికలోనే భేదాలను పాటిస్తాం. వండే పదార్థాన్ని కార్య క్రమానికి అనుగుణంగా తీర్చి దిద్దుతారు. జ్వరంతో బాధపడే వానికి వేడినీళ్ళు ఇయ్యాలి. అన్నాశయ సంబంధమైన రోగంతో బాధపడేవానికి చన్నీళ్ళు ఇయ్యాలి. పూజకు విడిగా నీరు, అసలు పప్పు ఉడకడానికే ప్రత్యేకమైన నీటిని వాడతారు. స్నానానికి, బట్టలుతకడానికి నీరు వేరుగా ఉంటుంది. ఇట్లా ప్రతి వ్యవహారంలోనూ విభజనను పాటిస్తాం.

Monday, 3 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 210 వ భాగం

 


వాది ప్రతివాదులు కలహించుకుంటూ ఉంటారు. కాని సాక్షి మాత్రం చూస్తూ ఉంటాడు. అట్లా ఇంద్రియాలు, మనసు సంఘర్షణ పడుతున్నా నేను మాత్రం సాక్షిని, చైతన్యాన్ని, ఆత్మయే నేను. మిగతాదంతా బాహ్యమైనది. ఇంద్రియాలు, అంతఃకరణలు చూడబడేవి. చూచేది ఆత్మయే. ఆ ఆత్మయే నేను. ఇది మొదటి శ్లోకం. ఇక చివరి దానిని చెబుతాను.


యత్ సౌఖ్యాంబుధి లేక లేక ఇమేశ క్రాదయోనిర్వృతా

యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్హృతః

యస్మిన్నిత్య సుధాంబుధౌ గలితధీః బ్రహ్మైవన బ్రహ్మవిత్

యః కశ్చిత్ స సురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ


ఏ సుఖ సముద్ర కణలేశాన్ని పొంది ఇంద్రాది దేవతలు, ఆనందంలో మునిగిపోయారో, ప్రశాంతచిత్తుడైన ముని, తన చిత్తంలో దేనిని పొంది ఆనందిస్తున్నాదో, ఆ నిత్య అమృత సముద్రంలో ఎవని చిత్తం కరిగి పోయిందో అతడు బ్రహ్మవేత్తే కాదు, బ్రహ్మమే. అట్టి మహాత్ముని పాదాలకు ఇంద్రుడు కూడా నమస్కరిస్తున్నాడని నా నిశ్చితాభిప్రాయం.


పంచముడు ఆనందాంబుధి యన్నాడు. శంకరులు సుధాంబుధియన్నారు. గురువు చెప్పినది శిష్యుడనాలి కదా! అతని మాటలనే ఉట్టంకించారు. ఇంద్ర భోగాలు కూడా ఆనంద సముద్రంలో ఒక కణం వంటివి. లేశమనే మాటలతో దానిని సూచించారు.


లలిత సహస్ర నామాలలో అమ్మవారు "స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః" అనగా బ్రహ్మాదిల దేవత ఆనందం, ఆమె ఆత్మానందంలో ఒక చుక్క వంటిదే.

Sunday, 2 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 209 వ భాగం



ఆ చండాలుడు, రెండు రకాల వాదాలను పేర్కొన్నాడు. 'కింగంగాంబుని' అనినపుడు, ప్రతిబింబవాదాన్ని పేర్కొన్నాడు. గంగ నీటిలో, చండాలవాటిక నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు కదా! రెండు ప్రతిబింబాలలోనూ తేడా ఉందా? తరువాత అవచ్ఛిన్న వాదాన్ని పేర్కొన్నాడు. రాజుగారి బంగారు కలశంలోనూ ఆకాశముంది. మా మట్టికుండలోనూ ఆకాశముంది. ఈ రెంటి ఆకాశాలకు తేడా ఉందా? బ్రాహ్మణ శరీరమైనా, చందాల శరీరమైనా కుండవంటిదే. లోనున్న ఆత్మకాశానికి తేడా ఉందా? రెండు శరీరాలు నీటి చుక్కలు వంటివే. రెంటిలోనూ ఆత్మ సూర్యుడొకడే.


లోనున్నది జ్ఞాన సముద్రమే సహజానంద అవబోధఅంబుధి. అది తరంగాలు లేని సముద్రం. సంసార సముద్రం తరంగాలతో ఉంటుంది. జ్ఞాన సముద్రానికి అవి ఉండవు. ఇది అంతటా వ్యాపించింది. దీనిపై మామూలు గాలి, తన ప్రభావాన్ని చూపదు. మామూలు సముద్రం, నీళ్ళతో, ఉప్పుతో ఉంటుంది. ఆత్మ సముద్రంలో జ్ఞానానందాలే ఉంటాయి. జ్ఞానమే ఆనందం ఆనందమే జ్ఞానమని అర్థం చేసుకోవాలి. ఇది వ్యాపించని చోటుండదు. కాని మామూలు సముద్రం అట్లా కాదు. ఇది అందరిలోనూ ఉంది. బాహ్య భేదాన్ని చూడమని నీ వేదాంతం చెప్పిందా? అని అడిగాడు. ఓహో! నీవు బ్రహ్మవేత్తవు. ఇట్టివారు ఎవరైనా మా గురువులే, నీ జ్ఞాన స్థాయిని తెలిసికోలేక ఆచారం ప్రకారం తొలగుమని అన్నా. నేను నీకు నమస్కరిస్తున్నా అని ఐదు శ్లోకాలు చెప్పారు. శంకరులు. దీనినే మనీషా పంచకమంటారు.


"జాగ్రత్ స్వప్న సుమస్తిమ స్ఫుటతరా సంవిత్ ఉజ్జృంభతే

యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ

సైవాహం నచ దృశ్య వస్త్వితి దృఢప్రజ్ఞాఽపి యస్యాస్తిచేత్

చండాలోఽస్తు సతుద్విజోజస్తు గురురిత్యేషా మనీషామమ" 


జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం అత్యంత స్పుటంగా ప్రకాశిస్తూ ఉందో, పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ ఏది ఓతప్రోతంగా (పడుగు పేకలుగా) అన్ని శరీరాలలోనూ వ్యాపించి సాక్షిగా ఉందో, నేనా చైతన్య స్వరూపాన్ని, నేను జడదృశ్యాన్ని కాను అని ఎవనికి గట్టి జ్ఞానం కలుగుతుందో, అతడు చండాలుడే అవుగాక, ద్విజుడే అగుగాక, అతడు నాకు గురువు. ఇది నిశ్చయం.


Saturday, 1 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 208 వ భాగం



పద్మపాదులు, శంకరుల సూత్రభాష్యంలో ఐదు అధికరణాలకు భాష్యం వ్రాసేదని, అది పంచపాదిక యని చదువుకున్నాం. ప్రకాశాత్ముడు, పంచపాదికపై వివరణ వ్రాసేడు. దీనిని వివరణ ప్రస్థానమంటారు. వాచస్పతి మిత్రులు, సూత్ర భాష్యంపై భామతి యనే పేరుతో భాష్యం వ్రాసేరు. ఇందు చెప్పబడిన వాటిని భామతి ప్రస్థానమంటారు.


వివరణ పద్ధతిని ప్రతిబింబవాదమని; భామతి సిద్ధాంతాన్ని అవచ్చేద వాదమని అంటారు. ఈ రెండూ పరమాత్మకు, మనకు భేదం లేదని చెప్పేవే.  

నేలపై కొన్ని నీళ్ళను చల్లామనుకోండి. అనేక జలకణాలు నేలపై ఉంటాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. అన్నిటిలోనూ ఆకాశంలోని ఒక్క సూర్యుడూ వీటిల్లో చిన్నవాడుగా, పెద్దవాడుగా ప్రతిబింబిస్తూ ఉంటాడు. నీటికణాలు నేలలో ఇంకిపోతే ప్రతిబింబాలుండవు. అవిద్య నీటి వంటిది. అట్లా పరమాత్మ జీవుల అంతఃకరణాలలో లేదా మనస్సులలో ప్రతిబింబిస్తాడు, జీవాన్నిస్తాడు. ఇక అంతఃకరణం పోతే ప్రతిబింబం ఉండదు. బింబం ఒక్కటే ఉంటుంది. బింబమైన పరమాత్మ, రెండు లేనిదై ప్రకాశిస్తుంది. దీనిని బింబ ప్రతిబింబ వాదనుంటారు.


ఇక అవచ్చిన్నవాదం. ఆకాశం అంతటా ఉంది. దీనిని మహాకాశం అంటారు. కుండలోని ఆకాశాన్ని ఘటాకాశమంటారు. కుండ ఉన్నంత వరకూ ఘటాకాశముంటుంది. అది పగిలిపోతే మహాకాశమే ఉంటుంది. ఘటం పగిలినపుడు ఘటాకాశం మహాకాశం ఒక్కటైనట్లుగా మనస్సు నశిస్తే ఒక్క పరమాత్మయే యుంటాడు. కుండలో ఉన్నది చిన్న ఆకాశంగా, బయట ఉన్నది పెద్దదిగా కన్పిస్తుంది. కుండలు, మహాకాశాన్ని పంచుకున్నట్లుగా ఉంటాయి. ఇది అవచ్ఛిన్న వాదం.


మరొక ఉదాహరణ చూపిస్తారు. ఒక కుండను నీటిలో ముంచాం. అది నీటితో నిండింది. అందులోనున్నది, నూతిలో నున్నది నీరే. కాని కుండ ఒక హద్దును సృష్టిస్తూ, కుండలో నున్న నీటిని నూతిలో నున్న నీటిని వేరు వేరుగా చూపిస్తోంది. పెద్ద కుండలో ఎక్కువ నీరు, చిన్న కుండలో తక్కువ నీరు ఉన్నట్లు కన్పింప చేసినట్లు ఒకే పరమాత్మ, జీవుల యొక్క అంతః కరణాలను బట్టి భిన్న భిన్నంగా కన్పిస్తాడు.  


వీరి వాదాలతో మనకు పనిలేదు. నీళ్ళ చుక్కలను తొలగిస్తే ఉన్నది ఒక్క సూర్యుడే. మాయవల్ల ఏర్పడిన జీవాత్మ భావాన్ని తొలగిస్తే మనమూ, పరమాత్మ ఒకటౌతాము. ఇది ప్రతిబింబవాదం వారనేది. ఇక కుండ పగిలితే మహాకాశమైనట్లని అవచ్ఛిన్నవాదం వారంటారు.


శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 207 వ భాగం



"విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః


పండితుడు, అందరి పట్లా సమభావంతో ఉంటాడు. అంతా బ్రహ్మమనినప్పుడు, మరొకవిధంగా వర్తించదు. జంతువులును తీసుకుంటే ఆవు, ఏనుగు, ఎక్కువస్థాయిలో ఉన్నాయని కుక్క అధమ జంతువుని భావిస్తాం. మానవులలో బ్రాహ్మణుని ఉత్తమునిగా భావిస్తారు. చండాలుణ్ణి నీచుడని భావిస్తారు.


జంతువులకంటే మానవులుత్తములని భావిస్తారు. కాని జ్ఞానికి, ఇట్టి ఎక్కువ తక్కువలుండవు. జంతువులను, మానవులను విడివిడిగా చూడదు. అన్ని ప్రాణులను ఒకటిగానే భావిస్తాడు.


ఇట్టి సమదృష్టి కలిగియుండాలని బోధించే అద్వైత స్థాపనాచార్యుడు. నన్ను పొమ్మనడం ఏమిటని ప్రశ్న


"ఏదో బాధపడి నన్ను వాదంలోకి దింపుతున్నాడా? అందువల్ల శాస్త్ర నియమాలను చెప్పినా అతడు వినే పరిస్థితిలో లేదు. అతడు తొలగకపోతే మనమే తొలగాలి. అయితే అతడేదో బాధపడి మాట్లాడడం లేదు. వేదాంత సత్యాలను చెబుతున్నాడు. కనుక అతడు చెప్పేది వినాలని" భావించారు శంకరులు.


చండాలుడు ఇంకా ఇలా అన్నాడు:


కింగంగాబుని బింబితోఽంబరమణౌ చండాలవాటీ పయః

పూరే చాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే

ప్రత్యగస్తుని విస్తరంగసహజానం దావబోధాంబుధౌ

విప్రొ@యం శ్వపచో@య మిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః"


తా: గంగాజలంలో, చండాల వాటికలో నున్న జలాశయంలోనూ ప్రతిబింబించిన సూర్యునిలో ఏమైనా భేదం ఉంటుందా? ఎట్టి తరంగాలు లేని సహజానంద బోధ సముద్రమగు ఆత్మలో ఇతడు చండాలుడు, ఇతడు బ్రాహ్మణుదనే భేదం అనే భ్రమ నీకు ఎట్లా కలిగింది?


శంకరులు తరువాత అద్వైతంలో రెండు భేదాలు కన్పిస్తాయి. లక్ష్యంలో తేడా యుండదు. పరమాత్మ జీవాత్మగా ఎట్లా కన్పిస్తున్నాడు? రెండు సిద్ధాంతాలూ అవిద్యయే కారణమంటాయి. అయినా భిన్నంగా చెబుతాయి.