Wednesday, 7 December 2022

భేతాళ కథలు - 9



ఆత్మహత్యకు అసలు కారణం 


భూలోకంలోని నగర రాజ్యాలన్నిటికీ కిరీటంలాటిది విజయనగరమనే పురం. దాని రాజు వంశకేతుడు. అతను నిత్యవ్రత అనే రాకుమారిని వివాహమాడి - ఆమెపై వలపు వీడలేక రాత్రింబవళ్ళు అంతఃపురంలోనే గడుపుతూ రాచకార్యములను పట్టించుకోవడం మానేశాడు.

అతని మంత్రి తీర్థదర్శి. పాలనా వ్యవహారాలు చూసేవాడు. దాంతో "ఈ మంత్రి ఎప్పుడో ఒకనాడు రాజునణచి రాజ్యము నపహరించును" అని పుకార్లు పుట్టసాగాయి. అవి మంత్రికి తెలిసాయి.


“లోకులు కాకులవంటివారు. వారికి నా మనసులోని ఉద్దేశం తెలియదు. నిజం తెలియకే యిలాటి నిందలు వేస్తున్నారు. లోకనింద భరించడం మహాకష్టం. ఇలా అపవాదుపడ్డాక రాజ్యం విడిచిపోవడమే మంచిది.” అనుకున్నాడు - తీర్థదర్శి. ఈ విషయం రాజుకి తెలిపి మరో మంత్రికి రాజ్యాధికారం యిచ్చాడు.


దేశత్యాగం చేసిన తీర్థదర్శి అనేక దేశాలు తిరిగి తిరిగి చివరకి సముద్రతీరంలో ఉన్న ఒక నగరాన్ని చేరుకుని అక్కడి వర్తకులలో ఒకరితో స్నేహం చేసి నిరంతరమూ అతనిని విడవకుండా ఉంటూండేవాడు.. ఒక రోజు - ఆ వర్తకుడు తన స్నేహితునితో - "నేనిప్పుడే బయలుదేరి ఓడపై ద్వీపానికి వెళ్తున్నాను. నేను పని చూసుకుని వచ్చేవరకూ నువ్విక్కడ నా బదులుగా అన్ని పనులూ చూడు" - అన్నాడు.


“నిన్ను విడచి నేనొక్కనిముషయినా ఉండలేను. నేనూ నీతోవస్తాను' ' అన్నాడు తీర్థదర్శి. అలాగ వారిద్దరూ ఓడమీద వెళ్తూ - ఒక ద్వీపంలో అద్భుత సౌందర్యవతినొకామెను చూశారు. ఆమెను చూసి అమితాశ్చర్యానికి లోనయిన తీర్థదర్శి - “ఈమె ఎవరు? అని అడిగాడు. వర్తకుడు - "ఈ కన్యారత్నమెవరో నాకు తెలియదు. కాని నేను ఓడమీద వచ్చిపప్పుడల్లా యీమెనిక్కడ తప్పకుండా చూస్తుంటాను" అని చెప్పాడు.


తరువాత తీర్థదర్శి కొంతకాలానికి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. తన మునుపటి రాజగు వంశకేతుడిని సందర్శించాడు. ఆ రాజు తీర్ధదర్శిని చూసి ఎంతో ఆనందించి కౌగలించుకొని, గౌరవించి కుశల ప్రశ్నలడిగి - “నన్నెందుకు విడచివెళ్లావు?” అని అడిగాడు.


“రాజా! నువ్వు స్త్రీలోలుడిపై అంతఃపురము విడచిరాక రాచకార్యములు నిర్వహింపకపోవుటచే నేనీ రాజ్యమును హరింతునని లోకోపవాదములు పుట్టాయి. ఆ నిందలు భరించలేకనే దేశం విడచి వెళ్లాను - " అని చెప్పాడు తీర్థదర్శి. రాజు విశేషాలేమిటని అడిగాడు. "ఒకచోట నేనొక వర్తకునితో స్నేహం చేసి.. అతనితో మరోద్వీపం ఓడమీద వెళ్లాను. అక్కడ ఒక చోట కాళికాలయముంది. దాని ముందున్న చెట్టు నీడలో ఒక కన్యారత్నం ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఎంత అందగత్తో నేను చెప్పలేను. నేనెన్నడూ అంత చక్కని స్త్రీని చూడలేదు.." అని తీర్థదర్శి చెప్పేసరికి వంశకేతుడు చాలా ఆశ్చర్యపోయి "తీర్థదర్శీ! నేనామెను చూడాలి! నా బదులు నవిక్కడుండు. త్వరలోనే వచ్చేస్తానులే” అంటూ అక్కడికి వెళ్లడానికవసరమయిన వివరాలు తెలుసుకుని - వర్తకునితో స్నేహంచేసి అతనా ద్వీపం వెళ్లేటప్పుడు వెంటవెళ్లి - మంత్రి చెప్పిన చోట ఆ కన్యకను చూసి ఆమె పట్ల మోహమూ, ప్రేమలో పడి కాళికాలయంలో పూజచేసి - - ప్రసాదం తీసుకుని ఆమె వద్దకు వచ్చాడు.


ఆమె అతన్ని చూసి దాక్కోబోగా ఆమె కొంగు పట్టుకుని వదలకుండా ఎన్నో విధాల ఆమెను ప్రార్ధించాడు. ప్రాధేయపడ్డాడు. అతను రాజని తెలిసి ఆమె అంగీకరించింది. వాళ్లిద్దరూ సుఖాలలో ఓలలాడారు. ఒకనాడు - వ్రతం నిమిత్తమామె నీటిలో మునగగా ఒక రాక్షసుడామెను మింగేశాడు. రాజు ఆ రాక్షసుడి పొట్టను తన కత్తితో చీల్చి తన భార్యను బయటకు తెచ్చాడు. కొన్నాళ్లు గడిచాక ఆమెను వెంటబెట్టుకుని తన రాజ్యానికి చేరుకున్న రాజు మునపటికంటె మరింతగా కాంతాలోలుడయి అంతఃపురందాటి బయటకు రావడం మానేశాడు.


అది చూసి మంత్రి విషం తాగి బలవంతంగా మరణించాడు? రాజు తిరిగి వచ్చాడనా? లేక తాను చూచినకాంత తనకి కాకుండా రాజుకి దక్కిందనా?” అడిగాడు భేతాళుడు. అందుకు - "భేతాళా! రాజు యిదివరకే స్త్రీలోలుడు. అది తెలిసి కూడా తానా స్త్రీ గురించి అతనికి చెప్పినందువల్లనే రాజు రాచకార్యములు మానేశాడు. ఆ అపవాదు తనమీదే పడుతుందని భయపడి మాత్రమే ఆ మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తప్ప మరే కారణమూకాదు-” అని జవాబిచ్చాడు విక్రమార్కుడు. అతని మౌనానికి భంగమవడంతో భేతాళుడు మాయమై యథాస్థానం చేరుకున్నాడు.


Tuesday, 6 December 2022

భేతాళ కథలు - 8



కార్పాటకుడంతకు ముందు మోహించిన నాగకన్య నిజంగానే అత్యద్భుత సౌందర్యంతో వెలిగిపోతుంది. మిగిలిన వారి మధ్య ఆమె చుక్కల్లో చంద్రుడిలాగే ఉంది.


ఆమె రాజును చూసినదే తడవుగా- అతని మీద మోహం చెంది అతని ముందుకు వచ్చి " రా రాజా! నీకేది కావాలంటే అది యివ్వగలను. దయయుంచి నా కోరిక తీర్చు. నీపైమోహంతో నేను తాళలేకపోతున్నాను' అంటూ వేడుకుంది. ఆమె మాటలకు - రాజు -" ఓ సుందరీ! ఇతను నా కొడుకు వయసులో ఉన్నాడు. నా కంటే అన్నివిధాలా గొప్పవాడు. ముందు అతని కోరిక తీర్చి సుఖాల్లో తేల్చు” అన్నాడు కార్పాటకుణ్ని చూపుతూ. రాజే అలా అన్నాక చేయగలిగిందేమీ కనిపించక నాగకన్య కార్పాటకుణ్ని అంగీకరించింది. రాజు వారిద్దరినీ ఒక చోట చేర్చి - "కార్పాటకా! ఆవేళ.. నేను అరణ్యంలో అతిదాహంతో బాధపడుతుండగా నువ్వు నాకిచ్చిన రెండు ఉసిరిపళ్లలోనూ ఒకదానికి యీ నాగకన్యను నీకు జతకూర్చుటతో సరిపోయినది. ఇంకొక పండుకు మాత్రమే నేను రుణపడి ఉన్నాను." అని మునుపు కార్పాటకుడు మునిగిన నీటిగుంటలో తాను మునిగి తన నగరమున తేలాడు. కార్పాటకుడు నాగలోకంలో సౌందర్యవతితో హాయిగా సుఖిస్తూ గడపసాగాడు.


రాజా వీరిద్దరిలో ఎవరు చేసిన ఉపకారము గొప్పదో నిర్ణయించి చెప్పు. సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ” అంటూ హెచ్చరించాడు. భేతాళుడు. విక్రమార్కుడికిదేమీ అంత జటిలమయిన ప్రశ్నలా అనిపించనట్లుంది. “భేతాళా! శకటశృంగుడు రాజు. కార్పాటకుడు అతని వద్ద సేవకుడు. సేవకుడు స్వామిభక్తిని ప్రదర్శించడం అతని విధే తప్ప అదనపు గొప్పతనమేమీ కాదు. కనుక - అరణ్యములో దాహముతో ఉన్న రాజుకు కార్పాటకుడు ఉసిరిపండ్లనిచ్చుటలో - విద్యుక్త ధర్మమే గోచరిస్తుంది. కాని రాజు భృత్యుడు చేసిన మేలుని మరవకపోవడమూ, ఆ మేలుని ఋణంగా భావించి, ప్రత్యుపకారం చేసి - తీర్చుకోవడమూ అతని చిత్తశుద్ధికి, విశాల హృదయాన్ని, సమాన భావాన్నీ తెలుపుతాయి. అందుచేత కార్పాటకుడు చేసిన ఉపకారంకంటే, శకటశృంగమహారాజు చేసిన ప్రత్యుపకారమే శ్లాఘించతగినది” అని చెప్పాడు.


“నిజమే” అంగీకరించాడు భేతాళుడు. 


విక్రమార్కుని మౌనానికి భంగం కలగడంతో - అతని తలమీదనున్న శవం మళ్లీ వెళ్లి మర్రి చెట్టుకు వేలాడసాగింది.


తప్పెవరిది?


మంత్రోపదేశం పొందిన నలుగురు అమాయకపు విప్రసోదరులు తమ మంత్రాలెలా పనిచేస్తాయో పరీక్షించాలనుకున్నారు. వాళ్లు నడుస్తున్న అడవిదారి పక్క ఒక ఎముక కనిపించింది. నాలుగోవాడు దానిని ముందుంచుకుని మంత్రం జపించేసరికి ఆ ఎముక తాలూకు జంతువు యొక్క అస్తిపంజరం ఏర్పడింది. మూడోవాడు తన మంత్రం పఠించేసరికి ఆ అస్తిపంజరానికి మాంసం, రక్తం, పేగులు మొదలయినవి అమిరాయి. రెండోవాడు తను నేర్చుకున్న మంత్రం ఉచ్చరించేసరికి - ఆ ఆకారానికి చర్మమూ, రోమాలూ (వెంట్రుకలు) గోళ్లూ ఏర్పడ్డాయి. అప్పుడేనా- అది పెద్దపులి అని ఆగకుండా పెద్దవాడు తను నేర్చిన మంత్రం చదివేశాడు. తొందరగానూ అమాయకంగానూ. దాంతో ఆ ఆకారానికి ప్రాణమూ చైతన్యమూ వచ్చేశాయి. ఆ పెద్దపులి-ఆకలిమీదుండి నలుగురన్నదమ్ములనీ తినేసింది. "రాజా! తప్పెవరిది? పాపమెవరిది?" అని అడిగాడు భేతాళుడు. "తప్పు కాని, పాపంకాని ఆనలుగురిలోనూ ఎవరిదీ కాదు ఎందుకంటే- నలుగురికి నలుగురూ అమాయకులు. వారిలో ఏఒక్కడికీ యితరులను చంపాలనే దుష్ట తలంపు లేనేలేదు. చెప్పాడు విక్రమార్కుడు. అతని మౌనం చెడడంతో భేతాళుడు శవంతో పాటే మాయమయ్యాడు.


Monday, 5 December 2022

భేతాళ కథలు - 7



"సింహళదేశాధిపతి కుమార్తె చాలా అందమయినదనీ, విద్యాధికురాలనీ విన్నాను. అలా వినినప్పటినుంచీ ఆమెను వివాహమాడాలని ఉవ్విళ్లూరుతున్నాను. నువ్వారాజు వద్దకు వెళ్ళి ఆమెను నాకిచ్చి పరిణయం చేసేటట్లు మాట్లాడి ఒప్పించాలి. వెళ్లు. కార్యం సఫలం చేసుకురా.” అని అతన్ని పంపాడు.


కార్పాటకుడు ఒక వర్తకుని ఓడ సింహళం వెళ్తూంటే దానినెక్కాడు. మధ్యతోవలో - పెద్ద తుఫానొచ్చింది. కార్పాటకుడెక్కిన ఓడ పగిలిపోయి నీటిలో మునిగిపోయింది. ప్రయాణీకులందరూ సముద్రం పాలయ్యారు. కాని కార్పాటకుడికి మాత్రం ఒక కొయ్య దొరికింది. దాని సాయంతో నీళ్లలో కొట్టుకురాసాగాడు. కొంతసేపలా కొయ్యతో ప్రయాణం చేశాక - నీటిలో ఒక తీగ కనిపించింది. అతను దానిని పట్టుకున్నాడు. అది అతన్ని నీటిలోపలకి ... సముద్రంలోపలికి.... అడుక్కు లాక్కుపోయింది.


నాగలోకానికి చేర్చి వదిలింది. అక్కడికెదురుగా ఒక దేవాలయం ఉంది. అతను నీటిలో మునిగి రావడం వలన కలిగిన శ్రమను తీర్చుకుందుకా దేవాలయంలో విశ్రమించాడు.


ఆ దేవాలయానికి ప్రతిరోజూ చాలామంది నాగకన్యలు వస్తారు. దైవపూజ చేస్తారు. నాట్యాలు అభినయిస్తారు. వీణవాయిస్తూ శ్రుతి బద్ధంగా పాటలు పాడతారు. అలాగే ఆ వేళకూడా కొందరు నాగకన్యలు వచ్చి సంగీతం పాడుతూంటే - ఆ శబ్దాలకి కార్పాటకుడికి మెలకువ వచ్చింది. కళ్లు పెద్దవి చేసుకుని వారిని చూసాడు. వారిలో ఒక నాగకన్యపై అతను మనసుపడ్డాడు. ఆమె చాలా అందంగా ఉంది.


ఆమె చెలికత్తె ద్వారా తన కోర్కెను తెలిపాడు.


“ఆ బాటసారి నీమీద మనసుపడ్డాడట. నీపై మోహంతో మైమరచి పోతున్నాడుట-” అని విన్నవించుకొంది.


"ఏడిశాడు వాడి మొహానికి మనసుకీ నేనే దొరికానా! వాడికి బుద్ధి చెప్పాలి. ఎలాగేనా వాడిని పరాభవించితీరాలి" అని నిశ్చయించుకుని అతని వద్దకు నడచింది.


“నువ్వంటే నా కిష్టమే. కాని... నేను నీ కోరికతీర్చాలంటే - మా దేశాచారం ప్రకారం ముందు నువ్వా నీటి గుంటలో మునిగి స్నానం చేయాలి' అంది.


అదెంత పని అనుకున్నాడు కార్పాటకుడు. క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆ నీటిగుంటలోకి ఉరికాడు. అంతే.


ఆ నాగకన్య మహిమవల్ల కాబోలు - అతను నీటిలో మునిగిందే తడవుగా - తన ప్రభువు పాలించే మల్లికాపురంలోని ఒక కోనేటిలో తేలాడు. అతని ఆశ్చర్యానికి మేరలేదు. వెంటనే ప్రభువుని చేరుకుని జరిగినదంతా అతనికి తెలియపరిచాడు.


రాజు చాలా ఆశ్చర్యపడి - నువ్వు చూసిన స్త్రీని నాకు చూపించమని అడిగాడు. అప్పుడు కార్పాటకుడు తాను మునుపు వెళ్లిన మార్గములో రాజును తీసుకుని వెళ్లి నాగలోకమందలి దేవాలయం చేర్చి- ఆ నాగకన్యలను చూపించాడు.


Sunday, 4 December 2022

భేతాళ కథలు - 6



ఎవరు గొప్ప? 


"విక్రమారా! పూర్వం మల్లికాపురమనే నగరం ఉండేది. దానిని శకటశృంగుడనే రాజు పాలించేవాడు. అతని వద్ద కార్పాటకుడనే సేవకుండేవాడు. కార్పాటకుడత్యంత విశ్వాసపాత్రుడయిన సేవకుడు. అతను రాజునొక్క నిముషమయినా విడచి పెట్టేవాడు కాదు. రాజుని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు.


ఒకనాడు రాజు వేటకి బయలుదేరాడు. రాజుతోపాటు పరివారం కూడా బయలుదేరింది. రాజు అరణ్యంలో అనేక జంతువులని వేటాడాడు. అంతలో అతనికొక అడవిపంది కనిపించింది. దాని నెలాగైనా వేటాడాలనుకుని వెంటపడ్డాడు రాజు.


ఆ అడవిపంది టక్కరిది. రాజుకి కనపడినట్లే కనపడుతూ, దొరక్కుండా చాలా దూరం తీసుకుపోయింది. కార్పాటకుడు మాత్రం అతి కష్టంమీద ప్రభువుననుసరిస్తున్నాడు. అడవిలో చాలా దూరం రాజుని తన వెంట పరుగెత్తించి - అడవి పంది మరి అతనికి కనపడకుండా పోయింది. రాజక్కడ ఆగిపోవలసి వచ్చింది.


అది, నిర్మానుష్యమైన ప్రదేశం. కనుచూపుమేర మానవుడన్నవాడు కనిపించడంలేదు. రాజేమో చాలా అలసిపోయి ఉన్నాడు. అతనికెంతో దాహంగా ఉంది. ఉస్సు ఉస్సు అంటూ ఓ చెట్టుకింద కూర్చుండిపోయాడు. ఏం చేయాలో తోచక.


సరిగ్గా అప్పుడు - 


కార్పాటకుడతని ఎదుట దేవుడిలాగే ప్రత్యక్షమయ్యాడు. ఊరికే ప్రత్యక్షం కావడమే కాక రెండు ఉసిరికాయలనందించాడు. రాజు ఆత్రంగా వాటిని తిన్నాడు. అతని దాహం తీరింది. శరీరంలోకి కొంచెం శక్తీ, ఉత్సాహమూ చేరాయి. సేవకుడయిన కార్పాటకుడి భక్తివిశ్వాసాల కతనెంతో సంతోషించాడు. అడవిపంది మరికనపడదని తేల్చుకుని తన పట్నానికి బయలుదేరిపోయాడు.


కొన్నాళ్లు గడిచాయి -


ఒకరోజు - శకటశృంగ మహారాజు కార్పాటకుడిని తన దగ్గరగా పిలిచాడు. “కార్పాటకా! నువ్వు స్వామిభక్తి పరాయణుడివి. అందుచేత నా మనసులోని కోరికను నీకే చెబుతున్నాను. నువ్వే నా కోరికని సాధించగలిగే సమర్థుడివి. అందుకని నిన్నే యీ పనికి నియమిస్తున్నాను.” అన్నాడు.


“ఆజ్ఞాపించండి ” అన్నాడు కార్పాటకుడు వినయ విధేయతలతో.


Saturday, 3 December 2022

భేతాళ కథలు - 5



"భర్త... సోదరుడు.. లేని జీవితం నాకెందుకు?” అనుకుంటూ కాళికాదేవి విగ్రహంముందే ఉరిపోసుకుని చనిపోబోయింది. అప్పుడు - కాళికాదేవి ప్రత్యక్షమై - “ఓ యువతీ! నీ పతి భక్తికి, సోదరప్రేమకీ ఎంతో సంతోషం కలిగింది. నీలాటి ఉత్తమ స్త్రీలు అకాల మరణం చెందకూడదు. ఎందుకు చనిపోతావు? నీ ఆప్తుల శిరస్సులను రెండింటినీ మొండెము (తలలేని శరీరభాగం)లకు కలుపుము. వారు తక్షణం బతుకుతారు” అంది. ఆమెవైపు దయగా చూస్తునే అదృశ్యమయింది.


అనూహ్యమూ, అత్యంత ఆనందదాయకమూ అయిన దేవి వరానికి ఆశ్చర్యపోతూనూ తన భర్తా, సోదరుడూ మళ్లీ జీవంపొందుతారన్న విశేష సంతోషంలోనూ, తొట్రుపాటు పడిపోతూ ఆమె భర్త శిరస్సును సోదరుని మొండానికీ, సోదరుని శిరస్సును భర్త మొండానికీ కలిపింది. అపరిమితమయిన అనందంలో కూడా కంగారు సహజమేకదా? వారిద్దరూ ప్రాణమొచ్చి లేచి కూర్చున్నారు.


ఆమె వారిద్దరినీ చూసింది. తన పొరపాటు తెలిసి వచ్చింది. తాను చేసిన తెలివితక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది. వీరిద్దరిలో ఎవరు తనభర్త? సోదరుడెవరు? తేల్చుకోలేక తెల్లమొహం వేసి ఉండిపోయింది. ఆమెకేమీ తోచడంలేదు.


రాజా! వారిద్దరిలోనూ ఆమె భర్త ఎవరు? ఆమెకు సోదరుడు కాదగిన వాడెవరు? సకారణంగా సమాధానం చెప్పు?” అన్నాడు భేతాళుడు.


సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండా ఉండలేకపోయాడు. “సర్వేంద్రియాణం నయనం ప్రధానమని, సర్వేంద్రియాణం శిరః ప్రధానం అనీ పెద్దలు చెప్పిన న్యాయమూ ధర్మము. నయనమూ, బుద్ధీ ఉండేవీ శిరస్సులోనే కనక మనిషి గుర్తింపు అతని శిరఃభాగం బట్టే జరగడం సముచితం. కనుక పతి శిరస్సు కలవాడామెకు భర్త. రెండవ మగవాడామె సోదరుడు చెప్పాడు విక్రమాదిత్యుడు.


భేతాళుడతని పరిష్కారాన్ని మెచ్చుకున్నాడు. కాని విక్రమాదిత్యుడి మౌనభంగమయింది. కనుక - రాజుతల పైనుండి శవమూ, దాని యందలి భేతాళుడూ మళ్లీ వెళ్లి చెట్టుకు వేలాడ సాగారు. 


Friday, 2 December 2022

భేతాళ కథలు - 4



“ఈమె నాకు భార్య అయినచో.. కొంతకాలం కాపరం చేశాక నా శిరమును నీకు బలి యిచ్చుకుంటాను.. " అని ఆలయంలోని కాళికి మొక్కుకుని... దేవీపూజలు చేసి ఆమెను వెంటాడి, ఆమె యింటి గుర్తులు చూసుకుని... తానే పనిమీద బయలుదేరాడో అది మరచిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతియందు ప్రేమతో రోజురోజుకీ కృశించిపోసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితిని చూసి ఆయోమయంలో పడిపోయారు. ధవళుడు మంచం పట్టేశాడు. ఇక తల్లిదండ్రులు ఆరాటమూ, భయమూ ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు. సంగతేమిటని అడిగారు. అతను కూడా ఏదీ దాచుకోకుండా జరిగినదంతా చెప్పాడు. అతను యిచ్చిన గురుతులనిబట్టి శోభావతీపురానికి వచ్చి కనుక్కోగా - ఆమెది కూడా వారి కులమే అని తెలిసింది. అందుకు వాళ్లెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకుని .


“మా కొడుకు మీ అమ్మాయియందు మనసుని లగ్నం చేసుకున్నాడు. ఆమె అతనికెంతో యిష్టము. మా బిడ్డకు మీ పుత్రిక నిత్తురా?” అని అడిగాడు. “తప్పకుండా. మాకంగీకారమే” చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు ఇంకేం?


కొద్దిరోజులలోనే ధవళుడికీ ఆమెకీ వివాహం జరిగిపోయింది. తరువాత ధవళుడు తన భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు.


కొంతకాలం గడిచింది. అప్పుడు ధవళుడి బావమరిది వచ్చాడు. అతనికి సోదరి అంటే ఎంతో ప్రేమ. "బావా! నిన్నూ మా సోదరినీ మా తల్లితండ్రులు యింటికి తీసుకురమ్మన్నారు. మీ తల్లితండ్రుల అనుమతి పొందాను. ఇక నీదే ఆలస్యం" అన్నాడు.


ధవళుడు అభ్యంతరం చెప్పలేదు. భార్యని తీసుకుని బావమరదితో తన అత్తవారింటికి బయలుదేరాడు.


వారు ముగ్గురూ ప్రయాణం చేసి చేసి శోభావతి నగర పొలిమేరలు చేరారు. అలసివున్న వారు కాళికాలయం.. కోనేరు... చూసేసరికి ధవళుడికి గతం గుర్తుకొచ్చింది. దేవికి తాను మొక్కిన మొక్కు మనసులో మెదిలింది. అంతే భార్యకుకాని బావమరదికి కాని చెప్పకుండానే దేవాలయంలోకి వెళ్లి తన శిరసును కాళికి బలియిచ్చాడు.


బావ ఏమయ్యాడో తెలియకు - "వెదికి వస్తాను ” అని బయలుదేరాడు బావమరిది. ఆ ప్రాంతమంతా తిరిగి అతను చివరకి ఆలయంలోకి వచ్చాడు. తల తెగి పడివున్న బావని చూశాడు. అతనికేమీ తోచలేదు. తను కూడా తలనరుక్కుని బావగారి పక్కనే పడిపోయాడు.


తన సోదరుడు - బావని వెదకడానికి వెళ్లినవాడు కూడా ఎంతకీ రాకపోవడంతో వారిద్దరినీ వెదకడానికి ఆమె బయలుదేరింది. వెదకి వెదకి వేసారి చివరకామె కాళికాలయానికి చేరింది. అక్కడ -


తన భర్తదీ, సోదరుడిదీ - తలలు. వాటిపక్కనే వారి మొండెములు కనిపించాయి. ఆమెకు భయము వేసింది, విపరీతమయిన దుఃఖమూ, వైరాగ్యమూ కూడా కలిగాయి. అ భీభత్సదృశ్యాన్ని చూసేసరికి ఏడుపు ఆపుకోలేకపోయింది. - ఆమె


Thursday, 1 December 2022

భేతాళ కథలు - 3



విక్రమార్కుడు పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఐనా వదలలేదు భేతాళుడు. “విక్రమార్క మహీపాలా! నేను- నీకు అలసట తెలియకుండానూ, యీ నిశీధిలో నడచి నడచి విసుగురాకుండానూ. ఒక కథ చెబుతాను. సరేనా?' 'అతను ఔననికాని కాదని కాని ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు.


మళ్లీ భేతాళుడి అన్నాడు. “కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్నవేస్తాను. ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసికూడా చెప్పక పోయావో తక్షణమే నీ తల వెయ్యి ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను. కథ మొదలు పెడుతున్నాను. -”


భేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అని మొదట కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమార్కుడు నోరు మెదపకుండానే నడుస్తూ కథ వినసాగాడు.


ఎవరు భర్త? ఎవరు సోదరుడు? 


"రాజా శోభావతీ అనే పురముండేది. దానిని యశఃకేతుడనే రాజు పరిపాలించేవాడు. అతను దేవ బ్రాహ్మణభక్తి కలవాడు. అంతే కాకుండా గొప్ప రాజకీయవేత్తగూడా. తన వేగుల (రహస్యముగా యితర దేశముల విషయములు తెలుసుకొను వారు) ద్వారా యితర దేశముల రహస్యములను సేకరించేవాడు. పని కొచ్చే సమాచారం తెచ్చిన వేగులకు చక్కని బహుమానాలనీ, విరివిగా జీతాల్నీ యిచ్చేవాడు.


మాకెప్పుడూ యీ రాజే కావాలని ప్రజలు కోరుకునే రీతిలో అతి చక్కగా.. ధర్మంగా రాజ్యపాలన చేస్తూండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. 


ఆ నగరానికి బయట ఒక కాళికాలయం ఉండేది. ప్రతి సంవత్సరమూ ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయం కెదురుగా ఒక కోనేరుంది. జాతరని చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం ఆ చేసి, శుచిగా, దేవి నారాధించి వెళ్లేవారు.


ఒక యేడు-ఉత్సవం నాడు కొందరు ఆడవారు కొలనులో స్నానం చేస్తున్నారు. మరో దేశం నుంచి ఎక్కడికో వెళ్తూ తోవలో ఉన్న యీ చోటుకి అనుకోకుండా వచ్చిన ధవళుడను రజకుడు కోనేటిలో స్నానమాడుతున్న ఒక స్త్రీని చూశాడు. అతనికా సౌందర్యవతి మీద విపరీతమయిన మోహం కలిగింది.