Monday, 15 July 2024

శ్రీ గరుడ పురాణము (235)

 


ఇదే క్రమంలో అన్నదానం కూడా ప్రతి గ్రహం పేరు పేరునా చేయాలి. తరువాత ప్రతి గ్రహం పేరుతో రకమంగా ధేనువు, శంఖం, ఎద్దు, బంగారం, బట్టలు, గుఱ్ఱం, నల్లావు, ఆయుధాలు, మేకలను దానంచేయాలి. గ్రహాలు శాంతించి అనుగ్రహిస్తే జాతకాలను మార్చగలవు. సిరులను కురిపించగలవు; రాజ్యాలనే ఇవ్వగలవు; రోగిని సంపూర్ణారోగ్యవంతునిగా చేయగలవు.


(అధ్యాయం 101)


వానప్రస్థ ధర్మ నిరూపణం


మునులారా! వానప్రస్థాశ్రమాన్ని వర్ణిస్తాను. అవధరించండి. వానప్రస్థాశ్రమంలో ప్రవేశించదలచుకొన్నవాడు తన భార్యను తీసుకొని వెళ్ళవచ్చు, లేదా, సమర్థుడైన కొడుకుపై ఆమె సంరక్షణ భారాన్ని మోపి వెళ్ళవచ్చు. అంతేగాని ఆమె సంగతి చూడకుండా వెళ్ళరాదు.


వానప్రస్థికి బ్రహ్మచర్యం విధాయకం. శృంగారానికి సంబంధించిన ఆలోచన కూడా మదిలో మెదలరాదు. శ్రౌతాగ్నినీ గృహాగ్నినీ తనతోబాటు వనంలోకి తీసుకుపోవాలి. ఎందుకంటే వనమంటే అడవి. అడవిలోకిపోయి ఆశ్రమాన్నీ ఆశ్రయాన్నీ ఏర్పాటు చేసుకొని శాంతంగా క్షమసహితంగా మనస్సునుంచుకొని అహర్నిశలూ దేవోపాసన చేస్తూ జీవించడాన్నే వానప్రస్థాశ్రమం అని వ్యవహరిస్తారు. అక్కడ దున్నని భూమి నుండి పుట్టిన అన్నం ద్వారా అగ్నిదేవునికీ, పితరులకూ, దేవతలకూ, అతిథులకూ, సేవకులకూ తృప్తి కలిగించాలి. ఆత్మజ్ఞాన తత్పరులైవుండాలి. శరీరానికి స్నానం అంగవస్త్రధారణ తప్ప ఏ సంస్కారమూ వుండరాదు. జటలూ, గడ్డమూ ఎంతగా పెరిగినా పట్టించుకోరాదు. ఇంద్రియ దమనం, త్రికాలస్నానం తప్పనిసరి. ఎవరి నుండీ ఎటువంటి దానాన్నీ స్వీకరింపరాదు. స్వాధ్యాయం, భగవద్ధ్యానం, లోకకల్యాణం- ఇవే వానప్రస్థికి నిత్యకృత్యాలు. తప్పనిసరైతే అన్నం కోసం మాత్రమే ధన సంపాదన చేయవచ్చు.


వ్రతాల ద్వారా ఆత్మశుద్ధిని గావించుకోవాలి. వారానికొకమారు, తరువాత పక్షంలో నొకమారు, ఆపై మాసాంతమందే భోజనం చేసే వ్రతం పట్టాలి. చాంద్రాయణం చేస్తూ, భూమిపై శయనిస్తూ వీలైనన్ని ధార్మిక కృత్యాలను (అన్నంతో కాకుండా) ఫలాలతో సంకల్పించి నెరవేర్చాలి. గ్రీష్మర్తువు (గ్రీష్మఋతువు) లో కూడా పంచ- అగ్ని మధ్యంలో (నాలుగు దిక్కులా అగ్నిని రగిల్చి సూర్యుని అయిదవ అగ్నిగా భావిస్తారు. ఈ పంచాగ్నుల మధ్యమే పంచ-అగ్ని మధ్యం). వర్షాలు పడుతున్నా, మంచు కురుస్తున్నా అరుగుపైనే పడుకోగలగాలి. హేమంతరువులో తడిబట్టలు కట్టుకొని, జపం, యోగాభ్యాసం చేయాలి.


పడకమీద తుమ్మముళ్ళు పఱచిన వానిపై క్రోధంగాని, పాదముల క్రింద ఎఱ్ఱ ముఖమలు తివాచీ పఱచిన వానిపై ప్రసన్నతగాని, సర్వాంగాలనూ చందన చర్చతో నెఱపిన వానిపై ప్రేమగాని కలుగరాదు. అప్పుడే అతడు / ఆమె శుద్ధవానప్రస్థి అయినట్లు భావించవచ్చు. సుఖదుఃఖాల కతీతులై సర్వసంగపరిత్యాగులై భగవంతుని వైపు చేసే ప్రయాణంలో చివరిదానికి ముందలి మజిలీ వానప్రస్థం. (అధ్యాయం - 102)


Sunday, 14 July 2024

శ్రీ గరుడ పురాణము (234)

 


గ్రహశాంతి


మునులారా! సిరిసంపదలూ, సుఖశాంతులూ కోరుకొనేవారు ముందు తమపై విభిన్న గ్రహాల 'చూపు' ఎలావుందో చూసుకొని 'అది' బాగులేని చోట జాగ్రత్తపడాలి. అంటే తమతమ జాతకాల్లో నున్న గ్రహదోషాలను ఆయాగ్రహ సంబంధిత యజ్ఞాలను చేయడం ద్వారా పోగొట్టుకోవాలి. మనకి తొమ్మిది గ్రహాలున్నాయని విద్వాంసులు చెప్తారు. అవి క్రమంగా సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు వీటిని లేదా వీరిని అర్చించడానికి ప్రతిమలను అనగా మూర్తులను క్రమంగా రాగి, స్పటికం, రక్తచందనం, బంగారం, వెండి, ఇనుము, సీసం, కంచు ధాతువులతో తయారు చేయించాలి. ఇక వారి రంగులు క్రమంగా ఎరుపు, తెలుపు, ఎరుపు, పసుపు, పసుపు, తెలుపు, చివరి మూడు గ్రహాలూ నలుపు. వీరి పూజాద్రవ్యాలు కూడా క్రమంగా అవే రంగుల్లో వుంటాయి. ఈ నవగ్రహాలనూ ఒకచోట శాస్త్రోక్తంగా స్థాపించి (లేదా స్థాపింపబడిన చోటికి పోయి) సువర్ణ, వస్త్ర పుష్పాలను నవగ్రహ మండపానికి సమర్పించాలి. గంధ, బలి, ధూప, గుగ్గులాదులను కూడా ఇవ్వాలి. చరు (అనగా హోమంలో వండబడిన అన్నం)ని మంత్రాల ద్వారా ప్రతి ఒక్క గ్రహాన్నీ ఉద్దేశించి సమర్పించాలి. ఆ తరువాత ఈయీ గ్రహాలనూ ఆయా మంత్రాలతో దిగువనిచ్చిన విధంగా జపించి అర్చించాలి.


ఓం ఆకృష్ణన రజసా... సూర్య

ఓం ఇమందేవా... చంద్ర

ఓం అగ్నిమూర్ధాదివః కకుత్... మంగళ

ఓం ఉద్బుద్ధస్వ... బుధ

ఓం బృహస్పతే... బృహస్పతి

ఓం అన్నత్పరిస్రుతం... శుక్ర

ఓం శం నో దేవీ... శని

ఓం కయానశ్చి... రాహు

ఓం కేతుం కృణ్వన్... కేతు


ఈ నవగ్రహాలకు ఇదే క్రమంలో మందార, మోదుగ, కాచు, ఉత్తరేను, రావి, మేడి, శమి, దూర్వ, కుశ సమిధలను నేయి, పెరుగు, తేనెలలో ముంచి హవనం చేయాలి. తరువాత మరల పైన చెప్పబడిన మంత్రాలను చదువుతూ ఈ క్రింది పదార్థాలను ఆహుతులివ్వాలి. సూర్యునికి బెల్లం, చంద్రునికి ఉప్మా, మంగళునికి పాయసం, బుధునికి బియ్యంతో పరమాన్నం, బృహస్పతికి పెరుగన్నం, శుక్రునికి నెయ్యి, శనికి అరిసెలు, రాహువుకు పండ్ల గుజ్జు, కేతువుకి అనేక రంగుల ధాన్యాలతో ఉడికించిన ముద్ద.


Saturday, 13 July 2024

శ్రీ గరుడ పురాణము (233)

 


రెండవ కలశాన్ని ఈ క్రింది మంత్రయుక్త శ్లోకాన్ని పఠిస్తూ ఆ వ్యక్తి తలపై వంచి అభిషేకించాలి.


భగంతే వరుణోరాజా భగం సూర్యో బృహస్పతిః ॥

భగమింద్రశ్చవాయుశ్చ భగం సప్తర్షయో దదుః | ( ఆచార 100 / 7,8)


మూడవ కలశలోని నీటితో వ్యక్తిని అభిషేకిస్తూ ఈ మంత్ర పూత శ్లోకాన్ని చదవాలి.


యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్ధని ॥

లలాటే కర్ణయోరక్ష్ణో రాపస్తద్రఘ్నంతు తే సదా ॥ ( ఆచార 100 / 8,9)


నీ సర్వాంగాలనూ పట్టిన దరిద్రం నేటితో ఈ నీటి పవిత్రత వల్ల కడుక్కుపోవాలి గాక అని ఈ శ్లోకభావం.


అనంతరం నాల్గవ కుండలోని నీటిని పోస్తూ పై మూడు శ్లోకాలనూ పఠించాలి. ఎడమ చేతిలో కుశదర్భలను తీసుకొని, బ్రాహ్మణుడు, ఆ వ్యక్తి యొక్క తలను స్పృశిస్తూ మేడి కర్రనుండి చేసిన స్రువ (చెంచాలాటిదేకాని కర్రచివరి గోయి వుంటుంది. యజ్ఞాలలో వాడతారు) తో ఆవనూనెను కుడి చేతితో తీసుకొని అగ్నిలో ఆహుతులను సమర్పించాలి.


ఈ ఆహుతులను ఈ క్రింది మంత్రాలు చదువుతూ వేయాలి.


మితాయస్వాహా, సమ్మితాయ స్వాహా, శాలాయ స్వాహా, కటంకటాయ స్వాహా, కూష్మాండాయ స్వాహా, రాజపుత్రాయ స్వాహా*


(*యాజ్ఞవల్క్యమితాక్షర గ.ప్ర. అధ్యాయంలో 285వ శ్లోకంలో మాత్రం పై మంత్రాలలో 'స్వాహా' కు ముందు ప్రయుక్తమైన నామాలన్నీ వినాయకునివే అని చెప్పబడింది.)


తరువాత లౌకిక అగ్నిలో గిన్నెలో, బియ్యంతో, అన్నాన్ని వండి చరు (హోమగుండంలో వండినలేదా వేసెడి అన్నం) ని తయారు చేసి దానిని ఇంతకు ముందు చెప్పబడిన ఆరు స్వాహా మంత్రాలతో ఆ లౌకికాగ్నిలోనే హవనం చేసి మిగిలిన దానిని ఇంద్రాగ్నియమాది దేవతలకు బలుల కింద సమర్పించాలి. ఆపై ఒక అరుగుపై దర్భలను పఱచి, దానిపై పుష్ప, గంధ, ఉండేరకమాల, పక్వాన్న, పాయసాలూ, నేయి కలిపిన పులావు, ముల్లంగి (ప్రత్యేకం) గడ్డి, అప్పాలు, పెరుగు, బెల్లంవుండలు, లడ్లు, చెఱకుముక్కలు ఈ ద్రవ్యాలన్నిటినీ చేర్చివుంచాలి.


వినాయక జననియైన దుర్గాదేవిని ప్రతిష్ఠించి చేతులు జోడించి నమస్కరించి, అర్ఘ్యమివ్వాలి. పుత్ర సంతానం కావలసిన స్త్రీ దూర్వా, సరసపుష్పాలతో భగవతి పార్వతీ దేవి నర్చించి స్వస్తివచనాలతో బాటు ఈ క్రింది ప్రార్థనా శ్లోకాన్ని చదవాలి.


రూపందేహియశోదేహి భగం భగవతి దేహి మే । 

పుత్రాందేహి శ్రియందేహి సర్వాన్ కామాంశ్చదేహి మే ॥ ( ఆచార 100 /16)


తరువాత బ్రాహ్మణులను భోజనాలతో తృప్తి పఱచాలి. గురువుగారికి రెండు వస్త్రాలనిచ్చి (అంటే గురు గ్రహానికి) అన్యగ్రహాలను పూజించి మరల ప్రత్యేకంగా సూర్యార్చన చేయాలి. ఈ విధంగా వినాయకునీ గ్రహాలనూ, పూజించిన వ్యక్తులు సర్వకార్యాల్లోనూ సాఫల్యము నందగలరు. ( అధ్యాయం - 100) 


Friday, 12 July 2024

శ్రీ గరుడ పురాణము (232)

 


వినాయక శాంతి స్నానం


'మునులారా! మనిషి తెలిసిగాని తెలియకగానీ చేసే కొన్ని పనులు దేవతలకు కోపం తెప్పిస్తాయి. వారు అప్రసన్నులౌతారు. అలా వినాయకుని అప్రసన్నతకు గురైన వారు ఆ విషయాన్ని తెలుసుకొనే అవకాశాన్ని ఆయనే కల్పించాడు' అంటూ వారి లక్షణాలను ఇలా చెప్పనారంభించాడు యాజ్ఞవల్క్య మహర్షి పుంగవుడు.


'వారికి స్వప్నాలెక్కువగా వస్తుంటాయి. ఆ కలలు కూడా స్నానం చేస్తున్నట్లు వస్తాయి. మరి కొన్ని కలల్లో మరణించిన ప్రాణుల తలలు మాత్రమే కనిపిస్తుంటాయి. కలలోనే కాక ఇలలో కూడా వారెపుడూ ఉద్విగ్నులై ఆత్రుతపడుతునే వుంటారు. వారే ప్రయత్నం చేసినా సఫలం కాదు. ఏ కారణమూ లేకుండానే నొప్పులు బాధిస్తుంటాయి. వినాయకుని అప్రసన్నతకు గురైన రాజు రాజ్యాన్ని కోల్పోతాడు; కన్యకు పతి దొరకడు; గర్భిణికి కొడుకు పుట్టడు. కాబట్టి ఇలాంటివారే కాదు ఎలాంటి వారైనా ఈ శాంతిని చేయించాలి.


అప్రసన్నతకు గురైన మనిషికి బంధువులూ బ్రాహ్మణులూ కలిసి ఇలా స్నానం చేయించాలి. భద్రాసనం మీద కూర్చుండబెట్టి బ్రాహ్మణులు స్వస్తివాచన పూర్వకంగా ఈ స్నానాన్ని చేయించాలి. పచ్చ ఆవాలను పొడిగావించి నేతితో కలిపి ముద్దచేసి దానినా వ్యక్తి శరీరంపై నలుగుడు పెట్టాలి. తరువాత అతని లేదా ఆమె యొక్క తలకు సర్వౌషధాలూ, సుగంధద్రవ్యాలూ కలిపి తయారు చేసిన నూనెను పట్టించాలి. ఔషధ మిశ్రితమైన నీటితో నాలుగు కుండలను నింపి వుంచి నలుగుడు పిండిని పూర్తిగా లాగివేసి తలపై పట్టించిన నూనె కాస్త తడియారగానే ఒక్కొక్క కుండనూ (ఈ కుండల్లో నీరు పోయడానికి ముందే పుణ్యనది, సరోవరం వంటి అయిదు పవిత్ర జలాశయాల నుండి తెచ్చిన మట్టినీ, గోరోచనాన్నీ, గంధాన్నీ, గుగ్గిలాన్నీ వేసి వుంచాలి) ఆ వ్యక్తి నెత్తి పై నుండి పోస్తూ స్నానం చేయించాలి.


మొదటి కలశలోని నీటిని పోస్తూ ఆచార్యుడు ఈ శ్లోకాన్ని చదవాలి. (మంత్ర)



ఈ మంత్ర శ్లోకాన్ని చదవాలి.


సహస్రాక్షం శతధారమృషిభిః పావనం స్మృతం ||

తేన త్వామభిషించామి పావమాన్యః పునంతుతే | ( ఆచార - 100 / 6,7)


సహస్ర నేత్రాలూ (సహస్ర శక్తులని ఉద్దేశ్యం), అసంఖ్యాక ధారలూ, మహర్షిబృందం పవిత్రములనీ పవిత్రీకరములనీ ఆదేశించిన పవిత్రజలాలతో (వినాయక గ్రస్తుడవైన నిన్ను) అభిషేకిస్తున్నాను. ఉపద్రవశాంతి నీకగుగాక -- అని దీని భావము.

Wednesday, 10 July 2024

శ్రీ గరుడ పురాణము (231)

 



సపిండీకరణ శ్రాద్ధంలో శ్రాద్ధ కర్త తిలలతో గంధ మిశ్రిత జలాలతో నాలుగు పాత్రలను నింపివుంచాలి. ఇవి పితరులకై ప్రత్యేకంగా విధించబడినవి. ఇవి కాక విశ్వేదేవులకు రెండు పాత్రలుండాలి. పితృపాత్రలలో నొకదానిని ప్రేతపాత్రగా ప్రత్యేకంగా వుంచి దానిని అర్ఘ్య ప్రదానానికి వినియోగించాలి. తరువాత శ్రాద్దకర్త ఆ పాత్రలోని కొంత జలాన్ని మిగిలిన మూడు పాత్రలలోని నీటితో కలిపి పూర్వంలాగే అర్ఘ్యాది క్రియలను సంపన్నం చేయాలి. ప్రేత పిండాన్ని యేసమానా... తో మొదలయ్యే రెండు మంత్రాలను చదువుతూ మూడు భాగాలుగా చేసి పితరుల పిండాలతో కలపాలి. దీని తరువాత ఏకోద్దిష్టంగా స్త్రీకి పిండాన్ని పెట్టాలి. ఒక యేడాదికి లోపే పెట్టు సపిండీకరణలో కూడా ఏడాది పూర్తయ్యాక పెట్టు విధంగానే సాన్నోదక కుంభాన్ని ప్రతి మాసం బ్రాహ్మణునకు, యథాశక్తిగా, దానం చెయ్యాలి. పితరులకు సమర్పితమైన పిండాన్ని ఆవు, బ్రహ్మ, బ్రాహ్మణుడు, అగ్ని, జలం వీటిలో దేనికైనా అర్పించవచ్చును.


హవిష్యాన్నంతో శ్రాద్ధం పెడితే నెలరోజులకు సరిపడా అన్నం తిన్న తృప్తినీ, పాయసంతో పెడితే ఒక యేడాది బాటు భోం చేసిన తృప్తినీ పితృగణాల వారు పొందుతారు.


మృతవ్యక్తులకి ప్రత్యేకంగా కృష్ణ చతుర్దశినాడు శ్రాద్ధం పెట్టిన వానికి జీవితకాల పర్యంతమూ ఉత్సాహ, శౌర్య, క్షేత్ర, శక్తి సుఖాలుంటాయి. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి వుంటుంది. (ఇక్కడ మృత వ్యక్తులనగా శ్రాద్దకర్తకు ఊహ తెలిశాక మృతులైనవారు కావచ్చు.)


విధి పూర్వకంగా అన్ని నియమాలనూ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం పెట్టిన వానికి పుత్ర సంతతి, సర్వజనశ్రేష్ఠత, సౌభాగ్యం, సమృద్ధి ప్రముఖత, మాంగలిక దక్షత (ప్రాముఖ్యము అనే మాటను వాడాలి) అభీష్టకామనలపూర్తి, వాణిజ్యంలో లాభం, నిరోగత, యశం, శోకరాహిత్యము, ధనం, విద్య, వాక్సిధ్ది, పాత్రత, గోసంపద, అశ్వాలకలిమి, దీర్ఘాయువు - ఇవన్నీ కలిగి దేహాంతంలో మోక్షము లభిస్తుంది.


కృత్తిక నుండి భరణిదాకా ప్రత్యేక నక్షత్రంలోనూ శ్రాద్ధ కార్యాలను చేసిన వానికి ఇహలోకంలో వస్త్ర, భవనాదులూ, సర్వసుఖ సాధనాలూ పుష్కలంగా లభిస్తాయి. పిత, పితామహుడు పితృదేవతలలో అగ్రగణ్యులు. వీరు తమ శ్రాద్ధ కర్తకు ఆయువు, సంతతి, ధనం, విద్య, రాజ్యం, సర్వసుఖాలు, స్వర్గం, తరువాత మోక్షం కూడా ప్రసాదించగలరు.'


(అధ్యాయం - 99)


Tuesday, 9 July 2024

శ్రీ గరుడ పురాణము (230)

 


పృథివీ తేపాత్రం.... అనే మంత్రంతో పాత్రలను అభిమంత్రితం చేసి ఇదం విష్ణుః ... అనే మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ మరింత శ్రద్ధగా గౌరవంగా బ్రాహ్మణుని బొటన వ్రేలి నందుకొని పితరులకుద్దేశింపబడిన అన్నంలో దానిని పెట్టాలి. గాయత్రి మంత్రాన్నీ మధువాతా.... అనే మంత్రాన్ని పఠిస్తూ మధ్యలో ఆపి బ్రాహ్మణులను భోజనానికి కూర్చుని మౌనంగా భోంచేయమని ప్రార్థించి మరల ఆ మంత్రాలనే చదువుతుండాలి. మరల బ్రాహ్మణులను మొగమాటపడవద్దని ప్రార్థించాలి. క్రోధాది మనోవికారాలను మనసులోకి రానీకుండా ప్రశాంతమనస్కుడై శ్రద్ధనిండిన గుండెతో వారికి వడ్డిస్తూ తొందరపెట్టకుండా, మంత్రాన్ని జపిస్తూ ఓపికగా భోజనాలు పెట్టాలి. హవిష్యాన్నము (హోమగుండంలో వండబడిన అన్నం) ను వారికి సమర్పించి వారు తృప్తిగా భోజనం చేసే దాకా పురుష సూక్తాన్నీ, పవమాన సూక్తాదులనూ జపిస్తుండాలి. వారు తృప్తిగా భుజించాక మరల మధువాతా... మంత్రాన్ని పఠించాలి. 'మేము తృప్తిగా సుష్టుగా భోంచేశాము' అని వారి చేత అనిపించుకొని వారు భుజించగా మిగిలిన అన్నాన్ని దక్షిణం వైపు తీసుకుపోయి తిలలను అందులో వేసి బ్రాహ్మణులు అన్నంతిన్న పాత్రలనూ వాటి ప్రక్కనే భక్తి మీరగా తెచ్చి ఆదరంగా వుంచాలి. ఎందుకంటే ఆ క్షణంలో వారు మనవూరి సామాన్య మానవులు కారు; పితృలోకం నుండి దిగివచ్చిన మన తండ్రులూ, తాతలూనూ. వారికి వేరువేరుగా ప్రక్షాళన జలాల నిచ్చి వెంటనే తుండుగుడ్డలను కూడా భక్తిగా ఇవ్వాలి.


ఉచ్ఛిష్టానికి సమీపంలోనే పితరాదులకూ మాతా మహాదులకూ పిండ ప్రదానం చేయాలి. తరువాత బ్రాహ్మణులను ఆచమనం చేయవలసిందిగా ప్రార్థించాలి. తరువాత బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను చదువగా శ్రాద్ధకర్త అక్షయమస్తు అంటూ బ్రాహ్మణుల చేతులలో నీరుపోసి తన సామర్థ్యానికి తగినట్లుగా దక్షిణలిచ్చి స్వధాంవాచయిష్యే అనాలి. వాచ్యతాం అంటూ వారు అనుమతి నివ్వాలి. అపుడు శ్రాద్దకర్త తన పితృదేవతలనుద్దేశించి స్వధా అనువాక్యాన్ని పలుకగా పితృదేవతల ప్రతిరూపమైన బ్రాహ్మణులు కూడా అదే వాక్యం ద్వారా అతనిని దీవిస్తారు. అప్పుడు శ్రాద్ధకర్త నీటిని భూమిపై వదలాలి. తరువాత విశ్వేదేవాః ప్రియంతాం అంటూ మరికొంత నీటిని వదిలి పితృదేవతలను ఇలా ప్రార్థించాలి.


దాతారో నో భి వర్ధంతాం వేదాః సంతతిరేవ చ ॥

శ్రద్ధా చనోమా వ్యగమద్ బహుదేయంచనో స్త్వితి | (ఆచార 99 / 26,27)


తరువాత వాజే వాజే.... అనే మంత్రాన్నుచ్ఛరిస్తూ శ్రాద్ధకర్త ప్రసన్నంగా పితరులను యథాక్రమంలో విసర్జించాలి. మొదట్లో బోర్లించి పెట్టిన, సంస్రవజలాలుండిన పాత్రను సరిచేసి చేత బట్టుకొని బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేసి వారిని వీడ్కొల్పాలి. వారితో బాటు కొంత దూరం నడచి వెళ్ళి సాదరంగా సాగనంపాలి. తరువాత శ్రాద్ధ కర్మలో మిగిలిన భోజనాన్ని స్వీకరించి ఆ రాత్రి బ్రహ్మ చర్యాన్నవలంబించాలి.


వివాహాది శుభకార్యాలు చేసేటపుడు పితరులకు నందీ ముఖశ్రాద్ధాన్ని పెట్టాలి. వారికి పెరుగు, బదరీ ఫలం, యవమిశ్రిత అన్నంలతో పిండదానం చేయాలి.


ఏకోద్దిష్టశ్రాద్ధం (ఎవరో ఒకే ఒక వ్యక్తి నుద్దేశించి పెట్టేది) విశ్వేదేవరహితం, ఏకాన్న, ఏక పవిత్రకయుక్తం అయివుంటే చాలు. ఈ శ్రాద్ధానికి ఆవాహనం, అగ్నైకరణం కూడా అవసరంలేదు. జంధ్యాన్ని అపసవ్యం చేస్తే చాలు. బ్రాహ్మణులను పవిత్ర భూమిపై ఉపతిష్ఠతాం అంటూ కూర్చోమని ప్రార్థించాలి. అలాగే అభిరమ్యతాం అంటూ విసర్జన చేయాలి. బ్రాహ్మణులు అభిరతాః స్మ అనే వచనాన్ని చెప్పాలి.


Monday, 8 July 2024

శ్రీ గరుడ పురాణము (229)




రోగి అంగహీనుడు, అధికాంగుడు, 1. కాణుడు 2. పౌనర్భవుడు, 3. అవకీర్ణాది ఆచార భ్రష్టులు శ్రాద్ధ యోగ్యులు కారు.


పునర్భూకి పుట్టినవాడు. పునర్భూ అనగా వివాహానికి ముందే ఒక పురుషునితో లైంగిక బంధమున్న ఆడది. బ్రహ్మచారిగా గురుకులంలో వున్నపుడే వీర్యస్థలనం జరిగిపోయినవాడు.


శ్రాద్ధాని కొకరోజు ముందే బ్రాహ్మణుని ఆహ్వానించి సిద్ధం చేసుకోవాలి. ఆ బ్రాహ్మణుడు ఆ క్షణం నుండే నియమ నియతుడైవుండాలి. (బ్రాహ్మణులను, బ్రాహ్మణులు plural) శ్రాద్ధదినం నాటి పూర్వాహ్ణంలో వారు రావాలి. రాగానే గృహస్థువారిచే అత్యంతాదరంతో ఆచమనం చేయించి ఆసనాలపై కూర్చుండపెట్టాలి. విశ్వేదేవ లేదా ఆభ్యుదయిక శ్రాద్ధానికి ఇద్దరు బ్రాహ్మణులనూ, పితృపాత్రలో వీలైనంతమంది బ్రాహ్మణులనూ కూర్చుకోవాలి. లేదా విశ్వేదేవపాత్రులుగా తూర్పు ముఖంగా ముగ్గురినీ కూర్చుండబెట్టవచ్చు. శక్తిలేనివారు దానికొకనినీ, దీని కొకనినీ తెచ్చి చేయించుకోవచ్చు. ఈ విధంగా మాతామహులకు కూడా కూర్చుండబెట్టవచ్చును.


ఆ తరువాత బ్రాహ్మణులకు హస్తార్ఘ్యము (చేతులు కడుక్కోవడానికి నీరు) నూ ఆసనానికి కుశలనూ ఇచ్చి వారి అనుమతి తోనే విశ్వేదేవాస... అనే మంత్రంతో విశ్వేదేవతలనా వాహనం చేసి భోజన పాత్రలో యవలను జల్లాలి. తరువాత పవిత్రయుక్త అర్ఘ్యపాత్రలో శం నో దేవీ.... అనే మంత్రం ద్వారా నీటినీ యవో సి.... అనే మంత్రం ద్వారా యవలనూ పోసి యా దివ్యా.... మంత్రంతో బ్రాహ్మణుని చేతిలో అర్ఘ్యోదకాన్ని ప్రదానం చేసి గంధ, దీపక, మాల, హారాది ఆభూషణాలనూ, వస్త్రాలనూ వారికి దానం చేయాలి.


తరువాత జంధ్యమును అపసవ్యం చేసుకొని అప్రదక్షిణ క్రమంలో అనగా ఎడమ క్రమంలో స్థానం ప్రదానం చేసి కుశలను అశంతస్త్వా... అనే మంత్రంతో (చేతబట్టుకొని) పితరులను ఆవాహనం చేయాలి. అనంతరం పితృస్థానంలో ఆసీనుడైయున్న భూదేవుని అనుమతిని తీసుకొని ఆయంతు నః పితరః.... అనే మంత్రాన్ని పఠించాలి.


పితృకార్యంలో నువ్వులకే ప్రాధాన్యముంటుంది. (ఇతర కార్యాల్లో యవలను వాడతారు) పితృగణాలకు తిలలతో అర్ఘ్యాన్నిచ్చిదానిని బ్రాహ్మణుడందుకోగా క్రిందపడిన జలాలను (వీటినే సంస్రవలంటారు) 'పితృపాత్ర' అని వేరే ఒక గిన్నెను పెట్టి అందులో వుంచాలి. దక్షిణాగ్రకుశస్తంభాన్ని భూమిపై పెట్టి దానిపై పితృభ్యః స్థానమసి... అనే మంత్రం చదువుతూ ఇందాక చెప్పిన అర్ఘ్య పాత్రను పితరులకు ఎడమవైపు బోర్లించి పెట్టాలి. అగ్నైకరణకి అనుమతి నివ్వమని ఆచార్యుని వేడుకొని ఆయన అనుమతించగానే శ్రాద్దకర్త నేతితో కలిపిన అన్నాన్ని అగ్నికి ప్రదానం చేయాలి. పాత్రలో మిగిలిన అన్నాన్ని నెమ్మదైన మనసుతో నిదానంగా పితరుల యొక్క భోజన పాత్రలోకి తీసివుంచాలి. స్తోమతు కలిగినవారు పితరుల భోజనానికై వెండి పాత్రలనుపయోగించాలి.