Wednesday 10 July 2024

శ్రీ గరుడ పురాణము (231)

 



సపిండీకరణ శ్రాద్ధంలో శ్రాద్ధ కర్త తిలలతో గంధ మిశ్రిత జలాలతో నాలుగు పాత్రలను నింపివుంచాలి. ఇవి పితరులకై ప్రత్యేకంగా విధించబడినవి. ఇవి కాక విశ్వేదేవులకు రెండు పాత్రలుండాలి. పితృపాత్రలలో నొకదానిని ప్రేతపాత్రగా ప్రత్యేకంగా వుంచి దానిని అర్ఘ్య ప్రదానానికి వినియోగించాలి. తరువాత శ్రాద్దకర్త ఆ పాత్రలోని కొంత జలాన్ని మిగిలిన మూడు పాత్రలలోని నీటితో కలిపి పూర్వంలాగే అర్ఘ్యాది క్రియలను సంపన్నం చేయాలి. ప్రేత పిండాన్ని యేసమానా... తో మొదలయ్యే రెండు మంత్రాలను చదువుతూ మూడు భాగాలుగా చేసి పితరుల పిండాలతో కలపాలి. దీని తరువాత ఏకోద్దిష్టంగా స్త్రీకి పిండాన్ని పెట్టాలి. ఒక యేడాదికి లోపే పెట్టు సపిండీకరణలో కూడా ఏడాది పూర్తయ్యాక పెట్టు విధంగానే సాన్నోదక కుంభాన్ని ప్రతి మాసం బ్రాహ్మణునకు, యథాశక్తిగా, దానం చెయ్యాలి. పితరులకు సమర్పితమైన పిండాన్ని ఆవు, బ్రహ్మ, బ్రాహ్మణుడు, అగ్ని, జలం వీటిలో దేనికైనా అర్పించవచ్చును.


హవిష్యాన్నంతో శ్రాద్ధం పెడితే నెలరోజులకు సరిపడా అన్నం తిన్న తృప్తినీ, పాయసంతో పెడితే ఒక యేడాది బాటు భోం చేసిన తృప్తినీ పితృగణాల వారు పొందుతారు.


మృతవ్యక్తులకి ప్రత్యేకంగా కృష్ణ చతుర్దశినాడు శ్రాద్ధం పెట్టిన వానికి జీవితకాల పర్యంతమూ ఉత్సాహ, శౌర్య, క్షేత్ర, శక్తి సుఖాలుంటాయి. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి వుంటుంది. (ఇక్కడ మృత వ్యక్తులనగా శ్రాద్దకర్తకు ఊహ తెలిశాక మృతులైనవారు కావచ్చు.)


విధి పూర్వకంగా అన్ని నియమాలనూ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం పెట్టిన వానికి పుత్ర సంతతి, సర్వజనశ్రేష్ఠత, సౌభాగ్యం, సమృద్ధి ప్రముఖత, మాంగలిక దక్షత (ప్రాముఖ్యము అనే మాటను వాడాలి) అభీష్టకామనలపూర్తి, వాణిజ్యంలో లాభం, నిరోగత, యశం, శోకరాహిత్యము, ధనం, విద్య, వాక్సిధ్ది, పాత్రత, గోసంపద, అశ్వాలకలిమి, దీర్ఘాయువు - ఇవన్నీ కలిగి దేహాంతంలో మోక్షము లభిస్తుంది.


కృత్తిక నుండి భరణిదాకా ప్రత్యేక నక్షత్రంలోనూ శ్రాద్ధ కార్యాలను చేసిన వానికి ఇహలోకంలో వస్త్ర, భవనాదులూ, సర్వసుఖ సాధనాలూ పుష్కలంగా లభిస్తాయి. పిత, పితామహుడు పితృదేవతలలో అగ్రగణ్యులు. వీరు తమ శ్రాద్ధ కర్తకు ఆయువు, సంతతి, ధనం, విద్య, రాజ్యం, సర్వసుఖాలు, స్వర్గం, తరువాత మోక్షం కూడా ప్రసాదించగలరు.'


(అధ్యాయం - 99)


No comments:

Post a Comment