Friday, 30 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (07)


ఆంజనేయుని ఆజ్ఞననుసరించి సముద్రం అణగియుంది. మనమేమో సంసార సాగరంలో చిక్కుకొన్నాం. సముద్రంలోని అలలు మాదిరిగా మనభావాలు అల్లకల్లోలంగా ఉంటాయి. కాని ఆంజనేయుడు మనోనిగ్రహం. కలవాడు. ఇంద్రియాలను జయించినవాడు.


జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం


అట్టి అభయాంజనేయ మూర్తిని దర్శిస్తే, ధ్యానిస్తే మన భయాలను తరుమడమే కాకుండా శాంతి సౌభాగ్యాలను అందిస్తాడు. సంసార సాగరాన్ని అల్లకల్లోలం లేకుండా చేయగలడు.


బలప్రదాత


బలహీనులకు బలాన్నిచ్చేవాడు, రామచంద్రమూర్తి, నిర్బల్ కే బల్ రామ్ అని హిందీలోని మాట. ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు రక్షించేవాడు రాముని కంటే మరెవ్వరు? ఆపదామ్ అపహర్తారం అని కీర్తిస్తాం. మనకు ముందు, వెనుక, ప్రక్కల, అన్ని వైపుల రక్షించేవాడు రాముడని కీర్తిస్తాం.


అగ్రతఃపురతశ్చైవ పార్శ్వ ఏవ మహాబలౌ.


మనలను రక్షించడానికి ధనుర్బాణాలతో రాముడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడూ రాముని విడువని లక్ష్మణుడున్నాడు.

ఆ కర్ణపూర్ణ తన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ

అంతటి విజయరాఘవుడు, వీర రాఘవుడు తాను సాధించినది హనుమ వల్లనే అని లోకానికి చూపిస్తాడు.

రాముడు మానవునిలా ప్రవర్తించాడు. రావణుడు, సీతనెక్కడ దాచాడో తెలియనట్లే ప్రవర్తించాడు. మానవునిగా నుండి దుఃఖంలో మునిగియుండగా హనుమ, సీతను వెదికి, రామునకు ఉత్సాహాన్ని, బలాన్ని కల్గించాడు.

సీతనుండి కేవలం వియోగం కంటే వియోగబాధ, కొన్నివేల రెట్లు ఎక్కువగా అనుభవించాడు. తన ప్రక్క లేకుండా ఆమె ఎట్టి కష్టాలను అనుభవిస్తోందో అని బాధపడ్డాడు. ఆమెకు అదనంగా మరొక బాధ ఉంది. అది రావణుని చెరలో ఉండుటయే. స్త్రీని అబలయని అంటారు. మహాలక్ష్మి సీతగా అవతరించి అశోకవనంలో బాధపడింది. మామూలు స్త్రీ కంటే ఎక్కువగా బాధపడి, ఉరిపోసికొందామని భావించింది కూడా. ఆంజనేయుడు ఆమెకు ధైర్యాన్ని, బలాన్ని, ఉత్సాహాన్ని కల్గించాడు.

అతడు చేసిన ఆశ్చర్యకర సంఘటనలు ఒకటా, రెండా? అగణనీయం. అన్నిటికంటే జీవితాన్ని త్యజించాలనే సీత యొక్క శోకాన్ని పోగొట్టడం గొప్పది.

Thursday, 29 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (06)



సరస్వతి, నిన్ను అనుసరిస్తానని అంది కాబట్టి ఆమె విగ్రహము, శంకరుల విగ్రహానికి వెనుక ఉండడం కూడా సబబే.


శంకరులు, నా ముందు సాక్షాత్కరించుమని ప్రార్థించడం వల్ల హనుమ ముందున్నాడు. శంకరులు హనుమత్ పంచరత్నం వ్రాసేరు. అనగా ఐదు శ్లోకాలు, రుద్రాంశ సంభూతుడు ఇక్కడ ప్రార్ధింపబడ్డాడు. ప్రశంసించిన వ్యక్తి అయిన శంకరులు, శంకరుని అవతారం. ఇద్దరూ ఒక్కటే. ఇద్దరూ వినయ మూర్తులే. ఇద్దరూ బుద్ధిమంతులైనా వినయవంతులే. శంకరులెంత వినయంతో ప్రార్థిస్తారో గమనించండి:


పురతో మమపాతు హనుమతో మూర్తి:


నాముందు ఆంజనేయస్వామి ప్రకాశించుగాక. రక్షించుగాక. కనుక శంకరులు ముందు ఈ స్వామి మూర్తి ఉండడం సబబే. అట్లా ఉంటేనే శంకరులకిష్టం.


ఆది, అంతమూ రెండూ ఒక్కటే. అద్వైత సత్యం. నేనుతో ఆరంభమై నేనుతో అంతమౌతుంది. (జీవాహంకారం నుండి మొదలై పూర్ణాహంకారంతో ముగుస్తుంది. చివర రావలసిన ఆంజనేయుడు. గురువు కంటే ముందే రావడం అద్వైతాన్ని వివరిస్తోంది. దాసోహం అని తనను తాను రామచంద్రునికి అర్పించుకొనగా సోహం స్థితికి చేరుకొన్నాడు. అనగా వాడే నేను అనే స్థితి. నేను, పరమాత్మనే అనేస్థితి. అదే అద్వైతభావం. కనుక ఆది, అంతమూ అతడే.


Wednesday, 28 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (05)



ఆంజనేయుణ్ణి చివర స్మరిస్తారు కదా! కాని ఆయన విగ్రహం, శంకరుల విగ్రహం ముందు ప్రవేశంలోనే ఉందేమిటి? ఎట్లా సబబు?


ఈ ఆంజనేయస్వామి, ఏనాడో తనంతట తాను వచ్చాడు. అతని విగ్రహం క్రొత్తగా ప్రతిష్ఠింపబడలేదు. స్వామి, తరువాతనే శంకరులు అడుగుపెట్టారు.


రుద్రనమక మంత్రాన్ని ఘనలో వల్లిస్తున్నపుడు అందులో ఉన్న శంకర పదం 13 సార్లు వస్తుంది. సాధారణంగా ఈ 13 అంకెలు శ్రేష్ఠం కాదంటారు. అందరికీ సుఖాన్ని కల్గిస్తుందని అర్థం ఇచ్చే శంకర పదం 13 సార్లు వస్తుంది.


ఆంజనేయుడు రుద్రాంశతో పుట్టినవాడు. అతడెప్పుడూ శ్రీరామ జయరామ జయ జయ రామ అని కీర్తిస్తూ ఉంటాడు. ఈ మంత్రంలోనూ 13 అక్షరాలున్నాయి. 13 అంకెను ఉత్తర ప్రాంతంలో ప్రత్యేకంగా భావించి "తేరాక్షర్" అంటారు. ఆ హనుమ, సమర్థ రామదాస స్వామిగా అవతరించినపుడు ఈ త్రయోదశాక్షరీ మంత్రాన్నే జపిస్తూ ఉండేవాడు. ఆ మంత్రబలం వల్లనే శివాజీకి మార్గదర్శకుడయ్యాడు. హిందూ సామ్రాజ్యాన్ని శివాజీ స్థాపించగలిగాడు.


ఘనలో శంకరపదం 13 సార్లు వస్తుందని చెప్పాను. శంకరుల విగ్రహం ముందున్న అంజనేయస్వామి 13 అక్షరాల మంత్రాన్నే జపిస్తాడు. సబబుగా లేదా?


అట్టి ఆంజనేయప్రతిమ వెనుక ఉండకూడదు. కనుక ముందే ఉంటుంది.


ఎట్లా కనిపిస్తున్నాడు? ఒక చేతిని పైకెత్తి చేయి చాచి యుంటుంది. అది అభయహస్తం. భయపడకండని సూచిస్తుంది. అంతేకాదు. ఆగండని మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటుంది కూడా. ఒక పెద్ద సముద్రం ముందుంది కదా! రామేశ్వరంలో సముద్రం పెద్ద అలలు లేకుండా ఉంటుంది. ఆగు, ముందుకు రాకు అని సముద్రాన్ని ఆజ్ఞాపించాడు హనుమ. వేల సంవత్సరాల నుండి అతని ఆజ్ఞను సముద్రం పాటిస్తూనే ఉంది.


కనుక అతడు సముద్రానికి అభిముఖంగా ఉంటాడు. అతనికి, సముద్రానికి మధ్యలో ఏ విగ్రహమూ ఉండదు. శంకరుల కంటే ముందు వచ్చిన వానికి అట్టి గౌరవ స్థానం ఉండడం సబబే కదా!


Tuesday, 27 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (04)



సరస్వతి, ఒక షరతు పెట్టి అంగీకరించింది. నీవు వెడుతూ ఉండగా నన్ను చూడడానికి వెనుదిరిగి చూడకూడదు సుమా! ఒకవేళ చూస్తే అక్కడే ఉండిపోతానని శంకరులతో చెప్పింది.


శంకరులు ప్రయాణం మొదలుపెట్టారు. ఆమె కూడా అనుసరించింది. ఆమె అందెల రవళి వింటూ ఉండడం వల్ల అనుసరిస్తోందని భావిస్తూ ఉండేవారు. వెనుదిరిగి చూడలేదు.


శంకరులు జ్ఞాన దృష్టిచే అన్నిటిని గ్రహించగలరు కదా! అవతార పురుషులైనా మానవ ధర్మాన్ని అనుసరించి మానవునిగానే ఒక్కొక్కప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు.


వస్తూ ఉండగా తుంగభద్రా నదీ తీరంలో శృంగేరిలో ఒక వింత జరిగింది. " కప్ప ప్రసవిస్తూ ఉండగా ఎండపడకుండా తన పడగను పాము కప్పే దృశ్యాన్ని చూసారు. పాము, కప్పను మ్రింగడం లోక సహజం. కాని ఇక్కడ సహజ శత్రుత్వం లేదు, సరికదా మిత్రత్వమూ కన్పించింది. ఇట్టి పవిత్ర ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్ఠిస్తే మంచిదని భావించారు. అందెల చప్పుడు వినబడడం లేదు. తుంగభద్రానదీ తీరం వెంట వస్తున్నారు. ఆ ఇసుక తిన్నెలలో ఆమె పాదాలు కూరుకొనిపోయి యుండవచ్చని భావించి వెను దిరిగి చూసారు. అక్కడే శారదా పీఠాన్ని స్థాపించారు.


నీ వెనుక వస్తానని సరస్వతి, లోగడ చెప్పింది కదా! తదనుగుణంగా ఈ రామేశ్వరంలో శంకరమంటపంలో సరస్వతీ విగ్రహం, శంకరుల విగ్రహం వెనుకనే ఉండడం పై కథను గుర్తుకుతెస్తుంది.


ఎవరైనా ఏదైనా పుస్తకం వ్రాసేటపుడు గురువందనం, తరువాత గణపతిని స్తుతి చేస్తారు. తరువాత సరస్వతీ స్తుతి ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం కూడా శంకరుల వెనుక సరస్వతి యుండడానికి కారణం కావచ్చు.


Monday, 26 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (03)



నిజంగా అతణ్ణి కొలిచిన వానికి, కోరదగిందంటూ ఏదీ ఉండదు. అతని వల్లనే రావణ సంహారం జరగడం, రామరాజ్య స్థాపనం జరిగింది. అతడు అర్జునుని జెండాపై ఉండడం వల్లనే యుద్ధానంతరం ధర్మరాజ్యం స్థాపింపబడింది. కొంతకాలం వెనుక మనధర్మానికి విఘాతం కలుగగా సమర్థ రామదాస స్వామి అవతరించి శివాజీ ద్వారా ధర్మస్థాపన చేయించాడు. రామదాస స్వామి ఆంజనేయుని అవతారమే. ఈనాడు, అట్టి సంకట పరిస్థితులు లేకుండా ఉండాలంటే, ధర్మ, భక్తులు వర్ధిల్లాలంటే ఆంజనేయ అనుగ్రహం కావాలి. శుద్ధమైన మనస్సుతో అతణ్ణి సేవిస్తే అన్నిటినీ ఇస్తాడు. 


సరస్వతి శంకర హనుమ విగ్రహాలు


రామేశ్వరంలోని, అగ్ని తీర్థకరై ప్రాంతంలో శంకరమంటపం ముఖ్య స్తంభం మధ్యలో ఆదిశంకరుల విగ్రహముంది. దాని వెనుక సరస్వతీ మహల్ ఉంది. అందు సరస్వతీ విగ్రహముంది.


శంకరుల వెనుక భాగంలో సరస్వతీ విగ్రహ ముండవచ్చా అని ఎవరైనా సందేహిస్తారు. దీనికి సంబంధించిన కథ ఉంది. మండన మిశ్రులతో వాదంలో శంకరులు జయించారు. బ్రహ్మ యొక్క అవతారమే మండనమిశ్రులు. అతని భార్యను కూడా ఓడించారు శంకరులు. ఆమె పేరు సరసవాణి. ఆమె సరస్వతి అవతారమే. మండనులు వెంటనే సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులనే ఆశ్రమ నామం స్వీకరించారు. సరసవాణి, సరస్వతిగా మారి బ్రహ్మలోకానికి వెళ్లాలనుకొంది. ఆమెను ఈ లోకంలోనే ఉంచాలని ఆమె దయవల్ల భూలోకవాసులకు విద్యాప్రకాశం కల్గుతుందని శంకరులు భావించారు. వనదుర్గా మంత్రంచే ఆమెను కదలకుండా చేసారు.


అమ్మా! నేను దేశ పర్యాటనను చేద్దామనుకుంటున్నాను, నాతో నీవు కూడా రా అని ఆమెతో అన్నారు. నిన్ను సరియైన స్థలంలో శారదాపీఠంలో స్థాపిస్తాను. తద్వారా ప్రజలను అనుగ్రహింపుమని వేడుకొన్నారు.


Sunday, 25 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (02)



భక్తియుంది కదాయని ప్రపంచ వ్యవహారాలను పట్టించుకోలేదని భావించకండి. ఆర్తులను, బలహీనులను కాపాడుటలో ఇతణ్ణి మించిన వారెవ్వరూ లేరు. లోకసేవా ధురంధరుడు.


జ్ఞానం యొక్క పరకాష్ఠను, బలపరాక్రమాల అవధిని, భక్తి సామ్రాజ్య విస్తరణను, కీర్తి పతాకాలను, అపరిమిత సేవను, అగణనీయ వినయ సంపదను అన్నిటిని ఒక్కచోట చూడదలచుకొంటే స్వామినే స్మరించాలి.


అంతకంటే తన బ్రహ్మచర్యాన్ని ముందుగా పరిగణించవలసి వస్తుంది. కామవాసన అణుమాత్రం లేని అస్ఖలిత బ్రహ్మచారి. తన కోసం తానేమీ ప్రయత్నం చేయలేదు. కామరాహిత్యం, రామసేవ వల్లనే పరిపూర్ణత్వం.


హనుమాన్ అని తమిళులంటే కర్ణాకటలో హనుమంతప్పయని, ఆంధ్రప్రదేశంలో ఆంజనేయుడని, మహారాష్ట్రలో మారుతియని, ఉత్తరదేశంలో మహావీరుడని పిలుస్తారు.


ఆయనను స్మరిస్తేనే మనలో ధైర్యం పొటమరిస్తుంది. జ్ఞానోదయం, కోరికలు తీరుట, జరుగుతుంది. అతని మాదిరిగా వినయంతో భగవత్ కైంకర్యం చేద్దాం.


ఎక్కడ రామనామం వినబడినా, ఎక్కడ రామాయణ ప్రవచనమున్నా, మనకంటికి కనబడకపోయినా అక్కడ సాక్షాత్కరిస్తాడు. కథలో, నామంలో మునిగి ఆనందాశ్రువులను రాలుస్తాడు.


మిగతా లక్షణాల కంటే ఈ కాలంలో వినయం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, ఇంకా ఏవో కావాలని ఆరాటపడుతూ ఉంటాం. అంతం కనబడడం లేదు. మనకు వినయ సంపద ఉన్నపుడు మాత్రమే ఈశ్వరానుగ్రహం పొందగలం. అదే తృప్తిని, సంపూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆ సంపూర్ణ తృప్తిని ఆంజనేయుడు అనుగ్రహించుగాక.

Saturday, 24 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (01)



హనుమ

ముందుమాట


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా

అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్


ఈ శ్లోకాన్ని బట్టి హనుమానుణ్ణి స్మరించే భక్తులపై అతడెట్టి అనుగ్రహం చూపిస్తాడో తెలుస్తుంది. బుద్ధిని, బలాన్ని, కీర్తిని, ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని, ఆరోగ్యాన్ని, జడత్వం లేకపోవడాన్ని, వాక్పటుత్వాన్ని ప్రసాదిస్తాడని అర్థం.


ఇట్లా అన్ని గుణాలూ ఒక్కనిలో ఉండవు. ఎంత బుద్ధిమంతునకైనా ఏదో లోటుంటుంది. బలవంతుడు, మూర్ఖుడు కావచ్చు. పై రెండు ఉన్నా పిరికివాడు కావచ్చు, భయపడవచ్చు. ఎంత సామర్ధ్యమున్నా చురుకుగా ఉండకపోవచ్చు. సోమరి పోతుగా ఉండవచ్చు. పండితుడైనా కొందరికి వక్తృత్వం ఉండకపోవచ్చు. కాని అన్ని సలక్షణాలను ప్రసాదించేది ఆంజనేయ స్వామియే.


సాధారణంగా మనుష్యులలో అన్నీ ఉండకపోయినా విరుద్ధ భావాలుంటాయి కూడా. బలవంతునకు బుద్ధి సంపదలేక పోయినా, బుద్ధిమంతునకు అహంకారంలేని భక్తి లేకపోయినా రాణించదు. కాని ఆంజనేయునిలో అన్ని లక్షణాలున్నాయి. అతడెన్ని విధాల బలవంతుడైనా తనకున్న శక్తి, రాముడనుగ్రహించినదే అని వినయం చూపిస్తూ ఎల్లపుడూ రామదాసుగానే ఉండాలని భావిస్తాడు. సేవకునిగా ఉంటే అతనిలో సంపూర్ణత్వం ఉంది. ఎవరికైనా భక్తియున్నా అది ఎందుకో స్పష్టంగా లేకుండా అనగా జ్ఞానసహితమైనది కాకుండా మూఢభక్తితో ఉంటారు. ఇక అట్టివారు భక్తి జ్ఞానాలు ఒకదానితో ఒకటి పడవనీ భావిస్తారు. రామునకెంత భక్తుడో అంతటి సుజ్ఞాని. వైదేహీ సహితం.... సనకాది ఋషులకు దక్షిణామూర్తి ఉపదేశించినట్లు ఆంజనేయునకు రాముడు తత్త్వోపదేశం చేసాడు. అర్జునుని కేతనం మీద ఉంటూ కృష్ణుడు చెప్పిన గీతను అర్జునునితో బాటు విన్నాడు. పైశాచీ భాషలో ఒక గీతా వ్యాఖ్యానం ఉందని, తత్వంతో నిండియుంటుందని దానిని ఆంజనేయుడే వ్రాసాడని అంటారు. రాముడే మొట్టమొదట సమావేశంలో ఇతణ్ణి నవవ్యాకరణ వేత్తయని కొనియాడాడు. అతడెంత బుద్ధిమంతుడైనా, పండితుడైనా, వినయభరితుడై భక్తి ఇచ్చే ఆనందంలో మునిగియుండేవాడు.