Friday, 2 February 2024

శ్రీ గరుడ పురాణము (78)



గాయత్రి న్యాసం - సంధ్యావిధి


శంకరాది దేవతలారా! విశ్వామిత్ర మహర్షి ప్రపంచానికి ప్రసాదించిన అద్భుత మంత్రం గాయత్రి. మిగతా మంత్రాలతో దేవతలను పూజిస్తారు. ఈ మంత్రాన్ని మాత్రమే ఒక స్వరూపాన్నూహించి న్యాసాదులతో పూజిస్తారు. ఈ మంత్రానికి ఋషి విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. మంత్రాధిదేవత సూర్యుడు. దీనికి మస్తకం బ్రహ్మ, శిఖ శివుడు. విష్ణు హృదయమే నివాసము. ఈ మంత్రరూపాన్ని విశ్వరూపంగానే ఊహించాలి. మూడు లోకాలూ ఈ మంత్రానికి చరణాలు. కాబట్టి పుడమిని పాదంగానూ విష్ణువును మొండెం గానూ బ్రహ్మను తలగానూ శివుని శిఖగానూ ఒక స్వరూపాన్ని మనసులో పెట్టుకొని కనులు మూసుకొని గాయత్రి మంత్రాన్ని పన్నెండు లక్షలమార్లు జపించాలి.


ఈ మంత్రానికి మూడు పాదాలుంటాయనేది సర్వవిదితం. కాని, నాలుగో పాదము కూడా ఉంది. జపం చేసుకున్నపుడు మూడు పాదాలనూ, గాయత్రినీ సూర్యునీ పూజించినపుడు నాలుగు పాదాలనూ వాడాలి.


పరో రజసేఽసావదోం అనేది గాయత్రి మంత్రానికి నాలుగవపాదం. సూర్య పూజలోనే కాక ఇతర పూజలలో కూడా ఈ పాదాన్ని ప్రస్తుతం చదవడం కనిపిస్తోంది. జప, ధ్యాన యజ్ఞాది కృత్యాలలోనూ పూజలలోనూ నిత్యం ఈ సర్వపాప వినాశినియైన మంత్రానికి విధ్యుక్తంగా సాధకుడు అంగన్యాసం చేసుకోవాలి.


పాదాలబొటన వ్రేళ్ళు, చీలమండల మధ్యాలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, వెనుకభాగము, అండకోశం, నాడి, నాభి, ఉదరం, ఛాతీ రెండు వైపులు, గుండె, కంఠం, పెదవులు, నోరు, తాలువు, రెండు భుజాగ్రాలు, నుదురు, కనులు, కనుబొమ్మలు, కణతలు, తల - ఈ భాగాలన్నింటిని ఈ మంత్ర న్యాసానికి వినియోగించాలి. తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలోనూ ఈ మంత్ర న్యాసాన్ని చేయాలి.


గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలనూ 24 రంగులలో వర్ణానికొక వర్ణంగా భావించి పూజించాలి. ఒకవేళ గాయత్రికి రూపాన్ని ఆవిష్కరిస్తే ఆ రూపానికి ఈ రంగులుండాలి. ఇంద్రనీలమణి రంగు, అగ్నివర్ణం, పసుపు, నలుపు, కపిల వర్ణం, అగ్ని వర్ణం, పసుపు, నలుపు, కపిల వర్ణం, తెలుపు, మెరుపు తీగ రంగు, ముత్యపు రంగు, కృష్ణ వర్ణం, ఎరుపు, చామనచాయ, వెన్నెల తెలుపు, శుక్ల వర్ణం, లేత పసుపు, పద్మరాగ వర్ణం, శంఖ వర్ణం, పాండుర వర్ణం, ద్రాక్ష ఎరుపు, తేనె రంగు, నలుపు ఎరుపు కలిసిన రంగు, సూర్య వర్ణం, సౌమ్య శ్వేతం, శంఖపు రంగు - ఇలా పంచరంగుల (పంచ వర్ణాల) కళల భేదాలతో ఇరవై నాలుగు అక్షరాలనూ ఒక ఫలకంపై వ్రాసి కూడా పూజించవచ్చు.


Thursday, 1 February 2024

శ్రీ గరుడ పురాణము (77)

 


అనంతరం బ్రహ్మ, నారద, సిద్ధ, గురు, పరగురు, గురు పాదుకలను క్రమంగా ఈ విధంగా ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరగురుభ్యో నమః, ఓం గురుపాదుకాభ్యాం నమః అనే మంత్రాలతో పూజించాలి. 

ఇపుడు తూర్పు దిక్కుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులనూ, ఊర్ధ్వ అధో దిశలలో బ్రహ్మనూ అనంతునీ ఈ మంత్రాలతో పూజించాలి. ఓం సవాహనాయ సపరివారాయ అనే ఉపసర్గను అందరికీ చేరుస్తూ ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, నిరృతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, సోమాయ నమః, ఈశానాయ నమః, బ్రహ్మణే నమః, అనంతాయ నమఃలతో ఆయా దేవతలందరినీ పూజించాలి. పిమ్మట


ఓం వజ్రాయ నమః, ఓం శక్తయే నమః, ఓం దండాయ నమః, ఓం ఖడ్గాయ నమః, ఓం పాశాయ నమః, ఓం ధ్వజాయ నమః, ఓం గదాయై నమః, ఓం చక్రాయ నమః,


అనే మంత్రాలతో ఆయుధాలనూ ఓం పద్మాయ నమః


అనే మంత్రంతో పద్మాన్నీ, ఈశానకోణంలో ఓం విష్వక్సేనాయ నమః అనే మంత్రంతో ఆయననీ పూజించి అనంతరం అనంతుని మరల అర్చించాలి. పిమ్మట హయగ్రీవుని మూలమంత్రంతో సర్వోపచారాలతో మరల పూజించి ప్రదక్షిణ మరల యథాశక్తి మూలమంత్ర జపాన్నిచేసి దానిని ఆయనకే అర్పించి ఇలా స్తుతించాలి :


ఓం నమో హయశిరసే విద్యాధ్యక్షాయవై నమః నమో విద్యాస్వరూపాయ విద్యాదాత్రే నమో నమః | నమః శాంతాయ దేవాయ త్రిగుణాయాత్మనే నమః ॥ సురాసుర నిహంత్రేచ సర్వదుష్ట వినాశినే । సర్వలోకాధిపతయే బ్రహ్మరూపాయ వై నమః ॥ నమశ్చేశ్వర వంద్యాయ శంఖచక్రధరాయ చ ॥ నమ ఆద్యాయ దాంతాయ సర్వసత్త్వ హితాయ చ || త్రిగుణాయా గుణాయైవ బ్రహ్మవిష్ణు స్వరూపిణే । కర్తే హర్తే సురేశాయ సర్వగాయ నమోనమః ॥ (ఆచార 34/50-54)


ఈ విధంగా స్తుతించి సాధకుడు తన మనః కమలమధ్యంలో శంఖచక్రగదాధారి, కోటి సూర్యకాంతి ప్రభుడైన ప్రభువు, సర్వాంగసుందరుడు, అవినాశియగు మహేశునికే ఈశుడు, దేవాధిదేవుడు, పరమాత్మయగు హయగ్రీవుని నిలుపుకొని ధ్యానం చేయాలి. 


హే ఫాలలోచనా! ఈ పూజను గూర్చి చదివినవారికి పరమపదం ప్రాప్తిస్తుంది. 


(అధ్యాయం - 34)


Wednesday, 31 January 2024

శ్రీ గరుడ పురాణము (76)

 


అపుడు కూర్మ, అనంత, పృథ్వీ దేవతలను పూజించి ఆగ్నేయంలోధర్మునీ, నైరృత్యంలో జ్ఞానాన్నీ, వాయవ్యంలో వైరాగ్యాన్నీ, ఈశాన్యంలో ఐశ్వర్యాన్నీ పూజించాలి. ఆ తరువాత క్రమంగా పూర్వాది దిశల్లో అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కూడా అర్చించాలి. మండలమధ్యంలో సత్త్వ రజస్తమోగుణాలనూ, అక్కడే కంద(*కందగడ్డ, హారతి కర్పూరం అనే అర్థాలున్నాయి.), నాళ, పద్మాలనూ విధ్యుక్తంగా పూజించాలి. అక్కడే అర్క, సోమ, అగ్ని మండలాలను కూడా పూజించాలి.


విమలాది శక్తులు తొమ్మిదింటినీ తూర్పుతో మొదలుపెట్టి క్రమంగా అన్ని దిక్కుల్లో వారి వారి మంత్రాలతో (శ్రీధర పూజానావిధిలో వలెనే) పూజించాలి.


తరువాత ఒక మంగళమయ ఆసనాన్ని స్నాన, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులతో పూజించి దేవాధిదేవుడు, భగవానుడునైన హయగ్రీవుని ఆవాహనం చేసి న్యాసం కూడా చేయాలి. ధ్యానం చేసుకొని శంఖచక్రాది మంగళముద్రలను ప్రదర్శించాలి. తరువాత పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నానాలను ప్రదానం చేయాలి. వస్త్రప్రదానం ఆచమనానికి ముందు చేయాలి. సుందరయజ్ఞోపవీతాన్నివ్వాలి. తరువాత భైరవదేవుని మూలమంత్రంతో ఆహ్వానించి పాద్యాదులను సమర్పించి విధివత్తుగా పూజించాలి.


తరువాత శుభదాయినీ, ఐశ్వర్యప్రదాత్రీయైన లక్ష్మీదేవిని పూజించాలి.


తరువాత నలుదిక్కులలో ఇలా


తూర్పులో ఓం శంఖాయ నమః


దక్షిణంలో ఓం పద్మాయ నమః


పడమట ఓం చక్రాయ నమః


ఉత్తరంలో ఓం గదాయై నమః 


అని ఉచ్చరిస్తూ ఆయా వస్తువులను అర్చించాలి. తరువాత అదే దిక్ క్రమంలో 

ఓం ఖడ్గాయ నమః, ఓం ముసలాయ నమః, ఓం పాశాయ నమః, ఓం అంకుశాయ నమః అనే మంత్రాలతో ఆయా ఆయుధాలనీ వాటి మధ్యలో ఓం సశరాయ ధనుషే నమః అనే మంత్రంలో విల్లమ్ములనూ స్థాపించి పూజించాలి. అదే క్రమంలో ఓంకారమును, యను, నమఃను పెట్టి శ్రీవత్స, కౌస్తుభ, వనమాలా(యై) పీతాంబరాలనూ పూజించి మరల శంఖాదిధారియైన హయగ్రీవస్వామిని అర్చించాలి.


Tuesday, 30 January 2024

శ్రీ గరుడ పురాణము (75)

 


హయగ్రీవ పూజనావిధి


సూతుడు శౌనకాది మహామునులకు విష్ణువు శివునికీ ఇతర దేవతలకూ ఉపదేశించిన హయగ్రీవపూజను ఇలా వినిపించసాగాడు.


"హయగ్రీవ పూజకు మూలమంత్రం పరమ పుణ్యాశాలి, సకల విద్యలనూ ప్రసాదించేది. ఓంకార యుక్తం. అది ఇది :


ఓం సౌం క్షౌం శిరసే నమః


ముందుగా ఎప్పటి వలెనే మంత్రాలతో అంగన్యాసం కరన్యాసం చేయాలి. (ఈ మంత్రాలిది వఱకే ఇవ్వబడ్డాయి. అయినా (అనుబంధం- 5లో చూడవచ్చు).


హయగ్రీవుడు శంఖం వలె, కుంద పుష్పం వలె, చంద్రుని వలె శ్వేతవర్ణుడు. ఆయన దేహకాంతి కమలనాళతంతు, రజత ధాతుకాంతితో సమానంగా ప్రకాశిస్తుంటుంది. నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా పద్మాలు ఆవు పాలలాగ, కోటి సూర్యప్రభలను విరజిమ్ముతుంటాయి. ఈ సర్వవ్యాపియైన దేవత ముకుట, కుండల, వనమాలా సుశోభితుడై సుదర్శనయుక్తుడై, సుందరదరహాసవ్యాపిత కపోలాలను కలిగి పీతాంబరధారియై మంగళ స్వరూపుడై వుంటాడు.


ఈ స్వామిని, అన్ని దేవతలనూ తనలోనే కలిగిన ఈ విరాట్ దేవుని సాధకుడు తన మనసులో భావించుకొని అంగమంత్రాలతో మూలమంత్రంతో న్యాసం చేయాలి. తరువాత మూలమంత్రంతోనే శంఖ, పద్మాదుల మంగళమయ ముద్రలను ప్రదర్శించాలి. తరువాత హయగ్రీవాసనానికి దగ్గరలో వున్న ఇతర దేవతలను ఆవాహన చేయాలి. ఈ మంత్రంతో :


ఓం హయ గ్రీవాసనస్య ఆగచ్ఛత చ దేవతాః |


తరువాత ఒక స్వస్తిక లేదా సర్వతోభద్ర మండలంలో ఆ దేవతలను పూజించి ద్వారంలో ధాతనూ విధాతనూ పూజించాలి. తదనంతరం సమస్త పరివారాయ అచ్యుతాయ నమః అనే మంత్రంతో మండల మధ్యంలో విష్ణు భగవానుని పూజించి ద్వారమందు గంగ, మహాదేవిలను, శంఖ, పద్మ, నామక నిధులనూ, అగ్రభాగంలో గరుడునీ, మధ్యభాగంలో ఆధారశక్తినీ పూజించాలి. (ఈ మంత్రాలన్నీ ఇదివఱకే చెప్పబడ్డాయి)


Monday, 29 January 2024

శ్రీ గరుడ పురాణము (74)

 


ఈ విధంగా సమస్త కష్టాలనూ దూరం చేసే దేవేశుడైన వాసుదేవ భగవానుని స్తుతించాలి. ఇతర వైదిక స్తుతులతో కూడా విష్ణు దేవుని హృదయంలో భావిస్తూ స్తుతించ వచ్చును. తరువాత విసర్జన చేసి మందిరంలో నుండి బయటికి రావాలి. ఈ పంచతత్త్వ యుక్తమైన విష్ణు పూజ సంపూర్ణకామనలను నెరవేర్చే వాసుదేవుని పూజలలో సర్వశ్రేష్ఠంగా వ్యవహరింపబడుతోంది.


నీలలోహిత శివ మహాదేవా! ఈ పూజనొక్క మారు చేసినా మనిషి కృతకృత్యుడవుతాడు. దీనిని చదివినవారూ, విన్నవారూ, ఇతరులకు వినిపించినవారూ దేహాంతంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు".


(అధ్యాయం - 32)


సుదర్శన చక్ర పూజా విధి


సూతుడు శౌనకాది మహామునులకు శివుడు విష్ణువుతో ఇలా అన్నాడని చెప్పసాగాడు. “ఓ శంఖ గదాధరా! గ్రహదోషాలూ, రోగాదులూ, సర్వకష్టాలూ వినష్టములవ్వాలంటే ఏ పూజను చేయాలి?"


"పరమశివా! నీవడిగిన దానికి సమాధానం సుదర్శన పూజ. ఈ పూజకి ముందు సాధకుడు స్నానం చేసి హరిని పూజించాలి. తరువాత తన నిర్మల హృదయ కమలంలో ఆ సుదర్శనాయుధుని నిలుపుకొని ధ్యానించాలి. ఆ తరువాత ఒక మండలాన్ని నిర్మించి అందులో శంఖ, చక్ర, గదా పద్మ భూషణుడైన కిరీటి, భగవానుడైన విష్ణుదేవుని ఆవాహన చేసి గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాది వివిధోపచారాలతో పూజించాలి.


పూజ చివరల్లో మూలమంత్రాన్ని నూటయెనిమిది మార్లు జపించాలి. హే రుద్రదేవా! మూలమంత్రమిదివఱకే చెప్పబడింది కదా! ఆ మంత్ర జపం తరువాత సర్వవ్యాధి దోష, కష్ట వినష్టకమైన ఈ సుదర్శన స్తుతిని శ్రద్ధగా పఠించాలి :


నమః సుదర్శనాయైవ సహస్రాదిత్యవర్చసే ॥

జ్వాలా మాలా ప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే । 

సర్వదుష్టవినాశాయ సర్వపాతక మర్దినే ॥ 

సుచక్రాయ విచక్రాయ సర్వమంత్ర విభేదినే 

ప్రసవిత్రే జగద్ధాత్రే జగద్విధ్వంసినే నమః । 

పాలనార్థాయలోకానాందుష్టాసుర వినాశినే । 

ఉగ్రాయ చైవ సౌమ్యాయ చండాయచ నమోనమః ॥ 

నమశ్చక్షుః స్వరూపాయ సంసార భయభేదినే । 

మాయా పంజర భేత్రేచ శివాయచ నమోనమః ॥ 

గ్రహాతిగ్రహరూపాయ గ్రహాణాం పతయే నమః 

కాలాయ మృత్యవేచైవ భీమాయ చ నమో నమః | 

భక్తానుగ్రహదాత్రే చ భక్త గోప్తే నమో నమః ॥ 

విష్ణురూపాయ శాంతాయ చాయు ధానాంధరాయచ ॥

విష్ణుశస్త్రాయ చక్రాయ నమోభూయోనమోనమః ॥


ఈ స్తోత్రాన్ని వేరేగా చదివినా వచ్చే ఫలం ఇలా వుంటుంది.


ఇతిస్తోత్రం మహత్పుణ్యం 

చక్రస్య తవ కీర్తితం ॥ 

యః పఠేత్ పరయాభక్త్యా 

విష్ణులోకం సగచ్ఛతి | 

చక్రపూజా విధింయశ్చ 

పఠేద్రుద్ర జితేంద్రియః । 

సపాపం భస్మసాత్కృత్వా 

విష్ణులోకాయ కల్పతే ॥ (ఆచార 33/7-16)


ఈ విధంగా ఇది విష్ణులోక ప్రాపకం.


Sunday, 28 January 2024

శ్రీ గరుడ పురాణము (73)

 


శ్రీ వాసుదేవకృష్ణుడే ఈ జగత్తుకి స్వామి. పీతాంబర విభూషితుడు, సహస్ర సూర్య సమాన తేజఃసంన్నుడు, దేదీప్యమాన మకరాకృతిలో నున్న కుండల సుశోభితుడునగు ఆ శ్రీకృష్ణ భగవానుని ముందుగా ప్రతి హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి. తరువాత సంకర్షణ భగవానుని అనగా బలరామదేవుని, ఆపై యథాక్రమంగా ప్రద్యుమ్న, అనిరుద్ధ, శ్రీమన్నారాయణులను ధ్యానించాలి. పిమ్మట ఆ దేవాధిదేవుని నుండి జనించిన ఇంద్రాది దేవతలను కూడా ధ్యానించాలి. మూలమంత్రం ద్వారా రెండు చేతులతో వ్యాపక రూపంలో కరన్యాసం అనంతరం అంగన్యాస మంత్రాలతో అంగన్యాసం నెరవేర్చి సర్వదేవతలనూ పూజించాలి. ఆ న్యాస మంత్రాలనూ, పూజా మంత్రాలనూ వినిపిస్తాను, వినండి:  తరువాత ఓం పద్మాయ నమః అంటూ స్వస్తిక, సర్వతోభద్రాది మండలాలను నిర్మించి ఆ మండలంలో ఇవే మంత్రాలతో దేవతలందరినీ పూజించాలి.


మూలమంత్రాలతో పాద్యాది నివేదనాన్ని గావించి స్నాన, వస్త్ర, ఆచమన, గంధ పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులనర్పించి, ఈ దేవతలకు నమస్కార ప్రదక్షిణలను గావించిన పిమ్మట యధాశక్తి పలుమార్లు మూలమంత్రాన్ని జపించి దాని ఫలాన్ని శ్రీకృష్ణ వాసుదేవ ప్రభునికి అర్పించాలి.


తరువాత వాసుదేవునికి నమస్కరిస్తూ ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి.


ఓం నమో వాసుదేవాయ నమః, సంకర్షణాయ చ ॥


ప్రద్యుమ్నాయాది దేవాయానిరుద్ధాయ నమోనమః


నమో నారాయణాయైవ నరాణాం పతయే నమః ||


నరపూజ్యాయ కీర్త్యాయ స్తుత్యాయ వరదాయచ ||


అనాదినిధనాయై వ పురాణాయ నమోనమః ||


సృష్టి సంహారక కర్తేచ బ్రహ్మణః పతయే నమః ||


నమో వైవేద వేద్యాయ శంఖచక్రధరాయ చ ||


కలి కల్మష హర్తేచ సురేశాయ నమోనమః ||


సంసార వృక్ష చ్ఛేత్రేచ మాయా భేత్రే నమో నమః ||


బహురూపాయ తీర్థాయ త్రిగుణాయ గుణాయచ |


బ్రహ్మవిష్ణ్వీశరూపాయ మోక్షదాయ నమో నమః ॥ 


మోక్షద్వారాయ ధర్మాయ నిర్వాణాయ నమోనమః ।


సర్వకామ ప్రదాయైవ పరబ్రహ్మ స్వరూపిణే ॥


సంసార సాగరే ఘోరే నిమగ్నం మాం సముద్ధర |


త్వదన్యోనాస్తి దేవేశ నాస్తిత్రాతా జగత్ప్రభో ॥


త్వామేవ సర్వగం విష్ణుం గతోఽహం శరణం తతః |


జ్ఞానదీప ప్రదానేన తమోముక్తం ప్రకాశయ ॥ (ఆచార 32/30-37)


Friday, 26 January 2024

శ్రీ గరుడ పురాణము (72)

 


పంచతత్త్వార్చన - విధి


'హే పరమాత్మా! తెలుసుకున్నంత మాత్రాననే సాధకునికి పరమపదాన్ని ప్రాప్తింప చేసే సారతత్త్వంలో భాగమైన పంచతత్త్వార్చన ఒకటున్నదని విన్నాను. మాపై దయ వుంచి దానినుపదేశించండి' అని కోరాడు శివుడు.


లోక కల్యాణం కోసం శంకరభగవానుని ఆరాటాన్ని అర్థం చేసుకున్న ఆదిదేవుడు ఆనందభరితుడై ఇలా చెప్పసాగాడు.


'సువ్రతుడవైన శంకరదేవా! మీకా పంచతత్త్వ పూజావిధిని తప్పక వినిపిస్తాను. ఎందుకంటే ఇది దివ్యం, మంగళస్వరూపం, కల్యాణకారి, రహస్యపూర్ణం, శ్రేష్ఠం, అభీష్ట సిద్ధిప్రదం, కలిదోష వినాశకం, పరమపవిత్రం.


హే సదాశివా! పరమాత్మయు, వాసుదేవుడునైన శ్రీహరి అవినాశి, శాంతుడు, సత్త్వస్వరూపుడు, ధ్రువుడు (నిత్యుడు, అచలుడు అని అర్ధము), శుద్ధుడు, సర్వవ్యాపి, నిరంజనుడు. ఆ విష్ణుదేవుడే తన స్వీయమాయ యొక్క ప్రభావం ద్వారా అయిదు ప్రకారాలుగా కనిపిస్తున్నాడు. ఈ ప్రకారాలు అయిదు రూపాలుగా, తత్త్వముగా పూజింపబడుతున్నాయి. విష్ణువు యొక్క పంచరూపాల వాచక మంత్రాలు వారి పేర్లతోనే ఇలా వుంటాయి.


ఓం అం వాసుదేవాయ నమః, 

ఓం ఆం సంకర్షణాయ నమః, 

ఓం అం ప్రద్యుమ్నాయ నమః, 

ఓం అః అనిరుద్ధాయ నమః, 

ఓంఓం నారాయణాయ నమః ।


సర్వపాతకాలనూ, మహాపాతకాలనూ నశింపజేసి పుణ్యాన్ని ప్రదానం చేసి, సర్వ రోగాలనూ దూరం చేసే, అయిదుగురు మహా దైవతముల వాచకాలే ఈ పంచమంత్రాలు.


ఈ పంచదేవ పూజకై సాధకుడు ముందుగా స్నానం చేసి విధివత్తుగా సంధ్యవార్చి మరల కాలుసేతులు కడుగుకొని పూజామందిరలో ప్రవేశించి ఆచమనం చేసి తమ మనసుకు నచ్చిన ఆసనాన్ని వేసుకొని స్థిరంగా కూర్చుని అం క్షౌం రం అనే మంత్రాలనుచ్చరిస్తూ శోషణాది క్రియలను చేయాలి. అనగా శరీరాన్ని పొడిగా చేసుకోవాలి.