Friday 2 February 2024

శ్రీ గరుడ పురాణము (78)



గాయత్రి న్యాసం - సంధ్యావిధి


శంకరాది దేవతలారా! విశ్వామిత్ర మహర్షి ప్రపంచానికి ప్రసాదించిన అద్భుత మంత్రం గాయత్రి. మిగతా మంత్రాలతో దేవతలను పూజిస్తారు. ఈ మంత్రాన్ని మాత్రమే ఒక స్వరూపాన్నూహించి న్యాసాదులతో పూజిస్తారు. ఈ మంత్రానికి ఋషి విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. మంత్రాధిదేవత సూర్యుడు. దీనికి మస్తకం బ్రహ్మ, శిఖ శివుడు. విష్ణు హృదయమే నివాసము. ఈ మంత్రరూపాన్ని విశ్వరూపంగానే ఊహించాలి. మూడు లోకాలూ ఈ మంత్రానికి చరణాలు. కాబట్టి పుడమిని పాదంగానూ విష్ణువును మొండెం గానూ బ్రహ్మను తలగానూ శివుని శిఖగానూ ఒక స్వరూపాన్ని మనసులో పెట్టుకొని కనులు మూసుకొని గాయత్రి మంత్రాన్ని పన్నెండు లక్షలమార్లు జపించాలి.


ఈ మంత్రానికి మూడు పాదాలుంటాయనేది సర్వవిదితం. కాని, నాలుగో పాదము కూడా ఉంది. జపం చేసుకున్నపుడు మూడు పాదాలనూ, గాయత్రినీ సూర్యునీ పూజించినపుడు నాలుగు పాదాలనూ వాడాలి.


పరో రజసేఽసావదోం అనేది గాయత్రి మంత్రానికి నాలుగవపాదం. సూర్య పూజలోనే కాక ఇతర పూజలలో కూడా ఈ పాదాన్ని ప్రస్తుతం చదవడం కనిపిస్తోంది. జప, ధ్యాన యజ్ఞాది కృత్యాలలోనూ పూజలలోనూ నిత్యం ఈ సర్వపాప వినాశినియైన మంత్రానికి విధ్యుక్తంగా సాధకుడు అంగన్యాసం చేసుకోవాలి.


పాదాలబొటన వ్రేళ్ళు, చీలమండల మధ్యాలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, వెనుకభాగము, అండకోశం, నాడి, నాభి, ఉదరం, ఛాతీ రెండు వైపులు, గుండె, కంఠం, పెదవులు, నోరు, తాలువు, రెండు భుజాగ్రాలు, నుదురు, కనులు, కనుబొమ్మలు, కణతలు, తల - ఈ భాగాలన్నింటిని ఈ మంత్ర న్యాసానికి వినియోగించాలి. తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలోనూ ఈ మంత్ర న్యాసాన్ని చేయాలి.


గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలనూ 24 రంగులలో వర్ణానికొక వర్ణంగా భావించి పూజించాలి. ఒకవేళ గాయత్రికి రూపాన్ని ఆవిష్కరిస్తే ఆ రూపానికి ఈ రంగులుండాలి. ఇంద్రనీలమణి రంగు, అగ్నివర్ణం, పసుపు, నలుపు, కపిల వర్ణం, అగ్ని వర్ణం, పసుపు, నలుపు, కపిల వర్ణం, తెలుపు, మెరుపు తీగ రంగు, ముత్యపు రంగు, కృష్ణ వర్ణం, ఎరుపు, చామనచాయ, వెన్నెల తెలుపు, శుక్ల వర్ణం, లేత పసుపు, పద్మరాగ వర్ణం, శంఖ వర్ణం, పాండుర వర్ణం, ద్రాక్ష ఎరుపు, తేనె రంగు, నలుపు ఎరుపు కలిసిన రంగు, సూర్య వర్ణం, సౌమ్య శ్వేతం, శంఖపు రంగు - ఇలా పంచరంగుల (పంచ వర్ణాల) కళల భేదాలతో ఇరవై నాలుగు అక్షరాలనూ ఒక ఫలకంపై వ్రాసి కూడా పూజించవచ్చు.


No comments:

Post a Comment