Thursday, 25 November 2021

శ్రీ హనుమద్భాగవతము (84)



హనుమంతుడు విభీషణుని గలిసికొనుట


కపికుంజరుడైన శ్రీ పవనపుత్రుడు మూడులోకములచే నమస్కరింపదగినదైన సీతా దేవిని దర్శించుటకై ఎంతో వ్యాకులపడుచున్నాడు. అందువలన ఆయన భయంకరులైన రాక్షసులకు కనబడకుండగా విచిత్రములైన పుష్పమయ ఆభరణముచే అలంకృతమైయున్న లంకలోని ముఖ్యస్థలాలను జాగ్రత్తగా చూడసాగాడు. నగర మధ్య భాగమున రావణుని గూఢచారులెందరో ఆయనకు కనబడ్డారు. అంతేకాదు ఆయన రావణుని అంతఃపురమును జాగ్రత్తగా కాపలాకాయుచున్న శస్త్రసంపన్నులైన ఒక లక్ష మంది సైనికులను కూడా చూసాడు. అంజనానందనుడు దశాననుని అశ్వశాలను, గజశాలను, అస్త్రాగారాన్ని, మంత్రణాలయాన్ని, సైన్యస్థావరాన్ని శ్రద్ధగా చూసాడు. ఆయన సీతా దేవిని అన్వేషిస్తూ రాక్షసుల హర్మ్యములలో ప్రవేశించి వారి ఆహారవిహారములను, పడకలను, మనోరంజనాదుల స్థలాలు మొదలైనవాటిని కూడా చూసాడు.


అచట వీరవరుడైన ఆంజనేయుడు ఐశ్వర్యమదమత్తులైన నిశాచరులను, మద్యపానమత్తులైన రాక్షసులను ఎందఱినో చూసాడు. శ్రీరాముని దూతయైన హనుమంతుడు జగత్రయ విజేతయైన రావణుని లంకలోనూ ఉత్కృష్టమైన బుద్ధిగలవారు, సుందరముగా పలుకువారు, గొప్ప శ్రద్ధగలవారు, అనేక విధములైన రూపములు వర్ణములు గలవారు, సుందరములైన నామములు గలవారైన అసురులనెందఱినో చూసాడు. కాని వారిలో జనకనందిని ఎచ్చటనూ కానరాలేదు. వారి సంభాషణముల వలన కూడా ఆమె ఉనికి తెలియలేదు.


అందువలన కామరూపధారియైన పవనకుమారుడు సీతాదేవి అన్వేషిస్తూ స్వర్ణమయములైన కోటగోడలతో చుట్టబడి ఉన్న రావణుని మహలులోనికి ప్రవేశించాడు. రాజోచితములైన సామగ్రులతో నిండిన శ్రేష్ఠము సుందరమైన ఆ భవనమును చూసి సమీరకుమారుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ భవనద్వారము మిలమిలలాడే బంగారము చేయబడినది. వెండి చే చేయబడిన చిత్రములతో దానిశోభ అద్భుతముగా ఉంది. దాని రక్షణకై శస్త్రములను ధరించిన లక్షల కొలది వీరులు సావధానముగా నిలబడియుంన్నారు. సైనికులందఱు అభేధ్యమైన కవచాలను ధరించి యుంన్నారు. ఏనుగులతోను, గుఱ్ఱములతోను, రధములతోను నిండియున్న ఆ భవనము యొక్క సాటిలేని రూపమును చూసి పవనకుమారుడు ఎంతో చకితుడయ్యాడు, కాని ఆయన నేత్రములు జనక నందినిని అన్వేషించుటలోనే నిమగ్నములై యున్నవి.


సర్వవిద్యావిశారదుడైన హనుమంతుడు ఆ భవనమునకు చుట్టుప్రక్కలనున్న భవనములలో ప్రవేశించి సీతా దేవి జాడను తెలుసుకునే పని ప్రారంభించాడు. ఆయన లంఘించి కుంభకర్ణుని భవనంలోకి ప్రవేశించాడు. అచట నుండి మహోదర విరూపాక్ష విద్యుజ్జిహ్వ విద్యున్మాలురగృహములలోనికి వెళ్ళాడు. ఆ అసురులు అమిత సంపదలను, మహావైభవమును చూస్తు నిర్భయుడైన హనుమంతుడు దూకి వజ్రదంష్టశుక సారణుల గృహములలోనికి వెళ్ళాడు. ఆయన సీతను అన్వేషిస్తూ ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలీల ఇళ్ళకు కూడా వెళ్ళాడు. అచట సీతా దేవి కనబడలేదు. అమితవిక్రమశాలియైన హనుమానుడు రశ్మి కేతు సూర్యశత్రు వజ్రకాయులభవనములోనికి వెళ్ళాడు. సీతా దేవి జాడను తెలుసుకొనుటకు పవననందనుడు ఎంతో శ్రమపడుచున్నాడు. ఆయన ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, చక్రుడు, శరుడు, కపటుడు, హ్రస్వ కర్ణుడు, దంష్ట్రుడు, లోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, ద్విజిహ్యుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలైన సుప్రసిద్ధులైన అసురుల గృహములలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. కాని అచట ఎక్కడ గూడ జానికి దర్శనము కాలేదు.

Wednesday, 24 November 2021

ఆచారాలను తర్వాతి తరాలకు నేర్పాల్సింది పెద్దలే



మన సంస్కృతి, సంప్రదాయలు, మన ఇంటి ఆచారవ్యవహారలు మన తర్వాతి తరాలు కూడా పాటించాలంటే అన్నిటికంటే ముందు కుటుంబాల్లో ఉన్న పెద్దలు శ్రద్ధగా సంప్రదాయలను పాటించాలి. ఇతర దేశాల్లో దీని మీద పరిశోధనలు కూడా జరిగాయి. పిల్లలు ఏది పాటిస్తారని చూడగా, పెద్దలు చెప్పింది చూసి పిల్లలు నేర్చుకోరట, పెద్దల నడవడిని మాత్రమే పిల్లలు చూసి నేర్చుకుంటారని తేలింది.


బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళలో కూడా ఇంట్లో పూజలు చేసుకోవడం రానివారిని కూడా నేను చూసాను. దళిత కుటుంబాల్లో పుట్టినా, తమ పెద్దలు శ్రద్ధగా పాటిస్తున్న ఆచరాన్ని చూసి నేర్చుకుని పాటించే వాళ్ళానీ చూశాను. అంటే బ్రాహ్మణులంతా అలా ఉంటారని కాదు. కాని అదొక్క చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంట్లో ఎవ్వరూ పాటించకున్నా నేర్చుకునేవారు కూడా లేకపోలేదు. అది మినహాయింపు అనుకోండి. దానికి కారనం పూర్వజన్మ వాసన.


మా చిన్నప్పుడు మా బామ్మ, అమ్మ, అమ్మమ్మ మన సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పారు. కార్తిక మాసం మొదలైనవి వచ్చినప్పుడు సాయంకాలం చీకటి పడే సమయానికి బడి నుంచి వచ్చిన మేము కాళ్ళు చేతులు కడ్డుక్కుని శుభ్రంగా ఉంటే ఆవిడ దీపం వెలిగించి దణ్ణం పెట్టుకోమనేవారు. మాతోనూ పెట్టించేవారు. అలా మాకు చిన్నప్పుడే కార్తికమాసం అంటే దీపాలు పెట్టాలని తెలిసింది. మూడవ తరగతి నాటికే మిత్రబృందం (అందరం చిన్నపిల్లలమే) అంతా గుడికి వెళ్ళి, అక్కడ కూడా దీపాలు వెలిగించేవాళ్ళము. కార్తిక సోమవారమని ఇంట్లో ఉపవాసాలు చేస్తుంటే మేమూ చేసేవాళ్ళము. మాతోటి స్నేహితులు కూడా అంతే. అదీగాక సహవాసదోషం కూడా ఉంటుంది గదా. మమ్మల్ని చూసి మా స్నేహితులు కూడా నేర్చుకున్నారు. అప్పట్లో మా పెద్దలు ఆచరించారు కాబట్టే ఇప్పుడు ఎవరూ చెప్పకున్నా పాటిస్తున్నాము.


మనమేమీ పాటించకుండా, కేవలం వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం సమూహాల్లో వచ్చే సందేశాలను చదివి, 'ఫార్వార్డ్' చేస్తూ, అంతరాజలంలో దొరికిన దీపాల చిత్రాలను 'స్టేటస్సులు'గా పెట్టుకుని కూర్చుంటే; మైకులు లౌడ్ స్పీకర్లు పెట్టి అరిచినా లేక షార్ట్-ఫిలంలు తీసినా సరే,  ఈ తరానికి లేదా రాబోయే తరానికి మన సంస్కృతి అందదు. కనుక పెద్దలైనవారు శ్రద్ధగా మన ఆచారాలను పాటించాలి. ఆ పండుగ వాతావరణాన్ని ఇంట్లో కలిగించాలి. అప్పుడే పిల్లలు నేర్చుకుంటారు. దీని గురించి ధూర్జటి చెప్పిన ఒక పద్యం చూడండి. 



మ. మొదలం జేసిన వారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు

ర్మదులై యిప్పటి వార ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న

వ్వదె? రానున్న దురాత్ములెల్లఁ దమత్రోవం బోవరే? యేల చే

సెదరో మీదు దలంచి చూడ కతముల్‌ శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! పాత కాలం వారు ఆచరించిన ధర్మాలను పాటిపెట్టి, అవి పనికిరానివని చెప్పి, తాము ఆచరించేదే ధర్మమని, ఈ తరం వారు అధర్మాలను ఆచరిస్తుంటే దైవం నవ్వకుండా ఉంటుందా? ఎందుకంటావా! రాబోయే తరలావారు కూడా ఈ దుర్మార్గాల పాలై పతనమవ్వరా! పిల్లలకు ఆస్తులు కూడా బెట్టి వారు సుఖంగా ఉండాలని తలచే ఈ మూఢజనులు ఈ విషయంలో ఎందుకు ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తున్నారు?

Tuesday, 23 November 2021

కృష్ణ అంగారక చతుర్థి మహత్యం



కృష్ణ అంగారక చతుర్థి మహత్యం


మంగళవారం వచ్చిన చవితి (చతుర్థి) తిథి వెయ్యి సూర్యగ్రహణాల పుణ్యకాలానికి సమానం. కృష్ణ అంగారక చవితి నాడు గణపతి ప్రీత్యర్ధం ఉపవసించిన భక్తునికి వచ్చే పుణ్యం అనంతం మరియు 1000 పడగల ఆదిశేషునకు సైతం ఆ వైభవాన్ని వివరంచుట వీలుకాదు.


మాఘమాస కృష్నపక్షంలో అంగారక చతుర్థి రావడం చాలా అరుదు మరియు అది గణేశోపాసకులకు అత్యంత విశేషం. ఆ తర్వాత భాద్రపద మరియు కార్తిక బహుళ చతుర్థిలకు ఆ విశేషముంది. మిగితా మాసాల్లో వచ్చిన కృష్ణ అంగారక చతుర్థులకంటే ఇవి చాలా ఫలప్రదం.


ఈ ఏడాది మనకు మాఘమాసంలోనూ మరియు కార్తిక మాసంలోనూ కృష్ణ అంగారక చవితులు వచ్చాయి.


గణపతి ముందు 16 దీపాలను వెలిగించి షోడశ గణపతులను ఆవహన చేసే ప్రక్రియ కూడా ఈరోజు చేస్తారు.


కృష్ణ అంగారక చవితి నాడు గణపతిని పూజిస్తే అతి శీఘ్రంగా ఫలాలు పొందవచ్చు. అందునా ఈ రోజు ఉపవాసం చేస్తే ఏడాదిలో వచ్చి ప్రతి సంకటహర చవితికి ఉపవాసం చేసిన ఫలితం వస్తుందని కొన్ని గ్రంథాల్లో చెప్పగా, 21 సంకటహర చవితులు ఉపవసించిన ఫలం లభిస్తుందని కొన్ని పురాణ గ్రంథాల్లో కనిపిస్తుంది. అంగారక చవితి నాడు గణపతిని ఆరాధిస్తే కుజుడు కూడా ప్రసన్నుడవుతాడు. కుజుడు గణపతి కోసం చేసిన వెయ్యి సంవత్సరాల తపః ఫలితం ఈనాడు గణపతిని ఆరాధించవారికి లభించి, వారు అభివృద్ధి చెందుతారని గణపతి చెప్పాడట.


గణేశాయ నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక |

సంకష్టం హరమేదేవాం గృహణార్ఘ్యం నమోస్తుతే ||


ఓం శ్రీ గణేశాయ నమః 

Monday, 22 November 2021

23 నవంబరు 2021, మంగళవారం, కార్తిక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి.

 


23 నవంబరు 2021, మంగళవారం, కార్తిక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి.


ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, సంకష్టహర చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.


ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.


ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.


ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.)


23 నవంబరు 2021 మంగళవారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.49 నిమి||

మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది

https://www.drikpanchang.com/sankashti/ganadhipa/ganadhipa-sankashti-date-time.html?year=2021


కార్తిక మాసంలో వచ్చిన దీనికి గణాధిప సంకష్టహర చవితి అని పేరు.


ఓం గణాధిపాయ నమః

ఓం గం గణపతయే నమః

శ్రీ హనుమద్భాగవతము (83)



హనుమంతుడు మిక్కిలి సూక్ష్మరూపమును ధరించినా లంకకు హనుమంతుడు మిక్కిలి సూక్ష్మరూపమును ధరించినా లంకకు అధిష్ఠాత్రియైన లంకిణి అనే ఆమె ఆయనన్ చూసింది. అది ఆయనను గద్దించుచు “ఓరీ! నీవెవ్వడవు? దొంగవలె ఈ నగరములోనికి ప్రవేశించుచున్నావు. చావుటకు పూర్వము నీవు నీ రహస్యమును వెల్లడించు'మని పలికింది. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడిట్లా తలచాడు - ‘మొదటనే ఈ వ్యక్తితో వివాదపడటం మంచిది కాదు. రాక్షసులు ప్రోగైతే ఇచ్చటే యుద్ధము ప్రారంభమవుతుంది. సీతా మాతను కనుగొనుటలో అంతరాయమేర్పడుతుంది! వెంటనే ఆయన ఆ వ్యక్తిని స్త్రీగా భావించి తన కుడి చేయి పిడికిలితో మెల్లగా గొట్టాడు. వజ్రమయ దేహుడైన హనుమానుని పిడికిలి పోటుచే లంకిణి నేత్రములు బైరులు గ్రమ్మాయి. అది రక్తము క్రక్కుకొంటూ భూమిపై బడి మూర్ఛిల్లింది. కాని కొద్ది సమయములోనే ఆమె మూర్ఛ నుండి లేచి కూర్చున్నది. 


అప్పుడు లంకిణి వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతునితో 'శ్రీరామదూతవైన హనుమా! నీవు లంకాపట్టణముపై విజయము సాధించావు. పొమ్ము, నీకు శుభమగుగాక! సీతా దేవి కారణముగా దురాత్ముడైన రావణుని వినాశమునకు కాలము సమీపించినది. పూర్వము చతుర్ముఖుడైన బ్రహ్మ నాతో ఇలా పలికాడు. 'త్రేతాయుగమున సాక్షాత్తుగా క్షీరోదధిశాయీ, వినాశరహితుడైన నారాయణుడు దశరథకుమారుడైన శ్రీ రాముని రూపమున అవతరిస్తాడు, ఆయన భార్య, మహామాయారూపిణీ అయిన సీతా దేవిని రావణుడు హరించాడు. ఆమెను ఆన్వేషిస్తూ రాత్రివేళ ఒక్క వానరుడు లంకలోనికి ప్రవేశించాడు. వాని పిడికిలి పోటుచే నీవు కలత చెందుతావు. ఇక రాక్షసవంశమునకు చేటుమూడినదని నీవప్పుడు తెలిసికో! నా అదృష్టవలన సుదీర్ఘ కాలము తరువాత నేటికి నాకా భవాబ్ధిపోతయైన శ్రీ రాముని ప్రియ భక్తుని దుర్లభ సాంగత్యము లభించినది. నేడు నేను ధన్యురాలనైతిని. నా హృదయమున విరాజిల్లు దశరథనందనుడైన శ్రీరాముడు నాపై ఎల్లప్పుడు కృప చూపుగాక.”


తద్భక్తసంగోఽప్యతిదుర్ల భో మమ 

ప్రసీదతాం దాశరధిః సదా హృది ||


(అ.రా. 5–1–57) 

వాయునందనుడు మిక్కిలిసూక్ష్ము బుద్ధిమంతుడైన రూపమును ధరించి, కరుణామయుడైన భగవానుని మనస్సులో స్మరించుకొని అసురరక్షితము, దుర్భేద్యమైన లంకలోనికి ప్రవేశించాడు.

హనుమంతుని సముద్రోల్లంఘన లంకా ప్రవేశములతో పాటు జగజ్జననియైన జానకికి కుడిభుజము, లంకాధిపతియైన రావణునకు ఎడమకన్ను, సురవందితుడైన శ్రీ రామునకు ఎడమపార్శ్వము అదరినవి.


Sunday, 21 November 2021

శ్రీ హనుమద్భాగవతము (82)



ఆంజనేయుడు ఒకమారు నలువైపుల చూసాడు. పిమ్మట అతడు లంకలోనికి ప్రవేశించుటకు ఆలోచింపసాగాడు. దుర్ధర్షుడైన దశానునితో యుద్ధము తప్పదు. అందువలన ఇక్కడ అపరిమితమైన వానరభల్లూక సేనతో స్వామి నివసించటానికి స్థలమును గురించి, ఆహార పానీయములను గురించి తెలుసుకోవాలి. ఈ దుర్గము ఎంతో దుర్గమముగా తోస్తున్నది. అందువలన ఆక్రమణదృష్టితో ఇక్కడి విషయములను ఒక్కొక్క దానిని గురించి తెలుసుకోవటం తప్పనిసరి. కాని ఈ విశాల వేషముతో ఉన్న పగటిపూట వెలుగులో అసురులకు నా ఆగమన రహస్యము తెలియగలదు. అందువలన రాత్రివేళ సూక్ష్మవేషమున దుర్గమమైన ఈ దుర్గములోనికి ప్రవేశించుట తగును అని అతడు ఆలోచించెను. 


ఆంజనేయుడు ఎగిరి ఒక పర్వతమును ఎక్కి, అచటి నుండి లంకాపట్టణమును చూడసాగాడు. ఆ పురము సుదృఢమైన దుర్గమైయుండెను. దాని సౌదర్యము అనిర్వచనీయంగా ఉంది. దానికి నలువైపుల సముద్రముంది; దాని ప్రాకారములు సువర్ణ నిర్మితములైయున్నాయి. దాని ద్వారములన్నీ సువర్ణ నిర్మితములే. ప్రతి ద్వారము మీద ఇంద్రనీల మణినిర్మితములైన వేదికలున్నాయి. అచటి పథములు విస్తృతముగా, స్వచ్ఛముగా, ఆకర్షకముగా ఉన్నాయి. రావణునిచే పాలింపబడు లంకాపట్టణమున ప్రతిస్థలం అందునా సుందరములు నిర్మలజలపూరితములైన జలాశయములున్నాయి. దాని నిర్మాణమున విశ్వకర్మ తన బుద్ధినంతటిని వ్యయము చేసినట్లు కనిపిస్తోంది.


లంకలో అంతట శస్త్రధారులు భయంకరులైన సైనికుల రక్షణవ్యవస్థ చాలకట్టుదిట్టంగా ఉండింది. విదేహా నందినిని హరించి తెచ్చిన తరువాత రావణుడు అచటి రక్షణ వ్యవస్థకు కట్టుదిట్టము చేసాడు. దానికి నలువైపుల ధనుర్బాణములను ధరించిన భయంకరులైన రాక్షసులెందఱో రేయింబవళ్ళు జాగ్రత్తగా పహరా ఇస్తున్నారు.


రాక్షసరాజైన రావణుని పట్టణమైన లంక యొక్క ఈ దృశ్యమును చూస్తూ మహావీరుడైన హనుమానుడు సాయంకాలమునకై ఎదురు చూడసాగాడు. ఇంతలో సాయం కాలమయ్యింది. పవననందనుడు అణిమ అనే సిద్ధిని అనుసరించి ఎంతో సూక్ష్మరూపమును ధరించి మనస్సులో శ్రీరఘునాథుని చరణములకు ప్రణామముల జేసి పవిత్రమైన ఆయన మూర్తిని హృదయంలో నిల్పుకొని లంకలోనికి ప్రవేశించాడు.

Saturday, 20 November 2021

శ్రీ హనుమద్భాగవతము (81)



సురస దేవలోకమునకు వెళ్ళగా ఉగ్రవేగుడైన శ్రీమారుతాత్మజుడు గరుడుని వలె ముందుకు మైనాకవందితుడు, వానరశిరోమణి, శ్రీరామదూత అయిన హనుమానుడు వాయు వేగముతో ఎగురుతున్నాడు. మార్గమున సింహికయైన రాక్షసి సముద్రమున ఎదురపడింది. ఆమె ఆకాశమున ఎగిరి వెళుతుండే ప్రాణులను వాటి ప్రతిబింబములద్వారా లాగి చంపుతుండేది. ఛాయాగ్రాహీణియైన సింహిక సముద్రమునుండి పవనపుత్రుని ఛాయను కూడా పట్టుకొంది. హనుమానుని గమనము ఆగిపోయింది. ఆశ్చర్యపడిన శ్రీ రామదూత నలు వైపుల చూసాడు, కాని అతనికి ఎక్కడా ఏమీ కనబడలేదు. క్రిందకు చూడగా నీటి పై స్థూలశరీరము కలిగిన భయంకరరాక్షసి కనబడింది. అప్పుడు విశాలకాయుడైన హనుమంతుడు వేగముగా సింహికపైకి దూకాడు. భూధరాకారుడు, మహా తేజస్వి, మహాశక్తిశాలీ అయిన పవన పుత్రుని బరువును ఆ రాక్షసి ఎలా సహించగలదు? నలిగి పొడిపొడి అయ్యింది.


హనుమానుడు చేసిన ఈ భయంకర కార్యమును చూచి ఖేచరులు ఆయనను స్తుతిస్తూ ఇలా పలికారు - " కపివరుడా! విశాల కాయము గలిగిన ఈ ప్రాణిని సంహరించి గొప్ప పని చేసావు. ఇక ఇప్పుడు నీవు ఆపదలు లేనివాడవై ముందుకు పోగలవు. వానరేంద్రా! ఏ పురుషునిలో నీవంటి ధైర్యము, తెలివి, బుద్ధి' కౌశల్యము అను ఈ నాలుగు గుణములుంటాయో అతనికి అతని కార్యమున ఎప్పుడూ అసఫలత కలుగదు.


ఆకాశమున సంచరిస్తూ ప్రాణుల వాక్కులను వింటూ పవనపుత్రుడు దక్షిణదిక్కుగా ఎంతో వేగముతో పయనించుచున్నాడు. కొద్ది కాలములోనే అతడు నిర్విఘ్నముగా సముద్ర తటమునకు చేరుకొన్నాడు. అక్కడ వివిధ సుగంధపుష్పములతోనూ, ఫలములతోనూ నిండి యున్న వృక్షములుగల సుందరోద్యానములున్నాయి. అవి తుమ్మెదల ఝంకారముల చేత, అనేక విధములైన సుందరపక్షుల కలరవములచే ప్రతిధ్వనిస్తూ ఉండేవి. అక్కడ మృగశాబకములు క్రీడిస్తూ ప్రసన్నముగా ఇటు ఇటు పరుగెడుతూ ఉండేవి. శీతలమందపవనము వీచుచుండేవి. అది మనోరమదృశ్యము. అచటి నుండి త్రికూట పర్వతశిఖరములపై నిర్మింపబడి నలువైపుల ప్రాకారములతో చుట్టబడియున్న రావణుని లంకానగరము స్పష్టముగా కనబడేది.