Thursday, 25 November 2021

శ్రీ హనుమద్భాగవతము (84)హనుమంతుడు విభీషణుని గలిసికొనుట


కపికుంజరుడైన శ్రీ పవనపుత్రుడు మూడులోకములచే నమస్కరింపదగినదైన సీతా దేవిని దర్శించుటకై ఎంతో వ్యాకులపడుచున్నాడు. అందువలన ఆయన భయంకరులైన రాక్షసులకు కనబడకుండగా విచిత్రములైన పుష్పమయ ఆభరణముచే అలంకృతమైయున్న లంకలోని ముఖ్యస్థలాలను జాగ్రత్తగా చూడసాగాడు. నగర మధ్య భాగమున రావణుని గూఢచారులెందరో ఆయనకు కనబడ్డారు. అంతేకాదు ఆయన రావణుని అంతఃపురమును జాగ్రత్తగా కాపలాకాయుచున్న శస్త్రసంపన్నులైన ఒక లక్ష మంది సైనికులను కూడా చూసాడు. అంజనానందనుడు దశాననుని అశ్వశాలను, గజశాలను, అస్త్రాగారాన్ని, మంత్రణాలయాన్ని, సైన్యస్థావరాన్ని శ్రద్ధగా చూసాడు. ఆయన సీతా దేవిని అన్వేషిస్తూ రాక్షసుల హర్మ్యములలో ప్రవేశించి వారి ఆహారవిహారములను, పడకలను, మనోరంజనాదుల స్థలాలు మొదలైనవాటిని కూడా చూసాడు.


అచట వీరవరుడైన ఆంజనేయుడు ఐశ్వర్యమదమత్తులైన నిశాచరులను, మద్యపానమత్తులైన రాక్షసులను ఎందఱినో చూసాడు. శ్రీరాముని దూతయైన హనుమంతుడు జగత్రయ విజేతయైన రావణుని లంకలోనూ ఉత్కృష్టమైన బుద్ధిగలవారు, సుందరముగా పలుకువారు, గొప్ప శ్రద్ధగలవారు, అనేక విధములైన రూపములు వర్ణములు గలవారు, సుందరములైన నామములు గలవారైన అసురులనెందఱినో చూసాడు. కాని వారిలో జనకనందిని ఎచ్చటనూ కానరాలేదు. వారి సంభాషణముల వలన కూడా ఆమె ఉనికి తెలియలేదు.


అందువలన కామరూపధారియైన పవనకుమారుడు సీతాదేవి అన్వేషిస్తూ స్వర్ణమయములైన కోటగోడలతో చుట్టబడి ఉన్న రావణుని మహలులోనికి ప్రవేశించాడు. రాజోచితములైన సామగ్రులతో నిండిన శ్రేష్ఠము సుందరమైన ఆ భవనమును చూసి సమీరకుమారుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ భవనద్వారము మిలమిలలాడే బంగారము చేయబడినది. వెండి చే చేయబడిన చిత్రములతో దానిశోభ అద్భుతముగా ఉంది. దాని రక్షణకై శస్త్రములను ధరించిన లక్షల కొలది వీరులు సావధానముగా నిలబడియుంన్నారు. సైనికులందఱు అభేధ్యమైన కవచాలను ధరించి యుంన్నారు. ఏనుగులతోను, గుఱ్ఱములతోను, రధములతోను నిండియున్న ఆ భవనము యొక్క సాటిలేని రూపమును చూసి పవనకుమారుడు ఎంతో చకితుడయ్యాడు, కాని ఆయన నేత్రములు జనక నందినిని అన్వేషించుటలోనే నిమగ్నములై యున్నవి.


సర్వవిద్యావిశారదుడైన హనుమంతుడు ఆ భవనమునకు చుట్టుప్రక్కలనున్న భవనములలో ప్రవేశించి సీతా దేవి జాడను తెలుసుకునే పని ప్రారంభించాడు. ఆయన లంఘించి కుంభకర్ణుని భవనంలోకి ప్రవేశించాడు. అచట నుండి మహోదర విరూపాక్ష విద్యుజ్జిహ్వ విద్యున్మాలురగృహములలోనికి వెళ్ళాడు. ఆ అసురులు అమిత సంపదలను, మహావైభవమును చూస్తు నిర్భయుడైన హనుమంతుడు దూకి వజ్రదంష్టశుక సారణుల గృహములలోనికి వెళ్ళాడు. ఆయన సీతను అన్వేషిస్తూ ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలీల ఇళ్ళకు కూడా వెళ్ళాడు. అచట సీతా దేవి కనబడలేదు. అమితవిక్రమశాలియైన హనుమానుడు రశ్మి కేతు సూర్యశత్రు వజ్రకాయులభవనములోనికి వెళ్ళాడు. సీతా దేవి జాడను తెలుసుకొనుటకు పవననందనుడు ఎంతో శ్రమపడుచున్నాడు. ఆయన ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, చక్రుడు, శరుడు, కపటుడు, హ్రస్వ కర్ణుడు, దంష్ట్రుడు, లోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, ద్విజిహ్యుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలైన సుప్రసిద్ధులైన అసురుల గృహములలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. కాని అచట ఎక్కడ గూడ జానికి దర్శనము కాలేదు.

No comments:

Post a Comment