Wednesday, 24 November 2021

ఆచారాలను తర్వాతి తరాలకు నేర్పాల్సింది పెద్దలే



మన సంస్కృతి, సంప్రదాయలు, మన ఇంటి ఆచారవ్యవహారలు మన తర్వాతి తరాలు కూడా పాటించాలంటే అన్నిటికంటే ముందు కుటుంబాల్లో ఉన్న పెద్దలు శ్రద్ధగా సంప్రదాయలను పాటించాలి. ఇతర దేశాల్లో దీని మీద పరిశోధనలు కూడా జరిగాయి. పిల్లలు ఏది పాటిస్తారని చూడగా, పెద్దలు చెప్పింది చూసి పిల్లలు నేర్చుకోరట, పెద్దల నడవడిని మాత్రమే పిల్లలు చూసి నేర్చుకుంటారని తేలింది.


బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళలో కూడా ఇంట్లో పూజలు చేసుకోవడం రానివారిని కూడా నేను చూసాను. దళిత కుటుంబాల్లో పుట్టినా, తమ పెద్దలు శ్రద్ధగా పాటిస్తున్న ఆచరాన్ని చూసి నేర్చుకుని పాటించే వాళ్ళానీ చూశాను. అంటే బ్రాహ్మణులంతా అలా ఉంటారని కాదు. కాని అదొక్క చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంట్లో ఎవ్వరూ పాటించకున్నా నేర్చుకునేవారు కూడా లేకపోలేదు. అది మినహాయింపు అనుకోండి. దానికి కారనం పూర్వజన్మ వాసన.


మా చిన్నప్పుడు మా బామ్మ, అమ్మ, అమ్మమ్మ మన సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పారు. కార్తిక మాసం మొదలైనవి వచ్చినప్పుడు సాయంకాలం చీకటి పడే సమయానికి బడి నుంచి వచ్చిన మేము కాళ్ళు చేతులు కడ్డుక్కుని శుభ్రంగా ఉంటే ఆవిడ దీపం వెలిగించి దణ్ణం పెట్టుకోమనేవారు. మాతోనూ పెట్టించేవారు. అలా మాకు చిన్నప్పుడే కార్తికమాసం అంటే దీపాలు పెట్టాలని తెలిసింది. మూడవ తరగతి నాటికే మిత్రబృందం (అందరం చిన్నపిల్లలమే) అంతా గుడికి వెళ్ళి, అక్కడ కూడా దీపాలు వెలిగించేవాళ్ళము. కార్తిక సోమవారమని ఇంట్లో ఉపవాసాలు చేస్తుంటే మేమూ చేసేవాళ్ళము. మాతోటి స్నేహితులు కూడా అంతే. అదీగాక సహవాసదోషం కూడా ఉంటుంది గదా. మమ్మల్ని చూసి మా స్నేహితులు కూడా నేర్చుకున్నారు. అప్పట్లో మా పెద్దలు ఆచరించారు కాబట్టే ఇప్పుడు ఎవరూ చెప్పకున్నా పాటిస్తున్నాము.


మనమేమీ పాటించకుండా, కేవలం వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం సమూహాల్లో వచ్చే సందేశాలను చదివి, 'ఫార్వార్డ్' చేస్తూ, అంతరాజలంలో దొరికిన దీపాల చిత్రాలను 'స్టేటస్సులు'గా పెట్టుకుని కూర్చుంటే; మైకులు లౌడ్ స్పీకర్లు పెట్టి అరిచినా లేక షార్ట్-ఫిలంలు తీసినా సరే,  ఈ తరానికి లేదా రాబోయే తరానికి మన సంస్కృతి అందదు. కనుక పెద్దలైనవారు శ్రద్ధగా మన ఆచారాలను పాటించాలి. ఆ పండుగ వాతావరణాన్ని ఇంట్లో కలిగించాలి. అప్పుడే పిల్లలు నేర్చుకుంటారు. దీని గురించి ధూర్జటి చెప్పిన ఒక పద్యం చూడండి. 



మ. మొదలం జేసిన వారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు

ర్మదులై యిప్పటి వార ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న

వ్వదె? రానున్న దురాత్ములెల్లఁ దమత్రోవం బోవరే? యేల చే

సెదరో మీదు దలంచి చూడ కతముల్‌ శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! పాత కాలం వారు ఆచరించిన ధర్మాలను పాటిపెట్టి, అవి పనికిరానివని చెప్పి, తాము ఆచరించేదే ధర్మమని, ఈ తరం వారు అధర్మాలను ఆచరిస్తుంటే దైవం నవ్వకుండా ఉంటుందా? ఎందుకంటావా! రాబోయే తరలావారు కూడా ఈ దుర్మార్గాల పాలై పతనమవ్వరా! పిల్లలకు ఆస్తులు కూడా బెట్టి వారు సుఖంగా ఉండాలని తలచే ఈ మూఢజనులు ఈ విషయంలో ఎందుకు ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తున్నారు?

No comments:

Post a Comment