Sunday 21 November 2021

శ్రీ హనుమద్భాగవతము (82)



ఆంజనేయుడు ఒకమారు నలువైపుల చూసాడు. పిమ్మట అతడు లంకలోనికి ప్రవేశించుటకు ఆలోచింపసాగాడు. దుర్ధర్షుడైన దశానునితో యుద్ధము తప్పదు. అందువలన ఇక్కడ అపరిమితమైన వానరభల్లూక సేనతో స్వామి నివసించటానికి స్థలమును గురించి, ఆహార పానీయములను గురించి తెలుసుకోవాలి. ఈ దుర్గము ఎంతో దుర్గమముగా తోస్తున్నది. అందువలన ఆక్రమణదృష్టితో ఇక్కడి విషయములను ఒక్కొక్క దానిని గురించి తెలుసుకోవటం తప్పనిసరి. కాని ఈ విశాల వేషముతో ఉన్న పగటిపూట వెలుగులో అసురులకు నా ఆగమన రహస్యము తెలియగలదు. అందువలన రాత్రివేళ సూక్ష్మవేషమున దుర్గమమైన ఈ దుర్గములోనికి ప్రవేశించుట తగును అని అతడు ఆలోచించెను. 


ఆంజనేయుడు ఎగిరి ఒక పర్వతమును ఎక్కి, అచటి నుండి లంకాపట్టణమును చూడసాగాడు. ఆ పురము సుదృఢమైన దుర్గమైయుండెను. దాని సౌదర్యము అనిర్వచనీయంగా ఉంది. దానికి నలువైపుల సముద్రముంది; దాని ప్రాకారములు సువర్ణ నిర్మితములైయున్నాయి. దాని ద్వారములన్నీ సువర్ణ నిర్మితములే. ప్రతి ద్వారము మీద ఇంద్రనీల మణినిర్మితములైన వేదికలున్నాయి. అచటి పథములు విస్తృతముగా, స్వచ్ఛముగా, ఆకర్షకముగా ఉన్నాయి. రావణునిచే పాలింపబడు లంకాపట్టణమున ప్రతిస్థలం అందునా సుందరములు నిర్మలజలపూరితములైన జలాశయములున్నాయి. దాని నిర్మాణమున విశ్వకర్మ తన బుద్ధినంతటిని వ్యయము చేసినట్లు కనిపిస్తోంది.


లంకలో అంతట శస్త్రధారులు భయంకరులైన సైనికుల రక్షణవ్యవస్థ చాలకట్టుదిట్టంగా ఉండింది. విదేహా నందినిని హరించి తెచ్చిన తరువాత రావణుడు అచటి రక్షణ వ్యవస్థకు కట్టుదిట్టము చేసాడు. దానికి నలువైపుల ధనుర్బాణములను ధరించిన భయంకరులైన రాక్షసులెందఱో రేయింబవళ్ళు జాగ్రత్తగా పహరా ఇస్తున్నారు.


రాక్షసరాజైన రావణుని పట్టణమైన లంక యొక్క ఈ దృశ్యమును చూస్తూ మహావీరుడైన హనుమానుడు సాయంకాలమునకై ఎదురు చూడసాగాడు. ఇంతలో సాయం కాలమయ్యింది. పవననందనుడు అణిమ అనే సిద్ధిని అనుసరించి ఎంతో సూక్ష్మరూపమును ధరించి మనస్సులో శ్రీరఘునాథుని చరణములకు ప్రణామముల జేసి పవిత్రమైన ఆయన మూర్తిని హృదయంలో నిల్పుకొని లంకలోనికి ప్రవేశించాడు.

No comments:

Post a Comment