సురస దేవలోకమునకు వెళ్ళగా ఉగ్రవేగుడైన శ్రీమారుతాత్మజుడు గరుడుని వలె ముందుకు మైనాకవందితుడు, వానరశిరోమణి, శ్రీరామదూత అయిన హనుమానుడు వాయు వేగముతో ఎగురుతున్నాడు. మార్గమున సింహికయైన రాక్షసి సముద్రమున ఎదురపడింది. ఆమె ఆకాశమున ఎగిరి వెళుతుండే ప్రాణులను వాటి ప్రతిబింబములద్వారా లాగి చంపుతుండేది. ఛాయాగ్రాహీణియైన సింహిక సముద్రమునుండి పవనపుత్రుని ఛాయను కూడా పట్టుకొంది. హనుమానుని గమనము ఆగిపోయింది. ఆశ్చర్యపడిన శ్రీ రామదూత నలు వైపుల చూసాడు, కాని అతనికి ఎక్కడా ఏమీ కనబడలేదు. క్రిందకు చూడగా నీటి పై స్థూలశరీరము కలిగిన భయంకరరాక్షసి కనబడింది. అప్పుడు విశాలకాయుడైన హనుమంతుడు వేగముగా సింహికపైకి దూకాడు. భూధరాకారుడు, మహా తేజస్వి, మహాశక్తిశాలీ అయిన పవన పుత్రుని బరువును ఆ రాక్షసి ఎలా సహించగలదు? నలిగి పొడిపొడి అయ్యింది.
హనుమానుడు చేసిన ఈ భయంకర కార్యమును చూచి ఖేచరులు ఆయనను స్తుతిస్తూ ఇలా పలికారు - " కపివరుడా! విశాల కాయము గలిగిన ఈ ప్రాణిని సంహరించి గొప్ప పని చేసావు. ఇక ఇప్పుడు నీవు ఆపదలు లేనివాడవై ముందుకు పోగలవు. వానరేంద్రా! ఏ పురుషునిలో నీవంటి ధైర్యము, తెలివి, బుద్ధి' కౌశల్యము అను ఈ నాలుగు గుణములుంటాయో అతనికి అతని కార్యమున ఎప్పుడూ అసఫలత కలుగదు.
ఆకాశమున సంచరిస్తూ ప్రాణుల వాక్కులను వింటూ పవనపుత్రుడు దక్షిణదిక్కుగా ఎంతో వేగముతో పయనించుచున్నాడు. కొద్ది కాలములోనే అతడు నిర్విఘ్నముగా సముద్ర తటమునకు చేరుకొన్నాడు. అక్కడ వివిధ సుగంధపుష్పములతోనూ, ఫలములతోనూ నిండి యున్న వృక్షములుగల సుందరోద్యానములున్నాయి. అవి తుమ్మెదల ఝంకారముల చేత, అనేక విధములైన సుందరపక్షుల కలరవములచే ప్రతిధ్వనిస్తూ ఉండేవి. అక్కడ మృగశాబకములు క్రీడిస్తూ ప్రసన్నముగా ఇటు ఇటు పరుగెడుతూ ఉండేవి. శీతలమందపవనము వీచుచుండేవి. అది మనోరమదృశ్యము. అచటి నుండి త్రికూట పర్వతశిఖరములపై నిర్మింపబడి నలువైపుల ప్రాకారములతో చుట్టబడియున్న రావణుని లంకానగరము స్పష్టముగా కనబడేది.
No comments:
Post a Comment