Monday, 4 March 2024

శ్రీ గరుడ పురాణము (109)

 


వానప్రస్థి సన్యాసిగా మారి తనువు చాలిస్తాడు. సన్యాసాశ్రమం వేరు.


భిక్షుక వృత్తి ద్వారానే జీవిస్తూ నిత్యం యోగాభ్యాసానురక్తుడై బ్రహ్మప్రాప్తి కోసమే ప్రయాసపడుతూ, జితేంద్రియుడై జీవించువానిని * 'పారమేష్ఠిక సన్యాసి' (* పరమేష్టి అనగా బ్రహ్మ) అంటారు.


ఎల్లప్పుడూ ఆత్మతత్త్వానుసంధానం పైననే ప్రేమను చూపిస్తూ, నిత్యతృప్తులై సంయమ 

నియమాలతో జీవిస్తూ, మహామునులుగా, యోగులుగా, ప్రతిష్ఠితులైన సన్యాసులను 'భిక్షు' 

శబ్దంతో గౌరవిస్తారు. 

భిక్షాచరణము, వేదాధ్యయనం, మౌనావలంబనము, తపము, ధ్యానము, సమ్యక్ జ్ఞానము, వైరాగ్యము - ఇవి సన్యాసాశ్రమి యొక్క సామాన్యధర్మాలు.


జ్ఞాన సన్యాసులనీ, వేద సన్యాసులనీ, కర్మసన్యాసులనీ పారమేష్ఠిక సన్యాసులు మువ్విధాలు. అలాగే యోగులలో కూడ ప్రారంభీ, భౌతిక, అంత్యాశ్రమీ స్థాయులున్నాయి. వీరందరికీ ఆరాధ్యమూ, ఆశ్రయమూ ఒకటే - యోగమూర్తి స్వరూపుడైన పరమాత్మ.


మానవులకు ధర్మం ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. అర్ధం వల్ల కామమనే పురుషార్ధం సిద్ధిస్తుంది. ప్రవృత్తి, నివృత్తి యని రెండు విధాల కర్మలు వేదంలో చెప్పబడ్డాయి. వేద, శాస్త్రానుసారము అగ్ని మున్నగు దేవతలనూ, గురు, విప్రాదులను ప్రసన్నం చేసుకోవడానికి చేయబడు కర్మలు ప్రవృత్తి కర్మలు కాగా, విధిపూర్వక కర్మానుష్టానం ద్వారా చిత్తశుద్ధినీ, ఆత్మజ్ఞానాన్నీ కలిగింపజేసేవి నివృత్తి కర్మలు. క్షమ, దమ, దయ, దాన, నిర్లోభత, స్వాధ్యాయ, సరలత, అనసూయత, తీర్థానుసరణ, సత్య, సంతోష, ఆస్తిక్య, ఇంద్రియనిగ్రహ, దేవార్చనలూ, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ పూజనం, అహింస, ప్రియవాదిత, అరూక్షత, అపైశున్యం, (దర్జా)- ఈ గుణాలన్నీ అన్ని ఆశ్రమాలలోనూ అందరికీ సామాన్య ధర్మాలు.


క్షమాదమో దయా దాన మలోభోఽభ్యాస ఏవచ ॥

ఆర్జవంచాన సూయాచ తీర్థాను సరణం తథా |

సత్యం సంతోష ఆస్తిక్యం తథా చేంద్రియ నిగ్రహః ॥

దేవతాభ్యర్చనం పూజా బ్రాహ్మణానాం విశేషతః |

అహింసా ప్రియవాదిత్య మపై శున్య మరూక్షతా ॥

ఏతే ఆశ్రమికా ధర్మా శ్చాతుర్వర్ణ్య బ్రవీమ్యతః ॥


(ఆచార 49/21-24)


Sunday, 3 March 2024

శ్రీ గరుడ పురాణము (108)

 


అలాగే శూద్రులు రాజ్యాలేలుట వస్తు విక్రయము చేయుట కూడా పురాణాల్లో కనిపిస్తుంది. అనగా శూద్రులే ఆయా వర్ణాల పనులలో సాయపడి పనిని బ్రహ్మాండంగా చేయడంతో వారికి 'వర్ణోన్నతి' ని కల్పించి వారిని వర్ణము వారినిగా గుర్తించి వుంటారు. కాబట్టి హిందువుల్లో కులాల్లేవు. ఇప్పటి కులపు లెక్కలే 'అప్పట్లో' వుండుంటే మహాపద్మనందుడూ, చంద్రగుప్తుడూ మగధ రాజులూ, భారత సమ్రాట్టులూ కాకూడదు కదా! శ్రీకృష్ణుడు భగవంతుడే కాకపోనేమో! వర్ణాలు వర్ణాలే. కులాలు కులాలే.*

 

శిల్ప రచన, పాకయజ్ఞ, సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చేయాల్సిన పనులే. ఇవి వర్ణధర్మాలు. ఇక ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్యాశ్రమాన్ని జీవితపు తొలినాళ్ళలో అందరూ పాటించాలి.

 

భిక్షాచరణ, గురు శుశ్రూష, స్వాధ్యాయము, సంధ్యావందనము, అగ్ని కార్యము. ఇవి బ్రహ్మచారుల ధర్మములు. బ్రహ్మచారులలో రెండు రకాల వారుంటారు. మొదటి రకం ఉపకుర్వాణులు. అంటే శాస్త్రోక్తంగా వేదాదులను ఇతర విద్యలను అధ్యయనం చేసి స్నాతకులై గురుకులాన్ని వీడి జనారణ్యంలోకి పోయి గృహస్థులయ్యేవారు.

 

రెండవ విధం నైష్ఠికులు - అంటే స్నాతకులైన తరువాత కూడా గురుకులంలోనే వుండి చదువుతూ, చదువునే బోధిస్తూ, బ్రహ్మజ్ఞానతత్పరులై, సాధకులై మృత్యుపర్యంతము గురుకులంలో వుండిపోయేవారు.

 

అగ్నికార్యము, అతిధిసేవ, యజ్ఞ, దాన, దేవతార్చనలు- ఇవి గృహస్థుల సంక్షిప్త ధర్మాలు, గృహస్థులలో సాధకులనీ, ఉదాసీనులనీ రెండు ప్రకారాల వారుంటారు. తన పరివారం యొక్క భరణ పోషణలలోనే మగ్నుడై వుండేవాడు సాధకుడు. పితృ, దేవ, ఋషి, ఋణాలను తీర్చుకొని, ఏకాకిగా ధర్మాచరణ చేస్తూ గృహస్థుగా జీవించేవాడు ఉదాసీన గృహస్థు. వీనిని మౌక్షికుడంటారు.

 

ఇక వానప్రస్థం, బాధ్యతలన్నీ తీరిన వారి స్థాయి ఇది. దశలో భూశయనం, ఫల - మూల ఆహారం, వేదాధ్యయనం, తపస్సు, తన సంపత్తిని తన వారికి యధోచితంగా పంచి యిచ్చుట ధర్మాలు. అరణ్యంలో తపస్సు చేసుకుంటూ, దేవార్చన, ఆహుతి ప్రదానం గావిస్తూ, స్వాధ్యాయాన్ని ఇష్టంగా చేస్తూ వుండే వానప్రస్థి తాపసోత్తమునిగా పరిగణింపబడతాడు. తపస్సుద్వారా, శరీరాన్ని శుష్కింపజేసి నిరంతరం భగవత్ ధ్యానంలో వుండే వానప్రస్థి చివరికాలంలో సన్యాసిగా గౌరవింపబడతాడు.


Saturday, 2 March 2024

శ్రీ గరుడ పురాణము (107)

 


వర్ణాశ్రమధర్మాలు

 

వర్ణమంటే కులం కాదు. నాడు పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికీ

నేడు కలికాలంలో రాజకీయాలను శాసిస్తున్న కులానికీ పోలిక లేదు. ఎవరైనా పేర్లను

బట్టి భ్రమపడినా అది హస్తిమశకాంతరమే. వర్ణమనగా వృత్తి. అంతే. అనువాదకుడు

వృత్తులను బట్టి ఆర్యావర్తంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలేర్పడినాయి. సృష్టి స్థితి లయ కారకులైన దేవతల భక్తి విషయంలో భేదాలు లేవు. ఎవరి పూజలు వారు చేసుకోవచ్చు. హరి అన్ని వర్ణాలకీ హరియే. ధర్మాలు వేరు.

 

యజన, యాజన, దాన, ప్రతిగ్రహ, అధ్యయన, అధ్యాపన- ఆరుకర్మలూ బ్రాహ్మణ ధర్మాలు. దానము, అధ్యయనము, యజ్ఞము- ఇవి క్షత్రియులకూ వైశ్యులకూ కూడా సమాన ధర్మాలు, సాధారణ కర్తవ్యాలు. ఇవికాక పరిపాలన, దండన క్షత్రియులకూ, వ్యవసాయం (అంటే పొలాల సేద్యం మాత్రమే కాదు, వ్యాపారం కూడా) వైశ్యులకూ విధ్యుక్త ధర్మాలు. పై మూడు వర్ణాల వారినీ సేవించుట శూద్రుల* ధర్మము.

 

* సేవించుట అనే మాటనే పట్టుకొని పెడర్థాలు తీసి అపార్థాలు సృష్టించి, వర్ణం అనే మాటను అర్ధంతో సహా మరుగున పడేసి, 'కులం' అనే మాటను సృష్టించి, అనర్థం చేశారు పాశ్యాత్యులు. విధంగా వారు హిందూ సంఘాన్ని విభజించి పాలిస్తే వారి మానసపుత్రులైన కొందరు భారతీయ మేధావులు కులతత్త్వాన్ని మరింత ముందుకి సాగదీసుకొనిపోయి ముందుబడిపోయిన వారనీ, వెనుకబడి పోయిన వారని రెండు జాతులను సృష్టించి వారు కలవకుండా జాగ్రత్తపడుతూ రాజకీయ లాభాన్ని పొందుతున్నారు.

 

భారతీయ సమాజంలో ఆదియుగంలో కులాలు లేవు. శూద్రులు ఇతర వర్ణాలను సేవించాలి అంటే నౌకరీ చాకిరీ వారికి చేస్తూ బతకాలని కాదు. వివిధ కర్మల్లో సాయపడాలని మాత్రమే.

 

శూద్రులు తపస్సు చేసి, వేదం చదివి బ్రాహ్మణులగుట బ్రాహ్మణుల చేతనే పూజలందుట పురాణాల్లో కనిపిస్తుంది. నిజానికి పురాణాన్ని మునులకు చెప్తున్నదెవరు?


Friday, 1 March 2024

శ్రీ గరుడ పురాణము (106)

 


విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గర్భగుడి మధ్యలో అనగా గర్భంలోనే పూర్తిగా ప్రతిష్ఠించ కూడదు. అలాగని గర్భానికి దూరంగానూ కారాదు. నువ్వుగింజంత మొగ్గు ఉత్తరం వైపుండాలి.

 

ఓం స్థిరోభవ, శివోభవ, ప్రజాభ్యశ్చనమో నమః, దేవస్యత్వా సవితుః... మున్నగు మంత్రాలతో ఆచార్యుడు యథావిధిగా విన్యాసాలనూ అభిమంత్రణాన్నీ చేయాలి. శాస్త్ర ప్రకారం సంపాత కలశనేర్పాటు చేసి దాని నుండి పడే జలాలతోనే దేవ ప్రతిమకు నిత్య స్నానం చేయించాలి. ప్రతిష్ఠ జరిగిన వెంటనే స్నానం చేయించి ధూప దీపాలతో పరిమళ భరిత సుగంధిత ద్రవ్యాలతో ఆ విగ్రహాన్ని పూజించి అర్ఘ్య ప్రదానం చేసి ప్రణామం చేసి నైవేద్యాన్ని పెట్టి క్షమాపన కోరుకోవాలి.

 

యజమానుడప్పుడు తన శక్తి మేరకు ఋత్విజులందరికీ పాత్రలను, వస్త్రాలను, ఉపవస్త్రాలను, గొడుగులను, విలువైన అందమైన ఉంగరాలను, దక్షిణలను ఇచ్చి సంతుష్ట పఱచాలి. తరువాత సావధానంగా చతుర్థీహోమాన్ని చేయాలి. నూరు ఆహుతులనిచ్చి ఆపై పూర్ణాహుతిని కూడా సమర్పించాలి.

 

విధంగా యజ్ఞం పూర్తి కాగానే ఆచార్యునికి కపిలధేనువు, ముకుటం, కుండలం, ఛత్రం, కేయూరం, కటి సూత్రం, వ్యజనం (పంఖా), వస్త్రాది వస్తువులు, గ్రామం, అలంకృత భవనం - వీటన్నిటినీ దానం చేయాలి. ఆనాడు అక్కడున్న వారందరికీ మంచి భోజనాలు పెట్టాలి. ఇలా చేసిన యజమాని కృతార్థుడౌతాడు. వాస్తుదేవుని ప్రసన్నత వల్ల ఆయనకు ముక్తి కూడా ప్రాప్తిస్తుంది.

 

(అధ్యాయం 48)


Wednesday, 28 February 2024

శ్రీ గరుడ పురాణము (105)

 


ప్రతిహోత తాను అనుష్టించిన ఆజ్యాహుతుల శేషభాగాన్ని యథావిధిగా కలశలలో సమర్పించాలి. అప్పుడు ఆచార్యుడు దేవతా, మంత్ర, అగ్నిసహితంగా తాదాత్మ్య భావనా పూర్తిగా మరల పూర్ణాహుతినిప్పించాలి.


ఆచార్యుడు యజ్ఞమండలము నుండి పైకి వచ్చి సర్వదేవతలకూ బలులివ్వాలి. భూతాలకూ నాగులకూ కూడా బలులివ్వాలి. నిజానికి తిలలూ, సమిధలూ - రెండింటినే విహిత హోమపదార్థాలంటారు. నెయ్యి ఆ రెండిటికీ సహయోగం చేస్తుంది. దాని ప్రాముఖ్యానికి కారణం అది లేనిదే హవనీయ ద్రవ్యం అక్షయం (సంపూర్ణం) కాలేకపోవడం.


ఈ హవనకృత్యంలో పురుష సూక్తం, రుద్రసూక్తం, జ్యేష్ఠసామం, 'తన్నయామి' మంత్రయుక్త భరుండ సూక్తం, మహామంత్ర రూపంగా ప్రసిద్ధమైన నీలరుద్ర సూక్తం, అథర్వకుంభ సూక్తం యథాక్రమంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, తూర్పు, దక్షిణ దిక్కులలో ఆసీనులైన ఋత్విజుల చేత పారాయణం చేయబడాలి. ఈ హవనకర్మలో ఒక్కొక్కదానికి సహస్రాహుతులనివ్వాలి. ఈ ఆహుతులలో వేదమంత్రాలు, దేవతా మంత్రాలు, వేదశాఖల మంత్రాలు, గాయత్రీమంత్రం అన్ని వ్యాహృతులతో ప్రణవ సహితంగా ఘోషింపబడాలి. ఆయా దేవతల యొక్క శిరో, మధ్య, పాద భాగాలకు ఈ ఆహుతులు చేరుతున్నట్టు, కనిపిస్తున్నట్టే భావించుకొని మిక్కిలి ఉత్సాహంతో ఈ కర్మను గావించాలి. చివరగా హోత తానే దేవుడననుకోవాలి.


ఆచార్యుడీ క్రింది మంత్రాలతో దేవ విగ్రహన్యాసాన్ని చేయాలి.


ఓం అగ్నిమీలే (డే) .... ఇరుపాదాలు

ఓం ఇషేత్వేతి .... చీలమండలు

ఓం అగ్నఆయాహి .... జంఘలు

ఓం శం నో దేవీ ... మోకాళ్ళు

ఓం బృహద్రథంతర  ... తొడలు

ఓం దీర్ఘాయుష్ట్వాయ .... హృదయం

ఓం శ్రీశ్చతే .... కంఠము

ఓం త్రాతారమింద్ర .... వక్షస్థలం

ఓం త్ర్యంబక .... కన్నులు

ఓం మూర్ద్ధాభవ .... మస్తకం 


ఆ మంత్రాలను పూర్తిగా చదువుతున్నంత సేపూ భగవానుని ఈ అంగాలను న్యాసం చేయాలని అర్ధము. ఇక లగ్న ముహూర్తంలో హవనంచేయాలి. తరువాత ఓం ఉత్తిష్ట బ్రహ్మణస్పతే... అనే మంత్రం చదువుతూ విగ్రహాన్ని లేపి మంత్రవేత్తయైన ఆచార్యుడు దేవస్యత్వా... అనే మంత్రాన్ని పఠిస్తూ దేవతామూర్తిని పట్టుకొని వేదోక్త పుణ్యాహవాచనాలను ఘోషిస్తూ దేవప్రాసాదానికి అంటే కోవెల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అపుడు వివిధ రత్న, వివిధ ధాతు, తాలౌహద్రవ్య, యథావిధానంగా అనేక ప్రకారాల సిద్ధబీజములతో దిక్పాలురకూ అనేక ఇతర దేవతలకూ (ఈ సామగ్రిని చేత బట్టుకొని) ప్రదక్షిణ చేయాలి. అంతట దేవ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించాలి.


Tuesday, 27 February 2024

శ్రీ గరుడ పురాణము (104)

 


తరువాత కలశకు దగ్గరలోనే కూర్చుని, ఆచార్యుడు, వేదమంత్రోచ్చారణ గావిస్తూ అగ్నిని స్థాపించాలి. ఋగ్వేదవేత్త యగు ఆచార్యానుచరుడొకడు (ఋత్విక్కు) తూర్పు వైపున్న కుండ సమీపంలో కూర్చుని శ్రీసూక్తం, పవమానసూక్తం చదవాలి.


కుండం దక్షిణం వైపున్న అథ్వర్యుడు, యజుర్వేదవేత్త, ఆచార్యుడు రుద్రసూక్తాన్నీ పురుషసూక్తాన్నీ పారాయణం చేయాలి. కుండానికి పశ్చిమ వైపున్న సామవేదీయాచార్యుడు వేదవ్రత, వామదేవ్య జ్యేష్ఠ సామ, రథంతర, భేరుండ నామాలను పఠించాలి. అలాగే కుండానికుత్తరం వైపున్న అథర్వవేదవేత్త, అథర్వశిరస్, కుంభసూక్త, నీలరుద్రసూక్త, మైత్ర సూక్తాలను పారాయణం చేయాలి.


అప్పుడాచార్యుడు అస్త్రమంత్రం ద్వారా కుండాన్ని బాగా ప్రోక్షించి స్వశక్తి మేరకు రాగి లేదా ఏ ఇతర ధాతు నిర్మిత పాత్రలో అగ్నిని గ్రహించి దేవతామూర్తి కెదురుగా వుంచాలి. ఆపై అమృతీకరణం చేయాలి. అనగా కవచమంత్రాలతో అగ్నిని రగుల్కొల్పాలి. తరువాత దానిని వేదమంత్రాలు చదువుతూ పాత్రతో సహా కుండానికి నాలుగు వైపులా తిప్పి ఈ మారు వైష్ణవ యోగంతో మరింత రగుల్కొల్పి ఆ పాత్రతో సహా అగ్నిని కుండం మధ్యలో స్థాపించాలి. దక్షిణం వైపు బ్రహ్మనీ, ఉత్తరంలో ప్రణీతాన్నీ స్థాపించి నాలుగు దిక్కులలోనూ కుశవిష్టరాలను వెదజల్లి ఒక పరిధి నేర్పాటు చేయాలి.


అప్పుడు గురువు త్రిమూర్తులను పూజించి దర్భలపై అగ్నిని కొంతవుంచి, దర్భజలంతోనే ప్రోక్షణం చేయాలి. ఎందుకంటే దర్భలతో, మంత్ర సహాయం అవసరం లేకుండానే దేనినైనా పవిత్రీకరించవచ్చు. అగ్నిలో వుంచి తీసిపెట్టిన దర్భలపై దేవతలు స్వయంగా 

వచ్చి కూర్చుంటారు. అగ్నిని ఈలాగున పవిత్రీకరించిన పిమ్మట ఆచార్యుడు ఆజ్య 

సంస్కారాన్ని చేపట్టాలి. ముందుగా నేతిని ఆహవయోగ్యం చేసుకోవాలి. అనగా దశల 

వారీగా ఆవేక్షణ, నిరీక్షణ, నీరాజన, అభిమంత్రణలను చేసి హవనానికి ముందే 'అభిఘారం' అనే యజ్ఞకార్యాన్ని ముగించాలి. తరువాత నేతితో అయిదేసి ఆహుతులను

రెండు మార్లివ్వాలి. ఇప్పుడు అన్ని అగ్ని సంస్కారాలనూ, గర్భాదానం నుండి గోదాన 

పర్యంతమూ, చేసి ఆచార్యుడు తన వేదశాఖా విహితమంత్రాలతో గాని ప్రణవంతోగాని ఆహుతి ప్రదానం చేయాలి. చివరగా ఆచార్యుడే పూర్ణాహుతిని కూడా ఇవ్వాలి. పూర్ణాహుతి వల్లనే యజమాని కోరికలన్నీ ఈడేరుతాయి.


ఈ విధంగా వేదవిహితంగా ఉత్పన్నమైన అగ్ని అన్ని కార్యాలనూ సిద్ధింపజేయగలదు. అందువల్ల దానిని మరల పూజించి అన్ని కుండాలలోనూ ప్రతిష్ఠితంచేయాలి. ప్రతి కుండము వద్ద ఋత్విక్కులు వారి వారి శాఖా మంత్రాలతో ఇంద్రాది దేవతలందరికీ నూరేసి ఆహుతులను ప్రదానం చేయాలి. పూర్ణాహుతిని సమర్పించి మరల ఆ దేవతలందరికీ ఒక్కొక్క ఆహుతినివ్వాలి.


Monday, 26 February 2024

శ్రీ గరుడ పురాణము (103)

 


ఒక కంచు లేదా రాగిపాత్రలో తేనె, నెయ్యిల మిశ్రమాన్ని తయారుచేయించి అంజనంగా చేసి దానిని బంగరు ముక్క (రేకు) తో తెచ్చి ఆ ప్రతిమ కనులకు పలుమార్లు అంజనమును పూయాలి. ఇలా కాటుక నిడుతున్నపుడు ఓం అగ్నిర్ జ్యోతీతి... అనే మంత్రంతో దేవుని లేదా దేవత నేత్రాలను తుడుస్తుండాలి.


నామకరణాన్ని యజమానియే చేయాలి. ఓం ఇమంమేగాంగేతి... అనే మంత్రంతో మూర్తి నేత్రాలను చల్లబఱచి, ఓం అగ్నిర్మూర్ ద్ధేతి... అనే మంత్రంతో పుట్ట వంటి శాస్త్రోక్త ప్రదేశాల నుండి తెచ్చి కలిపి వుంచిన మట్టిని దేవతామూర్తికి సమర్పించి మారేడు, చెఱకు, రావి, మఱి, మోదుగల నుండి తయారుచేయబడిన పంచకషాయమును తెచ్చి దానితో ఓం యజ్ఞా యజ్ఞేతి.... అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి. పిమ్మట పంచగవ్యాలతో స్నానం చేయించి సహదేవీ, బలా, శతమూలీ, శతావరీ, ఘృత కుమారీ, గుడూచీ, సింహీ, వ్యాఫ్రీ- అను పేళ్ళు గల ఔషధులను కలిపిన నీటితో ఓం యా ఓషధీతి... అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి. ఆపై ఓం యాః ఫలినీతి... అనే మంత్రం ద్వారా ఫలస్నానం చేయించాలి.


తరువాత ఓం ద్రుపదాదివేతి.. అనే మంత్రంతో విద్వాంసులకు అభ్యంగన చేయించాలి. ఉత్తరాది దిశలలోనాలుగు కలశల నుంచి వాటిలో వివిధ రత్నాలను, సప్తధాన్యాలను, శతపుష్పిక (సోంపు వంటిది) యను పేరు గల ఔషధినీ నిక్షేపించాలి. ఆ పై నాలుగు సముద్రాలనూ, నలుదిక్కుల అధిష్టాన దేవతలనూ వాటిలోకి ఆవాహనం చేయాలి. నాలుగు కలశలనూ విడివిడిగా, పాలు, పెరుగు, నీళ్ళపాలు, నెయ్యిలో కాస్త జలములతో నింపి ఆ కుంభాలను క్రమంగా ఆప్యాయస్వ... ధధిక్రావణో..., యా ఓషధీ..., తేజోసి... అనే మంత్రాలతో అభిమంత్రితం చేసి ఇవే చతుస్సముద్రాలని భావించి వాటితో దేవప్రతిమకు స్నానం చేయించాలి.


తరువాత దేవ ప్రతిమను బహుసుదర వేషభూషలతో అలంకరించి గుగ్గిల ధూపం వేయాలి. తరువాత ఇందాకటి కుంభాలను మంత్రించి వాటిలోకి భూమిపైనున్న సమస్త తీర్థ, నదీ, సముద్ర జలాలను ఆవాహన చేసి ఓం యా ఓషధీతి... ద్వారా అభిమంత్రించి మరల దేవప్రతిమను అభిషేకించాలి. ఈ అభిషేకావశిష్ట (మిగిలిన) జలాలతో స్నానం చేసిన వారికి సర్వపాప విముక్తి లభిస్తుంది.


సర్వసాగరస్నానాన్ని ప్రతిమకుగావించిన తరువాత అర్ఘ్య ప్రదానం చేసి ఓం గంధద్వారేతి... అనే మంత్రం ద్వారా సుగంధిత చందనాది పదార్థాలతో ప్రతిమను అనులేపితం చేయాలి. శాస్త్రవిహితంగా దేవమూర్తిని న్యాసం చేయాలి. ఓం ఇమం వస్త్రేతి... అనే మంత్రం చదువుతూ మూర్తికి బట్టలు కట్టి ఓం కవి హావితి... అనే మంత్రాన్నుచ్చరిస్తూ దానిని మండపం మీదికి గొని వచ్చి ఓం శంభవాయేతి... మంత్రంతో శయ్యపై స్థాపించాలి. ఓం విశ్వతశ్చక్షు... మంత్రాన్నుచ్చరిస్తూ మొత్తం పూజా విధానాన్ని పరీక్షించుకొని సరి చూసుకోవాలి. మూల దేవత శిరోభాగంలో రెండు వస్త్రాలచే కప్పబడిన, స్వర్ణయుక్తమైన, ఓంకారముచే పవిత్రీకరింపబడిన కలశ ను స్థాపించాలి.