Wednesday 28 February 2024

శ్రీ గరుడ పురాణము (105)

 


ప్రతిహోత తాను అనుష్టించిన ఆజ్యాహుతుల శేషభాగాన్ని యథావిధిగా కలశలలో సమర్పించాలి. అప్పుడు ఆచార్యుడు దేవతా, మంత్ర, అగ్నిసహితంగా తాదాత్మ్య భావనా పూర్తిగా మరల పూర్ణాహుతినిప్పించాలి.


ఆచార్యుడు యజ్ఞమండలము నుండి పైకి వచ్చి సర్వదేవతలకూ బలులివ్వాలి. భూతాలకూ నాగులకూ కూడా బలులివ్వాలి. నిజానికి తిలలూ, సమిధలూ - రెండింటినే విహిత హోమపదార్థాలంటారు. నెయ్యి ఆ రెండిటికీ సహయోగం చేస్తుంది. దాని ప్రాముఖ్యానికి కారణం అది లేనిదే హవనీయ ద్రవ్యం అక్షయం (సంపూర్ణం) కాలేకపోవడం.


ఈ హవనకృత్యంలో పురుష సూక్తం, రుద్రసూక్తం, జ్యేష్ఠసామం, 'తన్నయామి' మంత్రయుక్త భరుండ సూక్తం, మహామంత్ర రూపంగా ప్రసిద్ధమైన నీలరుద్ర సూక్తం, అథర్వకుంభ సూక్తం యథాక్రమంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, తూర్పు, దక్షిణ దిక్కులలో ఆసీనులైన ఋత్విజుల చేత పారాయణం చేయబడాలి. ఈ హవనకర్మలో ఒక్కొక్కదానికి సహస్రాహుతులనివ్వాలి. ఈ ఆహుతులలో వేదమంత్రాలు, దేవతా మంత్రాలు, వేదశాఖల మంత్రాలు, గాయత్రీమంత్రం అన్ని వ్యాహృతులతో ప్రణవ సహితంగా ఘోషింపబడాలి. ఆయా దేవతల యొక్క శిరో, మధ్య, పాద భాగాలకు ఈ ఆహుతులు చేరుతున్నట్టు, కనిపిస్తున్నట్టే భావించుకొని మిక్కిలి ఉత్సాహంతో ఈ కర్మను గావించాలి. చివరగా హోత తానే దేవుడననుకోవాలి.


ఆచార్యుడీ క్రింది మంత్రాలతో దేవ విగ్రహన్యాసాన్ని చేయాలి.


ఓం అగ్నిమీలే (డే) .... ఇరుపాదాలు

ఓం ఇషేత్వేతి .... చీలమండలు

ఓం అగ్నఆయాహి .... జంఘలు

ఓం శం నో దేవీ ... మోకాళ్ళు

ఓం బృహద్రథంతర  ... తొడలు

ఓం దీర్ఘాయుష్ట్వాయ .... హృదయం

ఓం శ్రీశ్చతే .... కంఠము

ఓం త్రాతారమింద్ర .... వక్షస్థలం

ఓం త్ర్యంబక .... కన్నులు

ఓం మూర్ద్ధాభవ .... మస్తకం 


ఆ మంత్రాలను పూర్తిగా చదువుతున్నంత సేపూ భగవానుని ఈ అంగాలను న్యాసం చేయాలని అర్ధము. ఇక లగ్న ముహూర్తంలో హవనంచేయాలి. తరువాత ఓం ఉత్తిష్ట బ్రహ్మణస్పతే... అనే మంత్రం చదువుతూ విగ్రహాన్ని లేపి మంత్రవేత్తయైన ఆచార్యుడు దేవస్యత్వా... అనే మంత్రాన్ని పఠిస్తూ దేవతామూర్తిని పట్టుకొని వేదోక్త పుణ్యాహవాచనాలను ఘోషిస్తూ దేవప్రాసాదానికి అంటే కోవెల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అపుడు వివిధ రత్న, వివిధ ధాతు, తాలౌహద్రవ్య, యథావిధానంగా అనేక ప్రకారాల సిద్ధబీజములతో దిక్పాలురకూ అనేక ఇతర దేవతలకూ (ఈ సామగ్రిని చేత బట్టుకొని) ప్రదక్షిణ చేయాలి. అంతట దేవ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించాలి.


No comments:

Post a Comment