వానప్రస్థి సన్యాసిగా మారి తనువు చాలిస్తాడు. సన్యాసాశ్రమం వేరు.
భిక్షుక వృత్తి ద్వారానే జీవిస్తూ నిత్యం యోగాభ్యాసానురక్తుడై బ్రహ్మప్రాప్తి కోసమే ప్రయాసపడుతూ, జితేంద్రియుడై జీవించువానిని * 'పారమేష్ఠిక సన్యాసి' (* పరమేష్టి అనగా బ్రహ్మ) అంటారు.
ఎల్లప్పుడూ ఆత్మతత్త్వానుసంధానం పైననే ప్రేమను చూపిస్తూ, నిత్యతృప్తులై సంయమ
నియమాలతో జీవిస్తూ, మహామునులుగా, యోగులుగా, ప్రతిష్ఠితులైన సన్యాసులను 'భిక్షు'
శబ్దంతో గౌరవిస్తారు.
భిక్షాచరణము, వేదాధ్యయనం, మౌనావలంబనము, తపము, ధ్యానము, సమ్యక్ జ్ఞానము, వైరాగ్యము - ఇవి సన్యాసాశ్రమి యొక్క సామాన్యధర్మాలు.
జ్ఞాన సన్యాసులనీ, వేద సన్యాసులనీ, కర్మసన్యాసులనీ పారమేష్ఠిక సన్యాసులు మువ్విధాలు. అలాగే యోగులలో కూడ ప్రారంభీ, భౌతిక, అంత్యాశ్రమీ స్థాయులున్నాయి. వీరందరికీ ఆరాధ్యమూ, ఆశ్రయమూ ఒకటే - యోగమూర్తి స్వరూపుడైన పరమాత్మ.
మానవులకు ధర్మం ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. అర్ధం వల్ల కామమనే పురుషార్ధం సిద్ధిస్తుంది. ప్రవృత్తి, నివృత్తి యని రెండు విధాల కర్మలు వేదంలో చెప్పబడ్డాయి. వేద, శాస్త్రానుసారము అగ్ని మున్నగు దేవతలనూ, గురు, విప్రాదులను ప్రసన్నం చేసుకోవడానికి చేయబడు కర్మలు ప్రవృత్తి కర్మలు కాగా, విధిపూర్వక కర్మానుష్టానం ద్వారా చిత్తశుద్ధినీ, ఆత్మజ్ఞానాన్నీ కలిగింపజేసేవి నివృత్తి కర్మలు. క్షమ, దమ, దయ, దాన, నిర్లోభత, స్వాధ్యాయ, సరలత, అనసూయత, తీర్థానుసరణ, సత్య, సంతోష, ఆస్తిక్య, ఇంద్రియనిగ్రహ, దేవార్చనలూ, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ పూజనం, అహింస, ప్రియవాదిత, అరూక్షత, అపైశున్యం, (దర్జా)- ఈ గుణాలన్నీ అన్ని ఆశ్రమాలలోనూ అందరికీ సామాన్య ధర్మాలు.
క్షమాదమో దయా దాన మలోభోఽభ్యాస ఏవచ ॥
ఆర్జవంచాన సూయాచ తీర్థాను సరణం తథా |
సత్యం సంతోష ఆస్తిక్యం తథా చేంద్రియ నిగ్రహః ॥
దేవతాభ్యర్చనం పూజా బ్రాహ్మణానాం విశేషతః |
అహింసా ప్రియవాదిత్య మపై శున్య మరూక్షతా ॥
ఏతే ఆశ్రమికా ధర్మా శ్చాతుర్వర్ణ్య బ్రవీమ్యతః ॥
(ఆచార 49/21-24)
No comments:
Post a Comment