Tuesday, 27 February 2024

శ్రీ గరుడ పురాణము (104)

 


తరువాత కలశకు దగ్గరలోనే కూర్చుని, ఆచార్యుడు, వేదమంత్రోచ్చారణ గావిస్తూ అగ్నిని స్థాపించాలి. ఋగ్వేదవేత్త యగు ఆచార్యానుచరుడొకడు (ఋత్విక్కు) తూర్పు వైపున్న కుండ సమీపంలో కూర్చుని శ్రీసూక్తం, పవమానసూక్తం చదవాలి.


కుండం దక్షిణం వైపున్న అథ్వర్యుడు, యజుర్వేదవేత్త, ఆచార్యుడు రుద్రసూక్తాన్నీ పురుషసూక్తాన్నీ పారాయణం చేయాలి. కుండానికి పశ్చిమ వైపున్న సామవేదీయాచార్యుడు వేదవ్రత, వామదేవ్య జ్యేష్ఠ సామ, రథంతర, భేరుండ నామాలను పఠించాలి. అలాగే కుండానికుత్తరం వైపున్న అథర్వవేదవేత్త, అథర్వశిరస్, కుంభసూక్త, నీలరుద్రసూక్త, మైత్ర సూక్తాలను పారాయణం చేయాలి.


అప్పుడాచార్యుడు అస్త్రమంత్రం ద్వారా కుండాన్ని బాగా ప్రోక్షించి స్వశక్తి మేరకు రాగి లేదా ఏ ఇతర ధాతు నిర్మిత పాత్రలో అగ్నిని గ్రహించి దేవతామూర్తి కెదురుగా వుంచాలి. ఆపై అమృతీకరణం చేయాలి. అనగా కవచమంత్రాలతో అగ్నిని రగుల్కొల్పాలి. తరువాత దానిని వేదమంత్రాలు చదువుతూ పాత్రతో సహా కుండానికి నాలుగు వైపులా తిప్పి ఈ మారు వైష్ణవ యోగంతో మరింత రగుల్కొల్పి ఆ పాత్రతో సహా అగ్నిని కుండం మధ్యలో స్థాపించాలి. దక్షిణం వైపు బ్రహ్మనీ, ఉత్తరంలో ప్రణీతాన్నీ స్థాపించి నాలుగు దిక్కులలోనూ కుశవిష్టరాలను వెదజల్లి ఒక పరిధి నేర్పాటు చేయాలి.


అప్పుడు గురువు త్రిమూర్తులను పూజించి దర్భలపై అగ్నిని కొంతవుంచి, దర్భజలంతోనే ప్రోక్షణం చేయాలి. ఎందుకంటే దర్భలతో, మంత్ర సహాయం అవసరం లేకుండానే దేనినైనా పవిత్రీకరించవచ్చు. అగ్నిలో వుంచి తీసిపెట్టిన దర్భలపై దేవతలు స్వయంగా 

వచ్చి కూర్చుంటారు. అగ్నిని ఈలాగున పవిత్రీకరించిన పిమ్మట ఆచార్యుడు ఆజ్య 

సంస్కారాన్ని చేపట్టాలి. ముందుగా నేతిని ఆహవయోగ్యం చేసుకోవాలి. అనగా దశల 

వారీగా ఆవేక్షణ, నిరీక్షణ, నీరాజన, అభిమంత్రణలను చేసి హవనానికి ముందే 'అభిఘారం' అనే యజ్ఞకార్యాన్ని ముగించాలి. తరువాత నేతితో అయిదేసి ఆహుతులను

రెండు మార్లివ్వాలి. ఇప్పుడు అన్ని అగ్ని సంస్కారాలనూ, గర్భాదానం నుండి గోదాన 

పర్యంతమూ, చేసి ఆచార్యుడు తన వేదశాఖా విహితమంత్రాలతో గాని ప్రణవంతోగాని ఆహుతి ప్రదానం చేయాలి. చివరగా ఆచార్యుడే పూర్ణాహుతిని కూడా ఇవ్వాలి. పూర్ణాహుతి వల్లనే యజమాని కోరికలన్నీ ఈడేరుతాయి.


ఈ విధంగా వేదవిహితంగా ఉత్పన్నమైన అగ్ని అన్ని కార్యాలనూ సిద్ధింపజేయగలదు. అందువల్ల దానిని మరల పూజించి అన్ని కుండాలలోనూ ప్రతిష్ఠితంచేయాలి. ప్రతి కుండము వద్ద ఋత్విక్కులు వారి వారి శాఖా మంత్రాలతో ఇంద్రాది దేవతలందరికీ నూరేసి ఆహుతులను ప్రదానం చేయాలి. పూర్ణాహుతిని సమర్పించి మరల ఆ దేవతలందరికీ ఒక్కొక్క ఆహుతినివ్వాలి.


No comments:

Post a Comment