ఒక కంచు లేదా రాగిపాత్రలో తేనె, నెయ్యిల మిశ్రమాన్ని తయారుచేయించి అంజనంగా చేసి దానిని బంగరు ముక్క (రేకు) తో తెచ్చి ఆ ప్రతిమ కనులకు పలుమార్లు అంజనమును పూయాలి. ఇలా కాటుక నిడుతున్నపుడు ఓం అగ్నిర్ జ్యోతీతి... అనే మంత్రంతో దేవుని లేదా దేవత నేత్రాలను తుడుస్తుండాలి.
నామకరణాన్ని యజమానియే చేయాలి. ఓం ఇమంమేగాంగేతి... అనే మంత్రంతో మూర్తి నేత్రాలను చల్లబఱచి, ఓం అగ్నిర్మూర్ ద్ధేతి... అనే మంత్రంతో పుట్ట వంటి శాస్త్రోక్త ప్రదేశాల నుండి తెచ్చి కలిపి వుంచిన మట్టిని దేవతామూర్తికి సమర్పించి మారేడు, చెఱకు, రావి, మఱి, మోదుగల నుండి తయారుచేయబడిన పంచకషాయమును తెచ్చి దానితో ఓం యజ్ఞా యజ్ఞేతి.... అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి. పిమ్మట పంచగవ్యాలతో స్నానం చేయించి సహదేవీ, బలా, శతమూలీ, శతావరీ, ఘృత కుమారీ, గుడూచీ, సింహీ, వ్యాఫ్రీ- అను పేళ్ళు గల ఔషధులను కలిపిన నీటితో ఓం యా ఓషధీతి... అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి. ఆపై ఓం యాః ఫలినీతి... అనే మంత్రం ద్వారా ఫలస్నానం చేయించాలి.
తరువాత ఓం ద్రుపదాదివేతి.. అనే మంత్రంతో విద్వాంసులకు అభ్యంగన చేయించాలి. ఉత్తరాది దిశలలోనాలుగు కలశల నుంచి వాటిలో వివిధ రత్నాలను, సప్తధాన్యాలను, శతపుష్పిక (సోంపు వంటిది) యను పేరు గల ఔషధినీ నిక్షేపించాలి. ఆ పై నాలుగు సముద్రాలనూ, నలుదిక్కుల అధిష్టాన దేవతలనూ వాటిలోకి ఆవాహనం చేయాలి. నాలుగు కలశలనూ విడివిడిగా, పాలు, పెరుగు, నీళ్ళపాలు, నెయ్యిలో కాస్త జలములతో నింపి ఆ కుంభాలను క్రమంగా ఆప్యాయస్వ... ధధిక్రావణో..., యా ఓషధీ..., తేజోసి... అనే మంత్రాలతో అభిమంత్రితం చేసి ఇవే చతుస్సముద్రాలని భావించి వాటితో దేవప్రతిమకు స్నానం చేయించాలి.
తరువాత దేవ ప్రతిమను బహుసుదర వేషభూషలతో అలంకరించి గుగ్గిల ధూపం వేయాలి. తరువాత ఇందాకటి కుంభాలను మంత్రించి వాటిలోకి భూమిపైనున్న సమస్త తీర్థ, నదీ, సముద్ర జలాలను ఆవాహన చేసి ఓం యా ఓషధీతి... ద్వారా అభిమంత్రించి మరల దేవప్రతిమను అభిషేకించాలి. ఈ అభిషేకావశిష్ట (మిగిలిన) జలాలతో స్నానం చేసిన వారికి సర్వపాప విముక్తి లభిస్తుంది.
సర్వసాగరస్నానాన్ని ప్రతిమకుగావించిన తరువాత అర్ఘ్య ప్రదానం చేసి ఓం గంధద్వారేతి... అనే మంత్రం ద్వారా సుగంధిత చందనాది పదార్థాలతో ప్రతిమను అనులేపితం చేయాలి. శాస్త్రవిహితంగా దేవమూర్తిని న్యాసం చేయాలి. ఓం ఇమం వస్త్రేతి... అనే మంత్రం చదువుతూ మూర్తికి బట్టలు కట్టి ఓం కవి హావితి... అనే మంత్రాన్నుచ్చరిస్తూ దానిని మండపం మీదికి గొని వచ్చి ఓం శంభవాయేతి... మంత్రంతో శయ్యపై స్థాపించాలి. ఓం విశ్వతశ్చక్షు... మంత్రాన్నుచ్చరిస్తూ మొత్తం పూజా విధానాన్ని పరీక్షించుకొని సరి చూసుకోవాలి. మూల దేవత శిరోభాగంలో రెండు వస్త్రాలచే కప్పబడిన, స్వర్ణయుక్తమైన, ఓంకారముచే పవిత్రీకరింపబడిన కలశ ను స్థాపించాలి.
No comments:
Post a Comment