విగ్రహాన్ని
ఎప్పుడూ కూడా గర్భగుడి మధ్యలో అనగా గర్భంలోనే పూర్తిగా ప్రతిష్ఠించ కూడదు. అలాగని గర్భానికి
దూరంగానూ కారాదు. నువ్వుగింజంత మొగ్గు ఉత్తరం వైపుండాలి.
ఓం స్థిరోభవ,
శివోభవ, ప్రజాభ్యశ్చనమో నమః, దేవస్యత్వా సవితుః... మున్నగు మంత్రాలతో ఆచార్యుడు యథావిధిగా
విన్యాసాలనూ అభిమంత్రణాన్నీ చేయాలి. శాస్త్ర ప్రకారం సంపాత కలశనేర్పాటు చేసి దాని నుండి
పడే జలాలతోనే దేవ ప్రతిమకు నిత్య స్నానం చేయించాలి. ప్రతిష్ఠ జరిగిన వెంటనే స్నానం
చేయించి ధూప దీపాలతో పరిమళ భరిత సుగంధిత ద్రవ్యాలతో ఆ విగ్రహాన్ని పూజించి అర్ఘ్య ప్రదానం
చేసి ప్రణామం చేసి నైవేద్యాన్ని పెట్టి క్షమాపన కోరుకోవాలి.
యజమానుడప్పుడు
తన శక్తి మేరకు ఋత్విజులందరికీ పాత్రలను, వస్త్రాలను, ఉపవస్త్రాలను, గొడుగులను, విలువైన
అందమైన ఉంగరాలను, దక్షిణలను ఇచ్చి సంతుష్ట పఱచాలి. తరువాత సావధానంగా చతుర్థీహోమాన్ని
చేయాలి. నూరు ఆహుతులనిచ్చి ఆపై పూర్ణాహుతిని కూడా సమర్పించాలి.
ఈ విధంగా యజ్ఞం పూర్తి కాగానే ఆచార్యునికి కపిలధేనువు, ముకుటం, కుండలం, ఛత్రం, కేయూరం, కటి సూత్రం, వ్యజనం (పంఖా), వస్త్రాది వస్తువులు, గ్రామం, అలంకృత భవనం - వీటన్నిటినీ దానం చేయాలి. ఆనాడు అక్కడున్న వారందరికీ మంచి భోజనాలు పెట్టాలి. ఇలా చేసిన యజమాని కృతార్థుడౌతాడు. వాస్తుదేవుని ప్రసన్నత వల్ల ఆయనకు ముక్తి కూడా ప్రాప్తిస్తుంది.
(అధ్యాయం 48)
No comments:
Post a Comment