Wednesday 4 September 2013

శరీరంలో పంచమహాభూతాలు

ఓం గం గణపతయే నమః

పరబ్రహ్మ రూపమైన ఓంకార శబ్దంతో క్రమంగా ఆకాశం మహాభూతం రూపుదిద్దుకుంది. ఆకాశం అంటే మనకు కనిపించే మబ్బులు, మేఘాలని కాదు, ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం, శూన్యం అని అర్దం చేసుకోవాలి. ఈ కాలంవారికి చెప్పలంటే స్పేస్ అన్నమాట. అది ఒక మీడియంలా పనిచేసి శబ్దాన్ని వక్త నోటి నుంచి శ్రోత చెవికి చేరవేస్తుంది కనుక ఆకాశం శబ్దగుణానికి సంకేతమైంది.

'ఆకాశాత్ వాయుః' ఈ ఆకాశం నుంచి శబ్దస్పర్శ గుణాలున్న వాయువు పుట్టింది. ఖాళీ ప్రదేశం ఉన్నదని అంటాం కానీ, స్పృసించలేం, అదే గాలి కంటికి కనిపించకపోయినా, మనల్ని గాలి తాకుతుంది. మనం గాలి యొక్క స్పర్శ(ఫీల్) కలుగుతుంది.

వాయువు నుంచి శబ్దస్పర్శ గుణాలతో పాటు రూప గుణం ఉన్న మహాతేజోతత్వమైన అగ్ని వచ్చింది. ఋగ్వేదంలోని మొదటి పదమే అగ్ని. అగ్ని అనంతమైనది అంటుంది వేదం. అగ్ని అంటే కేవలం నిప్పు అనే కాదు, అగ్ని అంటే ఒక శక్తి కూడా. ఈ విశ్వమంతా ఉన్న శక్తియే అగ్ని.

ఈ అగ్ని నుంచి శబ్దస్పర్శరూప గుణములతో పాటు రస గుణం ఉన్న జలం పుట్టింది. రసగుణం అంటే పారే స్వభావం, నీరు ఎత్తునుంచి పల్లానికి పారుతుంది కదా. అలా అన్నమాట.

'ఆపః పృధ్వీ' నీటి నుంచి భూమి ఏర్పడింది. ఈ భూమికి శబ్ద, స్పర్శ, రస, రూప గుణములతో పాటు గంధ(వాసన) గుణము ఉంది. భూమి నుంచి ఏర్పడిన మొక్కలు, వృషాలు, పువ్వులు, వాసన కలిగి ఉంటాయి. అంతెందుకు భూమి కూడా మంచి వాసన కలిగి ఉంటుంది. ఈ విధంగా పంచమహాభూతాలు ఏర్పడ్డాయి. అన్నిటికంటే చివరగా ఏర్పడింది కనుక ఈ భూమిలో పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు(శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు) ఉన్నాయి.

ఈ భూమి నుంచే ఓషధులు ఉధ్భించాయి. ఓషధులు అంతే ఉషః కాలము(సూర్యోదయ వేళ)నందు ఆహారం తయాతుచేసుకోనేవని అర్దం. అవే మొక్కలు, వృక్షాలు మొదలైనవి. ఈ ఓషధుల నుండే అన్నం వచ్చింది. అన్నం అంటే ఎప్పుడు మనం బియ్యాని ఉడికించుకుని తినే పదార్ధం అని భావించకూడదు. అన్నం అంటే ఆహారం. అది ఏదైనా కావచ్చు. ఒక్కో ప్రాంతాన్ని, ఒక్కో దేశాన్ని బట్టి వారి ఆహారం మారుతుంది. అయిన అది కూడా అన్నమే అంటుంది శాస్త్రం. అందువల్ల ఓషధుల నుంచి మంచి పుష్టికరమైన పండ్లు, కాయలు, కూరలు, విత్తనాలు, ఆకులు, దుంపలు, మకరందం మొదలైనవి వచ్చాయి.

ఈ అన్నం నుంచి క్రమంగా పురుషుడు(పురుషుడంటే స్త్రీలు, పురుషులు, ఇతర జంతువులు అని ఇక్కడ అర్దం) ఏర్పడ్డాడు. మానవశరీరం పంచభూతాత్మకమైనది. శరీరంలో ఈ పంచమహాభూతాలు ఉంటాయి.      

No comments:

Post a Comment