Thursday 27 November 2014

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తత్త్వం

అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం - ఈ నాలుగు పంచభూతాత్మకమైన సృష్టికి ఆధారమైనవి. ఇందులో అవ్యక్తం - పరమశివుడు, వ్యక్తం - పార్వతీ దేవి, మహత్ తత్త్వం గణపతి, అహకారం కుమారస్వామి. నిజానికి ఒక పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.

'అహంకారం' అంటే లోకంలో అనుకునే గర్వం అను భావం కాదు, 'నేను' అనే స్పృహని అహంకారం అంటారు. ఈ సృష్టి వ్యష్టిగానే కాక, సమిష్టిగా కూడా ఉంటుంది. ఈశ్వరుని పరమగానూ ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభమవుతుంది.

చైతన్యం ఒక్క లక్షణం-అహంకారం. ఈ సృష్టిలో కృతిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా ....... మానవుని మెదడు వంటి జ్ఞాపకశక్తి గల యంత్రన్ని తయార్ చేయవచ్చు. కానీ దానికి 'నేనీ పని చేస్తున్నాను' అనే అహంభావం - స్పందన ఇవ్వలేం. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ, కేంద్రం ఈ 'అహం' తత్త్వమే.

ఈ అహంతత్త్వానికి ప్రతీక - సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలో ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక 'గుహః' అని స్వామిని అన్నారు. జ్ఞానలక్షణం గల తత్త్వం కనుక గురుగుహ అన్నారు.

అమోఘమైన శివతేజాన్ని ధరించిన తత్త్వం కనుక 'శక్తిధరుడు' అని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని అన్నారు.

- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

No comments:

Post a Comment