Sunday 11 March 2018

హిందూ ధర్మం - 261 (కర్మసిద్ధాంతం- ఉపోద్ఘాతం (పరిచయం))



ఇప్పుడు మనం సనాతన ధర్మానికి మూల సిద్ధాంతమైన కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాము. కర్మ- పునర్జన్మ అనేవి సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన సిద్ధాంతాలు. సనాతన ధర్మం నుంచి ఉద్భవించిన ఇతర మతాలైన బౌద్ధం, జైనం కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. నిజానికి భారతదేశంలో, ముఖ్యంగా ఈ తరంలో పుట్టిన హిందువులకు మాత్రమే కర్మసిద్ధాంతం గురించి ఏ కొద్ది అవగాహాన కూడా లేదు. ఇది హిందువులకు అర్ధమైతే, సనాతన ధర్మం కంటే గొప్ప హేతువాదం ఈ ప్రపంచంలో లేదని, అసలు ధర్మంలో మూఢనమ్మకమనేది లేనేలేదని అర్ధం చేసుకోవచ్చు. ఇతర దేశాల్లోని అన్యమతస్థులు సనాతన ధర్మాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపే ప్రధాన కారణాల్లో కర్మసిద్ధాంతం ఒకటి. మనకూ అన్యమతాలకు మధ్యనున్న బేధాల్లో ముఖ్యమైనది కర్మ - పునర్జన్మ సిద్ధాంతం. క్రైస్తవం, ఇస్లాం మొదలైన మతాలను కర్మను, పునర్జన్మను అంగీకరించవు.

అసలు మనకే ఎందుకీ కష్టాలు? ఈ ప్రపంచంలో కొందరికి డబ్బు బాగా ఉంటుంది, పెద్ద పెద్ద మేడల్లో, విందు భోజనాలతో, బంధుమిత్రులతో, వైభవోపేతంగా జీవిస్తారు. కొందరికి రోజూ అన్నం దొరకడమే గగనం. నా అన్నవారు ఉండరు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, తల దాచుకోవడానికి నీడ ఉండదు. ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటారు. కొందరికి సుఖం, కొందరికి దుఃఖం, కొందరికి ఆనందం, కొందరికి విచారం. అంతెందుకు ఒకరి జీవితంలోనే కలిమిలేములు. కొన్నాళ్ళు ఆనందం, కొన్నాళ్ళు విచారం. కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యం, ఇంకొన్నేళ్ళు అనారోగ్యం. 
కొందరేమో ఉన్నదంతా దానం చేసే గుణం కలిగి ఉంటారు, ఇంకొందరు ఎంత ఉన్న, ఎంగిలి మెతుకులు కూడా విదల్చరు. ఎంత వ్యత్యాసం. కొందరు ఇతరుల మేలు కోసమే జీవిస్తే, ఇంకొందరు పక్కవాళ్ళకు హాని చేయడం కోసం జీవనం సాగిస్తున్నారు. ఎంత విభిన్నమైన మనస్తత్త్వాలు. అదీ ఒకే ప్రపంచంలో.

అసలు దేవుడే లేడనే నాస్తికులను పక్కన పెడితే ఈ సృష్టి అంతా భగవంతుడే చేశాడు, లేదా ఈ సృష్టి భగవంతుని నుంచే వచ్చింది అని నమ్మే ఆస్తికులు వీటిని చూసి ఏమనుకుంటారు? నిజంగా దేవుడనేవాడు ఉంటే కొందరికి ఇచ్చి, కొందరికి ఇవ్వక, కొందరికి పెట్టి, కొందరికి పెట్టక, కొందరిని అందంగా, కొందరిని అందవిహీనంగా ఎందుకు పుట్టించాడు? కొందరికి సద్బుద్ధి, కొందరికి దుర్భుద్ధి ఎందుకు ఇచ్చాడు? కొందరికి మాత్రమే సంపదలు ఎందుకిచ్చాడు? కొందరిని పేదరికంలో మగ్గేలా ఎందుకు చేశాడు? కొందరికెమో ధీర్గాయుష్షు, కొందరికేమో అల్పాయుష్షు? ఇదంతా పక్షపాతం కాదా? పక్షపాతం గలవాడు దేవుడౌతాడా?.... ఇలాంటి ప్రశ్నాలు అనేకం వస్తాయి. వీటికి సనాతన ధర్మంలో చెప్పబడిన కర్మ సిద్ధాంతం తప్ప మరే ఇతర మతం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే అక్కడ సమాధానం లేదు. 

ఇలా మనకు తలెత్తే ఎన్నో ప్రశ్నలకు సమాధనం చెప్పగల కర్మసిద్ధాంతాన్ని తెలుసుకుందాము. 


ఇంకా ఉంది.....

No comments:

Post a Comment