Sunday 18 March 2018

ఉగాది పచ్చడి - మనం మరిచిన ఆహారశైలి



ఉగాది అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వేపపువ్వుతో చేసిన ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు కలిగి ఉండటం, ఈ ఋతువులో వచ్చిన కొత్త బెల్లం, కొత్త చింతపండుతో దీన్ని చేయడం ప్రత్యేకత. ఈ పచ్చడి మనకు ఎన్నో సందేశాలను ఇస్తుంది. అయితే దాంతో పాటు ఇప్పుడు మనం మరిచిన మరొక విషయం కూడా గుర్తు చేస్తోంది.

నిత్యం స్వీకరించే భోజనం షడ్రసోపేతంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. షడ్రసోపేతం అంటే ఏంటో అనుకునేరు. ఆరు రకాల రుచులు కలిగి ఉండాలని అర్ధం అన్నమాట. అవే తీపి, వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పదనం. ఈ ఆరింటిని షడ్రుచులు అంటారు. మన శరీరంలో కఫ, వాతం, పైత్యం అని మూడు దోషాలుంటాయి. ఆ మూడు సమతుల్యతతో ఉండటమే ఆరోగ్యం. ఆ మూడింటిలో ఏ ఒక్కటి చెడినా, లేదా వాటిలో అసమతుల్యత ఏర్పడినా, ఏదో ఒక రోగం వస్తుంది. మనకు వచ్చే ప్రతి రోగానికి ఈ మూడు దోషాల మధ్య అసమతౌల్యమే కారణం కనుక ఆయుర్వేదంలో ఇచ్చే ఔషధాలు, దేహంలో విజృంభించిన ఆ దోషాన్ని నివారించి, సమతౌల్యం ఏర్పరుస్తాయి. అయితే ఈ రోజు మనం చూసుకుంటే, మన పళ్ళెంలో 6 రకాల రుచులు ఉండనే ఉండవు. మనకు వీటిలో ఏదో ఒక రుచి అంటేనే ఎక్కువ ఇష్టం. నిజానికి చాలామంది ఆరింటిలో, మూడైనా తింటారా అంటే అదీ లేదు. ఒక్కటే రుచితో సరిపెట్టుకుంటారు. కొందరు తినడానికి డబ్బు లేక, అలా చేస్తే, ఇంకొందరు ఏదో ఒక రుచి మీద ఇష్టంతో అలా చేస్తారు. ఎలా చూసినా, కేవలం ఒక రుచిని అధికంగా స్వీకరించడం వలన శరీరంలో త్రిదోషాల మధ్య సమతుల్యం చెడుతుంది. అందుకే ఇప్పుడు మనకు అనేక రకాల రోగాలు వస్తున్నాయి.

నిజానికి ఈ షడ్రుచులు కలిగిన ఆహారం తీసుకుంటున్నామంటే పోషకవిలువలు కలిగిన ఆహారం తింటున్నామనే అర్ధం. ఎందుకంటే ఒక్కొక్క రుచి, ఒక్కో రకం ఆహారంలో లభిస్తుంది. అదే సమయంలో ఇంకొక్క విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమైననత వరకు దేశీమైన ఆహారాన్నే స్వీకరించాలి. ఉదాహరణకు కారం తగలడానికి మనం మిరపకాయను వాడతాము. ఈ మిరపకాయ ఎక్కడిది అనేది ప్రశ్న. నిజానికి మిరపకాయ మన దేశంలో పుట్టిన పంట కాదు. అది విదేశాల నుంచి ఈ దేశానికి మధ్యకాలంలో ప్రవేశించింది. మన దేశానికి చెందిన కారం రుచి కలిగిన వస్తువు, మిరియాలు. ఇది సహజంగానే భారతదేశానికి చెందిన మొక్క. అంటే దేశీయమైనవి. అందుకే మీకు ఆయుర్వేద వైద్యంలో మిరియాలు వాడటం కనిపిస్తుంది కాని మిరపకాయ ప్రస్తావన ఉండదు. అంతెందుకు ఉగాది పచ్చడిలోనే మిరపకాయ చేరిపోయింది. అలాంటిదే ఆలుగడ్డ. అది ఆంగ్లేయులు మన దేశానికి తీసుకువచ్చారు. ఇలాంటి విదేశీ వస్తువులను పెద్ద పెద్ద ఆలయాల వంటల్లో వాడరు. అందుకు ఉదాహరణ పూరీ క్షేత్రం. అక్కడ చేసే ప్రసాదాల్లో మిరప, ఆలుగడ్డ మొదలైనవి కనిపించవు. 

దీనిలో అర్ధం ఒకటే. ఈ ప్రకృతి జడపదార్ధం కాదు. దానిలో చైతన్యం ఉంది. అది సాక్షాత్తు భగవంతుని వ్యక్తీకరణ అని సనాతన ధర్మం విశ్వసిస్తుంది. ఒక్కో ప్రాంతానికి తగినట్టుగా, వాతావరణ పరిస్థితులు, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భగవంతుడు ఒక్కో ప్రాంతంలో నివసించే ప్రజలకు ఒక్కో రకమైన ఆహారపంటను ఇచ్చాడు. అది ఆయ ప్రాంతాల వారి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేకూర్చేదిగాను మరియు త్రిదోషాలను సమతుల్యంలో ఉంచేదిగానూ ఉంటుంది. కనుక ఎక్కడ పండిన వస్తువులను ఆ ప్రాంతం వారు తినడమే ఉత్తమము. ఆ లెక్కన మనం కూడా సాధ్యమైనంతవరకు దేశీ ఆహార పదార్ధాలనే ఉపయోగించాలి.

ఇలా మనం షడ్రసోపేతమైన దేశీ ఆహారాన్ని నిత్యం స్వీకరిస్తే, మధుమేహం, రక్తపోటు, హృద్రోగాలు మొదలైన భయానక జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు. ఈ ఉగాది మనకు అలాంటి విషయాలను గట్టిగా గుర్తు చేసి, జీవితంలో దాన్ని ఆచరించేందుకు ప్రేరణ కలిగించేది కావాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 

No comments:

Post a Comment