Showing posts with label కర్మసిద్ధాంతం. Show all posts
Showing posts with label కర్మసిద్ధాంతం. Show all posts

Sunday, 3 February 2019

హిందూ ధర్మం - 277 (కర్మసిద్ధాంతం- 17)



స్వామి శివానంద ఇంకా ఈ విధంగా చెప్తున్నారు....
సంస్కారాలన్నీ చిత్తంలో నిద్రాణ స్థితిలో ఉంటాయి. కేవలం ఈ జన్మ సంస్కారాలే కాదు, గత జన్మ సంస్కారాలు, అనాది కాలం నుంచి ఉన్న సంస్కారాలన్నీ చిత్తంలో గుప్తంగా, నిద్రాణ స్థితిలో ఉంటాయి. జంతుజన్మ సంస్కారాలు, దేవ సంస్కారాలు, పేదవాడి జన్మ సంస్కారాలు, ధనిక జన్మ సంస్కారాలన్నీ చిత్తంలో దాక్కుని ఉంటాయి, లేదా దాచి పెట్టబడి ఉంటాయి. ఈ మానవ జన్మలో, ఈ జన్మకు ఏ సంస్కారాలు తగినవో, అవి మాత్రమే బయటకు వచ్చి కార్యం నిర్వర్తిస్తాయి. ఇతర సంస్కారాలు నిగూఢంగా నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఏ విధంగా అయితే ఒక వర్తకుడు సంవత్సరాంతంలో పాత లెక్కల పద్దు మూసివేసి కొత్త లెక్కల పద్దు తెరిచినప్పుడు, గతంలో ఉన్న పాత వస్తువుల వివరాలన్నీ అందులో నిక్షిప్తం చేయడం కాకుండా, కేవలం బ్యాలెన్స్ మాత్రమే అందులో పొందు పరుస్తాడు. ఎందుకంటే కొత్తగా మొదలుపెట్టిన పద్దులో గతంలో జరిగిన వ్యాపారం యొక్క స్థితిని ఈ బ్యాలెన్స్ చూపెడతాయి. అలాగే ఆత్మ లేదా జీవుడు, గత జన్మ యొక్క తన అనుభవాలను, తన గుర్తులను పొందుపరిచి, దాని యొక్క సారాన్ని కొత్తగా ఏర్పడిన జన్మలో వాడుకునేందుకు నిగూఢంగా చిత్తంలో దాచిపెడతాడు. ఇదే నిజమైన జ్ఞాపకము. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన మెదడులో ఉన్న ఒక విధమైన మానసిక సామాగ్రి. 

స్థూల శరీరము మరియు మనసుకు, గతంలో చేసుకున్న కర్మలవలన, ఒక విధంగా ప్రవర్తించే తీరు ఉంటుంది మరియు మనం కూడా దానికి అనుగుణంగానే వర్తిస్తాము. వీటికి మనమే కర్త అనుకొని పొరబడి పరిస్థితిని మరింత తీవ్రతరం చేసుకుంటాము. మనం చేసే చాలా కర్మలు మనకు తెలిసినా, తెలియకున్నా, వాటంతట అవే మన ప్రయత్నం లేకుండానే జరుగుతాయి. నిష్కామ కర్మ యొక్క స్ఫూర్తితో మీరు మీ కర్మలను చేయడం కష్టం అనిపించినప్పుడు, అన్ని కర్మలను త్యజించడంలో కోరిక కలిగి ఉండండి.

స్వర్గంలో, మానవ లేదా భౌతిక జీవనం యొక్క అన్ని అనుభూతులు వేరు చేసి విశ్లేషించి పెడతాయి. వాటి యొక్క సారం తీసుకోబడుతుంది. జీవుడు మరలా భౌతిక జగత్తులో, కొత్త శరీరంతో పుట్టినప్పుడు, గతంలో ఏర్పడిన మానసిక స్థితి, అనుభవాల ఆధారంగా, మనస్సు ప్రవర్తిస్తుంది. మీరు ఒక నాటకం రాస్తున్నప్పుడు, నిద్ర వస్తే మీరు వెంటనే అన్ని పక్కన పెట్టెసి నిద్రపోతారు. మీరు ఎక్కడైతే గత రాత్రి రాయడం ఆపారో, అక్కడి నుంచి తిరిగి మొదలు పెడతారు. అలాగే మీరు కొత్త జన్మ తీసుకున్నప్పుడు, గత జన్మలో మీరు ముగించకుండా వదిలేసిన కర్మల ఒక్క వాసనలు ఈ జన్మలో కూడా మీ మనసుపై ప్రభావం చూపుతాయి. మీరు తిరిగి ఆ పనులను ఎక్కడ ఆపారో, అక్కడ నుంచే మొదలు పెట్టి కొనసాగిస్తారు. రాబోయే జన్మకు కూడా మీరు ఈ జన్మలో చేసిన కర్మ ఆధారంగానే ఉంటుంది. 

ఈ ప్రపంచంలో మనిషి నిరంతరం ఎన్నో పనులు చేస్తాడు మరియు ఏ విధంగా కూడా ఎక్కువ హాని చేయకుండా ఎన్నో పనులు చేయవచ్చు. అయితే పదే పదే ఎన్నో పనులు ఇతరులకు హాని చేయకపోయినప్పటికీ, మనకు హానీ చేసేవి కూడా ఉంటాయి. వాటిని నిజాయితీగా ఆత్మసాక్షాత్కారం పొందగొరే సాధకులు, పాపకర్మను పదే పదే చేస్తే ఖచ్ఛితంగా అధోగతి పాలవుతారు. 

సంస్కారాల మీద మనసు తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. సంస్కారాల నుంచి వాసనలు గుంపులు గుంపులుగా ఉద్భవిస్తాయి. దాని నుంచి కోరిక అనే వాగు ప్రవహిస్తుంది. ఆ వాగు నుంచి వస్తువులను అనుభవించాలి అనే తృష్ణ బయలుదేరుతుంది. తృష్ణ చాలా శక్తివంతమైనది. సంస్కారాలన్నీ మనసులో, కారణశరీరంలో నిక్షిప్తమై ఉంటాయి. అక్కడి నుంచి మనసులోనే ఆ వస్తువును అనుభూతి చెందాలనే సంకల్పం ఉద్భవిస్తుంది. అప్పుడు మనస్సు దాని గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. కల్పనా/భ్రాంతి/ ఊహలోనే మాయ తన శక్తిని దాచి ఉంచుతుంది. అక్కడి నుంచి బంధం మొదలవుతుంది. మనసు ఏ విధంగానైనా ప్రణాళికను రచించి దాన్ని పొందేందుకు ప్రయత్నిస్తుంది. మీరు కోరిక వలలో చిక్కుకుపోతారు. ఆ వస్తువులను పొంది భౌతికంగా అనుభవించాలన్న తపన మీకు కలిగి, వాటిని పొందేందుకు మీ ప్రయత్నాలు మొదలుపెడతారు. మీ ప్రయత్నాల్లో మీకు కొన్నిటి మీద ఇష్టం కలుగుతుంది, కొన్నింటి మీద అయిష్టం కలుగుతుంది. ఫలితంగా మీరు చేసిన పాప పుణ్యాలకు తగిన ఫలం అనుభవించాలి. రాగద్వేషాలు, పాపపుణ్యాలు, సుఖదుఃఖాలు అనే ఆరు ఆకుల సంసారచక్రం అనాదికాలం నుంచి ఆగకుండా తిరుగుతూనే ఉంది. 

ఇంకా ఉంది....  

Sunday, 20 January 2019

హిందూ ధర్మం - 276 (కర్మసిద్ధాంతం- 16)



సంస్కారాల మీద సంయమం

సంస్కారాన్ని నిద్రావ్స్థలో ఉన్న శక్తి అని కూడా అంటారు. ఎప్పుడైతే వృత్తులు లేదా ఆలోచనలన్నీ సమసిపోతాయి, అప్పుడు మనస్సు అనే రూపం సంస్కారాలతో కలిసి ఉంటుంది. దీన్నే వేదాంత పరిభాషలో 'అంతఃకరణ మాత్రము' అంటారు.

అన్ని సంస్కారాలు మనసులో కలిసే ఉంటాయి. వృత్తులు క్రమంగా అణిగి, వాటి యొక్క జాడలలను మనసులో నిలిపుతాయి. ఈ జాడలే సంస్కారాలు. ఈ సంస్కారాల నుంచే జ్ఞాపకాలని పుడతాయి. మీకు యోగదృష్టి ఉంటే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిలో ఈ వృత్తులు మనసు అనే సరస్సు నుంచి ఎలా పైకి లేస్తున్నాయి, అవి తిరిగి ఎలా కిందకి అణిగిపోతున్నాయి, సంస్కారం ఎలా ఏర్పడుతోంది అనేది మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. అది మీరు చూసి ఆశ్చర్యచకితులవుతారు. సంస్కారాల మీద సమ్యమము అనేది నిద్రాణమై ఉన్న శక్తుల గురిన్చి ప్రత్యక్ష జ్ఞానం కలిగిస్తుంది. అతని సంస్కారాల యొక్క ప్రత్యక్ష జ్ఞానం ద్వారా ఒక యోగి తన గత జన్మ గురించి తెలుసుకుంటాడు. అలాంటి జ్ఞానాన్ని పంచడం ఏ విశ్వవిద్యాలయాలకు కూడా సాధ్యం కాదు. యోగి మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని అర్హత కలిగిన శిష్యులకు ఇవ్వగలడు.

మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు 
ఏ విధంగానైతే చెడు సంస్కారాలు ఉంటాయో అలాగే మంచి సంస్కారాలూ ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి రోగంతో బాధపడుతూ కనిపిస్తే, మీ హృదయంలో దయ అనేది ఉద్భవిస్తుంది. గత జన్మలో మీరు చేసిన దయతో చేసిన ప్రతి పని సంస్కారంగా మారి ఉంటుది. అవన్నీ మనస్సులో పైకి వచ్చి, ఆ శక్తి ద్వారా మీరు అతనికి సేవ చేస్తారు, సాయం చేస్తారు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి బాధలో ఉన్నా లేదా అలమటిస్తునా, ఇంతకముందు మీరు సేవా దృక్పథంతో చేసిన ప్రతి కర్మ నీ మనస్సు యొక్క చేతనలోకి ప్రవేశించి మీరు అతనికి సహాయం చేసేలా చేస్తుంది, తద్వారా మీరు సాయం చేస్తారు. ఒక మంచి సంస్కారం లేదా పుణ్య కర్మ మీరు చేస్తున్నప్పుడు, దానికి తద్విరుద్ధమైన వేరొక కూడా చెడు సంస్కారం కూడా బయలుదేరుతుంది. అది కూడా దాని పని చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు మీ మనస్సుని భగవంతుని మీద లగ్నం చేయాలని అనుకున్నప్పుడు, అంతఃశుద్ధి గురించి ఆలోచించినప్పుడు, ఆ క్షణంలోనే చెడు ఆలోచనలు, సంస్కారాలన్నీ ఒక్క ఉదుటన మీ మీదకు దాడి చేస్తాయి. మంచి సంస్కారాలు కూడా ఏకమై చెడు సంస్కారాలను పారద్రోలేందుకు మీకు సహాయ పడతాయి. స్వామి అద్వైతానందజీ వారి తండ్రి చండీమాతకు గొప్ప భక్తుడు. ఆయన అంతిమ సమయంలో సుప్తచేతనావస్థలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన బాల్యంలో నేర్చుకున్న చండి స్తోత్రాలు మనస్సులోకి ప్రవేశించాయి. వేంటనే వాటిని చదవడం మొదలు పెట్టారు. ఇది సత్సంకారాలు ఏకమై సరైన సమయంలో బయటకు రావడానికి నిదర్శనం.

మీరు జన్మించినప్పుడు మీ మనస్సు అనేది పూలబాట లాంటిది కాదు. అందులో ఎన్నో సంస్కారాలు, ఎన్నో జ్ఞాపకాలు, గుర్తులు మొదలైనవి ఉన్నాయి. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు అతని గత జన్మ అనుభవాలన్నీ మానసికమైన సంస్కారాలుగా, ఆలోచనలుగా, మానసిక శక్తిగా రూపాంతరం చెంది ఉంటాయి. అనుభవాల ద్వారా మనిషి వాటిని గ్రహిస్తాడు. భౌతిక ప్రపంచంలో కలిగే అనుభవాలను అతని బుద్ధి లోకి నిక్షిప్తమైపోయాయి. ఇంద్రియాల ద్వారా ఈ విశ్వం నుంచి తీసుకున్న సంస్కారాల ద్వారా మనసు ఏర్పడుతుంది. ఈ ప్రపంచం యొక్క సంపూర్ణమైన అనుభూతి పొందేవరకు, అది ఎన్నో శరీరాలను తీసుకుంటుంది. అంటే ప్రపంచాన్ని పరిపూర్ణంగా అనుభవించే వరకు/ తెలుసుకునేవరకు, దాని గురించి జ్ఞానం పొందేవరకు, మనస్సు ఎన్నో జన్మలు తీసుకుంటుంది. ప్రతి వ్యక్తికి కొన్ని సంస్కారాలు సహజసిద్ధంగా ఉంటాయి, అనగా పుట్టుకతో వస్తాయి. ఇవన్నీ అతని చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. చిత్తమే ప్రారబ్దానికి కేంద్ర స్థానము. భౌతిక ప్రపంచంలో అతను మరిన్నో సంస్కారాలను లేదా అనుభవాలను తన కర్మల ద్వారా పోగు చేసుకుంటాడు. ఇవి ఇంతకుముందే ఏర్పడిన సంస్కారాలకు తోడై భవిష్యత్తులో తనకు సంచిత కర్మలుగా మారుతాయి. 

ఇంకా ఉంది.....

Sunday, 30 December 2018

హిందూ ధర్మం - 275 (కర్మసిద్ధాంతం- 15)



స్వామి శివానంద గారి మాటల్లో;

అసలు సంస్కారం అంటే ఏమిటి?
మనోసముద్రంలో వృత్తులు (ఆలోచనా తరంగాలు - సుడిగుండాలు) ఏర్పడతాయి. అవి కొంతసేపు ఉండి, తర్వాత సాధారణ చేతనా స్థాయి క్రిందకు వెళ్ళిపోతాయి. అవి అప్పటి వరకు ఉన్న చేతనావస్థ మనస్సు నుంచి, లోతుగా ఉండే ఉపచేతన మనస్సు (చిత్తం) లోకి ప్రవేశిస్తాయి. అక్కడ అవి సూక్ష్మంగా, మహత్తరంగా పని చేస్తూ, సంస్కారంగా మారుతాయి. జాగురూక స్థితిలో చేసిన కర్మ - అది స్మృతిలో ఉన్నదైనా, ఉద్వేగపూరితమైనదైనా లేదా సంకల్పమైనా- చేతనావస్థకు క్రిందనే అది సూక్ష్మమైన, అవ్యక్తమైన రూపం తీసుకుంటుంది. దాన్నే సంస్కారం అంటాము. 

స్మృతి - సంస్కారం తిరిగి వ్యక్తమవుట.
సంస్కారాలు ఉపచేతన మనస్సు లేదా చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. ఉపచేతన మనస్సునే అచేతనా మనస్సు అని పిలుస్తారు. ఈ చిత్తం ఉండేది చిన్నమెదడులో. చాలా సూక్ష్మ విషయంతో సహా అన్నీ ఇందులో రక్షించబడుతుంటాయి. కొద్దిగా కూడా ఎన్నటికీ నష్టపోవు. చేతనా మనస్సు యొక్క ఉపరితలానికి పెద్ద తరంగంలా వచ్చే సూక్ష్మమైన సంస్కారాలు, లేదా జ్ఞాపకము వలన పురాతన వృత్తి చేతనామనస్సు ఉపరితలానికి వచ్చినప్పుడు, దాన్ని స్మృతి అంటారు. సంస్కారం లేకుండా స్మృతి/జ్ఞప్తి అసాధ్యం.

సంస్కారం ఎలా ఏర్పడుతుంది?
ఇంద్రియ భూమికలో కలిగిన అనుభవం చిత్తం యొక్క లోతుల్లోకి ప్రవేశించి సంస్కారంగా మారుతుంది. మనస్సు దేన్నైనా అనుభూతి చెందిన క్షణమే, ఆ అనుభూతి యొక్క సంస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడున్న అనుభూతికి, సుప్తచేతనలో ఏర్పడే సంస్కారానికి మధ్య సమయ బేధం ఉండదు. ఒక ప్రత్యేకమైన అనుభవం ప్రత్యేకమైన సంస్కారాన్ని కల్పిస్తుంది. ఈ అనుభూతి యొక్క స్మృతి/జ్ఞప్తి అనేది ఆ ప్రత్యేకమైన సంస్కారం నుంచే కలుగుతుంది.

మీరు మొదటి సారి బెల్లం రుచి చూసినప్పుడు, మీకు బెల్లం గురించి తెలుస్తుంది. దాని రుచి తెలుస్తుంది. అది బెల్లమనే వస్తువని తెలుస్తుంది. అప్పుడు సుప్తచేతన మనస్సులో ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఏ సమయంలోనైనా, ఈ సంస్కారం ఆ వస్తువు యొక్క స్మృతిని, దాని గురించి అవగాహనను మీకు కలిగిస్తుంది. వస్తువు, దాని గురించి అవగాహన వేర్వేరు చేయచ్చు గానీ, ఆ రెండు విడదీయరానివి.

బాహ్యమైన స్పందనల ద్వారా ఏ వస్తువైనా మనస్సులొని సంస్కారాన్ని తట్టిలేపుతుంది. అందువలన సంకల్పం అనేది బయట నుంచి ఏ స్పందన లేకున్నా లోపల నుంచి ఉద్భవిస్తుంది. మీరు ఇంతకముందు చూసిన ఆవు గురించి ఆలోచించినప్పుడు, మీరు మానసికంగా అవు అనే పదాన్ని స్మరిస్తారు. అప్పుడు దాని రూపం మనస్సులో ఏర్పడుతుంది. అప్పుడు ఆలోచన ఏర్పడుతుంది. ఎలాగైతే విత్తనం నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తనం వస్తుందో, అలానే సంస్కారం సంకల్పాన్ని కలిస్తుంది, సంకల్పం సంస్కారానికి కారణమవుతుంది. ఈ చక్రం బీజ-వృక్ష న్యాయమును తలపిస్తుంది. మనస్సులోని వృత్తి సంస్కారాన్ని కల్పిస్తే, ఆ సంస్కారం ఇంకో వృత్తికి కారకమవుతుంది. బాహ్యం లేదా లోపల నుంచి కలిగే స్పందనలు, ప్రేరణల వలన విత్తనాల వంటి సంస్కారాలు పెరిగి, అనేక కర్మలకు కారణమవుతాయి. వృత్తులు మరియు సంస్కారాల ఈ చక్రం అనాది, కానీ దివ్యజ్ఞానం పొందడంతోనే ఇది అంతమవుతుంది. అప్పుడతి ప్రకృతిలో లయిస్తుంది. అవి జీవన్ముక్తుని మీద ఏ ప్రభావం చూపలేవు. నిరంతర సమాధి వలన సంస్కారాలు కాలిపోతాయి. అప్పుడు మాత్రమే జీవుడు జనన మరణాదుల నుంచి విముక్తుడవుతాడు.

ఇంకా ఉంది .... 

Sunday, 28 October 2018

హిందూ ధర్మం - 274 (కర్మసిద్ధాంతం- 14)



మాయ చేత తాను కర్తననే భావమే జీవుడిని, ఈశ్వరుడి నుంచి వేరు చేస్తోంది. ఆ భావనే అహం. అహం నశిస్తే, సర్వం నశిస్తుంది, అప్పుడు మిగిలేది తానే అంటారు రమణులు. జ్ఞానం అంటే మరేదో కాదు, అహం నాశనం అని కూడా అంటారు. జీవుడు ఎప్పుడైతే తాను కర్తను అనుకుంటాడో, ఆ క్షణం నుంచి అతనికి కర్తృత్వం ఏర్పడుతుంది. అప్పుడు అతనికి కర్మ అంటుకుంటుంది. కర్మ ఏర్పడినప్పుడు, దానికి కర్మఫలం కూడా ఉంటుంది. అది జీవుడు అనుభవించవలసి వస్తుంది. అది పుణ్యకర్మ అయినా సరే, పాప కర్మ అయినా సరే. అందుకే పాపం జీవుడిని బంధించడానికి ఇనుపసంకెళ్ళు అయితే, పుణ్యం బంగారు సంకెళ్ళు అంటారు జ్ఞానులు. ఏదైనా బంధిస్తుంది. 

నిజానికి అంతా మనమే చేస్తున్నామనే భావనకు కారణం అన్నిటికి తానే కారణం అనుకోవడం, ఇది మాయ నుంచి వస్తుందని చెప్పుకున్నాము కదా. దీనికి రమణ మహర్షి ఒక చక్కని ఉపమానం చెబుతారు. రాత్రి ఒళ్ళు మరిచి నిద్రపోతాడు. అప్పుడు నేను అనే భావన ఉండదు. అసలు మనస్సులో ఏ ఆలోచన కలుగదు. నేను ఉన్నాను అన్న భావన కూడా ఉండదు. ఆ భావన లేనప్పటికి తాను లేడని అర్ధం కాదు. రాత్రి నిద్రలో మనస్సు హృదయంలో లయించి ఉంటుంది. ఉదయం లేస్తూనే, మనస్సు లేస్తుంది. మెల్లిగా అన్నీ గుర్తుకు వస్తాయి. నేను అన్న భావన కూడా పుడుతుంది. ఇలా పుట్టే నేను అన్న భావన మనస్సుకు చెందినది. అది నిద్రలో లేదు. ఆ భావన లేదు కాబట్టి తాను లేడని అనడం లేదు కదా. అనగా ఉదయం లేచింది, మనస్సు, అహంకారము. జ్ఞానోదయం అయినప్పుడు ఈ మనస్సు, అహంకారాలు రెండు ఉండవు. ఉన్నా, అవి హృదయం యొక్క ఆధీనంలో ఉంటాయి. కనుక అప్పుడు జీవునకు కర్మలు అంటవు.

జీవుడు చేసే కర్మలు కేవలం భౌతికమైన దేహానికే పరిమితం కావు. భౌతిక దేహంతో చేసిన కర్మలు, జీవుడు బయట నుంచి స్వీకరించే ఆలోచనలు, వినే మాటలు, చూసే విషయాలు, తిరిగే వాతావరణం సూక్ష్మదేహం మీద అనగా మనస్సు మీద చెరగని ముద్రలు వేస్తాయి. ఒక ప్రదేశానికి మొదటిసారి వెళ్ళినా, ఆ ప్రదేశం తనకు ఎప్పటి నుంచో తెలిసినట్టు అనిపిస్తుంది. కొందరిని చూసినప్పుడు, వారు ఎప్పటి నుంచో తెలిసినవారనిపిస్తుంది, లేదా బాగా దగ్గరివారని తోస్తుంది. మనస్సులో ఒక అలజడి లాంటిది కలుగుతుంది. దాన్నే వేదాంతశాస్త్రంలో 'వాసన' అంటారు. అనగా పూర్వజన్మ జ్ఞాపకం. చేతిలో కాసేపు కర్పూరం పట్టుకుంటే, చేయి అంతా కర్పూరం వాసనే వస్తుంది, అలానే మనస్సు దేన్ని పట్టుకుంటే, దానికి ఆ వాసన అలవడుతుంది. అది అంత తొందరగా వదలదు. 

ఒకే పనిని పదే పదే చేస్తే, అది 'సంస్కారం'గా ఏర్పడిపోతుంది. అది తర్వాత జన్మలో కూడా ఆ జీవునిపై ప్రభావితమవుతుంది. మనకు గత జన్మలో ఉన్న మంచి సంస్కారాలు, చెడ్డ అలవాట్లు/ దుసంస్కారాలు మనస్సులో వాసనలుగా నిక్షిప్తమవుతాయి. మరణం స్థూల (భౌతిక) దేహానికి కానీ సూక్ష్మ, కారణ శరీరాలకు, ఆత్మకు కాదు. కనుక మరణించిన తర్వాత, ఒక జీవుడు తాను ఆ జన్మలో చేసిన కర్మల యొక్క జ్ఞాపకాలు, ఆలోచనలు, కోరికలు, అతడిని వాసనల రూపంలో వెంటాడుతాయి. మరణం తర్వాత దేహం నుంచి ఆత్మ విడువడగానే, ఆ ఆత్మను పట్టుకుని, సూక్ష్మ, కారణ దేహాలు, వాటిల్లో ఉండే వాసనలు తదుపరి ఉపాధిని వెతుకుతూ ప్రయాణం మొదలుపెడతాయి. ఉపాధి అంటే శరీరం.   

ఇంకా ఉంది.... 

Sunday, 2 September 2018

హిందూ ధర్మం - 273 (కర్మసిద్ధాంతం- 13)



ప్రకృతి త్రిగుణాత్మకం. జీవుడు భగవంతుని అంశ. కనుక అతడు త్రిగుణాతీతుడు. త్రిగుణాతీతుడైన జీవుడు, తానే మనస్సు అనుకుని, త్రిగుణాత్మకమైన ప్రకృతిలో బంధించబడుతున్నాడు. ఆ కారణంగానే తాను దైవాంశ అనే విషయాన్ని తెలుసుకొనలేకపోతున్నాడు. ఇది ఎలా జరిగింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

దీనికి సంబంధించి, ఒకానొక సందర్భంలో సద్గురు శివానందమూర్తి గారు ఇలా చెప్పారు (దీనిని వి.వి.యస్. శర్మగారు భద్రపరిచి మనకు అందించారు) - ఒక సమయంలో ఒక శిష్యుడు గురువుగారితో మాట్లాడుతూ "నేను సాధన వలన మీస్థితికికి చేరగల వరాన్ని ప్రసాదించండి." అని కోరాడు. అప్పుడు గురువుగారు "ఈ జన్మలో పరిణామం పొందిన జీవులు, ఊర్ధ్వలోకములనుండి అవతరించిన జీవుల స్థితికి చేరవు" అని చెప్పారు. ఈ సంభాషణలో ప్రప్రథమంగా అక్కడ ఉన్న వారికి ఆయన ప్రస్తుత స్థితి తెలిసింది. అలా చెప్పగల ఈయన ఎవరు? ఆయన ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చారు? ఆయన అవతరణ వెనుక కారణ మేమిటి? ప్రథమమున అవతరించిన వారికి ఈయనకు సంబంధమేమిటి? సృష్టి ఆదినుండి ఆయన ప్రయాణమేమిటి? ఈ అనేక ప్రశ్నలకు సమాధానాలు ఆయన చెబుతూ వచ్చారు. 
సృష్టి ప్రారంభం
ఆరంభం అంటే శూన్య స్థితి. ఏదీ లేదు, ఎవరూ లేరు అనుకోవచ్చు. ఆస్థితిలో ఎవరో ఒక్కరికి తానొక్కరే ఉన్నాననే భావన కలిగినది. ఆయన స్థితి అవధులు లేని ఆనందం ఆయనకు ఈయబడిన నామం సదాశివుడు. సృష్టికి మూలం. సృష్టి అంటే ఒకరికి మరొకరు. ఒకటి అయిన సదాశివం రెండు అయినది. తనే అయిన పరమ శివుడు, తన శక్తి పరాశక్తి. తన శక్తియే తన ప్రకృతి. ఆ సమయంలో తన నుండి కోట్లాది తేజోరేణువులు వెలికి వచ్చాయి. ప్రతి రేణువు పరమ శివుని ప్రతిరూపమే. క్రమముగా ప్రతి రేణువుకు, రేణువుకు, ప్రకృతికి పరస్పర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధాల ఫలితంగా ప్రత్యణువు తాను ప్రత్యేకమనే భావనలోనికి వచ్చి పరమ శివునితో సంబంధమును కూడా విస్మరించినది. అప్పుడు ఈ రేణువులు జీవులు అనబడినవి. మూలాన్ని విస్మరించడమే వానిలో వ్యాపించిన అవిద్య, అజ్ఞానం. దానితో శివుడు, జీవుడు అనే ద్వంద్వ ప్రవృత్తి ఏర్పడింది. జీవుల మధ్య పరస్పర విరుద్ధమైన సంస్కారాలు ఏర్పడినవి. జీవుల మధ్య హానికరమైన సంస్కారాలు కల జీవులు ఉత్పన్నమైనారు. పరాశక్తికి వాటిని నిర్మూలింపవలసిన ఆవశ్యకత ఏర్పడినది. ఇది సృష్టి ఆరంభంలో జరిగినది. దీనితో జీవులకు పరిమితులు ఏర్పడినవి.
పరమశివుని అనుగ్రహము వలన జీవులకు తమ ఆరంభస్థితిని తిరిగిపొందే అవకాశ మీయబడినది.. దీనికై తిరిగి తిరిగి సృష్టిచేసే సంకల్పము పరమేశ్వరునికి కలిగింది. ఇది జీవుల పరిణామానికి ఏర్పడిన మార్గము. ఇదియే తమసోమా జ్యోతిర్గమయ (అవిద్యనుండి జ్ఞానానికి ప్రయాణము) అనే ప్రార్థన. ఈ సంకల్పమునకు స్థిరత్వమునిచ్చి సృష్టి స్థితి లయాల వ్యవస్థ చేయునది మహావిష్ణువు. ఆయన నాభికమలం నుండి ఆవిర్భవించిన చతుర్ముఖ బ్రహ్మ ప్రతి సృష్టిలోనూ జీవులకు భౌతిక శరీరాలు, భౌతిక జీవనానికి అవసరమైన సామగ్రి సృష్టిస్తాడు. జీవులు వేర్వేరు పరిణామ దశలలో ఉంటారు. సమయము ఆసన్నమైనప్పుడు బ్రహ్మ నుండి పుట్టిన రుద్రుడు తిరోధాన కార్యము చేబడతాడు. ఈ రుద్రుడు సృష్టిని సంకల్పించిన సదాశివుడే. లోకాలు, జీవులు యథాస్థితిలో విష్ణుగర్భంలోనికి తీసికొన బడి తరువాత ప్రతిసర్గ మొదలయేవరకు, నూతన బ్రహ్మకల్పారంభము వరకు, ఆస్థితిలోనే నిలిచి ఉంటారు. ఇది మహావిష్ణువు యోగనిద్రా సమయము. 
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెం
జీఁకటి కవ్వలనెవ్వం
డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్ ||
ఈ సృష్టి విజ్ఞానం శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో ఉన్న మనకు ఎలా తెలిసింది? అనంత కాల చక్రంలో ఈ ప్రతి సృష్టి కార్యక్రమం నేటివరకూ జరుగుతూనే ఉన్నది. సదాశివ పరమశివులతోబాటుగా మరియొకరు ఈ సృష్టికి సాక్షిగా అనేక బ్రహ్మకల్పాలను చూస్తూ ఉన్నారని అర్థమౌతున్నది. అర్హత గల కొన్ని ముముక్షువులైన జీవులకు, జిజ్ఞాసువులకు, సామాన్య మార్గమునకు మారుగా వేగముగా పరిణామము చెందే విధానమును బోధించుటకు ఆ సాక్షి సృష్టి చక్రములో ప్రవేశించాడు.. ఈ సనాతనుడైన ప్రత్యక్ష సాక్షియే మూర్తీభవించిన గురుతత్త్వము."  ఆ గురుస్వరూపమే దక్షిణామూర్తి, హయగ్రీవుడు.

ఇంకా ఉంది .... 

Sunday, 19 August 2018

హిందూ ధర్మం - 272 (కర్మసిద్ధాంతం- 12)



మనం చేసే కర్మలు కాయిక, వాచిక, మానసిక కర్మలుగా విభజించబడ్డాయి. కాయిక అంటే నోటితో చేసే కర్మలు, మానసికం అంటే మనస్సుతో చేసేవి, వాచిక అంటే మాటల ద్వారా చేయబడేవి. భౌతిక శరీరంతో జీవుడు కర్మ చేస్తాడు. ఆ కర్మలకు కారణం త్రిగుణాత్మకమైన ప్రకృతి. అంటే త్రిగుణాలతో కూడిన ప్రకృతి. ఆ ముడు గుణాలే సత్త్వ, రజో, తమో గుణాలు. నిజానికి జీవుడు (ఆత్మ) కళ్ళకు కనిపించే స్థూల శరీరం కాదు, కనిపించని సూక్ష్మ, కారణ శరీరాదులు కూడా కాదు. 'బ్రహ్మం యొక్క ప్రతిబింబమై ఉండీ (సూక్ష్మ శరీరంలో), తాను స్థూలశరీరమని భ్రమపడేవాడు జీవుడు. కానీ ఈ జీవుడు ఈశ్వరుని నుంచి వేరు కాదు' అని ఆదిశంకరులు తత్త్వబోధలో చెప్తారు.

ఈ ప్రపంచం పంచభూతాత్మకం. పంచభూతాలైన ఆకాసం, వాయువు, అగ్ని, నీరు, పృధ్వీల పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడింది.

3 గుణాలు ఇవి.
సత్త్వగుణం - శుద్ధత్వం మరియు జ్ఞానం దీని లక్షణాలు; ఉదాహరణ - సాత్త్వికమైన వ్యక్తి ఎవరిని బాధించడు. ఇతరులు తనకు అపకారం చేసినా, కోపగించుకోకుండా, ప్రతీకారానికి వెళ్ళకుండా, ఏ విధమైన భావావేశానికి లోనుకాకుండా, నిశ్చలంగా, కరుణాపూరితుడై ఉంటాడు. తన స్వార్ధం చూడకుండా, అందరి మేలు తలుస్తాడు.

రజో గుణం - క్రియ (కార్యము) మరియు కోరిక దీని లక్షణాలు; ఉదాహరణ - రజోగుణం ఉంటేనే పని చేయగలుగుతాము. మనస్సులో సంకల్పాలు కలిగించేది ఈ గుణమే. రజోగుణం గలవాడు కూడా ఎవరి జోలికి వెల్లడు. కానీ తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. తన స్వార్ధం చూసుకుంటూనే ఇతరులకు మేలు చేయాలని చూస్తాడు.

తమో గుణం - అజ్ఞానం మరియు జడత్వం దీని లక్షణాలు; ఉదాహరణ - తమోగుణం కలిగిన వ్యక్తి అందరిని బాధిస్తాడు. ఇతరులకు ఉపకారం చేయడమన్నమాటే ఉండదు. ఎప్పుడూ హానీ చేయాలనే తలుస్తాడు. తన స్వార్ధం గురించి ఆలోచిస్తూనే, ఇతరులు సుఖంగా ఉండకూడదని తలుస్తాడు. తన జోలికి రాకున్నా, ఇతరులను పీడించి, అందులో ఆనందం పొందుతాడు. దురాశ, ప్రతీకారం మొదలైన దుర్గుణాలు దీని లక్షణాలు.

పంచభూతాల సత్త్వగుణ అంశ నుంచి అంతఃకరణాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయి. రజోగుణ అంశ నుంచి పంచకర్మేంద్రియాలు, పంచవాయువులు ఉద్భవించాయి. తమోగుణ అంశ నుంచి స్థూలమైన పంచభూతాలు, స్థూల శరీరము ఏర్పడ్డాయి.

ఇవన్నీ పంచీకరణం అనే ప్రక్రియలో ఏర్పడ్డాయి. పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు.

విశ్వం ఏర్పడటానికి కారణమైన పంచీకరణమే ఈ శరీరం ఏర్పడాటానికి కారణమైంది. జీవుడి స్థూల శరీరం పిండాండమైతే, కనిపించే ఈ విశ్వం బ్రహ్మాండం. ఈ పిండాండం దేనితో ఏర్పడింది, ఈ బ్రహ్మాండం కూడా దానితోనే ఏర్పడింది. కాబట్టి పిండాండాన్ని అర్ధం చేసుకుంటే, బ్రహ్మాండాన్ని అర్ధం చేసుకోవచ్చని చెప్పారు ఋషులు.

ఇంకా ఉంది ....... 

Sunday, 24 June 2018

హిందూ ధర్మం - 271 (కర్మసిద్ధాంతం- 11)



సూక్ష్మ శరీరంలో ఇంకో రెండు కరణాలు (instruments) కూడా ఉన్నాయి. అందులో ఒకటి మనస్సు, రెండవది బుద్ధి. వీటిని అంతఃకరణాలు అంటారు. ఇవి లోపల కనిపించకుండా ఉంటూ, జీవుడు ఆలోచించనకు, సంకల్ప, వికల్పాలకు కారణమవుతాయి. నిజానికి జీవుడు విషయప్రపంచంలో చరించడానికి వీటిని వాడుకుంటాడు. మనస్సు, బుద్ధి అనేవి రెండూ ఒకటే ఉపకరణం, కానీ అవి చేసే పనిని బట్టి విభజించారు. సందేహం, అనుమానం, అస్థిరత, చాంచల్యం అనేవి కలిగినది మనస్సు, అందుకే దాన్ని 'సంకల్ప-వికల్పాత్మకం మనః' అన్నారు శంకరులు.

అదే ఉపకరణం అస్థిరతకు లోనుకాకుండా నిశ్చితంగా ఉంటే, అదే బుద్ధి. 'నిశ్చయాత్మకా బుద్ధిః' అన్నారు ఆదిశంకరులు. అంటే ఒక పని చేయమని నిశ్చయంగా చెప్పే శక్తి బుద్ధికి ఉంది.

మనస్సుకు అధిదేవత చంద్రుడు, బుద్ధికి బ్రహ్మ. ఇవే కాకుండా అహంకారం, చిత్తం అని కూడా రెండు ఉన్నాయి. అవి కూడా అంతఃకరణం యొక్క భాగాలు. 

అహంకారం - తానే కర్త అనే భావన, నేను, నాది అనే భావన కలిగించేది అహంకారం. అహంకారానికి అధిష్ఠాన దేవత రుద్రుడు. 

చిత్తం - గత జన్మల్లో ఏర్పడిన అనుభవాలు, కోట్ల వృత్తులు ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. ఇది శరీరంలోని అన్ని ఇంద్రియాలను చంలిపజేస్తుంది. మహావిష్ణువు దీని అధిష్ఠాన దేవత.

ఈ నాలుగింటికి పంచభూతాలకు సంబంధం ఉంది. అంతఃకరణం అనేది ఆకాశతత్త్వం. ఇందులో ఉన్న మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్నితత్త్వం, చిత్తము అగ్ని తత్త్వము, అహంకారం పృధ్వీతత్త్వానికి చెందినది.

ఇక్కడకి వరకు పఞ్చజ్ఞానేంద్రియాలు, పఞ్చకర్మేంద్రియాలు, పఞ్చప్రాణాలు, పంచ తన్మాత్రలు, మనోబుద్ధి, అహంకార, చిత్తాల గురించి చెప్పుకున్నాము. ఇవన్నీ సూక్ష్మ శరీరానికి చెందినవి.

జీవునకు ఉన్న మూడవ శరీరం కారణ శరీరం.

తత్త్వబోధలో శంకరులు ఇలా అంటారు.
ఏది కారణ శరీరం?
అనిర్వచనీయమైనది, అనాది (ఆది లేనిది), అవిద్యా (అజ్ఞానం) రూపంగా ఉన్నది; స్థూల, సూక్ష్మ శరీరాలకు కారణమైనది; అజ్ఞానమే తన స్వతస్వరూపంగా కలిగినది; నిర్వికల్ప రూపం కలిగినది కారణ శరీరం.

మిగితా రెండు శరీరాలు కార్యం అయితే ఇది వాటికి కారణం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. విత్తనం కారణమైతే, చెట్టు కార్యము. విత్తనం అవ్యక్త/నిద్రాణ  రూపమైతే, కార్యం వ్యక్తరూపం. కాబట్టి కారణం మరియు కార్యం రెండూ ఒకటే అయినా వాటి పరిస్థితులు వేరు. ఆలాగే కారణ శరీరమే స్థూల, సూక్ష్మ శరీరం, కాని నిద్రాణంగా ఉన్న రూపం. అయితే ఏది నిద్రాణంగా ఉన్నది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక విత్తనంలో, ఎన్నో రకాల కొమ్మలుం ఆకులు మొదలైనవి వేర్వేరుగా ఉండవు, మరియు ఇంద్రియాలకు కనిపించదు. ఎందుకంటే ఒక మామిడి విత్తనం నుంచి మామిడి చెట్టు మాత్రమే వచ్చినట్లు, నిమ్మ చెట్టు రానట్లు, బేధాలు కనిపించకున్నా, అవి ఉంటాయని భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కారణంలో కార్యం ఉంటుంది. కార్యంలో బేధాలు గమనించగలము కనుక దాన్ని సవికల్పం అంటారు మరియు కారణంలో, బేధాలు అనేవి ఇంద్రియాలకు అగోచరం కనుక, దాన్ని నిర్వికల్పం అన్నారు. కనుక కారణ శరీరం అనేది నిర్వికల్పం రూపం. గాఢ నిద్రను కారణశరీరానికి చెందినదిగా చెప్తారు, ఎందుకంటే ఆ స్థితిలో స్థూల, సూక్ష్మ శరీరాల ద్వార ఏర్పడిన బేధభావాలు జీవునకు తెలియవు. కారణ శరీరం గురించి చెబుతున్నప్పుడు, అజ్ఞానం అంటే మిథ్యా అని అర్ధం చేసుకోవాలి. ఆత్మ ఒక్కటే సత్యము. మిగితాది మిథ్య అంటుంది వేదాంతము. మిథ్యా వస్తువును గురించి చెప్పడం అసాధ్యం కనుక కారణ శరీరాన్ని అనిర్వాచ్యం అన్నారు. దాని ఆదిని (ప్రారంభాన్ని) అర్ధం చేసుకోలేరు కనుక అనాది అన్నారు కానీ అది ఆది నుంచి ఉన్నదని కాదు. కాలం అనే భావన సూక్ష్మ శరీరంలో భాగమైన బుద్ధి నుంచి తెలుసుకునేది. అదే కారణ శరీరం స్థాయిలో కాలం అనే భావన పనిచేయదు, ఎందుకంటే అక్కడ బుద్ధి నిద్రాణమై ఉంటుంది. బుద్ధి నిద్రాణంగా ఉండటమంటే, అది అజ్ఞానం అని అర్ధం. ఇది కారణ శరీరం. ఇక్కడితో శరీరత్రయం గురించి వివరణ ముగిసింది.
  ఇంకా ఉంది ..............

(ఈ అంశంలో చాలా భాగం డా.యస్.యజ్ఞసుబ్రమణియన్ గారు ఆదిశంకరుల తత్త్వబోధ మేద ఇచ్చిన ప్రవచనం నుంచి సేకరించబడినది.)

Sunday, 17 June 2018

హిందూ ధర్మం - 270 (కర్మసిద్ధాంతం- 10)



సూక్ష్మ శరీరం గురించి చెప్పుకుంటూ గత భాగంలో పఞ్చ జ్ఞానేంద్రియాలు, పఞ్చకర్మేంద్రియాల గురించి చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు పంచ ప్రాణాలు, అంతఃకరణం గురించి చెప్పుకుందాము.
పంచ ప్రాణాలు - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులను పంచప్రాణాలు అంటారు. ఇవి ప్రాణమయ కోశంలో భాగం. ఈ 5 వాయువులు, వీటికి 5 ఉపవాయువులు ఉన్నాయి. 

పంచ ప్రాణాలు - 
ప్రాణ వాయువు - ఊపిరి (ఉచ్ఛ్వాస, నిశ్వాస) ప్రక్రియలకు సంబంధించినది. మనం నిత్యం లోనికి తీసుకునే గాలి. మన ఆలోచనలు, భావావేశాలు, మనస్సు దీనితో గాఢంగా ముడిపడి ఉంటాయి.
అపానం - బొడ్డు నుంచి అరికాళ్ళ వరకు ప్రభావితం చేసే వాయువు. ఇది విసర్జన ప్రక్రియలను, కామోద్రేకాలను నియంత్రిస్తుంది. 
వ్యానం - శరీరమంతా వ్యాపిస్తూ, అన్ని భాగాలకు ప్రాణవాయువు ప్రసరణ జరిగేలా చూస్తుంది. రక్త ప్రసరణ చేస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది. సమస్త శరిరాన్ని, ముఖ్యంగా నడులను ప్రభావితం చేస్తుంది. శరీరభాగాలకు పని చేయుటకు అవసరమైన శక్తినిస్తుంది.
ఉదానం - తిరస్కరించడం, ఎగదన్నటం దీని పని. కన్నీళ్ళకు కారణమవుతుంది. ఇది కంఠంలో ఉంటూ, నోట్లో ఆహారాన్ని మిరింగటం అనే ప్రక్రియలో కీలకంగా వ్యావహరిస్తుంది. ఇది హృదయం నుంచి శిరస్సుకు, మెదడకు ప్రసరణ చేస్తుంది. మరణ సమయంలో ఉదాన వాయువు సహాయంతోనే సూక్ష్మదేహం స్థూల దేహం నుంచి విడువడుతుంది.
సమానం - అరుగుదలకు (జీర్ణం చేసుకునేందుకు) కారకమవుతుంది. ఉదరంలో ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాల్లో వాయుప్రసరణ సమంగా ఉండేలా చూస్తుంది. ఆహారంలోని పోషక విలువలను దేహమంతటా పంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది.

ఉపవాయువులు -
1. నాగ - తేపులు (త్రేనుపులు), ఎక్కిళ్ళు, వాంతులను కలిగిస్తుంది. ప్రాణ, అపాన వాయువులలో ఏర్పడిన దోషాలను తొలగిస్తుంది. ఉదరం నుంచి ఊర్ధముఖంగా వెళ్ళే వాయువులను నియంత్రిస్తుంది.
2. కూర్మ - కంటి భాగంలో ఉంటూ, కంటి రెప్పలు తెరిచి, మూసే ప్రక్రియను నియంత్రిస్తుంది.
3. కృకర - శ్వాసకోశ వ్యవస్థలో దోషాలను తొలగించేందుకు చీదడంలో తోడ్పడుతుంది. ఆకలి దప్పికలను కలిగిస్తుంది.\
4. ధనంజయ - కండరాలు, ముఖ్యంగా హృదయ కవాటాల వ్యాకోచ సంకోచాలు నియంత్రణ దీని ఆధీనంలో ఉంటాయి. మరణ సమయంలో శరీరాన్ని క్షీణింపజేసి, పంచభూతాల్లో కలిపేస్తుంది.
5. దేవదత్త - ఆవలింతలు కలిగిస్తుంది.

ఇవన్నీ శరీరంలో సక్ర్మంగా ఉన్నప్పుడే, వ్యక్తి ఆరోగ్యవంతుడిగా, సదాలోచనలతో ఆనందంగా ఉంటాడు. ఈ వాయువుల(ప్రాణాలు) ప్రసారంలో ఏర్పడే ఇబ్బందులు అనేక ఉపద్రవాలను తెచ్చిపెడతాయి. నిజానికి ఈ విజ్ఞానం మన రక్తంలో ఉంది. అందుకు ఉదాహరణ తెలంగాణ యాసలో స్పష్టంగా కంపిస్తుంది. ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే, పానం (ప్రాణం) బాలేదు అంటారు. అంటే ఆయా శరీర భాగాలకు శక్తి ప్రసారం చేసే ప్రాణంలో అకస్మాత్తుగా దోషం ఏర్పడి, ప్రసారణ ఆగిపోయిందని, లేదా తక్కువగా ప్రసరణ చేస్తోంది చెబుతున్నారు. ఎంత అద్భుతం ఇది. గమనిస్తే, మనం వాడే మాములు పదాల వెనుక సనాతన ధర్మానికి చెందిన సత్యాలు ఎన్నో ఉన్నాయి.

To be continued ........

Sunday, 10 June 2018

హిందూ ధర్మం - 269 (కర్మసిద్ధాంతం- 9)



శ్రోత్రే త్వక్ చక్షుః రసనా ఘ్రాణం ఇతి పఞ్చ జ్ఞానేంద్రియాణి
శ్రోత్రే - చెవులు (వినడం)
త్వక్ - చర్మం (స్పర్శ)
చక్షుః - కళ్ళు (దృష్టి)
రసనా - నాలుక (రుచి)
ఘ్రాణం - ముక్కు (వాసన)

ఏ వ్యక్తికైనా వినికిడి, రుచి మొదలైన సమర్థతలు/ సామర్ధ్యాలు పరిమితంగానే ఉంటాయి. అది గుణంలోనైనా, పరిమాణంలోనైనా. ఒకనికి పరిమితమైన శక్తి ఉన్నదంటే, అప్పుడు అతడు అపరిమితమైన శక్తి యొక్క అంశ అని, అపరిమితమైన శక్తి ఒకటుందని అతడు భావించవచ్చు. 
కాబట్టి ప్రతి సామర్ధ్యానికి, దానికి సంబంధించిన సంపూర్ణ శక్తి ఉంది. శక్తిని శాసించువాడు ఉంటే తప్పించి దానికి స్వతంత్రమైన వృత్తి ఉండదు. ఉదాహరణకు, దృష్టి( చూచే) శక్తి అనేది జీవుడి ఆధీనంలో ఉంటుంది. అతడు చూడాలనుకుంటేనే చూడగలడు. అలాగే సంపూర్ణశక్తికి, మన గ్రంథాలు, వాటిని నిర్వహించే నిర్వాహకులను వివరించాయి. వారిని అధిష్ఠానదేవతలు అంటారు. ఈ అధిష్ఠానదేవతలందరిని కలిపి, వారి సంపూర్ణ శక్తిని శాసించే అధికారి వెరొకడు ఉన్నాడు. అతడిని పరమేశ్వరుడని, ఈశ్వరుడని అంటారు. ఇదంతా ఆదిశంకరులు తత్వబోధలో వివరించారు.

శ్రోత్రస్య దిగ్దేవతా | త్వచే వాయుః |
చక్షుషాః సూర్యః | రసనాయ వరుణః |
ఘ్రాణస్య అశ్వినౌ | ఇతి జ్ఞానేంద్రియదేవతాః |

శ్రోత్రస్య దిగ్దేవతా - చెవికి (వినికిడి శక్తికి) అధిష్ఠానదేవతలు దిగ్దేవతలు
త్వచే వాయుః - చర్మానికి వాయువు
చక్షుషాః సూర్యః - కన్నులకు (చూపుకు) సూర్యుడు 
రసనాయ వరుణః - నాలుకకు (రుచికి) వరుణుడు 
ఘ్రాణస్య అశ్వినౌ - ముక్కుకు (వాసనకు) అశ్విని దేవతలు

వాక్పాణిపాదపాయుపిపస్థాని పఞ్చకర్మేంద్రియాణి |
వాక్ - నోరు
పాణి - చేతులు
పాద - పాదాలు
పాయువు - విసర్జన అవయవాలు
పిపిస్థ - జననాంగాలు
అనేవి 5 కర్మేయంద్రియాలు.

ఈ 5 కర్మేంద్రియాలకు కూడా ఐదుగురు అధిష్ఠానదేవతలు ఉన్నారు.

వాచో దేవతా వహ్నిః - వాక్కునకు అగ్ని
హస్తయోరింద్రహః - చేతులకు ఇంద్రుడు
పాదయోర్విష్ణుః - పాదాలకు విష్ణువు
పాయోర్మృత్యుః - పాయువునకు మృత్యువు

ఉపస్థస్య ప్రజాపతిః - జననాంగాలకు ప్రజాపతి 

To be continued ......

Sunday, 3 June 2018

హిందూ ధర్మం - 268 (కర్మసిద్ధాంతం - 8)



జీవుడు కర్మలను మూడు శరీరాల ద్వారా చేస్తాడు. అవే
1. స్థూల శరీరం
2. సూక్ష్మ శరీరం
3. కారణ శరీరం
ఆత్మ వీటికి అతీతమైనది.

1. స్థూల శరీరం అంటే కంటికి కనిపించే ఈ భౌతిక దేహం. ఇది పృధ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల వలన ఏర్పడిన పాంచభౌతిక దేహం. ఇది కాలానికి లోబడి ఉంటుంది. ఒకనాడు మరణం పాలవుతుంది. అగ్నికి ఆహుతువ్వడమో, లేదా మట్టిలో కలిసిపోవడం జరిగి, పంచభూతాల్లో లయమవుతుంది. ఈ స్థూల శరీరం నిలబడటానికి ఆహరం అవసరం. ఇది అనేక రకాల వ్యాధులకు లోనవుతుంది. జీవుడు తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరిచి, అతడి పడాల్సిన వేదనను అతనికిచ్చే వాహకం ఈ స్థూల శరీరం.

గత జన్మల్లో జీవుడు చేసిన పాపపుణ్యాల ఆధారంగా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పంచీకరణం జరిగి, అతడి కర్మఫలానికి తగిన విధంగా స్థూల శరీరం ఏర్పడుతుంది.

ఆదిశంకరులు తత్త్వబోధలో దీని గురించి ఈ విధంగా చెప్పారు. పంచభూతాల కారణంగా పాపపుణ్య కర్మఫలాల కారణంగా పంచీకరణం చెంది రూపుదిద్దుకుంటుంది స్థూలశరీరం. ఇది సుఖదుఃఖాలకు నివాసస్థానం. షడ్ (6) వికారాలకు లోబడి ఉంటుంది. అవే
అస్తి - తల్లి గర్భంలో అండరూపంలో ఉండటం.
జాయతే - పుట్టడం
వర్ధతే - పెరగుట
విపరిణమతే - మార్పు చెందుట
అపక్షీయతే - కృశించుట
వినశ్యతి - నశించుట

అంటే తల్లి గర్భంలో ఏర్పడటం (అస్తి), రూపం పొంది పుట్టడం (జాయతే), పెరిగి పెద్దవ్వడం (వర్ధతే), క్రమంగా రూపాంతరం చెందడం (శరీరంలో మార్పులు చెందడం), ఒక వయస్సు వచ్చాక ఎలా ఎదిగామో, అలా ఒక్కో ఇంద్రియం శక్తి క్షీనించడం, అనగా ముసలితనం రావడం (అపక్షీయతే), మరణించడం (వినశ్యతి). వికారం అంటే మార్పు. ఈ 6 మార్పులు లేదా వికారాలు అనేవి భౌతిక దేహం యొక్క లక్షణాలు.

2. సూక్ష్మ శరీరం అంటే మనస్సు. ఈ సూక్ష్మ శరీరాన్నే లింగశరీరం అని కూడా అంటారు.దీన్నే అంతఃకరణం అని కూడా అంటారు. ఇది కంటికి కనిపించకపోయినా, చేయాలసిన కర్మలను చేస్తుంది.

శంకరులు ఇలా అంటారు - ఇది పంచభూతాలతో పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడిన రూపం. సత్కర్మజన్యం అనగా ఇది సత్కర్మ వలన ఉద్భవిస్తుంది. సుఖదుఃఖాది భోగాలకు సాధనం. ఇందులో మొత్తం 17 తత్త్వాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ్యేంద్రియాలు, పంచ (5) ప్రాణాలు, మనస్సు మరియు బుద్ధి.

ఇవి సూక్ష్మంగా ఉన్నందువలన వీటిని ఇంద్రియాలు అంటారు. స్థూల దేహంలో ఉన్నవాటి ప్రతిరూపాలను గోలకాలు అంటారు. ఉదాహరణకు చెవితమ్మె స్థూలమైతే, వినికిడి శక్తి దాని సూక్ష్మరూపం). సూక్ష్మ శరీరం ఒక జీవుడి నుంచి ఇంకో జీవుడికి వేరుగా ఉంటుంది, కాబట్టి ప్రతి జీవుడు ప్రత్యేకమైనవాడు. ఈ అన్నింటితో ఉండేది సూక్ష్మ శరీరం.

సూక్ష్మశరీరం అనేది పంచభూతాల పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడింది. కనుక వాటిని పంచ తన్మాత్రలు అంటారు.

ఈ సూక్ష్మశరీరం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది సుఖదుఃఖాలను అనుభవించడానికి 'సాధనం' (Instrument). స్థూలశరీరం అనేది సుఖదుఃఖాలను అనుభవించడానికి 'ఆయతనం' (Locus) అంటే అందులో ఉండి, సూక్ష్మశరీరం ద్వారా అనుభవిస్తామన్నమాట. రకరకాల అనుభూతులు ఉంటాయి కనుక, వాటిని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి అనేక రకాల ఉపకరణాలు (సాధనాలు) కావాలి.

ఇంకా ఉంది.....

Sunday, 20 May 2018

హిందూ ధర్మం - 267 (కర్మసిద్ధాంతం - 7)



పుణ్యం సుఖం ఇస్తుందని, పాపం దుఃఖకారకమని పాపపుణ్యాల గురించి ప్రస్తావించుకున్నాం కదా. వ్యక్తికి మరణం సంభవించిన తర్వాత, అతడి ఖాతాలో జమ అయిన పాపపుణ్యాలను అనుసరించి అతడికి తదుపరి జన్మ ఉంటుంది. పుణ్యం ఎక్కువగా చేసుకున్న జీవాత్మలు ఊర్ధ్వలోకాలకు అనగా స్వర్గం మొదలైన దేవతాలోకాలకు వెళ్ళి, దేవతాజన్మలు పొంది, అక్కడ సుఖాలు అనుభవిస్తారు. చేసుకున్న పుణ్యాన్ని అనుసరించి బ్రహ్మ, ఇంద్ర, వరుణ, వాయు ఇత్యాది ఎన్నో పదవులు వస్తాయి. ఇంద్రుడు అంటాము కదా, ఇంద్ర అనేది పదవి. బాగా పుణ్యం చేసుకున్న జీవుడు ఇంద్రపదవిలో కూర్చుంటాడు. ఆ పదవి పొందిన ఎవరినైనా ఇంద్రుడనే అంటారు. అలా చేసుకున్న పుణ్యాన్ని అనుసరించి, అతడికి దేవ, గంధర్వ, కింపురుష.... ఇలా చెప్పబడ్డ ఎన్నో రకాల ఊర్ధ్వలోక జీవులకు చెందిన ఒక పదవి అప్పజెప్పబడుతుంది. అక్కడ సుఖం అనుభవించిన తర్వాత, అనగా పుణ్యం క్షయం అవ్వగానే, ఇంకా కొంత పుణ్యం మిగిలి ఉండగానే అతడిని మరలా భూలోకానికి పంపిస్తారు. అదే భగవద్గీతలో 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి' అని శ్రీ కృష్ణపరమాత్మ వివరిస్తాడు. కొంత పుణ్యం అతని ఖాతాలో ఉంటుంది కనుక అతని సదాచార సంపన్నుల ఇంట, మానుష జన్మ పొందుతాడు.

మరణానంతరం జీవుని ఖాతాలో పాపం ఎక్కువగా ఉంటే, అతడు పశు, క్రిమి, కీటకాదులు, జంతువులు, పక్షులు, చెట్లు మొదలైన జన్మలు పొందుతాడు. మన ధర్మం ప్రకారం ఈ భూమి మీద మొత్తం 84 లక్షల 'రకాల' జీవరాశి ఉంది. అందులో మానవజన్మ తప్పించి, మిగితా వాటిలో అంటే, 83,99,999 రకాల జీవుల్లో ఏదో ఒక జన్మ పొంది, చేసిన పాపానికి తగిన శిక్షలు అనుభవిస్తాడు- బాధలు పడతాడు, హింసించబడతాడు, చీదరించబడతాడు. 

పాపపుణ్యాలు సమానంగా ఉన్న జీవులు మాత్రమే మానుష జన్మ పొందుతారు. సమానం అంటే సరిగ్గా సమానమని కాదు, కాస్త అటుఇటుగా. అందులో కూడా అతడి పాపపుణ్యాలను అనుసరించి, ధనవంతుల ఇంట పుట్టడమా, లేక పేదవారి ఇంట పుట్టడమా అనేది ఉంటుంది. ఒక వైద్యశాలకు వెళ్ళినప్పుడు, అక్కడ ఎంతో మంది జన్మిస్తూ ఉంటారు. అందులో కొందరు అత్యధిక సంపన్నులకు పుట్టి, పుట్టగానే భోగాల మధ్య పెరుగుతారు. కొందరు ఏమీలేని వారి ఇంట పుట్టి, చిన్నవయసు నుంచే పస్తులుంటారు. కొందరు డబ్బు లేనివారి ఇంట పుట్టినా, సదాచార సంపన్నుల ఇంట పుడతారు. 

ఈ మూడు జన్మలకు మధ్య వ్యత్యాసం కూడా ఉంది. దేవతాదిలోకాలు భోగభూములు. అక్కడ కర్మ చేసే అధికారం లేదు. మనస్సు, బుద్ధి మొదలైన అంతఃకరణాలు ఉంటాయే గానీ, స్థూలశరీరం ఉండదు. కనుక కర్మ చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి సంపాదించుకున్న పుణ్యం వ్యయం (ఖర్చు) చేయడానికి మాత్రమే ఆ జన్మ పనికివస్తుంది. జంతుజన్మలో మనస్సు ఉంటుంది, స్థూలశరీరం ఉంటుంది, కానీ బుద్ధి ఉండదు. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం ఉండదు. జంతువులు, పక్షులు, చెట్లు పని చేసినట్లు, స్పందించినట్లు కనిపిస్తాయి కాని అవి ప్రకృతి ప్రేరణతో పని చేస్తాయి. వాటికి స్వతంత్రేచ్ఛ ఉండదు (అంటే తమంతట తాము ఒకటి నిర్ణయించుకుని చేయడమన్నమాట). మానవజన్మలో జీవుడికి కావలసిన అన్ని సదుపాయాలను దైవం సమకూర్చారు. తాను తన భవిష్యత్తును, తదుపరి జన్మలను నిర్ణయించుకునే స్వేచ్ఛను అతనికి ప్రసాదించారు. అందుకే ఆదిశంకరాచార్యులు మొదలైనవారు 'జంతూనాం నరజన్మ దుర్లభం' అన్నారు. మానవజన్మ పొందటం అత్యంత దుర్లభమైనది. దానికి దైవానుగ్రహం పుష్కలంగా ఉండాలి.

అయితే ఇక్కడొక విషయం గుర్తించుకోవాలి. జంతుజన్మలు తక్కువ అని చెప్పినంత మాత్రంచేత, కనిపించే ప్రతి జీవి పాపం కారణంగానే అలా పుట్టిందని, వాటికి జ్ఞానం లేదని నిర్ధారించకూడదు. ఒక మహాజ్ఞానిని, జీవన్ముక్తుడిని మనుష్యులకంటే ముందుగా గుర్తించేది ప్రకృతియే, పశుపక్ష్యాదులు, వృక్షాదులే. భగవాన్ రమణ మహర్షి, త్రైలింగ స్వామి, ఇంకా ఈ దేశంలో నడయాడిన ఎందరో మహానుభావుల చరిత్రలకు మనకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జంతువులుగా పుట్టిన ఏనుగు, సాలెపురుగు, పాము సైతం ఈశ్వరుడిని సేవించి, మోక్షం పొందిన క్షేత్రం శ్రీ కాళహస్తి. అనగా వాటిలో కూడా చైతన్యం మెండుగా ఉందని గుర్తించాలి. కానీ మనిషిగా పుట్టినవాడికి ఇది ఓ గొప్ప సువర్ణావకాశం అని చెప్పడమే గురువుల లక్ష్యం.

అలాగే ఋషులు మొదలైన తపస్సంపన్నులు సైతం కొన్ని సార్లు, లోకకల్యాణ నిమిత్తం, దైవాదేశానుసారం వృక్షాలుగా, పశుపక్ష్యాదులుగా జన్మలెత్తిన సందర్భాలు సనాతన ధర్మ వాజ్ఞమయంలో కోకొల్లలు. తిరుమల, అహోబిలం, శ్రీ శైలం, అరుణాచలం మొదలైన పవిత్ర క్షేత్రాల్లో, దేవతలు, ఋషులు రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, పశుపక్ష్యాదుల రూపాలను స్వీకరించి, సంచరిస్తుంటారని, తపమాచరిస్తారని పురాణ వచనం. 

To be continued ........

Sunday, 29 April 2018

హిందూ ధర్మం - 266 (కర్మసిద్ధాంతం - 6)



నిత్య, నైమిత్తిక కర్మలను చేయడం వలన పుణ్యం, యశస్సు, ఆత్మబలం కలుగుతాయి, వాటిని విడిచిపెట్టడం వలన పాపం కలుగుతుంది. నిషిద్ధ కర్మను చేయడం వలన పాపం కలుగుతుంది, దాన్ని విడిచిపెట్టడం వలన సద్గతి, ఆత్మబలం, తపశ్శక్తి పెరుగుతాయి. 

చేసిన కర్మ మనకు ఇచ్చే ఫలితాన్ని అనుసరించి దాన్ని పాపకర్మ, లేదా పుణ్యకర్మ అంటాము. ఇతరులకు మేలు చేసేది; ఇతరులకు హానీ చేయకుండా తనకు మేలు చేసేవి అయిన కర్మలను సత్కర్మలుగా చెప్తారు. ఇతరులకు హానీ చేసే కర్మను పాపకర్మ అంటారు.

సులభంగా చెప్పాలంటే సుభాషితకారులు ఇలా అన్నారు.

అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితం
పరోపకారం పుణ్యాయః పాపాయ పరపీడణం

అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసుడు వాటి సారాన్ని ఈ విధంగా కీర్తించాడట. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, అపకారం చేయడం పాపం అని. నిజానికి ఇతరులకే కాదు, తనకు హానీ చేసేది కూడా పాపమే.

ఎడ్ల బండి నడవడానికిబండి చక్రాలు ఎలాగో, అలాగే జీవ యాత్ర సాగాలంటే పాపపుణ్యాలు అలాంటివి. ఈ రోజు నీకున్న ఆరోగ్యం, ఆహారం, ఆహార్యం, సంతోషం, పదవి, హోదా మొదలైన అన్ని సుఖాలకు కారణం పుణ్యకర్మ లేదా పుణ్యఫలం. అలాగే నీవు అనుభవించే కష్టాలు, భయాలు, రోగాలు మొదలైన అన్ని రకాల దుఃఖాలకు కారణం పాపకర్మ లేదా పాప కర్మ యొక్క ఫలం. కర్మ సిద్ధాంతం ఇలా చెప్తుంది. నీవు చెడు చేస్తే, చెడును పొందుతావు; మంచి చేస్తే మంచి అనుభవిస్తావు; ఇతరులను అవమానిస్తే, అవమానించబడతావు; దూషిస్తే దూషించబడతావు; దోషాలు ఎంచితే, నీలోని దోషాలు ఎంచబడతాయి; ఆకలి తీరిస్తే, నీ ఆకలి తీర్చబడుతుంది; నీవు తిరస్కరిస్తే, తిరస్కరించబడతావు; ప్రేమిస్తే, ప్రేమించబడతావు; శంతిని పంచితే, శాంతిని పొందుతావు; అశాంతిని రగిలిస్తే, అశాంతితో కాలి బూడదవుతావు. ఒక్కమాటలో చెప్పాలంటే నీవు (ఇతరులకు) ఏది ఇస్తావో, అదే నీకు తిరిగి లభిస్తుంది. 

ఈ జన్మలో నీవు అనుభవించే సుఖాలకు కారణం నువ్వు గతంలో చేసిన పుణ్యమైతే, దుఃఖాలకు కారణం నీ గత జన్మ పాపం. అంటే జీవుడు, తాను చేసే కర్మ ద్వారా, పాపపుణ్యాలను మూటకట్టుకుని జన్మల పరంపరంలో ప్రయాణం చేస్తుంటాడు. ఆ క్రమంలో మరణం తర్వాత పోగు చేసుకున్న సంపదలు గానీ, బంధువులు గానీ తన వెంట రారు. అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన వారు అక్కడ కరెన్సీని ఇక్కడ నేరుగా ఉపయోగించలేరు. దాన్ని భారత కరెన్సీలోకి మార్పిడి చేసుకోవాలి. అప్పుడే వీలవుతుంది. అలానే పాపపుణ్యాలు. కూడబెట్టిన సంపదను దానం అనే ప్రక్రియ ద్వారా పుణ్యంగా మార్చుకోవచ్చు. అప్పుడది జీవయాత్రలో జీవుడి వెంట ఉండి, అతడికి అవసరమైనప్పుడు, తగిన వసతిని సమకూర్చుతుంది. కాబట్టి తాను పోగు చేసుకున్న సంపదను పుణ్యంగా మార్చుకుంటాడు వివేకవంతుడు. అలా కాక, అన్నీ కట్టుకుపోతామనే భ్రమలో ఉండి, తాను తినక, ఇతరులకు పెట్టక, ఇతరుల నోటి దగ్గరి ముద్దను సైతం లాక్కునే వాడు అవివేకి, బుద్ధిహీనుడు.

అందుకే భగవాన్ రమణులు ఇలా అంటారు. "ఇతరులకు ఇచ్చిందేదో, అది మాత్రమే తనకు దక్కుతుంది. మిగితావన్నీ వెళ్ళిపోతాయి. ఈ రహస్యం తెలిసిన ఇతరులకు ఇవ్వకుండా ఎలా ఉండగలరు?"

అందుకే సనాతన ధర్మం దానం గురించి గొప్పగా చెప్తుంది. ఒక్కో దానానికి ఒక్కో ఫలం ఉంటుంది. ఉదాహరణకు కొందరికి అన్నీ ఉంటాయి, కానీ ఆత్మసంతృప్తి ఉండదు. కొందరికి ఏమీ లేకున్నా, సంతృప్తిగా ఉంటారు. దీనికి మూలం ఎక్కడ ఉంది? శాస్త్రం ఇలా చెప్తుంది. మామిడి పండును దానం చేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అది మామిడి పండు దానం వలన జీవుడు సంపాదించుకున్న పుణ్యఫలం. అది ఏ జన్మలో చేసినా, ఎప్పుడో ఒకప్పుడు, ఫలం లభిస్తుంది. అలా ప్రతి వస్తువు దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ మరింత విశేషం ఏమిటంటే ఇచ్చేవాడు అనగా దాత గొప్ప కాదు, దానం పుచ్చుకునేవాడు గొప్ప అంటుంది సనాతన హిందూ ధర్మం. అతడు దానం స్వీకరించి, పుణ్యఫలానికి నీకు పాత్రతను కలిగిస్తున్నాడు. కాబట్టి మన ధర్మంలో దానం తీసుకున్నవాడు దాతకు నమస్కరించడు, దాతయే దానం పుచ్చుకున్నవానికి నమస్కరిస్తాడు. తనకు అంతటి అమూల్యమైన భాగ్యాన్ని ఇచ్చినందుకు.  అదేకాక దానం పుచ్చుకునేవాడిని శ్రీ మాహావిష్ణు స్వరూపంగా భావించమని శాస్త్రం చెబుతోంది. అతడికి పాదపూజ చేయమంటుంది.

ఇదే తైత్తరీయోపనిషత్తులో కనిపిస్తుంది.
శ్రద్ధయా దేయం | అశ్రద్ధయా2 దేయం | శ్రియా దేయం | హ్రియా దేయం | భీయా దేయం | సంవిదా దేయం || 11.6

శ్రద్ధతో దానం ఇవ్వండి. ఉదాసీనతతో, అశ్రద్ధతో దానం ఇవ్వకండి. శక్తి మేరకు, సమృద్ధిగా దానం ఇవ్వండి. వినమ్రతతో, అణుకువ కలిగి దానం ఇవ్వండి. గౌరవపూర్వకంగా దానం ఇవ్వండి. సౌహార్దంతో దానం ఇవ్వండి.

To be continued ..... 

Sunday, 22 April 2018

హిందూ ధర్మం - 265 (కర్మసిద్ధాంతం- 5)



శాస్త్రం మనకు కర్మల్ని రెండు రకాలుగా విభజించింది. ఒకటి విహిత కర్మ, రెండవది నిషిద్ధ కర్మ. 
విహిత కర్మ అంటే ఆచరించించవలసిన కర్మ. 'సత్యంవద ధర్మంచర' అంటుంది తైత్తరీయోపనిషత్తు. సత్యమే మాట్లాడండి, ధర్మాన్ని పాటించండి. విధిగా పితృదేవతలకు శ్రాద్ధకర్మలు పెట్టండి అని తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. ఇలా శాస్త్రం మనకు ఆచరించమని విధించిన కర్మలు విహిత కర్మలు.

నిషిద్ధ కర్మ అంటే చేయకూడని కర్మ.  ఉదాహరణకు పరమశివుడు సూర్యభగవానుని స్తుతించిన సూర్యాష్టకంలో ఈ విధంగా ఉంది. ఆదివారం నాడు మద్యం తాగకూడదు, మాంసాహారం తినకూడదు. స్త్రీగమనం కూడదు అంటే శృంగారం కూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. తైలాభ్యంగన స్నానం చేయరాదు అంటుంది, అంటే ఆదివారం నాడు పైవి చేయడం నిషిద్ధం. ఇలా ప్రత్యేక దినాల్లో కొన్ని నిషిద్ధమైతే, కొన్ని ఎల్లవేళలా నిషిద్ధం. ఎవరిని బాధించకూడదు, శారీరికంగా కానీ, మానసికంగా గానీ హింసించకూడదు. అలా హింసించడం నిషిద్ధ కర్మ. 

మళ్ళీ విహిత కర్మలు మూడు రకాలు. అవి నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ.

నిత్యకర్మ అంటే నిత్యం ఆచరించవలసిన కర్మ - స్నానం, జపం, సంధ్యావందనం, దీపారాధన, దైవ ప్రార్థన మొదలైనవి. అంటే మన రోజూవారీ జీవితంలో అనునిత్యం ఆచరించాల్సిన కర్మలు.

నైమిత్తిక కర్మ - అంటే ప్రత్యేకమైన రోజుల్లో ఆచరించే కర్మ. ఉదాహరణకు వినాయక చవితి నాడు వరసిద్ధి వినాయకుడిని పూజించడం, అక్షయతృతీయ నాడు దానాలు చేయడం, పెద్దలు మరణించిన తిధుల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం మొదలైనవి. అంటే ఇవి ప్రత్యేకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆచరించేవి.

కామ్య కర్మ - అంటే కోరికతో చేసే కర్మ, లేదా మనకున్న కోరికలను సిద్ధింపజేసుకోవడానికి చేసే కర్మలు. ఉదాహరణకు మరణానంతరం స్వర్గాది లోకాలను పొందడానికి అగ్నిష్టోమం మొదలైన యగాలు చేస్తారు. అలాగే వివాహం ఆలస్యమవుతుంటే, దానికి ఏర్పడ్డ ఆటంకాలు తొలగడానికి కొన్ని ఆలయాలను దర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా మన కోరికలు తీరడానికి, అందుకు తగ్గ పుణ్యం ప్రాప్తించడానికి ఎన్నో పనులను మనం నిత్యం చేస్తుంటాము. వాటిని కామ్య కర్మలు అంటారు.

చేసే కర్మ యొక్క స్వభావాన్ని బట్టి దాన్ని సత్కర్మ లేదా దుష్కర్మ అన్నారు. సత్కర్మ అంటే మంచి కర్మ, దుష్కర్మ అంటే చెడు కర్మ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. చేస్తున్న కర్మ యొక్క స్వభావానికంటే ముఖ్యమైనది, ఆ కర్మ వెనుకున్న కర్త యొక్క ఉదేశ్యం. ఒక పని చేస్తున్నప్పుడు, అది ఏ భావంతో, ఎందుకు చేస్తున్నామనే దాన్ని అనుసరించి కర్తకు ఫలం లభిస్తుంది. కాబట్టి ఆచరించబడుతున్న కర్మకంటే, దాని వెనుకనున్న భావాలు, ఉద్దేశాలు ముఖ్యం. భగవంతుడు చేసిన కర్మను చూడడు, దాని వెనుకనున్న ఉద్దేశాలను చూస్తాడు. 

స్వామి వివేకానంద కర్మ యోగంలో ఒక మాట అంటారు. మనం ఉన్నది సాపేక్ష ప్రపంచంలో. ఇది మంచి, చెడు, సుఖ దుఃఖాలు మొదలైన ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ఏ పని పూర్తిగా మంచిది కాదు, పూర్తిగా చెడ్డది కాదు. మంచి చేసే పని కూడా కొందరికి చెడు చేస్తుంది, చెడు కూడా కొందరికి మేలు కలిగిస్తుంది. కాకపోతే, ఒక కర్మ అత్యధికమందికి మేలు కలిగిస్తే అది మంచి కర్మగానూ, అత్యధికశాతం చెడు కలిగిస్తే, అది చెడ్డదిగానూ చెప్పాయి శాస్త్రాలు.       

To be continued .....

Sunday, 15 April 2018

హిందూ ధర్మం - 264 (కర్మసిద్ధాంతం- 4)



మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము. ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము. అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె కొంప. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము. ఋణం తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటివేయబడుతుంది. దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు. అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని, వెళుతుంది. అవే సంచితకర్మలు.

3. ప్రారబ్ధ కర్మలు - అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు. ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ.ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే. ప్రారబ్ధం తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు, బంధవులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆయ వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము. 

ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయుపోగా, జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి. ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభవించడానికి సిద్ధమవుతాయో, అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో 
"పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం" 
అని అన్నారు.

మళ్ళూ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లుగర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు.

ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము, అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము. అలాగే పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము. పాపం పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది. ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే. విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు. అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది.  

ఇంకా ఉంది .....
దీనికి సహాయపడి రచన - దేవిశెట్టి చలపతిరావు గారి కర్మసిద్ధాంతం ప్రవచనం

Sunday, 8 April 2018

హిందూ ధర్మం - 263 (కర్మసిద్ధాంతం- 3)



పాపకార్యమైనా, పుణ్యకార్యమైనా దాన్ని కర్మ అనే అంటారు. సత్ఫలితాన్నిచ్చే కర్మను సత్కర్మ అని, దుష్ఫలితాన్ని (చెడు ఫలాన్ని) ఇచ్చే కర్మను దుష్కర్మ అని అంటారు.

అవశ్యమను భోక్తవ్యం కృతాకర్మ శుభాశుభమ్ ......
చేసిన పని మంచిదైనా, చెడ్డదైనా, దాని ఫలితాన్ని అవశ్యం అనుభవించి తీరాలని శాస్త్రవాక్కు. చేసిన కర్మకు ఫలితం అనుభవించకుండా తప్పించుకోనుట అసాధ్యం. అది భగవంతుడు ఏర్పరిచిన నియమం. అయితే ఒక కర్మ (పని) చేసినప్పుడు, అవి ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను 3 రకాలుగా విభజించారు. అవి 1) ఆగామి కర్మలు, 2) సంచిత కర్మలు, 3)ప్రారబ్ధ కర్మలు 

అంటే ఒక విత్తనం వేసినప్పుడు, అది మొక్కయై, చెట్టు గా మారి, మొగ్గ వేసి, పువ్వు పూసి, పిందే గా మారి, కాయ (పచ్చి) గా రూపాంతరం చెంది, అనుభవించేందుకు సిద్ధం అవుతుంది, అంటే పక్వానికి వస్తుంది, పండుతుంది. అలా మనం చేసిన కర్మ పక్వానికి (కర్మ పండడానికి) పట్టే సమయం బట్టి వాటిని పై మూడింటిగా విభాగం చేశారు.

1- ఆగామి కర్మ - మనం చేసే కొన్ని పనులకు వెంటనే, ఇప్పటికిప్పుడే ఫలం లభిస్తుంది. వాటిని ఆగామి కర్మలు అంటాము. ఉదాహరణకు దాహం వేస్తే, నీరు త్రాగుతాం. నీరు త్రాగడం కర్మ అయితే, దాహం తీరడం ఆ కర్మ యొక్క ఫలం. అలాగే ఆకలి తీరుచుకోవడానికి భోజనం చేస్తాము. భోజనం అనే కర్మ, ఆకలిని తీర్చి, అనగా తగిన ఫలాన్ని వెంటనే ఇచ్చి, అక్కడితో శాంతిస్తోంది. ఇది ఆగామి కర్మ.
ఆవేశాలు అదుపు తప్పినప్పుడు, ఒకరిపై చేయి చేసుకుంటాము, నాలుగు తిడతాము. అవతలి వాడు సమర్ధుడైతే తిరిగి నాలుగు తంతాడు, బాగా వాయించి వదిలిపెడతాడు. అది అగామి కర్మ.
ఆగమి కర్మలు అంటే ఈ జన్మలో చేసిన కర్మకు ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించడమన్నమాట.

2- సంచిత కర్మ - కొన్ని కర్మలు (పనులు) వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు చేస్తే, ఇంకెప్పుడో ఫలం అనుభవిస్తాము. అంటే ఫలం అనుభవించే వరకు అవి మనలని వెంటాడుతూనే ఉంటాయి. అంటే అవి కూడబెట్టబడి (సంచితం) చేయబడి ఉంటాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. అంటే సమయం వచ్చే వరకు అవి సంచీలో భద్రంగా ఉంటాయన్నమాట.

ఇందాకటి ఉదాహరణనే తీసుకుంటే, మనం ఒకరిపై చేయి చేసుకున్నా, లేక నాలుగు తిట్టినా, అవతలి వ్యక్తి వెంటనే ప్రతిచర్యకు దిగకపోవచ్చు. కానీ అది మనస్సులోనే పెట్టుకునే, తగిన సమయం కోసం వేచి చూస్తాడు. సమయం వచ్చినప్పుడు, ఇంతకంటే గట్టి దెబ్బ కొడతాడు. అది ఎప్పుడనేది తెలియదు. అది సంచిత కర్మ. 
ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే, మనం ఈ రోజు ఒక విత్తనం వేసి, నీరు పోస్తే, అది ఒకనాటిగా చెట్టు అయ్యి, పండ్లు కాసి, మనకు అందిస్తుంది. అక్కడ విత్తనం వేయగానే పండు (ఫలం) రావట్లేదు. దానికి కొంత సమయం పడుతున్నది. అది సంచిత కర్మ.
ఈ సంచిత కర్మలకు ఫలాలన్నీ ఈ జన్మలోనే లభిస్తాయని లేదు. అది కాలచక్రంలో ఏ జన్మ లోనో లభించవచ్చు. 

అంటే ఇంతకముందు లేదా ఈ జన్మలో చేసి- తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టిన కర్మలలో నుండి, ఆ జనంలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించిన కర్మలు పోను, మిగిలిన కూడబెట్టబడిన కర్మలను, అదే విధంగా, ఇంతకముందు అనేక జన్మలలో జీవుడు చేసిన కర్మల నుండి ఖర్చైనవి మినహా, ఒక జన్మ నుంచి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలు అంటారు. నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అంటారే, అలా నిజంగా అవి వెనకేసుకుంటామో లేదో గానీ, కర్మ అనే సంచీలో అనేక జన్మల కర్మలను పోగు చేసుకుని, జీవుడు జన్మల పరంపరను పొందుతుంటాడు. వాటిని సంచిత కర్మలు అంటారు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినా, ఈ సంచిత కర్మలు మాత్రం జీవుడిని విడిచి వెళ్ళకుండా అతడితోనే ప్రయాణిస్తుంటాయి. 

To be continued ....

దీనికి సహకరించిన రచన- దేవిశెట్టి చలపతి రావుగారి కర్మసిద్ధాంతం ప్రవచనం 

Sunday, 1 April 2018

హిందూ ధర్మం - 262 (కర్మసిద్ధాంతం- 2)



క్రియతే అనేన ఇతి కర్మ - చేయబడేది ఏదైనా కర్మయే. కర్మ అనేది సంస్కృత పదం. అది 'కృ' అనే ధాతువు నుంచి వచ్చింది. కర్మ అంటే మానసికంగా కానీ, శారీరికంగా కాని చేసినది. పూర్తయిన పనిని కర్మ అని, జరుగుతున్న పనిని క్రియ అని అంటారు.

అలాగే వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మకు సంబంధించిన విషయంలో మూడు విభాగాలు ఉంటాయి. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే చేయువాడు, క్రియ అంటే చేయబడుతున్న కార్యం, కర్మ అంటే చేయబడిన కర్మ యొక్క ఫలం. కర్త, క్రియ లేకపోతే కర్మ ఉండదు.

నిరాలంబోపనిషత్ 22 వ శ్లోకం కర్మను ఇలా నిర్వచించింది. నేను చేస్తున్నాను అనే భావనతో, ఆథ్యాత్మ నిష్ఠగా ఇంద్రియాల చేత, అంటే శబ్ద (వినడం), స్పర్శ (తాకడం), రూప (చూడటం), రస (రుచి చూడతం), గంధాలతో (వాసన చూడటం) చేసే వ్యాపరమే కర్మ. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కనుక మనస్సుతో చేసేది కూడా కర్మయే అవుతుంది.
అలాగే కర్మలను మూడు రకాలు చేస్తుంటాము. కాయిక (శరీరంతో చేసేవి), వాచిక (మాటల ద్వారా), మానసిక (మనస్సుతో) చేసే కర్మలు. ఈ మనస్సు, వక్కు, కాయాలనే త్రికరణములు అంటారు. 
త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకం మెచ్చును అని అన్నమాచార్యుల కిర్తన కూడా ఉంది.

కర్మకు కులమతాలు, ప్రాంత, లింగ భేదాలు లేవు. ఈ లోకంలో అందరు కర్మలు చేస్తారు, ఫలం అనుభవిస్తారు. ఇది మన కళ్లకు కనిపిస్తూనే ఉంది.
అలాగే కర్మలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి చేయడం. ఇది బాహ్య స్వరూపం లేదా దృశ్య స్వరూపం. రెండు దాచడం. ఇది అంతర్గత స్వరూపం లేదా అదృశ్య స్వరూపం. మూడు సరైన సమయంలో దానికి సరైన ఫలితాన్ని ఇవ్వడం. ఇది కర్మ ఫలానుభవం అంటే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించడం.

న ఇ కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్
కార్యతే వ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః
భగవద్గీత - 3వ అధ్యాయంలోని 5 వ శ్లోకం.

ఈ ప్రపంచంలోని ఏ మనిషి కూడా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. దీనిలో ఎలాంటి సందేహంలేదు. ఎందుకంటే మనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకు లోబడి కర్మలను చేయాల్సి ఉంటుంది అంటారు కృష్ణ పరమాత్మ.

కర్మ అంటే పని లేదా కార్యము లేదా క్రియ అని చెప్పేది సులభమైన అర్ధం. కానీ కార్యకారణ నియతితో నడిచే ఈ విశ్వగతికి కూడా కర్మ అనే పదం అన్వయమవుతుంది. కార్యం అంటే ఫలము/ ప్రయోజనము (Effect). కారణమంటే ఆ ఫలానికి గల హేతువు/ కారణము (Cause). విశ్వచైతన్యం ఈ విశ్వాన్ని ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగానే నడిపిస్తుంది.

To be continued ......

Sunday, 11 March 2018

హిందూ ధర్మం - 261 (కర్మసిద్ధాంతం- ఉపోద్ఘాతం (పరిచయం))



ఇప్పుడు మనం సనాతన ధర్మానికి మూల సిద్ధాంతమైన కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాము. కర్మ- పునర్జన్మ అనేవి సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన సిద్ధాంతాలు. సనాతన ధర్మం నుంచి ఉద్భవించిన ఇతర మతాలైన బౌద్ధం, జైనం కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. నిజానికి భారతదేశంలో, ముఖ్యంగా ఈ తరంలో పుట్టిన హిందువులకు మాత్రమే కర్మసిద్ధాంతం గురించి ఏ కొద్ది అవగాహాన కూడా లేదు. ఇది హిందువులకు అర్ధమైతే, సనాతన ధర్మం కంటే గొప్ప హేతువాదం ఈ ప్రపంచంలో లేదని, అసలు ధర్మంలో మూఢనమ్మకమనేది లేనేలేదని అర్ధం చేసుకోవచ్చు. ఇతర దేశాల్లోని అన్యమతస్థులు సనాతన ధర్మాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపే ప్రధాన కారణాల్లో కర్మసిద్ధాంతం ఒకటి. మనకూ అన్యమతాలకు మధ్యనున్న బేధాల్లో ముఖ్యమైనది కర్మ - పునర్జన్మ సిద్ధాంతం. క్రైస్తవం, ఇస్లాం మొదలైన మతాలను కర్మను, పునర్జన్మను అంగీకరించవు.

అసలు మనకే ఎందుకీ కష్టాలు? ఈ ప్రపంచంలో కొందరికి డబ్బు బాగా ఉంటుంది, పెద్ద పెద్ద మేడల్లో, విందు భోజనాలతో, బంధుమిత్రులతో, వైభవోపేతంగా జీవిస్తారు. కొందరికి రోజూ అన్నం దొరకడమే గగనం. నా అన్నవారు ఉండరు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, తల దాచుకోవడానికి నీడ ఉండదు. ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటారు. కొందరికి సుఖం, కొందరికి దుఃఖం, కొందరికి ఆనందం, కొందరికి విచారం. అంతెందుకు ఒకరి జీవితంలోనే కలిమిలేములు. కొన్నాళ్ళు ఆనందం, కొన్నాళ్ళు విచారం. కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యం, ఇంకొన్నేళ్ళు అనారోగ్యం. 
కొందరేమో ఉన్నదంతా దానం చేసే గుణం కలిగి ఉంటారు, ఇంకొందరు ఎంత ఉన్న, ఎంగిలి మెతుకులు కూడా విదల్చరు. ఎంత వ్యత్యాసం. కొందరు ఇతరుల మేలు కోసమే జీవిస్తే, ఇంకొందరు పక్కవాళ్ళకు హాని చేయడం కోసం జీవనం సాగిస్తున్నారు. ఎంత విభిన్నమైన మనస్తత్త్వాలు. అదీ ఒకే ప్రపంచంలో.

అసలు దేవుడే లేడనే నాస్తికులను పక్కన పెడితే ఈ సృష్టి అంతా భగవంతుడే చేశాడు, లేదా ఈ సృష్టి భగవంతుని నుంచే వచ్చింది అని నమ్మే ఆస్తికులు వీటిని చూసి ఏమనుకుంటారు? నిజంగా దేవుడనేవాడు ఉంటే కొందరికి ఇచ్చి, కొందరికి ఇవ్వక, కొందరికి పెట్టి, కొందరికి పెట్టక, కొందరిని అందంగా, కొందరిని అందవిహీనంగా ఎందుకు పుట్టించాడు? కొందరికి సద్బుద్ధి, కొందరికి దుర్భుద్ధి ఎందుకు ఇచ్చాడు? కొందరికి మాత్రమే సంపదలు ఎందుకిచ్చాడు? కొందరిని పేదరికంలో మగ్గేలా ఎందుకు చేశాడు? కొందరికెమో ధీర్గాయుష్షు, కొందరికేమో అల్పాయుష్షు? ఇదంతా పక్షపాతం కాదా? పక్షపాతం గలవాడు దేవుడౌతాడా?.... ఇలాంటి ప్రశ్నాలు అనేకం వస్తాయి. వీటికి సనాతన ధర్మంలో చెప్పబడిన కర్మ సిద్ధాంతం తప్ప మరే ఇతర మతం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే అక్కడ సమాధానం లేదు. 

ఇలా మనకు తలెత్తే ఎన్నో ప్రశ్నలకు సమాధనం చెప్పగల కర్మసిద్ధాంతాన్ని తెలుసుకుందాము. 


ఇంకా ఉంది.....