Sunday 8 April 2018

హిందూ ధర్మం - 263 (కర్మసిద్ధాంతం- 3)



పాపకార్యమైనా, పుణ్యకార్యమైనా దాన్ని కర్మ అనే అంటారు. సత్ఫలితాన్నిచ్చే కర్మను సత్కర్మ అని, దుష్ఫలితాన్ని (చెడు ఫలాన్ని) ఇచ్చే కర్మను దుష్కర్మ అని అంటారు.

అవశ్యమను భోక్తవ్యం కృతాకర్మ శుభాశుభమ్ ......
చేసిన పని మంచిదైనా, చెడ్డదైనా, దాని ఫలితాన్ని అవశ్యం అనుభవించి తీరాలని శాస్త్రవాక్కు. చేసిన కర్మకు ఫలితం అనుభవించకుండా తప్పించుకోనుట అసాధ్యం. అది భగవంతుడు ఏర్పరిచిన నియమం. అయితే ఒక కర్మ (పని) చేసినప్పుడు, అవి ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను 3 రకాలుగా విభజించారు. అవి 1) ఆగామి కర్మలు, 2) సంచిత కర్మలు, 3)ప్రారబ్ధ కర్మలు 

అంటే ఒక విత్తనం వేసినప్పుడు, అది మొక్కయై, చెట్టు గా మారి, మొగ్గ వేసి, పువ్వు పూసి, పిందే గా మారి, కాయ (పచ్చి) గా రూపాంతరం చెంది, అనుభవించేందుకు సిద్ధం అవుతుంది, అంటే పక్వానికి వస్తుంది, పండుతుంది. అలా మనం చేసిన కర్మ పక్వానికి (కర్మ పండడానికి) పట్టే సమయం బట్టి వాటిని పై మూడింటిగా విభాగం చేశారు.

1- ఆగామి కర్మ - మనం చేసే కొన్ని పనులకు వెంటనే, ఇప్పటికిప్పుడే ఫలం లభిస్తుంది. వాటిని ఆగామి కర్మలు అంటాము. ఉదాహరణకు దాహం వేస్తే, నీరు త్రాగుతాం. నీరు త్రాగడం కర్మ అయితే, దాహం తీరడం ఆ కర్మ యొక్క ఫలం. అలాగే ఆకలి తీరుచుకోవడానికి భోజనం చేస్తాము. భోజనం అనే కర్మ, ఆకలిని తీర్చి, అనగా తగిన ఫలాన్ని వెంటనే ఇచ్చి, అక్కడితో శాంతిస్తోంది. ఇది ఆగామి కర్మ.
ఆవేశాలు అదుపు తప్పినప్పుడు, ఒకరిపై చేయి చేసుకుంటాము, నాలుగు తిడతాము. అవతలి వాడు సమర్ధుడైతే తిరిగి నాలుగు తంతాడు, బాగా వాయించి వదిలిపెడతాడు. అది అగామి కర్మ.
ఆగమి కర్మలు అంటే ఈ జన్మలో చేసిన కర్మకు ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించడమన్నమాట.

2- సంచిత కర్మ - కొన్ని కర్మలు (పనులు) వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు చేస్తే, ఇంకెప్పుడో ఫలం అనుభవిస్తాము. అంటే ఫలం అనుభవించే వరకు అవి మనలని వెంటాడుతూనే ఉంటాయి. అంటే అవి కూడబెట్టబడి (సంచితం) చేయబడి ఉంటాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. అంటే సమయం వచ్చే వరకు అవి సంచీలో భద్రంగా ఉంటాయన్నమాట.

ఇందాకటి ఉదాహరణనే తీసుకుంటే, మనం ఒకరిపై చేయి చేసుకున్నా, లేక నాలుగు తిట్టినా, అవతలి వ్యక్తి వెంటనే ప్రతిచర్యకు దిగకపోవచ్చు. కానీ అది మనస్సులోనే పెట్టుకునే, తగిన సమయం కోసం వేచి చూస్తాడు. సమయం వచ్చినప్పుడు, ఇంతకంటే గట్టి దెబ్బ కొడతాడు. అది ఎప్పుడనేది తెలియదు. అది సంచిత కర్మ. 
ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే, మనం ఈ రోజు ఒక విత్తనం వేసి, నీరు పోస్తే, అది ఒకనాటిగా చెట్టు అయ్యి, పండ్లు కాసి, మనకు అందిస్తుంది. అక్కడ విత్తనం వేయగానే పండు (ఫలం) రావట్లేదు. దానికి కొంత సమయం పడుతున్నది. అది సంచిత కర్మ.
ఈ సంచిత కర్మలకు ఫలాలన్నీ ఈ జన్మలోనే లభిస్తాయని లేదు. అది కాలచక్రంలో ఏ జన్మ లోనో లభించవచ్చు. 

అంటే ఇంతకముందు లేదా ఈ జన్మలో చేసి- తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టిన కర్మలలో నుండి, ఆ జనంలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించిన కర్మలు పోను, మిగిలిన కూడబెట్టబడిన కర్మలను, అదే విధంగా, ఇంతకముందు అనేక జన్మలలో జీవుడు చేసిన కర్మల నుండి ఖర్చైనవి మినహా, ఒక జన్మ నుంచి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలు అంటారు. నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అంటారే, అలా నిజంగా అవి వెనకేసుకుంటామో లేదో గానీ, కర్మ అనే సంచీలో అనేక జన్మల కర్మలను పోగు చేసుకుని, జీవుడు జన్మల పరంపరను పొందుతుంటాడు. వాటిని సంచిత కర్మలు అంటారు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినా, ఈ సంచిత కర్మలు మాత్రం జీవుడిని విడిచి వెళ్ళకుండా అతడితోనే ప్రయాణిస్తుంటాయి. 

To be continued ....

దీనికి సహకరించిన రచన- దేవిశెట్టి చలపతి రావుగారి కర్మసిద్ధాంతం ప్రవచనం 

No comments:

Post a Comment