Tuesday 24 March 2020

వసంత నవరాత్రులు చేద్దామా ?

25 మార్చి 2020, బుధవారం నుంచి 03 ఆప్రిల్ 2020, శుక్రవారం వరకు చైత్ర నవరాత్రుల సందర్భంగా...


దయచేసి ఈ సమచారాన్ని మీరు చదివి అందరితో పంచుకోండి. అందరితోనూ ఆచరింపజేయండి...

వసంత నవరాత్రులు చేద్దామా ?

ఉగాది నుంచి శ్రీ రామనవమి వరకు 9 రోజులు అమ్మవారిని, శ్రీ రామచంద్రమూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. మన సంప్రదాయంలో ఒక ఏడాదిలో మనకు 4 రకాల నవరాత్రులు ఉంటాయి. ఇప్పుడు చేసే వసంత నవరాత్రులను శారదా నవరాత్రులు అంటారు. ఇప్పుడు కూడా దుర్గా మాతను 9 రోజుల పాటు నవదుర్గల రూపంలో పూజిస్తారు. ఇప్పుడు చేసే పూజ జ్ఞానాన్ని ఇవ్వడమే గాక, ఈ కాలంలో ప్రబలే విషరోగాల నుంచి రక్షణ ఇస్తుందని శాస్త్రవాక్కు.

ఈ వసంత నవరాత్రులు ఎలా చేయాలి ?
• చండీ, బాలా, పంచదశీ మొదలైన మంత్రాలు ఉపదేశం ఉన్నవారు తమ తమ గురువులు చెప్పిన రీతిలో నవరాత్రులను తప్పక చేస్తారు.
• మరి మనలాంటి సామాన్య హిందువుల సంగతి?
• ఉగాది వస్తోంది గనక ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకుంటాము, ఇంట్లో ఉన్న చెత్త వస్తువులు తీసివేస్తాము, బూజు దులిపేస్తాము, ఇల్లంతా కడిగి, ఆవుపేడతో అలికి, ముగ్గులు వేస్తాము.
• ఇంటిని నీటితో కడిగి, అలికి, ముగ్గులు వేసే వెసులుబాటు నగరాల్లో లేకపోయినా, కనీసం తుడుచుకోవాలి.
• ఉగాది నాటి ఉదయమే నిద్రలేచి, అభ్యంగన స్నానం (తలకి నువ్వుల నూనె పట్టించుకుని స్నానం) చేసి, కొత్తబట్టలు ధరించి, దేవుని ముందు కూర్చుని, లోకక్షేమం కోసం, ఆయురారోగ్యాల కోసం అమ్మవారి నవరాత్రులు చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం సంస్కృతంలోనే చెప్పుకోనక్కర్లేదు, మనకు వచ్చిన భాషలో మనస్సులో గట్టిగా సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది.
• ఆ తర్వాత దుర్గా అష్టోత్తరం చదివి, 'శ్రీ రామ' అనే నామాన్ని 108 సార్లు జపం చేసి (1008 సార్లు జపం చేయడానికి మీకు పట్టేది 13 నిమిషాలు, 108 1-2 నిమిషాల్లోనే అయిపోతుంది), మనకు తోచిన నివేదన చేయాలి. మొదటి రోజు ఆ అన్నం వండాలి, రెండవ రోజు ఈ అన్నం వండాలని లేదు.
• మనం రోజూ వండుకునే అన్నమే సరిపోతుంది. కాకపోతే స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకుని, బియ్యం కడిగిన తర్వాత, అందులోనే కొంచం పెసరపప్పు, పసుపు వేసి, వండితే చాలు.
• అది కూడా కుదరదు అంటే, వండిన అన్నం మీద చిన్న బెల్లం ముక్క (చిటికెడు పెట్టినా చాలు) వేసి నివేదన చేసినా, అదే మహానివేదన.
• మరి అన్నం కూడా వండుకోలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటీ అంటారా ? తాడేపల్లీ రాఘవనారాయణ శాస్త్రిగారికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కేవలం మంచినీటినే మహనివేదన చేశారు. కనుక ఆందోళన అవసరంలేదు.
• ఉండగలిగిన వాళ్ళు నక్తం చేస్తారు. అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం పూజ తర్వాత భోజనం చేస్తారు.
• లేదనుకుంటే, నివేదన చేసినది ప్రసాదమే అవుతుంది కనుక ఏ దోషం ఉండదు, హాయిగా తిని, సాయంకాలం స్నానం చేసి, మళ్ళీ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలే కాలం బాలేదు. ఒంట్లో శక్తిలేనివాళ్ళు నక్తాలు చేసి బలహీనపడేకంటే తిని చేయడమే మంచిది.
• సాయంకాలం చేసే పూజ ప్రధానం. అది కూడా సంధ్యాకాలంలో అంటే సూర్యాస్తమయ కాలంలో చేస్తే ఇంకా విశేషం. అంటే సాయంకాలం 6 నుంచి 7 మధ్యలో.
• మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు : ఈ తొమ్మిది రోజులు మద్యానికి, మాంసానికి దూరంగా ఉంటూ, బ్రహ్మచర్యం పాటించాలి. వీలైనంత దుర్గా మరియు శ్రీ రామ నామస్మరణ చేయాలి. రోజూ శ్రీ రామరక్ష స్తోత్రం పారాయణ చేయాలి. అనవసర సంభాషణ పనికిరాదు. శుచిగా ఉండాలి. శుచిగా, స్నానం చేసి వండిన పదార్ధమే తినాలి. ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా తినకూడదు. అంతే, అంతకుమించి ఇంకేమీ లేవు.
• అలా తొమ్మిది రోజులు చేసి, పదవ రోజు ఉదయం పూజ చేసి, అమ్మవారిని, ఆ శ్రీరామచంద్ర మూర్తిని పూజించి, వ్రతం ముగించవచ్చు. ఇది కష్టం కూడా కాదు. మీకున్న దాంట్లో మీకు తోచిన విధంగా చేసుకునేది. మీకు ఇంకా ఆసక్తి ఉంటే చైత్రపూర్ణిమ వరకు పక్షం మొత్తం అనగా 15 రోజుల పాటు చేయవచ్చు.
• రోజూ ఆలయానికి వెళ్ళాలనే నియమం లేనేలేదు. ఇంట్లో ఉంటూనే చేసుకునే అద్భుతమైన వ్రతం ఇది. దీని వలన మానసిక శాంతి, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారలాభము, సంతానము, కుటుమసభ్యుల మధ్య సఖ్యత, సౌభాగ్యము కలుగుతాయి.
అయితే ఈ ఏడాది తప్పకుండా ఎందుకు చేయాలి?
• ఇప్పుడు రాహువు ఆరుద్రలో ఉన్నాడు. అందుకే విషక్రిమి ప్రభావంతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. రాహువు మృగశిరలోకి రాగానే అంతా చక్కబడుతుంది.
• రాహువుకు అదిష్ఠాన దైవం దుర్గాదేవి. కనుక దుర్గాదేవి పూజతో రాహువు శాంతిస్తాడు. మన జోలికి రాడు.
• ఏ గృహంలో పూజ చేస్తారో ఆ గృహం వైపు చూడడు. గ్రామంలో ఎక్కువమంది చేస్తే ఆ గ్రామం వైపు చూడడు. దేశమంతా వసంత నవరాత్రులు చేసే ఆచారం ఉంది కనుక దేశం ఈ కష్టం నుంచి బయటపడుతుంది.
• మనం హిందువులము, లోకక్షేమం కోరతాము, సమస్తలోకాలు సుఖంగా ఉండాలని తలుస్తాము. అందువలన లోకసుకృతి కోసం చేస్తున్నామని సంకల్పం చెప్పుకుని చేస్తే, సమస్త లోకానికి మేలు జరుగుతుంది.
• ఇప్పుడు ఎలాగూ ప్రభుత్వాలు మనల్ని ఇల్లు కదలవద్దు అంటున్నాయి.
• అమ్మవారి పూజలో శుచి ఉండాలి. ఇప్పుడు మనం అందరితోనూ సామాజిక దూరం పాటిస్తున్నాము, ఎవరి ఇంటికి వెళ్ళడంలేదు, అసలు బయట తిరిగే పరిస్థితులు కూడా లేవు. కనుక మన శుచికి ఆటంకం కలగదు.
• పూజ పేరుతో రోజూ ఇల్లు శుభ్రం చేసి, ఉతికిన బట్టలే కట్టుకుంటాము గనక కొత్త రోగాలు దరిచేరవు. అదేగాక మనకు వసంత నవరాత్రులకు ఎప్పూడూ సెలవులు వచ్చింది లేదు.
• ఇప్పుడు అందరికీ ప్రభుత్వమే పేయిడ్ లీవ్ ఇస్తోంది. ఇంట్లో కూర్చున్న రోజులకు సైతం జీతం ఇస్తున్నారు.
• ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని మనమెందుకు వదులుకోవాలి ?
• ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రమ్మంటే రాదు.
• మీరు నామజపం ఎంత ఎక్కువ చేస్తే అంత గొప్ప అనుభూతులను పొందుతారు.
• శ్రీ రామ నామంలో శివకేశవులు, లక్ష్మీదేవి ఉన్నారు. శ్రీకారం సంపదను ఇస్తే, ర కారం అగ్నితత్త్వం కనుక పాపాన్ని దహిస్తుంది, మకారం అమృతతత్త్వాన్ని ఇచ్చి, రోగరహితం చేస్తుంది.
• మీకు గనక సంకల్ప బలం ఉంటే ఈ తొమ్మిది రోజుల్లోనే శ్రీ రామనామాన్ని అక్షర లక్షలు అనగా 3 లక్షలు జపం చేయగలరు.
• అప్పుడు మీకు కలిగే ఆ దివ్యానుభూతి కొన్ని కోట్లు పోసినా కొనలేనిది.
• మళ్ళీ సంవత్సరంలో ఇవన్నీ చేయడానికి సమయం ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు !?
• ఈ కర్ఫ్యూ ఖచ్చితంగా ఇంకో 15 రోజులైనా ఉంటుంది.
• ఇంట్లో ఊరికే ఉండి, తిని కూర్చునే కంటే, ఈ సమయాన్ని దైవికంగా వినియోగించుకుని, మనకు, ప్రపంచానికి మేలు చేస్తే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి.
జయ దుర్గే ! జయ వనదుర్గే ! శ్రీ సీతా రామచంద్రమూర్తికి జై ! జై శ్రీ రామ !
లోకాసమస్తా సుఖినోభవంతు!

దయచేసి ఈ సమచారాన్ని మీరు చదివి అందరితో పంచుకోండి. అందరితోనూ ఆచరింపజేయండి.

No comments:

Post a Comment