Thursday 26 March 2020

అలవాట్లు మార్చుకునేందుకు ఇదే సదవకాశం



దయచేసి వినండి...

ఈ వ్యాధి వలన ప్రత్యక్ష సమస్యలే కాక, పరోక్ష ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ 21 రోజులు తర్వాత జీవన విధానం కూడా మారిపోతుంది.

మానసిక నిపుణులు ఏం చెప్తారంటే కొత్తగా ఏదైనా అలవాటు చేసుకోవాలనుకుంటే 21 రోజుల పాటు నిరంతరం దాన్ని పాటిస్తే సరిపోతుంది. అదే వదులుకోవాలనుకుంటే, ఏకాధాటిగా 21 రోజుల పాటు దాన్ని ఆచరించకుండా ఉంటే సరిపోతుంది. కనుక మనల్ని మనం మంచిగా, చక్కని పౌరులుగా, ఆరోగ్యవంతులుగా, ధార్మికులుగా మలుచుకునేందుకు ఈ 21 రోజులు కీలకం. ఈ కరోనా సెలవుల కాలంలో వీలైతే ధ్యానం, యోగాసనాలు నేర్చుకోండి, లేదంటే రోజూ ఉదయమే నిద్రలేచి దైవప్రార్ధన చేయడం, జపం చేయడం నేర్చుకోండి. బ్రహ్మచర్యం పాటించండి. చక్కని ఆహారం తీసుకోండి. మద్యమాంసాలను విడిచిపెట్టండి. రోజూ ఒక గది చొప్పున ఇంటిని శుభ్రం చేసుకోండి. పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. రాత్రి త్వరగా అంటే 9 నుంచి 10 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించి, ఉదయం 5 నుంచి 6 మధ్య లేవడం నేర్చుకోండి. దేశానికి, ధర్మానికి ఉపయోగపడేలా ఈ 21 రోజుల్లో మిమ్మల్ని మీరు మలుచుకోండి. చూస్తుంటే, ఏప్రిల్ నెల మొత్తం ఇలానే ఉంటుందేమో. కనుక ఈ సమయంలో కుటుంబంతో గడపండి, ప్రేమాప్యాయతలు పెరుగుతాయి. నిర్లిప్తత, నిరాశ కు లోనవకుండా ఎవరికి వారు మనసునీ, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి.    

ఇవేమీ చేయకుండా తిని కూర్చుకుంటే, 21 రోజుల అజ్ఞాతవాసం వలన,  అందరికీ ఖచ్చితంగా బద్ధకం పట్టుకుంటుంది. మూడు వారాల సెలవులు కాబట్టి ఓ వారం తరువాత చేయడానికి చేతినిండి పని ఉండదు. టీవీ చూస్తూ, ఫోన్, ఫేస్‌బుక్ చూస్తూ గడిపేస్తాం. ఇది పెద్ద ప్రమాదన్ని తెచ్చి పెడుతుంది. సామాజిక దూరమే కాదు, సామాజిక మాధ్యమాలకు, టి.వి.కి కూడా సాధ్యమైనంత దూరం పాటించండి. లేదంటే అవి additions గా మారతాయి. సిగిరెట్, మద్యం వంటి వ్యసనాలు (addictions) శరీరానికి ఎంత చెడు చేస్తాయో, ఈ సామాజిక మాధ్యమాలకు, ఫోన్ కు బానిస అవ్వడమనేది అంతే కీడు కలిగిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. 

వింటున్నారా?  Maintain Social Distance and distance from Social Media too....

No comments:

Post a Comment