Saturday 4 September 2021

శ్రీ హనుమద్భాగవతము (32)



ఇట్లా ధ్యానమునఁదలి తన్మయత్వముచే అతనికి ఆకలి దప్పులు కూడ కలుగుట లేదు. అంజనా దేవి మధ్యాహ్నము నందును, సాయంకాలమందును తనప్రియపుత్రుని వెదకుటకు పోయేది. తన పుత్రుడు ఉండు ప్రదేశము ఆమెకు తెలుసు. అందువలన ఆమె వనములు, పర్వతములు, సరోవరములు, సెలయేళ్ళు అన్నింటియందు తిరిగి తిరిగి హనుమానుని వెదకి తెచ్చెది. అప్పుడు తల్లి యొక్క పట్టుదలతో ఆహారమును తినేవాడు. ఇట్లా ప్రతిదినము జరుగుచుండేది. ఒళ్ళు తెలియనంతగా హనుమంతుడు తన కారాధ్యుడగు శ్రీరాముని ప్రేమలో లీనమయ్యేవాడు, అతని ముఖము నుండి కేవలము "రామ రామ’ యను రెండక్షరములు నిరంతరము బయటవచ్చేవి.


సూర్యుని దగ్గర విద్యనభ్యసించుట


అంజనా దేవి తన పుత్రుని మానసిక స్థితిని చూసి అప్పుడప్పుడు విచారించుచుండేది. తండ్రియైన కేసరి కూడా ఆలోచనామగ్నుడయ్యేవాడు. హనుమంతుడు విద్యనభ్యసించుటకు అగినవయస్సు గలవాడయ్యాడు. 'ఇపుడు ఇతనిని గురువు దగ్గరకు విద్యాభ్యాసమునకై పంపాలి. దీనివలన ఇతని ఈ దశ మారవచ్చు'నని తల్లిదండ్రులు ఆలోచించారు. వారికి జ్ఞానమూర్తియైన తమ పుత్రుని విద్యాబుద్ధులు, బలపౌరుషములు తెలియును. అంతేకాక బహ్మాది దేవతలు కుమారునకిచ్చిన వరముల విషయము కూడా తెలుసు. సామాన్యజనులు మహాపురుషులను అనుకరిస్తారు. సమాజమున అవ్యవస్థ ఏర్పడుతుందన్న భావముతో మహాపురుషులు స్వేచ్ఛగా ప్రవర్తించరు. వారెల్లపుడు శాస్త్రమర్యాదను మనస్సులో ఉన్చుకొని నియమానుకూలంగా వ్యవహరిస్తారు. అందువలన అప్పుడప్పుడు కరుణాసముద్రుడైన భగవానుడు భూతలముపై అవతరిస్తూ ఉంటాడు. ఆయన సర్వజ్ఞాన సంన్నుడైనా విద్యాప్రాప్తికై గురుగృహమునకు వెళతాడు, అచట గురువును అనేక విధాళుగా సేవించి బహు శ్రద్ధతో ఆయన నుండి విద్యను నేర్చుకుంటాడు. గురువును సేవచే సంతుష్టి పఱచి శ్రద్ధతోను భక్తి తోను పొందిన విద్యయే ఫలవంతమవుతుంది. అందువలన అంజనా దేవి కేసరి విద్యాభ్యాసమునకై హనుమంతుని గురుగృహమునకు పంపించుటకు నిశ్చయించుకున్నారు.


తల్లిదండ్రులు మహోల్లాసముతో హనుమంతునకు ఉపనయన సంస్కారము చేసారు. విద్యాప్రాప్తికై గురుచరణముల దగ్గరకు వెళ్ళుటకు అనుజ్ఞ లభించినది; కాని అతడు సర్వగుణ సంపన్నుడైన ఏ  ఆదర్శ గురువు దగ్గరకు వెళ్ళాలి? అంజనా దేవి ప్రేమాధిక్యముతో ఇట్లు పలికింది 'కుమారా! సర్వశాస్త్ర మర్మజ్ఞుడు, సర్వలోకములకు సాక్షిగా ఉన్నవాడు సూర్య దేవుడు. సమయము వచ్చినపుడు నీకు విద్య చెప్పెదనని ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. అందువలన నీవు ఆయనకడకు వెడలి శ్రద్ధాభక్తులతో విద్య నార్జింపుము'.

No comments:

Post a Comment