Thursday 23 September 2021

శ్రీ హనుమద్భాగవతము (40)



సర్వలోకపావనుడగు శ్రీ రాముడు మహాభాగయగు కౌసల్యాదేవికి ప్రత్యక్షమయ్యాడు. ఉమానాథుడగు శివుడు అయోధ్యానగరవీధులలో సంచరింపసాగాడు. ఒకప్పుడాయన అయోధ్యాధిపతియైన దశరథుని రాజద్వారమున ప్రభువు గుణములను గానము చేయు సాధువురూపమున, మఱియొకప్పుడు భిక్షార్ధమై విరక్తుడగు మహాత్మునివేషమున దర్శనమిచ్చేవాడు. ఒకప్పుడు భగవానుని మంగళమయములైన నవతారకథలను వినిపించు ప్రసిద్ధ విద్వాంసునిరూపమున రాజ ప్రాసాదమునకు విచ్చేసేవాడు, మఱియొకప్పుడు త్రికాలదర్శియైన దైవజ్ఞుని రూపంలో దశరథునికుమారుడైన బాల రాముని జాతక ఫలమును చెప్పుటకు వచ్చేవాడు. ఇట్లాయన ఏదో ఒక నెపంతో శ్రీ రాముని సమీపమునకు వచ్చుచుండేవాడు. శంకరుడొకప్పుడు బాలుని ఎత్తుకొంటాడు. ఒకప్పుడు హస్తములోని రేఖలను చూసే మిషతో కోమలతమము దివ్యము అయిన శిశువు హస్తపద్మాలను నిమురుతాడు. మఱియొకప్పుడు తన జడలతో కమలములవలె ఎఱ్ఱనైన చిన్న చిన్న అరి కాళ్ళను తుడుస్తాడు. ఇంకొకప్పుడు దేవదుర్లభములు, సుకోమలములు, అరుణోత్పలసదృశములైన చరణములను తన విశాలనేత్రములతో స్పృశించి పరమానందమున మగ్నుడవుతాడు. మెల్లమెల్లగా కౌసల్యానందనుడు రాజద్వారము వఱకు రాసాగాడు.


ఒకనాటిమాట. పార్వతీవల్లభుడు 'భిక్షకుని' వేషమును ధరించి ఢమరుకమును మ్రోగించుచు రాజద్వారమును సమీపించెను. అతని వెంట నృత్యముచేయు సుందరమైన ఒక కోతి కూడా ఉంది. ఆ భిక్షకునివెంట అయోధ్యలోని బాలురసమూహము ఉండింది.


డమరుకము మోగసాగెను. కొద్దిసేపటిలోనే శ్రీ రామునితో కూడా నలుగురు సోదరులు రాజద్వారముకడకు

వచ్చారు. భిక్షకుడు డమరుకమును మ్రోగించెను. కోతి రెండు చేతులను జోడించినది, సోదరులతో గూడ శ్రీరాముడు నవ్వాడూ. 


వృషభధ్వజుడైన ఈశ్వరుడు తన యొక అంశతో శ్రీరాముని ఎదుట నృత్యము చేయుచుండేవాడు. తన రెండవ అంశతో స్వయముగా దానిని ఆడించేవాడు. నాట్యము చేయువాడు, చేయించువాడు ఆయనయే. శ్రీరామచరణానురాగియైనవాడు పార్వతీవల్లభుడు; వానరనాట్యముచే ముగ్ధుడై మాటిమాటికి చప్పట్లుకొట్టువాడు సమస్తసృష్టిని తన జగన్నాటకంతో ఆడించే శ్రీ మన్నారాయణుడు. ఇలా సమీరకూమారుడు అనేకమార్లు శ్రీరాముని దర్శించేవాడు.

No comments:

Post a Comment