Monday 20 September 2021

ఇంతకీ మనమెవరు ?



శివుడిని ఇష్టదైవంగా కలిగినంత మాత్రాన శైవులము, నారాయణుని అర్చన చేస్తాం కనుక వైష్ణవులము, అమ్మవారి రూపాలంటే ఇష్టం కనుక శాక్తేయులం, గణపతి భక్తులం కనుక గాణాపత్యులమైపోము. శైవ గురువుల నుంచి మంత్రదీక్ష తీసుకుని, శైవాగమాల ప్రకారం శివార్చన చేస్తే శైవులం అవుతాము. వైష్ణవ గురువు వద్ద మంత్రదీక్ష తీసుకుని వైష్ణవ అగమాల ప్రకారం అర్చన చేస్తే అప్పుడు వైష్ణవులం అవుతాము. అదే శక్తి, సూర్య, గణపతి మరియు సుబ్రహ్మణ్యుని అర్చనలో కూడా అన్వయం అవుతుంది. అలాగే ఆయా కుటుంబాల్లో పుట్టినవారు ఆయా శాఖలకే చెందుతారు. మరి మనమంతా ఎవరము అనే ప్రశ్న తలెత్తుతుంది. 


దీనికి సమాధనం మనమంతా జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన స్మార్తులము. ఎప్పుడైన చెప్పవలసి వస్తే మనది స్మార్త సంప్రదాయమని చెప్పాలి. స్మార్తులు అంటే ఎవరు? శృతులు (వేదాలను), స్మృతులను ఆధారంగా చేసుకుని, సర్వదేవతలను సమానంగా పూజించేవారు. మనకు శివకేశవ బేధం లేదు; ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే అహంభావన లేదు. ఏ దేవతను పూజించినా అన్ని ఒక్కడికే చేరతాయనే భావన మన అందరిలో నిగూఢంగా ఉంది. ఇష్టదేవతను కలిగి ఉన్నా, ఇతర దేవతలను తక్కువ చెయ్యము. ఎందుకంటే మన అందరిలో ఆదిశంకరుల తత్త్వము అనాదిగా నిండి ఉంది. అందుకే ఎవరైనా మనది ఏ సంప్రదాయం అని అడిగినప్పుడు శంకర సంప్రదాయమని, స్మార్తులమని చెప్పాలి. గురువు లేని వారందరీ గురువు ఆదిశంకరులు, సాక్షాత్తు శివుడే ఆదిశంకరులుగా అవతరించి సనాతన ధర్మాన్ని కాపాడారు. వారు జగద్గురువులు, ఈ లోకంలో గురువు లేనివారందరికీ ఆయనే గురువు. అందుకే మనం 


సదాశివ సమారంభాం అని చెప్పినా, నారాయణ సమారంభాం అని చెప్పినా,

వ్యాస శంకర మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం 

వందే గురు పరంపరాం అని చెప్తాము. 

అనగా సదాశివుడు/ నారాయణుడి నుంచి మొదలైన ఈ సంప్రదాయంలో, అనాదిగా కొనసాగుతూ వచ్చింది. అందులో వేదవ్యాసులవారు, ఆదిశంకరాచార్యుల వారి ద్వారా రక్షించబడింది. అక్కడి నుంచి పరమపరగా వస్తూ ఇప్పటి నా గురువు ద్వారా నాకిది అందింది. ఈ మొత్తం గురుపరంపరకు నమస్కారం అని భావము. (ఈ శ్లోకం రోజూ చదువుకోవచ్చు). 


ఆదిశంకరులు 6 మతాలను స్థాపించారు. మీ ఇష్టదేవతను మధ్యలో ఉంచి, మిగితా దేవతలను వారి చుట్టూ ఉంచి పూజించే సంప్రదాయం అది. దాన్ని పంచాయతనం అంటారు. ఆదిశంకరులు ప్రతిపాదించిన దాంట్లో వైష్ణవం కూడా ఉంది. ఈనాటికి శంకర సంప్రదాయంలో ఉన్న వైష్ణవులు గణపతిని, మహేశ్వరుడిని, అమ్మవారిని, సుబ్రహ్మణ్యుని తమ దేవతార్చనలో పూజిస్తారు, ఉపాసన కూడా చేస్తున్నవారు ఉన్నారు. శంకర సంప్రదాయంలోని శైవులు కూడా విష్ణువును అంతే భక్తితో ఆరాధిస్తారు. ఆదిశంకర సంప్రదాయంలోని ఏ మతంలో ఉన్నవారైనా ఇతర దేవతలను తులనాడరు. అదే ఇప్పుడు మనకు అనుసరణీయము. 

No comments:

Post a Comment